వేడుక

 సెలవురోజు మధ్యాహ్నపు సోమరితనంతో

ఏ ఊసుల్లోనో చిక్కుపడి నిద్రపోయి

కలలోని నవ్వుతో కలలాంటి జీవితంలోకి

నీతో కలిసి మేల్కోవడమే,

నాకు తెలిసిన వేడుక.


నీరెండ ఉదయాల్లో అద్దంలోకి వొంగి

ఇప్పుడిప్పుడే రంగు మారుతున్న గడ్డాన్ని

నువ్వు తడుముకున్నప్పుడల్లా

ఆ గరుకుచెంపలని తొలిసారి తాకిన

లేప్రాయపు తడబాటు క్షణమొకటి,

మెరుపై నన్ను చుట్టుముడుతుంది.

పట్టరాని నా ఇష్టం ముందు  

నీ వయసు కట్టుబానిసై మోకరిల్లుతుంది.  


వెలిసిపోని జ్ఞాపకమైనందుకు

పారేయలేని నీ పాతచొక్కాలా

ఉరికే యవ్వనంలో నువ్వు ముద్దరలేసిన

ఎన్ని నిన్నలో

ఫ్రిడ్జ్ మాగ్నెట్ మీద కుదురుకున్న 

నీ అయస్కాంతపు నవ్వుల్లా లాగుతూనే ఉంటాయి.


ప్రణయఝంఝ రేపిన మోహసంచలనాలు సర్దుమణిగాక,

అలవాటైన ఉనికి ఇచ్చే స్తిమితానివై నను కమ్ముకుంటావు.

ఉత్తిమాటనై నిను కప్పుకోబోతే

పెదాల మీద సీతాకోకరెక్కల్లా వాలి చెదిరిపోయే ముద్దువవుతావు.

తప్పని ఈ లోకపు వత్తిళ్ళ నుండి తప్పించుకుని వచ్చి

నే కావలించుకునే విరామ క్షణాల సమస్తమా...


నా కన్నా ముందే అలారం మీదకి  చేరే నీ చేయీ

నా డెస్క్ మీద నువు నింపి  ఉంచే నీళ్ళ సీసా

బాల్కనీలో విచ్చిన పిచ్చి పూవు  

ఆఖరికి

మీరా షాంపూ వాసన కూడా

ప్రేమఋతువులోకి నెట్టే ఇంట్లో,  


ఇన్నేళ్ళ తర్వాత ఈ రోజుకి కూడా ...

కలలోని నవ్వుతో కల లాంటి జీవితంలోకి

నీతో కలిసి మేల్కోవడమే

నాకు తెలిసిన వేడుక.


No comments:

Post a Comment

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....