కవిని కలిసినరోజు

నారింజ రంగులు మీద వాలే సంజ వేళల్లోనో

ఏటవాలు కొండల మధ్య జలపాతపు తుంపర్లు పడే తావుల్లోనో

నీటి అద్దం మెరిసే ఏ నిశ్శబ్ద సాగరతీరాల్లోనో నిర్మల ఉదయాల్లోనో

నీలాకాశం వైపు చూపు సారిస్తే కంటికేదీ అడ్డుపడని విశాలమైదానాల్లోనో

కవీ... నిన్ను కలుస్తాననుకున్నాను.


మిగతాలోకం మీద చేతి రుమాలు వేసి

సీతాకోకను చేసి ఎటో విసిరేయగల ఓ మాయాజాలికుణ్ణి

గంటల్ని నిమిషాలుగా మార్చగల ఓ మంత్రదండాన్ని

నిన్నెంతో ప్రేమిస్తానని చెప్పడానికి నాలుగు పూవుల్ని

నా వెంటపెట్టుకుని నిన్ను కలవాలనుకున్నాను.


నా నిర్వ్యాపక సమయాలని నీ అక్షరమొక సూది మొనై పొడుస్తుందనీ 

నీ స్వరం - దిగులు గూడు నుండి నస పిట్టలని చెదరగొట్టి ఊరడిస్తుందనీ 

నా ఎలప్రాయాన్ని నీ కవిత్వమే నిర్వికల్ప సంగీతమై ఆవరించుకున్నదనీ 

మలినపడని ఉద్వేగమేదో నీ పేరు వినపడితే చాలు- నాలో చివాలున లేస్తుందనీ 

నీకు చెప్పాలనుకున్నాను.


కవీ..!!

చివరికి  నిన్ను శబ్దాల మధ్యా సమూహాల మధ్యా కలుసుకున్నాను.

అక్షరం వినా వేరేదీ లేని ఉత్తచేతులతో కలుసుకున్నాను.

మనిద్దరి మధ్య అదృశ్య కాంతిలా నిలబడ్డ మౌనంతో...

ఈ సాఫల్యక్షణాలను దోసిట్లో పోసిన జీవితానికి వినమ్రంగా ప్రణమిల్లాను.


No comments:

Post a Comment

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....