స్కేట్ క్లాస్

 అనుకోకుండా వెళ్ళానక్కడికి. అయిష్టంగా.

చూడకూడదనుకుంటూనే చూశాను. వాడు పడుతుంటే చూశాను. లేస్తుంటేనూ.
శనాదివారాల్లో సాయంత్రాలు వెదర్ బాగుంటే పిల్లాడికి స్కేటింగ్ క్లాస్. కొన్ని పనులు ఎందుకో అనిల్‌కే అప్పజెప్పేస్తాను. సైకిల్ నేర్పించడం, స్కేట్ స్కూటర్, స్కేటింగ్, హెయిర్ కట్...కొత్త విద్యలు నేర్పించేటప్పుడో, మప్పితంగా మంచి అలవాట్లకు ఒప్పించేప్పుడో మాత్రమే కాదు, తలస్నానాలు చేయించడం, స్కూల్‌బస్ దగ్గర దింపడం లాంటి మామూలు పనుల్లో కూడా కొన్ని అనిల్‌కే ఇచ్చేస్తాను. వాడు ఇష్టపడడనో, ఇబ్బంది పడతాడనో గాయపడతాడనో అనిపించిన ప్రతి విషయానికీ నాకు తెలీకుండానే కొంత ఎడం పాటిస్తానని మొన్నెప్పుడో మేం మాట్లాడుకుంటుంటేనే అర్థమైంది. అలా తెలిసాక, ఊరికే ఆ ఇబ్బందిని కొంతైనా దాటడానికా అన్నట్టు, ఎప్పుడైనా నేనూ ఆ స్కేట్ క్లాస్‌కి వెళ్దామనుకున్నాను. అనుకోకుండా అనిల్‌కి వేరే పనిపడటంతో నిజంగానే నేను తీసుకెళ్ళాల్సి వచ్చింది.
అలా,
అనుకోకుండానే వెళ్ళానక్కడికి. కొంత అయిష్టంగానే.
చూడకూడదనుకుంటూనే చూశాను. వాడు పడుతుంటే చూశాను. లేస్తుంటేనూ.
దాదాపు గంటసేపు అక్కడి పిల్లలందరి దేహాలూ ఏ చప్పుళ్ళకూ అల్లర్లకూ చెదరని అపురూపమైన ఏకాగ్రతతో ఆ మైదానమంతా వలయాలుగా తిరగడం చూశాను. తేలిగ్గా, హాయిగా హేలగా వాళ్ళలా కాళ్ళ కింది చక్రాలతో కళ్ళ ముందు నుండి కదిలిపోవడం చూశాను. ఇష్టంగా ధైర్యంగా ఆ మైదానపు మూలల్లోకి చెదిరిపోవడం చూశాను. స్నేహంగా మళ్ళీ ఒకేచోటకు చేతులు పట్టుకు చేరిపోవడం చూశాను. కొందరి కళ్ళలో భయమూ చూశాను, కాళ్ళు పైనుండి కింద దాకా వణికిపోవడం చూశాను. జర్రున జారి, మోకాళ్ళ మీద పడిపోవడం చూశాను. పడి లేస్తుంటేనూ.
ఆట అయిపోయింది. హెల్మెట్ కింద, తడిసి అంటుకుపోయిన జుట్టు. మైదానమంతా వెలుగుతూ ఆరుతూ రంగు దీపాలు. బిగ్గరగా, పాదాలను ఆడించేంత సందడిగా, నరాలను తాకుతోందా అన్నంత దగ్గరగా -సంగీతం. ఆ ఉత్సాహపు లోకంలోకి వాడొక తుళ్ళింతై వెళ్ళిపోయాడు. తానూ అక్కడి స్వరకోలాహలంలో ఓ కేరింతై కలిసిపోయాడు. ఎదురుపడ్డ రంగుల లోయలోకి, నన్ను విడిచి, ఈకలా జారిపోయాడు.
రంగు దీపాల నీడలు నా మీదుగా కదిలి వెళ్ళిపోతున్నాయ్. మైదానం ఖాళీ అవుతోంది. రాత్రిని తోడు పిలుచుకున్న బెంగళూరు చలిగాలిలో ఉన్మత్తత మొదలవుతోంది.
దేహపు లోపలి వణుకుని స్వెటర్‌తో కప్పుకుంటూ చూశాన్నేను. చూస్తేనే అంటుకుపోయే ఆ పసిప్రపంచపు ఉత్సాహాన్ని. వాళ్ళ వాళ్ళ ఆటల్లో ఉన్నప్పుడు, ఒక్కరే ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఒకే మాటను మంత్రంగా చేసుకుని, ఒకే పల్లవిని పదే పదే పాడుకుని, లోలోపలి సంబరమంతా కొత్త కదలికై వాళ్ళని కుదిపేయడాన్ని నిశ్చింతగా అనుభవిస్తూ, సమయాన్ని ఆ లేతపాదాల కింద నొప్పి తెలీకుండా తొక్కిపెట్టడాన్ని, చీకటి వేళల చలిగాలి నిర్దయని, దీపాల నీడలని, నా చిన్ని తండ్రిని. ❤️
May be an illustration

No comments:

Post a Comment

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....