నిర్ణయం

ఎన్ని వసంతాల వంచనకు వడలి
రేకులుగా రాలిపడుతోందో
లోలోపలెంతగా దహించుకుపోయి
దావాగ్నిలా ఎగసిపడుతోందో
దూరం నుండి చూస్తున్నవాడివి
లేతపచ్చ ప్రాయంలో తన కోమలమైన స్పర్శని
కలనైనా ఊహించి అనుభవించలేనివాడివి
తొందరపడి తీర్పులివ్వకు, తననేమీ అనకు.
మలుపు మలుపులో
ఎందుకు ప్రాణాన్ని మెలిపెట్టుకుందో
ఉప్పునీట కలిసే ముందు
ఏమని మనసును ఒప్పించుకుందో
పడవ కుదురుగా పాడుతున్నప్పుడు
ప్రయాణం చేసి పోయినవాడివి
లోతులు తెలియకుండా
నువ్వే నిర్ణయానికీ రాకు, దోషివి కాకు.
నన్ను గిచ్చి లేపిన ఉదయమే
నీ వెన్నెల రాత్రవ్వడాన్ని
రెప్పవేయకుండా చూస్తోందే ఆ ఆకాశం
నిజం కూడా అబద్దమవుతుందంటే,
ముగింపుల్లోనే కథ మొదలవుతుందంటే
రాలిపడుతుందా? రంగులు మార్చుకుంటుందా?
ఏ కాలం నాటిదో
ఎవరెందుకు వాడి వదిలేసిందో
నువు లోలోపల దాచుకున్న
ఇనుప తక్కెడ.
బరువెత్తిపోయిన రోజైనా
బయటకు తీసి చూడు.
వీలైతే విరిచి ముక్కలు చేసి
ఒక్కరోజైనా బ్రతికి చూడు.
తొలి ప్రచురణ : ఈమాటజనవరి, 2015

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....