నిర్ణయం

ఎన్ని వసంతాల వంచనకు వడలి
రేకులుగా రాలిపడుతోందో
లోలోపలెంతగా దహించుకుపోయి
దావాగ్నిలా ఎగసిపడుతోందో
దూరం నుండి చూస్తున్నవాడివి
లేతపచ్చ ప్రాయంలో తన కోమలమైన స్పర్శని
కలనైనా ఊహించి అనుభవించలేనివాడివి
తొందరపడి తీర్పులివ్వకు, తననేమీ అనకు.
మలుపు మలుపులో
ఎందుకు ప్రాణాన్ని మెలిపెట్టుకుందో
ఉప్పునీట కలిసే ముందు
ఏమని మనసును ఒప్పించుకుందో
పడవ కుదురుగా పాడుతున్నప్పుడు
ప్రయాణం చేసి పోయినవాడివి
లోతులు తెలియకుండా
నువ్వే నిర్ణయానికీ రాకు, దోషివి కాకు.
నన్ను గిచ్చి లేపిన ఉదయమే
నీ వెన్నెల రాత్రవ్వడాన్ని
రెప్పవేయకుండా చూస్తోందే ఆ ఆకాశం
నిజం కూడా అబద్దమవుతుందంటే,
ముగింపుల్లోనే కథ మొదలవుతుందంటే
రాలిపడుతుందా? రంగులు మార్చుకుంటుందా?
ఏ కాలం నాటిదో
ఎవరెందుకు వాడి వదిలేసిందో
నువు లోలోపల దాచుకున్న
ఇనుప తక్కెడ.
బరువెత్తిపోయిన రోజైనా
బయటకు తీసి చూడు.
వీలైతే విరిచి ముక్కలు చేసి
ఒక్కరోజైనా బ్రతికి చూడు.
తొలి ప్రచురణ : ఈమాటజనవరి, 2015

2 comments:

 1. మానస గారూ ! మీ కవితలు' సాహిత్యం పట్ల మీకున్న ఆసక్తి చూసి , అద్వైత తత్వాన్ని ఒక కొత్త కోణంలో మీకు పరిచయం చేయాలనిపించింది. దానిని మీరు ఈ క్రింది link లో చూడవచ్చు .
  https://docs.google.com/document/d/1q77UVYOMWSC9Ituh9qaXBNa8gb42tsEuugvueKna81s/edit?pli=1

  ReplyDelete
 2. వీలైతే విరిచి ముక్కలు చేసి
  ఒక్కరోజైనా బ్రతికి చూడు.

  ప్రతీ వారినీ వారికీ ప్రశ్నించే ప్రశ్న.
  ప్రశ్నించే కాదు ప్రశ్నించాల్సిన....

  ReplyDelete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...