జాషువా కవిత్వం - పిరదౌసి

కళ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. అది దాని జీవలక్షణం. సాహిత్యం దానికి మినహాయింపు కాదు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కథన కవిత్వ రీతులు పుట్టుకొస్తున్నాయి. నూతన అభివ్యక్తి మార్గాల కోసం అన్వేషణలు కొనసాగుతున్నాయి. కవితా వస్తువులు మారుతున్నాయి, నేపథ్యాలూ కొత్తగా కనపడుతున్నాయి. కవిత్వ లక్షణాల గురించీ, లక్ష్యాల గురించీ విభిన్న వాదనలు వినపడటమూ, సామాజిక ఆర్థిక రాజకీయ అవసరాలు ఏ కాలానికాకాలం కవిత్వాన్నీ ప్రభావితం చేయడమూ పాఠకలోకం గమనిస్తూనే ఉంది. ఇన్ని వైవిధ్యాలున్న వాతావరణంలో, ఎవరైనా ఒక కోవకు చెందిన కవిత్వాన్ని లేదా ఒకరి కవిత్వాన్ని మాత్రమే గొప్పది అనడం సాహసమనిపిస్తుంది. ఆ రకమైన అభిప్రాయం తాత్కాలికమనీ తోస్తుంది. సృజన గొప్పతనాన్ని నిర్ణయించగలిగేది కేవలం కాలం మాత్రమే. జాషువా ఖండకావ్యం పిరదౌసి, కాలం ధాటికి తట్టుకుని నిలబడ్డ అలాంటి అసాధారణమైన కవిత్వం. సరళమైన అభివ్యక్తితో గాఢమైన మానసిక దశలను చిత్రించిన తీరుకి, ఊహలకందని ఉద్వేగాలకి అక్షరరూపమిచ్చి అనుభవైకవేద్యం చేసిన సమర్థతకీ, ఇప్పుడే కాదు, ఏ కాలానికైనా ఈ కావ్యం సజీవంగా సాహిత్య లోకంలో నిలబడగలదు.
పిరదౌసి పర్షియనులు ఎంతగానో అభిమానించే 10వ శతాబ్దపు ఒక గొప్ప కవి. అతని షాహ్‌నామా సామానీ, గజనీ రాజుల కాలంలో రాయబడిన ఇరాన్ దేశపు చారిత్రిక ఐతిహాసం. అరవై వేల పద్యాలతో, ప్రపంచం లోనే అతి పొడుగైన ఇతిహాసంగా పేరెన్నిక గన్న గ్రంథం. అప్పటి కవిపండితులు ఎందరి లాగానో పిరదౌసి జీవితాన్ని గుఱించి కూడా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వ్యత్యాసాలు ఎన్నున్నా స్థూలంగా కథ మాత్రం ఒక్కటే. ఇదీ ఆ పిరదౌసి కథ:
రాజ్యాలకు రాజ్యాలను తన విస్తార కాంక్షతో ముట్టడించి, శత్రుసైన్యాలను చిత్తు చేసి వీరుడిగా నిలబడ్డ గజనీ మహమ్మదు ఒకనాడు తానే స్వయంగా పిరదౌసిని నిండు సభకు పిలిచి, తమ ఈ చరిత్ర అంతా ఉద్గ్రంథముగా వ్రాయమని, అలా వ్రాసిన ప్రతి పద్యానికీ ఓ బంగారు నాణెం బహుకరిస్తానని, ఆనక ఆ కృతిని తనకే అంకితమీయమనీ అడుగుతాడు. పిరదౌసి పరమ సంతోషంగా ఏకాగ్రచిత్తంతో గజనీ మహమ్మదు విజయయాత్ర వ్రాయడం మొదలెడతాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు విధివశాత్తూ మరణించాడని తెలుసుకున్నప్పుడు ఆ బాధలో విలవిల్లాడుతూ కూడా కావ్యరచనలో మగ్నమవుతాడు. అంత బాధనూ శ్రమనూ భరించి అరవయివేల పద్య రత్నాలతో షాహ్‌నామా అనే ఉద్గ్రంథాన్ని పూర్తి చేసి సంతృప్తిగా తిరిగి ప్రభువు కొలువులో అడుగుపెడతాడు పిరదౌసి. కృతిని అందుకుని, బంగారు నాణాలకు బదులుగా వెండి నాణాలు ఇస్తాడు మహమ్మదు. పిరదౌసి హృదయం ముక్కలవుతుంది. అక్షరాలా ముప్పయ్యేళ్ళ శ్రమకు నిండు కొలువులో జరిగిన పరాభవం, మసలిన హృదయాన్ని, ప్రాణాన్ని ఊరకుండనివ్వదు. మసీదు గోడల మీద మాట తప్పిన మహమ్మదు గురించి వ్రాయకుండా ఉండలేకపోతాడు పిరదౌసి. అవి చదివి, పట్టరాని కోపంతో ఆ రాజద్రోహిని చంపేయమంటూ ఆదేశాలిస్తాడు మహమ్మదు. చక్రవర్తి ఆలోచనలు తెలుసుకున్న పిరదౌసి, తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యం వదిలి, భార్యాబిడ్డలతో ఎంతో ప్రయాసతో కారడవులు దాటుకుని తాను పుట్టిన తూసీ నగరానికి వెళ్ళిపోతాడు. కవి హననోద్యుక్తుడైన మహమ్మదు తరువాత ఎన్నాళ్ళకో సామంత రాజుల మాటలు విని, తప్పు తెలుసుకుని, బంగారు నాణాలు బస్తాల కెక్కించి తూసీకి భటులను పంపించి, పిరదౌసికి అందించ చూస్తాడు. ఒక ద్వారం నుండి బంగారు బస్తాలు పిరదౌసి ఇంటిలోనికి వస్తూంటే, మరొక ద్వారం గుండా కవి పార్థివ దేహాన్ని శ్మశానానికి పంపుతుంటారు. రాజభటులు నిశ్చేష్టులై, ఏమి చేయాలో పాలుబోక కవి కుమార్తెను ఆ బంగారాన్ని స్వీకరించమని అడుగుతారు. నా తండ్రిని బ్రతికినంత కాలమూ, అనుక్షణం క్షోభకు గురిచేసిన ఈ ధనాన్ని తాను ముట్టననీ, అది తమకక్కర లేదనీ ఆమె తిరస్కరిస్తుంది. వేగుల ద్వారా వార్త రాజుకు చేరుతుంది. అతడు తీవ్రమైన పశ్చాత్తాపంతో దహించుకుపోయి, చివరికి అదే ధనంతో తూసీ పట్టణంలో పిరదౌసి స్మారక స్తూపాన్ని, సత్రాన్ని నిర్మిస్తాడు.
ఒక వాస్తవ ఘటనను ఆధారశిలగా చేసుకుని తన భావనా గరిమతో పిరదౌసి లాంటి కవితాసౌధాన్ని నిర్మించుకోగలిగాడు జాషువా. కనుక, కథకు సంబంధించి జాషువాకి ఘనత ఆపాదించనవసరం లేదు. అతని ప్రతిభ మొత్తం ఆ కథను ఆశ్వాసాలుగా విడగొట్టిన పద్ధతిలో ఉంది. ఇక్కడే జాషువా తన బలాబలాలను నేర్పుగా అంచనా వేసుకున్నాడు. గజనీ మహమ్మదు రాజ్య విస్తార కాంక్షని, విజయాలని అతడు పిరదౌసిని షాహ్‌నామా రచించమని అడగడం మొదలుకుని, పిరదౌసికి జరిగిన అవమానమూ తదనుభవానికి విచలితుడై కవి మసీదు గోడల మీద రాజుని నిందించడం వరకూ మొత్తాన్నీ ఒకే ఆశ్వాసంలో ముగించాడు జాషువా. అడవి దారుల్లో తూసీ నగరానికి ప్రయాణమయ్యాక ఎదురైన ప్రకృతి వర్ణనలనూ, కవి అంతరంగ ఆవిష్కరణకు ఎక్కువ ఆస్కారం ఉన్న మిగిలిన కథనూ మూడు ఆశ్వాసాల్లో విస్తరించి రచించాడు. ఈ పరిచ్ఛేదమేమీ కాకతాళీయం కాదనీ, తాను చెప్పదలచుకున్నదేమిటో సుస్పష్టంగా తెలుసు కనుకే ఇంత జాగరూకతతో కథాక్రమాన్ని మలచుకున్నాడనీ పాఠకులకూ సులభంగానే అర్థమవుతుంది.
పాఠకులుగా మనకు కవులంటే వారి ప్రతిభ, విద్వత్తుల గురించి కొన్ని అభిప్రాయాలుంటాయి; వారిపై కొన్ని అంచనాలుంటాయి. మరి కవులు కవుల గురించి ఏమనుకోవాలి? వారెలాంటివారైతే వారి సృజన రాణిస్తుంది? అన్నది సగటు పాఠకులకుండే కుతూహలం. అందుకనే కవులు కవి గురించి, కవిత్వం గురించీ చెప్పే మాటలంటే మనకు ఆసక్తి ఎక్కువ. అలాంటి ఆసక్తిని సంతుష్టపరచే రసగుళికల్లాంటి పద్యాలు కొన్ని ప్రథమాశ్వాసం లోనే ఎదురవుతాయి. ‘తమ్మిచూలి కేలుదమ్మిని గల నేర్పు/ కవికలంబునందు కలదు,’ అనీ, ‘క్షణము గడచిన దాని వెంకకు మరల్ప/ సాధ్యమే మానవున కిలాచక్రమందు?/ దాటిపోయిన యుగములనాటి చరిత మరల పుట్టించగల సమర్థుడు,’ కవియే అనీ జాషువా నమ్మకం. అలాగే, సత్కవికి నాకున్న నిర్వచనమొకటి జాషువా కవిత్వం లోనూ చూశాన్నేను.
వసుధ శాసింపగల సార్వభౌముండగును
ధీరుడగు, భిక్షకుండగు, దీనుడగును
దుఃఖితుండగు, నిత్యసంతోషియగును
సత్కవి ధరింపరాని వేషములు గలవె!
కవి పాఠకులకేమైనా కావచ్చును కానీ, తనకు తాను కవి కాకూడదు. జాషువా అన్నట్టు, అతడు ఎన్ని అవతారాలైనా ఎత్తాలి, ఎత్తగలగాలి. దీనుడూ, దయాళుడూ, నిత్యసంతోషి, నిత్యశంకితుడు, భిక్షకుడు, భగవంతుడు అన్నీ అతడే అయినప్పుడే అందరూ అతని అక్షరాల్లో తమని తాము చూసుకుని కదలిపోయేది. ఈ రహస్యం తెలిసిన కవి చేతుల్లో ప్రాణం పోసుకున్న కారణానికే పిరదౌసిలోని ప్రతి పద్యమూ తనదైన ఉద్వేగాన్ని ప్రకటిస్తుంది.
నిజానికి పైన టూకీగా చెప్పిన కథను చదివితే, ఇట్టే అర్థమవుతుంది, ఈ కథ సున్నితమనస్కులను తేలిగ్గా కదిలించగలదనీ, కళాకారులైతే తమ సృజనలో చోటు కల్పించేంతగా ఇది విని చలించగలరనీ. జాషువా ఇందుకు మినహాయింపేమీ కాదు కానీ, కథను విప్పే క్రమంలో కొన్ని పునరుక్తులనిపించే వర్ణనలూ చేయకపోలేదు. ఉదాహరణకి, మొదటి ఆశ్వాసంలో మహమ్మదు కవిని సభకు పిలిపించి పద్యాలు వ్రాయమని అడిగే సందర్భంలో, పైన ప్రస్తావించినట్టు కవి అన్న పదానికి నిర్వచనాలుగా నిలబడగల పద్యాలు ఎన్నో వ్రాశాడు. అవి కథను ముందుకు నడిపించే పద్యాలు కావు. కేవలం కవి పట్ల జాషువా దృక్కోణాన్ని ప్రతిఫలించే ఆలోచనలు మాత్రమే. ఈ పద్యాలు ఎన్ని సార్లు చదివినా బాగుండటమూ, ఈ కాలానికీ పొసగేట్టుగా ఉండటం తరువాతి సంగతి. అలాగే, ద్వితీయాశ్వాసంలో వరుసగా ప్రకృతి వర్ణనలూ, పరమాత్మ ఈ సృష్టిని నిలబెట్టి నడిపిస్తున్న తీరును గూర్చి విస్మయుడై కీర్తించడమూ కనపడుతుంది. మొదటి ఆశ్వాసంలో కనపడ్డ పునరుక్తి దోషం ఇక్కడెందుకు లేదూ అంటే, ఒకటే కారణం. కథలో, ఈ భాగంలో పిరదౌసి అడవిలో ప్రయాణం చేస్తున్నాడు. దారీ తెన్నూ తెలీని కొత్త మార్గాల్లో ప్రయాణం, అతనికి క్షణానికో కొత్త సౌందర్యాన్ని చూపెట్టిందనుకోవడంలో అసహజమేమీ లేదు. పూటపూటకీ మారే లోకపు రంగులనీ, సెలయేటి చప్పుళ్ళనీ, ఆ వెనుకే కనపడే కొండల్నీ గుట్టల్నీ జంతువులనీ ఎన్ని పద్యాల్లో వర్ణించినా ప్రతీదీ దేనికదే సర్వస్వతంత్రంగా నిలబడగలదు. ఇటువంటి ఒక సమర్థన మొదటి ఆశ్వాసానికి ఆపాదించడం అసాధ్యం కాదు కానీ, కష్టం.
ఈ వర్ణనల్లోనే, ‘కుంకుమ పంకముం బులుముకున్నవి తూరుపుకొండ నెత్తముల్’ అంటాడొక చోట ఈ కవి. కాల ప్రభావాన్ని పరిగణన లోనికి తీసుకోక తప్పదేమో కానీ, ఇది పెద్ద పెద్ద కవులు మొదలుకుని ఇప్పుడిప్పుడే వచన కవిత్వం వ్రాయడం మొదలెట్టిన వారి వరకూ అందరూ వాడుకోగా అరిగిపోయిన వర్ణనే. అలాగే, విచలితమైన మనసును గురించి చెబుతూ, ‘గాలి కెదురు గట్టు కాచగోళంబయ్యె /గండు చేఁప దాఁకు కమలమయ్యె’ అని వర్ణిస్తాడు కవి. చిత్రంగా, ఈ గండు చేప తాకిన కమలం* అన్న వర్ణననే, వాల్మీకి సుందరకాండలో,
తస్యాః శుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణవిశాలశుక్లమ్
ప్రాస్పన్దతైకం నయనం సుకేశ్యా మీనాహతం పద్మమివాభితామ్రమ్ (సుం. కాండ – సర్గ 29, 5.29.2.)
అంటూ సీత ఎడమకన్ను హనుమను కలువబోయే ముందు శుభసూచకంగా అదరడాన్ని గురించి వర్ణిస్తూ చెబుతాడు. అలాగే మేఘసందేశంలో (ఉత్తరమేఘము-34) కాళిదాసు, ‘మీనక్షోభాచ్చల కువలయశ్రీతులా మేష్యతీతి’ అంటూ మేఘం అలకాపురి చేరినప్పుడు యక్షుడి కుడికన్ను శుభసూచకంగా అదరడాన్ని గురించి చెబుతాడు. ఈ రెండు చోట్లా ఈ ఉపమానం శుభసూచకంగా చెప్పబడితే, పిరదౌసికి మాత్రం ఇది అశుభసూచకమే అయింది. పుత్రవియోగం కలిగిందని పిరదౌసికి ఈ సందర్భం లోనే తెలుస్తుంది. ఒక ప్రాచీన ప్రసిద్ధ వర్ణనని, దానికి పూర్తిగా భిన్నమైన స్ఫూర్తిలో ఒప్పించే రీతిలో వాడుకోవడం ఇక్కడ నన్నాకర్షించిన విషయం. ఈ ఇద్దరు కవుల ప్రభావమూ జాషువా మీద ఎంతో కొంత ఉండే ఉండాలి. ఎందుకంటే, జాషువ రెండవ రచన – కుశలవోపాఖ్యానం (1922). అలాగే, గబ్బిలం గురించి చెబుతూ పీఠికలో ఆయనే, ‘కాళిదాసుని మేఘసందేశము మనస్సులో ఉంచుకుని నేనీ కావ్యమును రచించితిని,’ అని చెప్పుకున్నారు.
కవిత్వంలో భాషకి ఎంత ప్రాముఖ్యత ఉందో, భావ చిత్రణకూ అంతే ప్రాముఖ్యత ఉంది. ప్రకృతి వర్ణనల్లోనూ, ఊహలకు మాత్రమే పరిమతమయ్యే దృశ్య చిత్రీకరణల్లోనూ కవులకు ఉండే స్వేచ్ఛ, అతి సహజమైన మానవ ఉద్వేగ చిత్రీకరణలో ఉండటం అరుదు. అతిగా వర్ణిస్తే అది కల్పనలానే మిగిలిపోతుంది. క్లుప్తంగా తేల్చేస్తే అనుభవం పాఠకులకు అందకపోయే ప్రమాదమూ ఉంది. కత్తి మీది సాము లాంటి ఈ గారడీని, జాషువా ఎంత నేర్పుగా చేశాడో తప్పకుండా గమనించాలి.
కృతిని అంకితమిచ్చేందుకు రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ మహీపతి, ‘గడ్డము దువ్వుచు మందహాసవాసిత ముఖుడై,’ సభలో చదువుదువు రమ్మని పిలుస్తాడట. అతనిలో ఈ కవి నా మాట నమ్మి ముప్పయేళ్ళు ఏమి వ్రాశాడో అన్న ఉత్సాహం కానీ, అదెలా ఉండబోతోందోనన్న ఉత్కంఠ కానీ, లేశమాత్రమైనా ఉన్నట్టు కనిపించవు. ఆ ‘గడ్డము దువ్వుచు’ అన్న రెండు పొడి పొడి మాటలతో, నృపతి నిర్లక్ష్యధోరణిని సూచనామాత్రంగా చెప్పేశాడు జాషువా. సరిగ్గా ఆ మరుసటి పద్యంలోనే, పిరదౌసి సభలోకి రావడాన్ని ఇలా చెప్తాడు: ‘హేమసమ్మిళితకీర్తిన్ కాంచు కౌతుహలంబున, లజ్జావతియై స్వయంవర సభాభూమిన్ ప్రవేశించు ముగ్ధను బోల్గ్రంథము చంకబెట్టుకుని యాస్థానంబు డాయంజనెన్.’
స్వయంవరం వేళ సభలో ప్రవేశించే ముగ్ధలా ఒకింత సిగ్గుతో, తనకు రాబోయే కీర్తినీ, బంగారాన్నీ చూసుకోవాలన్న కుతూహలంతో ఆ గ్రంథమును చంకన పెట్టుకుని వస్తాడట పిరదౌసి. స్వయంవరానికై సభలో అడుగుపెట్టే యువరాణికి వేనకోట్ల కలలుంటాయి. లెక్కకు మిక్కిలి కోర్కెలుంటాయి. తనకు అన్ని విధాలా తగిన వరుడొకడు ఉంటాడనీ, అతనికే తాను వరమాల వేస్తాననీ నమ్మి వస్తుంది. ఆమె సౌందర్యం/ వ్యక్తిత్వం అన్నేళ్ళుగా నగిషీలు చెక్కుకుని నాడు తొలిసారిగా మరొకరకు అంకితమవ్వబోతోంది. పిరదౌసి చేతిలోని షానామా కూడా అంతే. ఆ పోలిక గురించి ఆలోచించిన కొద్దీ అందులోని సౌందర్యం పొరలుపొరలుగా విస్తరించుకు పోతూ మనను ముగ్ధులను చేస్తుంది. జాషువా ఎంత పకడ్బందీగా దీనిని వాడాడో చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. అదీ కాక, ముందు పద్యంలో రారాజు నిర్లక్ష్యం చెప్పి, ఇప్పుడీ కవి అమాయకమైన ఆశని, అంచనాలని చెబుతోంటే, జరగబోయేది ఊహకంది మన మనసు విచలితం కాకుండా ఉంటుందా? ఆఫ్గన్ సభామండపానికి మనను లాక్కుపోయి నిలబెట్టిన జాషువా నేర్పుకి ఇదొక మెచ్చుతునక.
జాషువా తెలుగు ఎంత తేటగా ఉంటుందో అంత గుంభనం గానూ ఉంటుంది. అతను వాడినవి బలమైన ప్రతీకలే కానీ, భాష భయపెట్టదు. కవిత్వ సౌందర్యం బరువైన పదాల్లో కాదు, బరువైన భావాలను తేలిక పదాల్లో పెట్టడం లోనే ఉంటుందని తెలిసిన వాళ్ళకి పిరదౌసి నచ్చుతుంది. సాక్షాత్తూ పిరదౌసియే పూని అంతరంగ చిత్రణ చేయించాడా అన్నంత ఉదాత్తంగా ఆ పాత్రని మలచాడు జాషువా. అతని ఏకాగ్రతని, అతను పొందిన పరాభవాన్ని, అందులో నుండి పొరలి వచ్చిన దుఃఖాన్ని, ముప్పయేళ్ళ సేవకు ఈ ‘నిరాశాంకిత బాష్పములేనా ప్రతిఫలమూ’ అని ప్రశ్నిస్తూ వ్రాసిన ఉత్తరాలనూ – ఇంతే గాఢతతో, ఆర్ద్రతతో వేరెవరూ వ్రాయలేరనిపిస్తుంది.

పిరదౌసికి బంగారు నాణాలు ఇస్తానని నిండు సభలో వాగ్దానం చేసి ఘజనీ వెండి నాణాలు ఇచ్చిన వార్తను వేగుల ద్వారా తెలుసుకున్న పిరదౌసి కుపితుడై రాజు గురించి వ్రాసిన ప్రతీ పద్యమూ అమూల్యమైనదే. పద్యానికో బంగారు నాణమేం భాగ్యం, ప్రతీ అక్షరానికీ కనకాభిషేకం చేయాలన్నంత గొప్పగా ఉంటాయవి. ఇక్కడ కూడా భావకవుల లక్షణమొకటి కనపడుతుంది జాషువాలో. తురుష్కభూపతి మాట తప్పి మనసు ముక్కలు చేశాక కూడా, ఈ గోడల మీది పద్యాలలో మనకు కనపడేది వేదనే తప్ప కసి కాదు. ఆ మాటకొస్తే, పిరదౌసిలో పరనిందాసక్తి కంటే స్వీయనిందాభిలాషే ఎక్కువ. మహీపతిని ఎన్ని మాటలన్నా, సంయమనం కోల్పోయి మాట్లాడినట్టు కనపడదు. అయితే, సుస్పష్టంగా అది భయం వల్ల కాదనీ, స్వభావరీత్యా మాత్రమే అనీ కూడా తెలుస్తుంది. అంత సున్నితత్వం, వేదన, స్వీయనిందాలక్షణం భావకవుల్లో మాత్రమే ఆశించగలం.
చిరముగ బానిసీని నభిషేక మొనర్చితి మల్లెపూవు ట
త్తరులొలికించి; మాయజలతారున రాదుగదా పసిండి, యో
కఱకు తురుష్కభూపతి! యఖండమహీవలయంబునందు, నా
శిరమున, బోసికొంటిని నశింపని దుఃఖపు టగ్నిఖండముల్.
అన్నపుడైనా, మసీదు గోడల మీద కనపడి రాజు ఆగ్రహాన్ని కళ్ళజూసిన ఈ క్రింది పద్యంలోనైనా, కరుకుదనం కనపడదు. ఆ కనపడకపోవడమే జాషువా ముద్ర. అదే అతని శైలి.
ముత్యముల కిక్కయైన సముద్రమునను
బెక్కుమాఱులు ముంకలు వేసినాఁడ;
భాగ్యహీనుఁడ ముత్యమ్ము వడయనయితి
వనధి నను మ్రింగ నోరు విచ్చినది తుదకు.
విశ్వనాథ సత్యనారాయణ — ఖండ కావ్యములు భావ ప్రథానములు. కావ్యమునందు ప్రతి పద్యమునందు భావముండవచ్చును. కాని కావ్యము సమిష్టి మీద రసాభిముఖముగా ఉండును. ఖండకావ్యములందు భావములు రస వ్యంజకములు కావచ్చును. కానీ ఖండకావ్యములు ప్రధానముగా ఒక భావమును ఆశ్రయించి ఉండును. అందుచేత దీనిని భావ కవిత్వమనవచ్చును, — అని ఈ ఖండకావ్యాలని నిర్వచించారు (ఆంధ్రవారపత్రిక, జనవరి 1938.) అదే విధంగా వెల్చేరు నారాయణరావు తన పుస్తకం, తెలుగులో కవితావిప్లవాల స్వరూప స్వభావాలులో ఇలా అంటారు: భావ కవిత్వంలో వస్తువుకి స్వతంత్ర అస్తిత్వం లేదు. అది కేవలం కవి వ్యక్తిగతంగా మనస్సులో ఊహించుకున్నది. ఆ వస్తువుకి పుట్టుక పౌరాణిక సమాజమూ కాదు. కవి నిర్మితమైన సాహిత్య ప్రపంచమూ కాదు. అది కేవలం వైయక్తికమైన కవి మనః ప్రపంచం (పుట 96.); ఒక్క మాటలో చెప్పాలంటే లిరిసిజమ్‌నీ కవిత్వాన్నీ అభిన్నంగా భావించడం భావకవిత్వం చేసిన పని. రమణీయ వస్తువే కవిత్వ యోగ్యమనీ లలిత పదజాలమే కవిత్వ భాష అనీ అనుకోవడం దీనికి స్థూలరూపం. కథలో కవిత్వం లేదనీ, సంఘటనలో కవిత్వం లేదనీ, అనుభూతిని వ్యక్తీకరించడంలోనే కవిత్వం ఉందనీ ఈ సిద్ధాంతపు అంతరార్థం (పుట 128.)
ఈ నిర్వచనాలకి లోబడినట్టే కనపడినా, భావకవి లక్షణాలు ఎంత స్ఫుటంగా చూపెట్టినా, జాషువా పూర్తిగా కథను విడిచి కవిత్వం వ్రాయాలనుకోలేదు. అదే కారణానికి, కథను రసవత్తరంగా నడిపిస్తూనే, అంటే, ఈ కవిత్వంలో కథకు సముచిత స్థానమిస్తూనే ఓ కవిగా తన విశ్వరూపాన్ని చూపేందుకు అనువుగా ఉన్న అడవి ప్రయాణాన్నీ (ద్వితీయాశ్వాసము), దైవికంగా తారసపడ్డ నిషాదునితో చర్చనూ, కొన్ని లోతైన ప్రతిపాదనలనూ (తృతీయాశ్వాసము) వీలైనంతగా విస్తరిస్తూ నిఖార్సయిన కవిత్వాన్ని ప్రతి పద్యంలోనూ చల్లుకుంటూ సాగిపోయాడు. కవి ఇక్కడ ప్రత్యేకించి చేసిన గమ్మత్తేమిటంటే విశృంఖలమైన అడవి దారి అందాలన్నీ అక్షరాల్లోకి అనువదించాడు. ఆ ప్రయత్నంలో, మౌనాన్నీ, శూన్యాన్నీ కూడా కవిత్వం చేయగలిగాడు.
నిజానికి ప్రకృతి వర్ణనలకు సంబంధించి చాలా మంది పాఠకులకు ఉండే ఇబ్బంది కవి దృష్టితో లోకాన్ని చూడలేకపోవడం; కవి వర్ణనలను అతిశయోక్తులని నమ్మడం. ఈ వైయక్తికమైన అనుభవాలని సార్వజనీనం చేసి ఒప్పింప జేసుకోవడానికి కవిలో నిజాయితీతో పాటు, పాఠకులను చనువుగా తన వెంట రమ్మని పిలవగల నేర్పు కూడా ఉండాలి. ఆ ఒడుపు ఈ కవిలో ఉంది. మననే కాదు, పరమేశ్వరుణ్ణి కూడా, ‘మొగమింత సూపు, మిటనెవ్వరులేరు పరాయులీశ్వరా!’ అని పిలవగల చాకచక్యం ఇతని కవిత్వాన్ని సహజంగా పఠితలకు దగ్గర చేస్తుంది.
అలాగే, మరొక పద్యంలో, మనం మామూలుగా మన మాట వినని లేదా మనం చెప్పిన పని చెయ్యని ఆత్మీయులతో, నీకు అన్నింటికీ తీరిక ఉంటుంది ఒక్క నా పనికి తప్ప! అని ఎలా నిష్ఠూరాలాడతామో అచ్చు అలాగే, పరమాత్ముని ఎలా నిగ్గదీస్తున్నాడో చూడండి.
ఆగడపు మబ్బుశయ్యల నపరశిఖరి
బుడుత చంద్రుడు నిద్దుర బోవుచుండె
ఈ చెఱువునీట నతని కుయ్యెలలు గట్టి
జోలవాడుచు నావంక చూడవేమి?
ఇలాంటి ఎత్తుగడలు కవిత్వాన్ని పఠితలకు తేలిగ్గా దగ్గర చేస్తాయి. సహజత్వాన్నీ సృజనాత్మకతనీ జమిలిగా తమలో ఇముడ్చుకుని ప్రత్యేకంగానూ నిలబడతాయి.
మూడవ ఆశ్వాసంలో నన్ను పూర్తిగా లోబరచుకున్న పద్యమొకటి ఉంది. పిరదౌసి, భార్యాపిల్లలతో సొంత ఊరైన తూసీకి భయంకరమైన అడవి మార్గాల గుండా ప్రయాణిస్తున్నాడు. ఓ వైపు రాజు సైన్యం ఎక్కడ తనను, తన పరివారాన్ని వెంబడించి వచ్చి చంపేస్తారో అన్న భయం. మరోవైపు, ఆ కారడవిలో, ఆ నడిరాత్రి వేళ ఎటువైపు నుండి ఏ క్రూరమృగం మీదపడి నెత్తురు తాగుతుందోనన్న భయం. ఇట్లాంటి ఓ సందర్భంలో, ఈ పథికుడికి భయం కలిగించిన ఓ సంఘటన వర్ణించాలంటే, ఏ కవి అయినా ఏం వర్ణిస్తాడు? ఆ రాత్రి కారుచీకట్లనో, ఓ సింహగర్జననో, భీకర అడవిమృగాల పోరాటాన్నో, గుర్రపు డెక్కల చప్పుడునో, దారి దొంగల క్రౌర్యాన్నో… అవునా? చిత్రంగా జాషువా ఆలోచనలు అక్కడ ఆగిపోలేదు. అదే ఆశ్చర్యం! జాషువా వర్ణన ఇదీ:
గొసరి నివ్వరి ధాన్యంబు కొఱికి నమలు
నెలుక మునిపంటిసవ్వడి కులికిపడుచు
త్రోవ గమియించు నాటి పాంథుల నదేమొ
అదరి బెదరించె నొక ఎండుటాకు కూడ.
వాళ్ళ మనఃస్థితిని ఊహించి, కల్పించి వర్ణించలేదు జాషువా. అది అనుభవించి వ్రాశాడు. అంత పరాభవభారం తోనూ, దైన్యం తోనూ, వల్లమాలిన భయం తోనూ ఓ తప్పనిసరి ప్రయాణం చేస్తోన్న బాటసారిని భయపెట్టడానికి ఒక్క ఎండుటాకు చాలు. ధాన్యం కొరికే చిట్టెలుక మునిపంటి సవ్వడే చాలు. దీన్నెరిగి వ్రాయగల్గినవాడే కవి! వర్ణనల్లోని ఈ ఔచిత్యమే జాషువాని సాధారణ కవుల నుండి ఎడంగా నిలబెట్టింది. నవయుగకవిచక్రవర్తి అని సాహిత్యప్రేమికులు కీర్తించేలా చేసింది.
పిరదౌసి ఓ పారశీక కవి. గజనీ మహమ్మదు కాలం లోని వాడు. ఆ కాలంలో అతని సామ్రాజ్యమంతటి లోనూ అగ్రగణ్యుడిగా పేరొందిన కవి. అతని గురించి జాషువా ఏమని కవిత్వం వ్రాసినట్టు? ఎందుకు వ్రాసినట్టు?
పిరదౌసి పాఠకులకు నచ్చడానికి కారణాలు స్పష్టంగానే ఉంటాయి, వాటిలో కొన్నింటిని ఈ వ్యాసం లోనే వివరించే ప్రయత్నమూ జరిగింది. అయితే, అసలు పిరదౌసి వంటి ఒక కథ జాషువాని ఆకర్షించడానికి కారణం ఆ కథలోని విషాదమేనా, ఆర్ద్రత మాత్రమేనా, మిగిలిన కవులందరి మాదిరిగా కేవలం ఈ విషయాలకేనా అతను ఆకర్షితుడైనది? అన్న దిశలో ఆలోచిస్తూ జాషువా వ్యక్తిగత జీవితాన్ని ఓ సారి పరిశీలిస్తే, మరొక కారణం కూడా కనపడుతుంది. జాషువా తొలిరచనల్లో రుక్మిణీ కళ్యాణం (1919), కుశలవోపాఖ్యానం (1922), ధ్రువ విజయంకృష్ణనాడి (1925) మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ ఇతివృత్తాలు హిందువుల పురాణ గాధలు కావడం వల్ల, క్రైస్తవ కుటుంబంలో పుట్టి అన్య మతాన్ని ప్రచారం చేస్తున్నాడన్న నెపం మీద తన కులం వారే అతన్ని వెలివేశారు. జాషువా కుమర్తె హేమలత లవణం మా నాన్నగారు పుస్తకంలో ఈ ఉదంతాన్ని వివరిస్తూ –
అప్పటికే వివాహితుడైన నాన్నగారు తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను కూడా విడిచి ఊరికి దూరంగా ఉండవలసి వచ్చింది. పగలంతా ఊరికి దూరంగా ఉన్న పాడు పడ్డ మసీదులో మకాము చేసి రాత్రి చీకటి చాటుగా వచ్చి తల్లి పెట్టిన భోజనం తిని మరలా మసీదు చేరుకునేవారు. అటు సంఘం నుండి, ఇటు స్వగృహం నుండి తరమబడ్డ నాన్నగారికి ప్రకృతి ఆత్మబంధువై, గురువుగా తల్లిగా స్నేహితుడిగా తోడు నిల్చింది. జంతువులు, పిట్టలు, కొండలు, కోనలు ఆయనకు మిత్రులు. అవే ఆయనకు కవితా వస్తువులు.
అని వ్రాస్తారు. అలా చూస్తే, పిరదౌసి, జాషువా ఇద్దరూ నమ్ముకున్నది కవిత్వాన్నే. మనస్సాక్షికి లోబడి కవిత్వాన్ని వ్రాసుకోవడం, చివరికి ఆ కవిత్వమే చిక్కులు కొనితెస్తే వెలికాబడి సంఘానికి దూరంగా జరగడం, అందువల్ల వేదనకు గురి కావడం ఇద్దరిలోనూ కనపడే సామ్యాలు. తమ జీవితాల్లోని ఈ సారూప్యతే జాషువాని కదిలించింది అనుకోవడనికీ, కావ్యరచనకు పురికొల్పిందనుకోవడానికీ కొంత ఆస్కారం ఉంది.
‘ఆకులందున అణగిమణగీ కవిత కోయిల పలుకవలెనోయ్,’ అని గురజాడ అన్నాడు కానీ, ఈ కవి కోకిల మాత్రం జీవితంలో అణగి ఉండటాన్ని ప్రశ్నించదలచినట్టే కనపడుతుంది. పిరదౌసిలో ప్రస్ఫుటంగా కనపడే భావకవుల లక్షణాలు గబ్బిలం దగ్గరికి వచ్చేసరికి అభ్యుదయవాదంలోకి మారడమూ అంతే స్పష్టంగా తెలుస్తుంది. జాషువా తానే స్వయంగా — జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నా గురువులు ఇద్దరు – పేదరికం; కులమతభేదం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచింది కానీ బానిసగా మార్చలేదు. దారిద్ర్యాన్ని, కులభేదాల్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలచాను. వాటిపై నేను కత్తి గట్టాను. అయితే నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపై ద్వేషం, — అని చెప్పుకున్నాడు. ఇటువంటి తీర్మానం చేశాడు కనుకనే, అటుపైన మరింత సూటిగా, పదునుగా, కులప్రాతిపదిక మీద తనను చిన్నచూపు చూసిన వారినే లక్ష్యంగా చేసుకుని,
పంచములలోన మాదిగవాడను నేను
            పంచమీయులలో మాలవాడతండు
ఉభయులము క్రైస్తవ మతాన నొదిగినాము
            సోదరత గిట్టుబాటు కాలేదు మాకు
దేవుడొకడు; మాకు దేవళంబులు రెండు;
            దేశమొకటి; మాకు తెగలు రెండు;
మాటవరుసకొక్క మతమందుమే కాని
            కుల సమస్య వద్ద కుమ్ము దుమ్ము.
అని మన సంఘంలో ప్రతీ స్థాయిలోనూ కనపడే అనైకమత్యాన్ని గేలి చేశాడు. మనుష్యులుగా ఒకటిగా ఉండాల్సిన మనం, మతాలుగా, కులాలుగా, శాఖలుగా చీలిపోవడాన్ని తన కవిత్వంలో తూర్పాఱబట్టాడు. కనుక, అవసరమనుకుంటే ఎంత ఘాటుగా అయినా స్పందించగల లక్షణమొకటి జాషువాలో ఉందనీ, పిరదౌసి జాషువాలోని ఒక పార్శ్వాన్నే పాఠకలోకానికి చూపించిందనీ గమనించడం అవసరం.
‘రాజుల్ మత్తుల్ వారిసేవ నరకప్రాయంబు, వారిచ్చు నంభోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదులాత్మవ్యథాబీజంబుల్,’ అన్న ధూర్జటి మాటలెంత నిష్ఠురసత్యాలో అనిపించక మానదు పిరదౌసి చదువుతున్నంతసేపూ. దురదృష్టవశాత్తూ అది తెలుసుకునేలోపే తన జీవితంలో అత్యంత విలువైన ముప్పైయేళ్ళు కోల్పోయాడతను. ఆ బాధే, ఆ వంచనకు గురైన వేదనే జాషువా కావ్యంలోని అక్షరమక్షరంలో ప్రతిఫలించి మననూ వెన్నాడుతుంది. విషాదాంతమైన ఒక కథను ఎంత బలంగా చెప్పే వీలుందో, అంత బలంగానూ చెప్పాడు జాషువా. లలితమైన వర్ణనలూ, తేనెలొలికే భాష, పట్టి కుదిపే కథనం, శబ్దకాఠిన్యమూ అన్వయ క్లిష్టతా లేని అపురూపమైన కవిత్వమూ జాషువా పిరదౌసిని ఏ కాలానికైనా అజరామరంగా నిలబెడతాయి. మహమ్మదు రాతి విగ్రహాల యందైనా ఉండగలడా అన్నది సందేహమే కానీ, ‘ప్రజల నాల్కల యందు’ ఈ సుకవి జీవించి తీరుతాడు.
(*వాల్మీకి చేసిన ఈ పోలికను చెప్పిన భైరవభట్ల కామేశ్వరరావు గారికి,  ఈమాట సంపాదకులు మాధవ్ గారికీ కృతజ్ఞతలు .)
*తొలి ప్రచురణ : ఈమాట, జనవరి,2015

5 comments:

  1. Manasa, can't understand a word of what you have written

    ReplyDelete
  2. Is this the way you say hi ?:) How are you doing Ashwin...? Long time..I had sent you an email now...check..

    ReplyDelete
  3. చాలా బాగా వ్రాశారనడం చాలా సాధారణమైన చిన్నమాట.కానీ సరైన మాటలకోసం తడుముకోవాల్సిన పరిస్థితులు జీవితంలో కొన్ని ఎదురవుతూంటయి.అలాంటిదే ఇదీనూ

    ReplyDelete
    Replies
    1. Hi..Very happy to see your response. Thanks a lot. Happy Ugadi to you and family.

      Delete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....