ఇష్టమాను నిన్నే...మనసిలాయో...పోటెత్తిన అలలతో పుడమి కడలైపోవటాన్ని కనులారా వీక్షించి, అటుపై పాల వెన్నెల విరిగి తెలి వెలుగులుగా మారబోయే క్షణాల దాకా సైకత తీరాల్లో అనిమేషివై నిరీక్షించి...కాలం కౌగిట్లో నుండి ఏవేమి కొల్లగొట్టి కొంగు ముడిలో దాచుకున్నావో పదాలలో పెట్టవూ..? ఒక్క అనుభవమూ అవ్యక్తమై నీలో నిక్షిప్తమవకూడదు, దొరలిన నవ్వుల సిరులన్నీ లోలో దాగిపోకూడదు...పందెమే కడుతున్నాను మనసా! - అక్షరాల అమ్ములపొది నిన్నేమైనా గెలిపిస్తుందేమో ప్రయత్నించవూ?
                                                                 ****************
అనంత కాలప్రవాహంలో రెండు రోజులంటే పరిగణనలోనికి రాని పరిచ్ఛేదమే కావచ్చు; కాలానిదేముంది, కళ్ళెమేసే వారు లేరనుకుని తల నెగురవేస్తుంది. సృష్టిలో సౌందర్యమనేది ఒకటుందనీ, ఆ సౌందర్యం అనుభవంలోకి వచ్చిన క్షణాలు కాలాలనూ లోకాలనూ కూడా విస్మరించగల శక్తినిస్తాయనీ - లెక్కలు కట్టుకు గళ్ళను దాటుకుంటూ తమ ప్రతిభకు తామే చప్పట్లు కొట్టుకునే గోడ మీది ముళ్ళకెప్పటికి తెలిసేను, ఎవ్వరు చెప్పేను? మునుపెరుగని మనోజ్ఞ సీమలలో తిరుగాడిన రోజులే కాదు, స్మృతి పథంలో ముద్దరలేసిన ఆ అనుభవాలన్నీ అక్షరబద్ధం చేసుకునే ఏకాంత క్షణాల్లోనూ, మామూలు వేళల్లో మనను పరుగులెత్తించే ఆ మాయావికి, గర్వభంగం అయి తీరుతుంది కదూ!

బ్యాక్ వాటర్స్, సాగర తీరాలూ, జలపాతాలూ, పర్వత శిఖరాలూ, కొబ్బరి చెట్లూ - అన్నీ కాస్త అటునిటుగా అక్కడక్కడే పక్కపక్కనే ఉంటే - అదే కేరళ. కలహంస పంక్తులనూ, కల్హార సౌరభాలనూ ఇంకా మిగుల్చుకున్న భూలోక స్వర్గమది. రెండు రోజుల వ్యవథి ఆ అందాలను చూడటానికి నాబోటి వాళ్ళకి అస్సలేమాత్రమూ సరిపోదు. తమి తీరనే తీరదు. తనువేమో కదులదు.

సాగర తీరాలను స్పృశించి వచ్చే మంద సమీరం చెవిలో ఇంకా రహస్యాలు చెబుతునట్టే ఉంది; అలలు కమ్ముకున్నప్పుడల్లా తడిసిన పాదాలు అవి వెనక్కు మళ్ళగానే మెత్తటి ఇసుకలోకి లాగబడ్డ స్పర్శ ఇంకా సజీవంగానే ఉంది; పడియలు కట్టిన కావి రంగు నీరు ఒక్కోసారీ ఒక్కో తీరుగా కనపడి నవ్వించడమూ గుర్తుంది. రేయి రేయంతా చంద్రికలతో వన్నెలద్దుకుంటుంటే ఏ తీగ చాటునో రహస్యంగా రెప్పలు విప్పుతున్న మొగ్గల పక్కన ఓపిగ్గా కూర్చుని కబుర్లాడుకోవడం జ్ఞాపకాలలో పదిలంగా ఉంది. ఎన్ని కబుర్లని పంచుకోను...అన్నింటి గురించీ సవివరంగా రాయలేకపోయినా, చూసిన రెండు ముఖ్యమైన ప్రదేశాల గురించి -- కాసిన్ని సంగతులు.


మొదటి రోజు - బెంగళూరు నుండి పన్నెండు గంటల ప్రయాణించి -కాసర్‌గోడ్‌లో విడిది - బెకల్ ఫోర్ట్ సందర్శనం

సాగర తీరాన నలభై ఎకరాల్లో నిర్మించబడిన కోట ఇది. భారతదేశపు పది అద్భుతాలలో(2012) ఒక్కటిగా ప్రతిపాదించబడిన పర్యాటక ప్రదేశం కూడానూ. నల్లరాతి కోట గోడలు చూస్తుంటే, తడుముతూ ముందు సాగుతుంటే, ఎన్నెన్ని ఆలోచనలో..! ఒకప్పుడు ఇది దుర్భేద్యమైన కోట. ఒక చక్రవర్తి బలానికి, బలగానికీ, ఆతని పరాక్రమానికి తిరుగులేని సాక్ష్యం. ఇప్పుడో - పల్లీలు చేతబట్టుకు ఒక సాయంకాలం గడిపేందుకు వీలుగా మార్చబడ్డ విహార స్థలం.  ఎందుకో హఠాత్తుగా "రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే" అని శుక్రాచార్యునికి బదులిచ్చిన బలి చక్రవర్తి ఎంత వివేకవంతుడో కదా అనిపించింది.

"ఉరికే చిలకా" పాట గుర్తుందా? బొంబాయి సినిమా! కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని మనీషా కోసం ఎదురుచూస్తూ అరవింద స్వామి పాట పాడింది ఇక్కడే. ఆ పాట తల్చుకోగానే ముందు నేపథ్యంలో వినిపించే మురళీ గానం గుర్తొస్తుంది. మతి చెడగొట్టిన సంగీతం కదూ..! అలా కోట బురుజుల మీద కూర్చుని, సముద్రం మీద పడుతున్న వర్షపు చినుకుల సంగీతం వింటూ కోట లోపలి వైపు దట్టంగా పెరిగిన పచ్చికలో పరుగులిడుతున్న పసి వాళ్ళను చూడడం ఎంచక్కటి కాలక్షేపమో.

మధ్యాహ్నమనగా వెళితే, కాస్త ఎండగా ఉన్నంతసేపూ బీచ్ పార్క్‌లోనూ, ఇక నాలుగు మొదలుకుని బెకల్ ఫోర్ట్‌లోనూ కాళ్ళరిగేలా తిరగడంతోనే సరిపోయింది. కోట బయటా లోపలా కూడా ఊరబెట్టిన ఉసిరికాయల మీద పల్చగా కారం జల్లి అమ్ముతూంటారు. అన్ని గంటల సేపూ నేను ఒకదాని తరువాత ఒకటి తింటూనే ఉన్నాను. హ్మ్మ్..రాస్తుంటే మళ్ళీ పులపుల్లగా తియతియ్యగా ఆఖర్లో కాస్త వగరు రుచి లాంటిదేదో వదిలిన ఆ ఉసిరికాయ ఇంకొక్కటి బుగ్గన పెట్టుకు చప్పరించాలనిపిస్తోంది. సూర్యాస్తమయమయ్యే వేళకు కోట తలుపులు మూసేస్తారు. అరికాళ్ళ మీద ఇసుకంతా ఓపిగ్గా దులుపుకుని, ఇసుక గుళ్ళు కట్టి గవ్వలేరుకునే అలవాట్లు ఉంటే సముద్ర జలాలతో మళ్ళీ చేతులు తడుపుకుని, కోట బయటకు వచ్చేయాలి. పక్కనే హనుమంతుడి గుడి ఉంటుంది. హారతి సమయం. ఎంచక్కా దణ్ణం పెట్టేసుకుని బెల్లం-అటుకులు-కొబ్బరి తురుము కలిపి చేసిన ప్రసాదం దోసిలి నిండా నింపుకు బయటకు వచ్చి నిలబడితే, దూరంగా ఆకుపచ్చ జెండాతో, నెలవంకతో అస్పష్టంగా కనపడే మసీదు కూడా మసకమసకగా చూపులకానుతుంది. బాగుంటుంది, రెంటినీ అలా చూడడం.

రెండవ రోజు....కాసర్‌గోడ్ నుండి అనంతపురానికి ప్రయాణం..

నిశ్చలమైన సరస్సు...మధ్యలో కేరళీయుల దేవాలయ నిర్మాణాలలోని వైవిధ్యతను కళ్ళకు కట్టినట్టు చూపించే అనంత పద్మనాభస్వామి ఆలయం. హరినామ స్మరణతో ముఖరితమవుతున్న దేవాలయ ప్రాంగణంలో జంటగా అడుగులేస్తూ మేమిద్దరం. పక్కకు చూస్తే, తలలు నిక్కించి ఎగిరిపడుతున్న చిరుమీలు కనపడతాయి. ఉన్నట్టుండి నీటి పైపైకొస్తున్న కొంగల తడిసిన రెక్కల తపతప ధ్వనులు, ఎన్నడనగా అక్కడొచ్చి చేరాయో - తెలతెల్లని పావురాయిపిట్టల కురరీ ధ్వనులు...ఇవేమీ అక్కడి నిశ్శబ్దాన్ని భగ్నం చేయకుండా, లయగా ఇమిడిపోయినట్లనిపించడంలోనే ఉంది అసలు మహత్తంతా..!

మెట్లు దిగి, ఆలయంలోకి వెళ్ళి, పంచలోహాలతోనో, రాతితోనో కాక అమూల్యమైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడ్డ భూదేవీ శ్రీదేవీ సహిత అనంత పద్మనాభ స్వామికి మనసారా మ్రొక్కాము. దర్శనమైన ఉత్తరక్షణంలో  "పదండి...పదండీ" అంటూ తరిమేయకుండా ఇంకాసేపు అటు పక్క కూర్చుని శ్రీ మహా విష్ణువును ప్రార్ధించండి అంటూ చోటు చూపించిన పూజారులంటే అమాంతం గౌరవం పెరిగిపోయింది. కాసేపాగి, ఆ గుడికి కాపలాగా పిలువబడడమే కాక, దైవాంశ కలిగినదిగా పొగడబడే మకర శ్రేష్టాన్ని చూడటానికి వెళ్ళాము. మేమూ, మాతో పాటు ఇంకో పది మందీ - ఆశ చావక ఎంత సేపు చూశామో- తీరా అది బయటకే రాలేదు. చూసే భాగ్యం కలుగలేదు. అన్నట్టూ - త్రివేండ్రంలో ఉన్న అనంత పద్మనాభ స్వామికి ఇదే మూలస్థానం అని ఇక్కడి వారి నమ్మిక. స్వామి ఈ సరస్సులో నుండి కనపడే గుహలోపలి నుండే అక్కడికి వెళ్ళారని ఒక విశ్వాసం.

                                                                            *****
వెళ్ళే ముందు రెండు గంటలు మళ్ళీ, పాలక్కడ్ బీచ్‌కు వెళ్ళి, తీరానికి కాస్త దూరంగానే కూర్చుని... ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల కౌగిలిలో నను బంధించేందుకు, నురగల నవ్వులతో ముందుకొస్తున్న సంద్రాన్ని చూస్తుంటే...మనసంతా ఎంత పరవశమో!!

అరుణ కాంతుల పగడపు తునకలు నీవే, నీలిమేఘఛాయలు వాలిన వేళ నీలాలగనివీ నీవే, పకృతి కాంత చిరుచీకట్ల కాటుక దిద్దుకుంటూంటే మరకతమణులన్నీ నీవే, తెలి లేవెన్నెల చాలులో తళతళె దీపించు వేళ ముత్తెపు గుత్తులు నీవే, వర్ణాలన్నీ దోచిన అర్ణవమా, రతనాకరమా...నీ అసమాన సౌందర్యాన్ని వర్ణించదలచిన ప్రతీ ప్రయత్నంలోనూ నిర్దాక్షిణ్యంగా నను ఓడిస్తావెందుకు ?

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....