నేలకు దూకిన జలపాతం


వర్డ్స్‌వర్త్ ఒక కావ్యంలో "కన్య జలపాతం చూస్తూ గడిపితే, ఆ జలపాతంలో లయ, క్రమము, ధ్వని, నాదము- వీటి సమ్మేళనం వల్ల ఏర్పడే సంగీతం, సౌందర్యం ఇవన్నీ కన్య శరీరంలో జొరబడీ ఆ కన్యని అందంగా చేస్తా"యంటాడు. ఇంకొకరి జీవితానుభవాలను, మరొకరి కవిత్వాలను మనం అర్థం చేసుకోగలమే కానీ, అవే భావోద్వేగాలను అదే స్థాయిలో అనుభవించడం సాధ్యమయ్యే పని కాదనిపిస్తుంది. బహుశా అందుకేనేమో, మొదటిసారి అది చదివి, అతనిది భలే చిత్రమైన ఊహ సుమా అనుకున్నానే కానీ, ఆ రహస్యం నాకర్థమవుతుందని మాత్రం కలగనలేదు. ఆశ్చర్యమేమిటో తెలుసా..."శివ సముద్రం" జలపాతాల దగ్గర నిను చూసినప్పుడు, ఆకాశపు కొస నుండి జారిపడుతోందా అన్నట్లున్న ప్రవాహం క్రిందుగా నిల్చుని నవ్వుతోన్న నీకు దగ్గరగా నడచినప్పుడు...అకస్మాత్తుగా వర్డ్స్‌వర్త్ మాటలకు అర్థం తెలిసింది నాకు. 

జలపాతమంటే నువ్వు..తెరలు తెరలుగా విస్తరించే నీ నవ్వు. తడిస్తే ఆ నవ్వుల్లో తడవాలి. జలపాతమంటే నువ్వు..నీ చిలిపి చిందులు...చేతనైతే ఆ అల్లరి ప్రవాహాన్ని అడ్డుకోగలగాలి. జలపాతమంటే...సఖీ..దానికి నిజమైన పర్యాయపదం నీ సౌందర్యం! అందులో మార్గం తెలియని సుమనస్సునై తేలిపోవాలి..లేదూ..నిశి నీలి పెదవిపై నుండి జారిపడే అమృతపు బిందువునై వచ్చి నీలో ఐక్యమవాలి. గమ్యం నీవే అయినప్పుడు, మార్గాలతో నాకేం పని ? 

సమ్మోహన మీ మోహన గీతం..


కవిత్వంలో నిరంతరం నవ్యత కోసమే అన్వేషణ సాగినట్లు కవిత్వచరిత్ర నిరూపిస్తుంది. ఆ రహస్యాన్ని జీర్ణించుకుని, తెలుగునాట సాహిత్యాభిమానులను తన కవిత్వంతో ఉర్రూతలూపిన కవి మో! తన సమ్మోహనకరమైన శైలితో స్వీయముద్రను ప్రతీ రచనలోనూ ప్రస్ఫుటంగా చూపెట్టిన అతి తక్కువ మంది కవుల్లో, 'మో' ముందు వరుసలో ఉంటారు. మో రాసిన ప్రతీ కవితా విలక్షణమైనదే! అది అనుసరణనూ అనుకరణనూ దరి చేరనీయని అనన్యమైన మార్గము.

'మో' గా సుపరిచుతులైన వేగుంట మోహన ప్రసాద్ కవిత్వమంతా వైయక్తిక దృక్పథంతో సాగిపోతుంది. ఆ కవిత్వానికి ముసుగులుండవు, నటనలుండవు. స్వచ్ఛమైన భావాలతో తరగని స్వేచ్ఛాకాంక్షతో స్పష్టాస్పష్టంగా కనపడే తాత్విక చింతనతో మో రాసిన మొట్టమొదటి సంపుటి - "చితి-చింత".  కవితా వస్తువు కవిత్వంలో ప్రాథమికంగా నిలబడని ప్రతిచోటా, కవి గొంతు, కవి భావం బలంగా వినపడతాయని విశ్వసించిన వ్యక్తి మో. ఆ భావమే వస్తువుగా మారి కవిత్వాన్ని నిలబెట్టగలదని నమ్మాడాయన. నిరూపించాడు కూడా! కానీ, మో రచనలు చదివే వారిలో అత్యధికులు ఇక్కడే అయోమయానికి లోనవుతారు. వస్తువును వెదుక్కునే అలవాటు నుండి బయటపడలేక - అతి ప్రాచీనమైన తమ తప్పుడు తూనికరాళ్ళతో, మో కవిత్వాన్ని తూచే విఫల యత్నం చేసి, నిరాశ పొందుతారు.

"నా కోసం మంచు రాల్చిన ఆకాశమా
చివరికి నువ్వే రూక్ష వీక్షణాల్తో నను శిక్షిస్తే
నికోలస్ రోరిక్ వేసిన
"సోర్స్ ఆఫ్ గాంజెస్"
హిమాలయ చిత్రాల మంచు సోనల నీడల్లో దాక్కుంటాను
అక్కడొక్కచోటే మనిషి
జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది.
మాటిమాటికీ
బ్రతుకు దుఃఖాలకి ఆడపిల్లలా కన్నీళ్ళు నింపుకునే నగ్ననేత్రం
చీకిపోయి
నీళ్ళోడి
చివరికి అక్కడొక్కచోటే జ్ఞానదీపం వేడిగా కాలుతుంది" (చితి-చింత : ఆలస్యం కవిత నుండి)

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....