సమ్మోహన మీ మోహన గీతం..


కవిత్వంలో నిరంతరం నవ్యత కోసమే అన్వేషణ సాగినట్లు కవిత్వచరిత్ర నిరూపిస్తుంది. ఆ రహస్యాన్ని జీర్ణించుకుని, తెలుగునాట సాహిత్యాభిమానులను తన కవిత్వంతో ఉర్రూతలూపిన కవి మో! తన సమ్మోహనకరమైన శైలితో స్వీయముద్రను ప్రతీ రచనలోనూ ప్రస్ఫుటంగా చూపెట్టిన అతి తక్కువ మంది కవుల్లో, 'మో' ముందు వరుసలో ఉంటారు. మో రాసిన ప్రతీ కవితా విలక్షణమైనదే! అది అనుసరణనూ అనుకరణనూ దరి చేరనీయని అనన్యమైన మార్గము.

'మో' గా సుపరిచుతులైన వేగుంట మోహన ప్రసాద్ కవిత్వమంతా వైయక్తిక దృక్పథంతో సాగిపోతుంది. ఆ కవిత్వానికి ముసుగులుండవు, నటనలుండవు. స్వచ్ఛమైన భావాలతో తరగని స్వేచ్ఛాకాంక్షతో స్పష్టాస్పష్టంగా కనపడే తాత్విక చింతనతో మో రాసిన మొట్టమొదటి సంపుటి - "చితి-చింత".  కవితా వస్తువు కవిత్వంలో ప్రాథమికంగా నిలబడని ప్రతిచోటా, కవి గొంతు, కవి భావం బలంగా వినపడతాయని విశ్వసించిన వ్యక్తి మో. ఆ భావమే వస్తువుగా మారి కవిత్వాన్ని నిలబెట్టగలదని నమ్మాడాయన. నిరూపించాడు కూడా! కానీ, మో రచనలు చదివే వారిలో అత్యధికులు ఇక్కడే అయోమయానికి లోనవుతారు. వస్తువును వెదుక్కునే అలవాటు నుండి బయటపడలేక - అతి ప్రాచీనమైన తమ తప్పుడు తూనికరాళ్ళతో, మో కవిత్వాన్ని తూచే విఫల యత్నం చేసి, నిరాశ పొందుతారు.

"నా కోసం మంచు రాల్చిన ఆకాశమా
చివరికి నువ్వే రూక్ష వీక్షణాల్తో నను శిక్షిస్తే
నికోలస్ రోరిక్ వేసిన
"సోర్స్ ఆఫ్ గాంజెస్"
హిమాలయ చిత్రాల మంచు సోనల నీడల్లో దాక్కుంటాను
అక్కడొక్కచోటే మనిషి
జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది.
మాటిమాటికీ
బ్రతుకు దుఃఖాలకి ఆడపిల్లలా కన్నీళ్ళు నింపుకునే నగ్ననేత్రం
చీకిపోయి
నీళ్ళోడి
చివరికి అక్కడొక్కచోటే జ్ఞానదీపం వేడిగా కాలుతుంది" (చితి-చింత : ఆలస్యం కవిత నుండి)బాహ్య ప్రపంచానికి దూరంగా, ఒకానొక ఏకాంతాన్ని వెదుక్కుంటున్న మనిషికి ఆ కాస్త అదృష్టమూ చిక్కిందా, అన్ని బంధాలూ తెంచుకుపోతాయి. తన లోలోపలికి చేసే ప్రయాణం ఫలించిందా, ఎన్నాళ్ళుగానో తపిస్తున్న వెలుగు కనపడి తీరుతుంది. ఇహపోతే, ఇక్కడ ప్రత్యేకంగా క(వి)నిపిస్తోన్న "బ్రతుకు దుఃఖాలకు 'ఆడపిల్లలా' 'కన్నీళ్ళు' నింపుకునే నగ్ననేత్రం చీకిపోయి నీళ్ళొడితే 'జ్ఞానదీపం' 'వేడిగా' వెలగడం" - మొదలైనవన్నీ 'మో' ముద్రలే!

వచన కవిత్వమంటే అప్పుడూ ఇప్పుడూ కూడా చాలా మందికి ఒక చిన్నచూపు. "వచనం వ్రాసి కవిత్వమని అమ్ముకుంటున్నా"రంటారు. కవులు అమ్ముతారు సరే, పఠితలకు తెలియదూ? కాలపు పరీక్షలకు ఎదురొడ్డి నిశ్చలంగా నిలబడి, చదివిన ప్రతిసారీ కొత్త మెలికలు తిరుగుతున్న నదిలానూ, కొత్త మొలకలు తొడుగుతున్న లేలేత మొక్కలానూ కనపడుతూ- మానసాన్ని స్పృశిస్తూ చర్చించబడేది వఠ్ఠి వచనమెలా అవుతుంది ?

మో కవిత్వంలో అంతర్లీనంగా ఒక లయ ఉంటుంది, చూసేందుకు పదాలను ఇష్టానుసారం ముక్కలుగా విడగొట్టి రాసేడన్న భ్రమ కలిగించినా, కవిత చదివేటప్పుడు ఆ లయ పాఠకులకు విస్పష్టంగా తెలిసిపోతుంది. ఆ కళ అతని కవిత్వానికి కొత్త సొబగులేవో అద్దుతుంది.

"ఆనందపూర్ణ సరస్సులో ఎర్రకల్వల్లో ఆశ్చర్య సజల నేత్రాల్లో
నిమ్మచెట్టు మీంచి రాలిపడిన వానచుక్కలో ఎక్కడా నీ బొమ్మేనా
రివ్వుమని చిమ్మే దానిమ్మపండు అరుణారుణ ప్రేమలో
ఇంకా ఈ ప్రపంచం చూడని శిశువు ఆత్మలోంచే ఆకల్తో కేకవేస్తే
వక్షంలో పాలతో జలపాతంతో ప్రతీక్షించే అమ్మలో
ఎల్లెడెలా నువ్వేనా ఒక్క నువ్వేనా
నీ హఠాత్ ప్రేమతో నా భూతభవిష్యత్ జన్మల్ని నరికితే
ఈ నా రూపం కరిగిపోదా నీ వెలుగు మెరుపులోకి! " (అతీతం కవిత నుండి)

"నాకుగాదులు లేవు, ఉషస్సులు లేవు" అని కృష్ణశాస్త్రిగారన్న మాటలను జ్ఞప్తికి తెస్తూ, మో కూడా "నాకు కార్తీక పూర్ణిమా స్నానములు లేవు / కృశాంగిత నిజాకృతికి వెన్నెల వస్త్రములూ లేవు" అంటూ నైరాశ్యాన్ని గుమ్మరిస్తారు. అన్ని మాటలన్నా,

"ఎటూ ఈ శరీరపు రేఖలు వెలిసిపోయేవేగదాని
ఎండకూ వానకూ చివరకు వహ్నిశిఖలకూనని
అనావర్తపు ఆత్మకు రూపురేఖలు దిద్దుతున్నవాణ్ణి"     అని ఒకసారీ,

"నువ్వు వెయ్యి చెప్పు
చివరికి మనందరం చింతాక్రాంతులమయ్యే ఉంటాం
ఓరబ్బాయ్
ఇదంతా రామదాసు చెరసాల. ఎండావానా నర్తనశాల."    అంటూ ఇంకొక్కసారీ,

"సత్యం హఠాదర్శన మివ్వదు
శాంతి మీట నొక్కితే వెలగదు
అంతరంగాన్ని ముగ్గుపొడి పెట్టి తుడవాలి
దయాస్పర్శతో తడపాలి
అందాకా ఆనందపు తడినంటిన వెలుగుచుక్క మెరవదు. "

అని మరోసారీ చెప్పిన మోలోని కవినీ తాత్వికుడినీ విడదీసి చూడగలమనుకోవడమొక తప్పిదమే అవుతుంది. వాన చుక్క నింగిని విడిచి నేలకు జారుతుంటే నిబిడాశ్చర్యంలో మునిగి మనం గమనించేది అందులోని పవిత్రతనూ, నిసర్గ సౌందర్యాన్ని. మో లోని కవికి మాత్రమే, ఆకాశం అంతరంగంలోని దయ కనపడుతుంది,

"వృథా వర్షమని శపింపకు
ఎంతో దయ లేకపోతేకానీ ఎవరూ
అధోముఖంగా ఈ పృథ్విపై పడరు" అనడంలో ఇన్నాళ్ళూ మనకు తోచని అసామాన్యమైన భావమేదో తడుతుంది.

మో కవిత్వం అర్థం చేసుకోదగినది కాదనీ, ఆంగ్ల పదాల విచ్చలవిడి వాడకంతో తెలుగు కవిత్వమే కాకుండా పోయిందనీ ఘాటైన విమర్శలే ఉన్నాయి. మో ఆంగ్ల వాడకం పట్ల పరిమితులు పెట్టుకున్నట్లు ఎక్కడా తోచదు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఫలానా ఆంగ్ల పదమే పడాలని అనిపిస్తే, అది నిస్సందేహంగా వాడే ధోరణే "మో"లో మొదటి నుండీ చివరి దాకా కనపడుతుంది. కె.వి రమణారెడ్డి గారు తన స్వాగత వచనాల్లో వాటికి బదులుగా అననే అంటారు -

" అర్థమ్ముగాని తత్వగీతమ్ములివి" అని ఆక్షేపించడం కంటే సులువైన పని విమర్శకుడికి మరొకటి ఉండదు. గహనంలోనైనా సుగమమైన మార్గాన్ని తీయడం అతని ధర్మమైనప్పుడు, తత్వ కవిత్వాన్ని చూసీచూడక ముందే చేతులెత్తి దణ్ణం పెట్టి తన బాధ్యతను వదులుకోవడం, అతగాడూ సామాన్య పాఠక స్థాయికి పడిపోయి కూడా విమర్శక బిరుదాన్ని తలదాలుస్తూండడమే" -అని.

ఏకాంతంలో చుట్టుముట్టిన అంతుపట్టని విషాదానికి ప్రతీకలుగా కన్నీటి బొట్లు జలజల రాలి పడినట్లూ, ముప్పిరిగొన్న మోహంతో ఒక చుక్క మకరందం కోసం ఝుంఝుమ్మంటూ వేల తుమ్మెదలు ఒక్కసారి వాలినట్లూ, మనమెన్నటికీ కనిపెట్టలేని మరో ప్రపంచపు రహస్యాలేవో మోసుకొస్తూ అర్థరాత్రి ఆకాశం నుండి నక్షత్రాలేవో తూలిపోతునట్లూ - ఎన్నెన్ని భావనలో కలిగించే కవిత్వం "మో" సొంతం. అర్థమవడానికి ముందే అనుభూతులేవో రగిలించి, విషాదవియోగాల అంచుల్లో నిలబెడుతూనే అర్థమవనక్కర్లేని శాంతిని పాఠకులకు రుచి చూపించి, తెలుగు వచన కవిత్వంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన "మో" కవిత్వం, ఆ కవి మరణం తరువాతే మరింతగా ప్రజలకు చేరడం, మన సాహిత్యానికి మహావిషాదం. నవనవోల్లాసంతో ఎగసిపడ్డ కవిత్వమేదైనా మానసికంగా మరుగుజ్జులైన వాళ్ళు అడ్డునిలిస్తే ఆగిపోదనీ,  స్థలకాలాలకతీతంగా జనం నాల్కలపైన నాట్యమాడే మధురమోహన గీతమై మిగిలిపోతుందనీ నిరూపించిన మో - కవితా ప్రపంచంలో అమరుడనడం అతిశయోక్తి కాదు.
                                                        ********************
* * తొలి ప్రచురణ - గత నెలలో తొలి సంచికతో మన ముందుకొచ్చిన "వాకిలి" పత్రికలో...

అన్నట్టూ - - ఉగాదిలో లేని సౌలభ్యం ఇప్పుడేముందంటే - చేదు చుక్కలు, వగరు వాసనలు పక్కన పెట్టగలడమేనంటాను. అత్యాశే అవవచ్చు గాక, ఈ ఏడు గడిచిపోయాక వెనక్కు తిరిగితే తీయ తేనియ కబుర్లూ జ్ఞాపకాలే మిగలాలని ఆశ పడటం ఏమంత నేరమనీ? సాహితీ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాభినందనలు. :-)

7 comments:

 1. Replies
  1. ధన్యవాదాలండీ..! నన్నడిగితే అంతా ఆ కవిత్వపు మహత్తే నంటాను. మోహనప్రసాద్ కవిత్వం చదువుతూ పోతుంటే, మన వచనం కూడా కవిత్వమైపోతుందనే మిత్రుల మాటలూ గుర్తొచ్చాయి. :) పద్మార్పిత గారూ- మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. (కొంచం ఆలస్యంగా..)

   Delete
 2. అంతరంగాన్ని ముగ్గుపొడి పెట్టి తుడవాలి...idi okkti chalu... mo em cheppado... nice feature ni andinchinaduku meeku thaks.

  ReplyDelete
  Replies
  1. విజయ్ గారూ - ధన్యవాదాలండీ! నిజం, ఒక్కో వాక్యం ఎంత సూటిగా, బలంగా ఉంటుందో మో కవిత్వంలో! "అంతరంగాన్ని ముగ్గుపొడితో తుడవడం" - అన్న భావన నన్నెంత సేపు కుదురుగా నిలువనీకుండా చేసిందో నాకే తెలుసు. లోలోపల జ్వాలలు రగిలించే నిప్పు కణికలు మో అక్షరాలు. కొన్ని కొన్ని కవితలు మొదట్లో విసుగనిపించాయి - ప్రేలరితనమా అని కూడా అనిపించాయి. వాటిని అలా వదిలేసి వేరేదో చేసుకునే క్షణాల్లో చటుక్కున భావం స్పురించేది.

   కొన్ని మాత్రం ఇంకా అలాగే ప్రవల్లికల్లా కవ్విస్తున్నాయి. :-)

   Delete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...