విరహితమ్

పడమటి కొండల గుండెల్లో
ఒద్దికగా ఒదుగుతున్న సూరీడిని
రైలు కిటికి ఊచలకానిన కళ్ళు
దిగులుగా దాచుకుంటున్నాయి.

కలిసినట్టున్న పట్టాలను క్షణాల్లో విడదీస్తూ
నిశ్శబ్దపు పెదవులను శృతిలయల్లో కదిలిస్తూ
విషాద వియోగ విరహ భారాల స్పృహ లేక
జోరుగానే సాగుతోందీ రైలుబండి పరుగు.

బికారి నోట ముక్కలైపోయిన పదాలుగా
ఉండుండీ తాకుతోన్న ఓ విరహ గీతం
ఆకాశపు ఆవలి ఒంపులో ఒణుకుతూ
మిగిలున్న వెలుగుల్లో ముక్కలవ్వని నక్షత్రం

నాకీ నిశీథిలో
మరింకేం గుర్తుకు తేగలవు?

విడివడిన నీ అరచేతి వేళ్ళనీ
ఆగీ ఆగీ ఆఖరకు ఓడిన కన్నీటి బొట్లనీ
రాతిరిలో తడుస్తోన్న గ్రీష్మపు గాలి
జ్ఞాపకాలేమోననుకుని మోసుకొస్తుంటే..

చుట్టూ చీకట్లు పరుచుకుంటున్నా
కళ్ళల్లో సాయంకాలపు సూరీడి ఎరుపలాగే...
తడిగా!

వెన్నాడే అద్భుతాలు

కొండరాళ్ళ మీద
జారుడు బల్లాటలో
ఒకరినొకరు తోసుకునే
చినుకు కన్యలు

వెన్నెల పరుగులకు
వెనుకెనుక పడుతూ
పట్టు చిక్కాక పకపక నవ్వే
సెలయేటి నురగలు

వెలుగు పూలు జల్లే సూరీడికై
రాతిరంతా రహస్యంగా శ్రమించి
రంగవల్లులతో ఆహ్వానం పలికే
గగనపు లోగిలి

అరుణ వర్ణ ప్రభాతాల్లో
చినుకుల చిలిపితనంతో
సెలయేరల్లే తుళ్ళిపడే నన్ను
బంధించి నిలబెట్టే -నువ్వు - నీ నవ్వు!!

శృంగేరీ..సౌందర్యలహరీ!


చూసే కనుదోయి అభిప్రాయాల అల్పత్వం దగ్గరే ఆగిపోకుండా, మనసును తాకి పరవశింప జేసే సౌందర్యాన్ని అణువణువునా నింపుకున్న ప్రదేశాలు అదృష్టవశాత్తూ మన దేశంలో ఇంకా చాలానే మిగిలి ఉన్నాయి. వెర్రి పోకడల నవనాగరికత నీడలు పడని, కాలుష్యమింకా తెరలను పరువని నిష్కల్మష పుణ్యస్థలమైన శృంగేరి శారదా పీఠం తప్పకుండా అదే కోవకు చెందుతుంది.

జాతి వైరాన్ని మరచి ఒక పాము కప్పకు తన పడగ చాటున నీడనిచ్చిన మహత్తరమైన ప్రదేశంలో ఒక్కసారైనా కాలు మోపాలన్న ఆశా, అద్వైతాన్ని నలుదిశలా ప్రచారం చేసి, సనాతన భారతీయ ధర్మోద్ధరణ గావించిన శ్రీ శంకర భగవత్పాదులు ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించిన శారదా పీఠాన్ని దర్శించుకుని ఒక రెండు రోజులు హడావుడి లోకానికి దూరంగా, ప్రశాంతంగా గడపాలన్న కోరిక - తొలుత ఈ రెండే మా అకస్మాత్తు ప్రయాణానికి ప్రేరణలు. అయితే, అనుకోని వరాల్లా, అక్కడ ఉన్న రెండు రోజుల్లోనే ముందు వినని, చదువని (చదివినా ఇంత మనోహరంగా ఉంటాయని ఊహించని) మరికొన్ని ప్రదేశాలు కూడా చూడగలిగాము. అదృష్టమేనేమో కానీ, బెంగళూరు దాటి సగం దూరం ప్రయాణం చేసినప్పటి నుండీ వాన పడే ముందు ఉండే అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం, శృంగగిరి పీఠం ఇంకా చేరకుండానే మనఃస్థితి మొత్తాన్నీ మార్చేసింది. మలుపుల మయమైన ఘాట్ రోడ్ మీద కిటికి పక్కన కూర్చుని చేసిన ప్రయాణం, ఎంత వెనక్కు తోసినా మొహమంతా పరుచుకునే జుత్తు, చెవుల్లోకి సన్నని హోరుతో దూసుకెళ్ళే గాలి, కళ్ళకు హాయి గొలిపే చిక్కటి పచ్చదనం ప్రయాణంలో తొలి ఘడియల అనుభవాలు.

శృంగగిరి అడవి మధ్యలో ఉన్నట్టుంటుంది. నాకు సహజంగానే అడవి ప్రాంతాల పట్ల మక్కువ ఎక్కువ. అందునా పచ్చందనాల కౌగిళ్ళల్లో ఒదిగి హొయలొలికించే చిగురాకులలోనూ, చిరుజల్లుల తాకిడికి తడిసి తల విదుల్చుకునే లేలేత కుసుమాల కదలికల్లోనూ మానవ మేధస్సుకు అంతు పట్టని మార్మిక సౌందర్యమేదో మనసులకు ఎర వేసి లాగేస్తుంది. కాలాలను కట్టి పడేసి, బాహ్య స్మృతి విముక్తులను చేయగల అదృశ్య శక్తేదో ఆ అడవి తల్లి ఒడిలో మాత్రమే భద్రంగా ఉంది.

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....