తుఫాను రాత్రి

ఓ వర్షం కురవని రాత్రిలో
నదిలో కలుస్తున్న నీటి చుక్కలెక్కడివో
గమనించుకోలేని దిగులులో నేనున్నప్పుడు

దోసిలి పట్టకు, దోషిని చెయ్యకు
ఈ పడవలో ప్రయాణానికి
పరితపించకు.

పగిలిన ముక్కలు ఏరుకు
పారిపోతున్న దాన్ని.
నెత్తురోడేలా గుచ్చకుండా
( నిన్నైనా నన్నైనా )
వాటి పదును పోగొట్టేందుకు
ప్రయత్నిస్తున్నదాన్ని

ముక్కముక్కలో, ఇంతింతగా
తత్వాన్ని చదువుకోగలను కానీ
వరదొచ్చి ముంచేసే వేళల్లో
పొరలన్నీ కరిగే వేళల్లో
అంత నిజాన్నీ చూడలేను.

చెప్పలేదు కదూ,
నది చీలి నిలబడ్డ క్షణాల్లో
నే పారిపోని సంగతీ
నదిని ఎలాగైనా గెలవగలనని తెలిసీ
అది తెలీని వాళ్ళ కోసం
ఓడిపోయిన సంగతీ..

అయినా, ఒక్క తుఫాను రాత్రికే
ఓటమినొప్పుకున్న ప్రాణమిది
కవ్వింపులెందుకు?
మునిగిపోవాల్సిన చిల్లుల పడవే ఇది.

నిబ్బరంగా ఊగిన నాలుగు రెక్కల
పూవొకటి
నిలబడాలని తపించిన నాలుగు పూవుల
మొక్కొకటి

ఏం చెప్పాయో తెలీదు కానీ,
గుప్పెడు గుండెను అడ్డంగా పెట్టి,
మళ్ళీ దిక్కులు వెదుక్కుంటున్నాను.

నీలా వెలుతుర్లో కాదయ్యా,
ఈ పగటి ప్రశాంతతలో కాదయ్యా,
తుఫాను రాత్రి చూశానీ లోకాన్ని.

అలాంటి రాత్రి, అలాంటి ప్రతి రాత్రీ,
నాతో ఉండాలనిపిస్తే చెప్పు
ఉండే వీలుంటేనే చెప్పు

మనం మాట్లాడుకుందాం!

** మధురవాణి దసరా-దీపావళి సంచికలో

ఆట

వేదనతో పగిలి వేదికపై
ఒరిగిపోయింది రాత్రి
నారింజరంగు పరదా
మళ్ళీ కొత్తగా రెపరెపలాడింది

సూర్యకాంతి సోకితేనే
కాలిపోయే తెల్లకాగితాలని
ఏ నీడలో దాచి కథ పూర్తి చెయ్యాలో
తెలియలేదతనికి

రంగునీళ్ళని బుడగలుగా గాల్లోకి వదిలి
మిట్టమధ్యాహ్నపు ఆటల్లో నవ్వుకున్నాడు కానీ
ఇంద్రధనుసు పగలకుండా ఆపడం
చేతకాలేదతనికి

అరచేతుల క్రింద ఇసుకను దాచి
ఆటాడీ ఆడించీ గుప్పెట తెరిచాక
వేలి క్రింద ముత్యపు ఉంగరమొక్కటే
మెరుస్తూ కనపడింది

కలలో కనపడ్డ బంగారు చెట్టుకు
ఊయలకట్టి ఊగుతూ నిద్రించిన సంగతి
ఎవ్వరికీ చెప్పకుండానే
వేరు ఎండిపోయింది

నారింజరంగు పరదా
మళ్ళీ రెపరెపలాడింది
ఒకరు ముందుకి – మరొకరు వెనక్కి-
నటనెవరిదైతేనేం- నాటకం సాగుతూనే ఉంది.

*తొలి ప్రచురణ : వాకిలి, అక్టోబరు-2016 సంచిక


వర్ణచిత్రం

కొత్తరోజులన్నీ ఖాళీ కాగితాలై
రంగులద్దుకోవాలని నా ముందు
రెపరెపలాడతాయి.

తైలవర్ణచిత్రమేదో గీయాలని
తొందరపడతాయి వేళ్ళు.
వీచే గాలికి ఉబలాటంగా ఊగుతూ
ఖాళీ కాన్వాసు మీదకి ఎగిరి చూస్తూంటాయి
డిసెంబరు పూవులు

ఊదారంగు సముద్రం, పైనేమో నీలాకాశం
గరుడపచ్చ పూసలకు గొడుగులు పడుతున్నట్టు
ఆకుపచ్చాపచ్చని కొండలు
పసిమి కాంతుల నెగురవేస్తూ వెనుకొక లోకం 
గీతలుగా మెదులుతూ చెదురుతున్న చిత్రం
పూర్తయ్యీ అవకుండానే
గుప్పెళ్ళతో కెంజాయలు రువ్వి
ఎర్రటి సూరీడెటో మాయమవుతాడా-
నల్లని రెప్పల తాటింపునాపి
నివ్వెరపాటుతో నిలబడిపోతుంది కుంచె

జీవితంలోని వర్ణాలనో
వర్ణాల్లోని జీవితాన్నో
జ్ఞాపకంగా నిల్పుకునే నేర్పు లేక
ఒళ్ళంతా ఒలకబోసుకుంటుంటే
అక్కడెక్కడి నుండో తొంగిచూసి
తెల్లగా నవ్విన చంద్రవంక
పెదాలపై నవ్వు ముద్దరై వెలుగుతుంది.

చిత్రం పూర్తవకపోతేనేం..?
చలిలోకి ముడుచుకునే వేళయ్యేసరికి
ఆనందం అర్ణవమయ్యీ,
సౌందర్యం అనుభవమయ్యీ,  
తీరం వెంట తడితడిగుర్తులతో
అసంపూర్ణ చిత్రాలన్నీ పరుగులు తీస్తాయి.
నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో,
నా బొమ్మలు నాలుగు రంగులు మిగిల్చి పోతాయి.

* తొలిప్రచురణ : ఆంధ్రజ్యోతి-వివిధ, 03-10-2016

గోపిని కరుణాకర్ కవిత్వం : "పొద్దున్నే వచ్చిన వాన"

ఆకాశం దాహంతో ఏటిలోకి వంగితే, ఒలికిన చుక్కలన్నింటిని చేపలు పొడుచుకు తింటాయన్న ఊహ కొందరు కవులకే వరమై దోసిట్లో పడుతుంది. గులకరాళ్ళ గూటిలోని గువ్వ పాటని ఎద పదే పదే పాడుకునేలా వ్రాయడమూ కొందరికే సాధ్యపడుతుంది. గోపిని కరుణాకర్ ఆ కోవకు చెందిన కవి. సార్వజనీనత, సర్వకాలీనత సదా వాంఛనీయమైన కవిత్వ రంగంలో ఓ కూడలిలో నిలబడి, ఓ సంధి కాలానికి చెందిన సంఘటనాక్రమాన్ని మాత్రమే తన కవిత్వంగా నమోదు చేయడానికి మొగ్గు చూపిన రైతు బిడ్డ ఇతడు. గుండె పట్టేలా వ్రాయడమే పరిణత కవిత్వ లక్షణమన్న నమ్మకాన్ని స్థిరపరచిన సమర్థుడైన కవి కూడానూ. సౌందర్యము, సత్యము, సాలోచన కలగలసిన త్రివేణీ సంగమమైన కవిత్వాన్ని అందించే కరుణాకర్ కవితల సంకలనం పొద్దున్నే వచ్చిన వాన.

పాలపిట్ట ప్రచురణలు
మార్చ్ 2011. వెల: 50/-
కాల్పనికవాదం, అస్తిత్వవాదం కాలాలకతీతంగా తెలుగు సాహిత్యాన్ని కుదుపుతూనే ఉన్నాయి. కలలు సాకారమయ్యేందుకు పల్లెని విడవక తప్పదని ఒప్పుకున్న మనిషే ఆ పల్లె లోని తన మూలాలను పదే పదే మానసనేత్రంతో చూసుకోవడం తెలియనిది, కొత్తది కాదు. పల్లెల దాకా పాకని ఈ దేశ అభివృద్ధి, అక్కడ స్థిరపడలేని వ్యాపారాలు, ఉపాధిగా మారని కళలు, పల్లె జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో పరోక్షంగా ఈ సంపుటి మనకు చూపెడుతుంది. ఈ కవితల వెనుక అనివార్యమైన ఉత్పత్తిశక్తుల, సంబంధాల సంఘర్షణను రాజకీయ పోరాటంగా కాకుండా, ఊహాత్మక స్థాయిలో జీవితానుభవాలకు దగ్గరగా తెచ్చి కవిత్వంగా మలచిన సృజనకారుడి చాతుర్యం ఉంది. కరువు రక్కసి కోరల్లో చిక్కి, పట్నానికి వలసపోయిన రైతుబిడ్డ హృదయం ఉంది.
ఇతని కవిత్వంలో ప్రధానంగా కనపడే లక్షణాలు ఈ రెండే – పల్లె హృదయం తాలూకు వాస్తవ్యత; వలస జీవుల అస్తిత్వ వేదన. ఈ వేదన స్పష్టంగా కనిపించే కవిత: ఇదంతా మడకసాల్లో పుట్టినవాడి మనేద! (పు. 40).
ఏ కొమ్మపై వాలానో తెలియని మట్టికాకిని
మీ మామిడిచెట్టుపై వాలాను
మీ పిల్లల్లా కాన్వెంటు స్కూల్లో
ఇంగిలీసు అక్షరాలను ఏరుకు తినలేదు
కపిలి తోలుతూ
గొర్రెల తాత పాడిన జనపదానికి పల్లవినైనాను.
మా నాయనతో పాటు మేడి పట్టుకుని
పొక్కు కట్టిన చేనును
నేను పకృతిని
ఋతువును బట్టి రూపాన్ని మార్చుకోవడం నా తత్వం
తాను దేనికి దూరమయ్యాడో దానినే తన కవిత్వంలో వెతుక్కున్నాడు కాబట్టి, ఇతని కవిత్వ భాష కూడా అందుకు అనుగుణంగానే పల్లె యాసలో, పల్లె పదాలతో ఒప్పారుతుంది. జానపద గేయాల శైలిలోనే కొన్ని చోట్ల పాటలల్లినా, పాటలా పదాలల్లినా, అది కవిత్వం కావడమూ (ఎర్రమట్టి గోడ, పు. 35) కనపడుతుంది.
తూరుపోనలో
ఎర్రమట్టి గోడ వొంటిగా తడస్తా వుండాది
చూర్లో నుంచి రాలిపడిన కలలు
నీటిమింద పగిలిపోతా వుండాయి
వొక్కటిగూడ చేతికందడం లేదు
మోడం తునిగి పడింది
దొడ్లోని గొర్రెలు బెదిరి
వొకదాని యెనక వొకటిగా దడిమింద నుంచి ఎగిరిదూకినాయి
బాయిలోకి దొరువిల్లి పూడిసింది
చేనంతా గొర్రెల తాత మట్టిపాదాలు
వాన ఇంగా పెవలమైంది!
ఎద పొంగి ఏరైంది!!
ఇతని కవితలు కూడా కథ చెబుతున్నట్టే ఉంటాయి. పాదాల మధ్య అకారణమైన విరుపులు తక్కువ. సన్నివేశం వెనుక సన్నివేశం పాఠకుల కళ్ళ ముందుకు వడివడిగా తీసుకు వచ్చి, అనుభూతినంతా దృశ్యమానం చేస్తాడితడు. ఈ శైలికి, బహుశా కరుణాకర్ లోని కథకుడు సాయపడి ఉండవచ్చు. కరుణాకర్ చక్కటి కథకుడు కూడా! తన బారతం కథలుకి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నాడు. కరుణాకర్ ఈ కథలను, పొద్దున్నే వచ్చిన వాన సంపుటిలోని కవితలనూ దాదాపు ఒకే సమయంలో వ్రాశాడు. కథకుడిగా అతనికున్న సౌలభ్యాల దృష్ట్యా తన ఆలోచనలను స్వేచ్ఛగా విస్తరించుకు పోయినా, కవితల్లోనూ కథల్లోనూ నేపథ్యాలు అవే, మనకు తారసపడే మనుష్యులూ వాళ్ళే. గుడ్డెవ్వ, గొర్రెల తాత, పాలకొండ మీది మబ్బు, జీనిబాయి గూళ్ళు, ఉత్తీతపాటలు – ఇలా ఎన్నో, మనకు అక్కడా ఇక్కడా దాదాపు ఒకటే ప్రవృత్తితో తారసపడుతూంటాయి. మరోలా చెప్పాలంటే, కథల్లోని కవితాత్మను కరుణాకర్ కుదించి రాసుకున్న నోట్స్‌గా ఈ కవితలు కనిపిస్తాయి.
ఉదాహరణకు, చిల్లుల ముంత (పు. 46) అన్న కవిత, కథాకథన పద్ధతిలో మాంత్రికవాస్తవికతకు చక్కటి నమూనాగా కరుణాకర్‌కు పేరు తెచ్చి పెట్టిన అతని కథ ‘దుత్తలో చెందమామ’కు పరిమిత వ్యాఖ్యలా, ప్రేరణలా అనిపిస్తుంది. ఈ గమనింపు కేవలం శీర్షికలోని సామ్యానికే పరిమితం కాదు. (దుత్త అంటే ముంత.)
పైరు మీద వాలిన జీనిబాయి గువ్వలకు పాలకంకి ఊయల ఉంది
కోటిదీపాల కాంతిని వెదజల్లే చిల్లులముంత ఆకాశమూ ఉంది
జీనిబాయి గువ్వలంటే, బంగారు పిచ్చుకలు (గిజిగాళ్ళు). వాటి చీకటి గూళ్ళని వెలిగించడానికి, చిల్లులముంత లాంటి ఆకాశం నుండి, వెన్నెలో, నక్షత్రాల కాంతో సాయపడుతుందన్నది ఇక్కడ తోచే అర్థం. అయితే, కథ చదివిన వారికి, ఇక్కడ గుడ్డెవ్వ చెప్పిన పిట్టకథ అనాయాసంగా గుర్తు వస్తుంది. (ఈ ఒక్క పిట్టకథను,”గిజిగాడూస్ అండ్ ద ఫైర్‌ఫ్లయ్స్” అన్న పేరుతో కథ.ఆర్గ్ వాళ్ళు ప్రచురించారు.)
రాత్తిరిపూట చెందమామ ఆకాశానికి రాసుకుని రాసుకుని సుంకు రాలితింది. ఆ సుంకే ఈ మినగరబూసులు. ఆ సుంకును తెచ్చి మీ గూళ్ళకు కరిపించుకోండి. అవే మీకు దీపాలు.
ఇది, దేవలోకానికి వెళ్ళి, ‘దీపమెలా పెట్టుకోవాలి మా చీకటి గూటిలో?’ అని అడిగిన జీనిబాయిలకు దేవుడు చెప్పిన ఉపాయమని, కథలో గుడ్డెవ్వ చెప్తుంది. సుంకు అంటే, పాలకంకి గింజ పట్టినప్పుడు రాలిపోయే పొట్టు. గిజిగాళ్ళు గూట్లో బంకమన్ను పెట్టుకుని, ఈ మిణుగురులను అంటించుకుని వెలుగు నింపుకుంటాయని కూడా, కథలో గుడ్డెవ్వ వివరంగా చెబుతుంది. ఆ భావాన్నే ఈ కవితలో వాడుకున్నాడు కవి.
అతని కథల్లోనూ, కవితల్లోనూ వర్ణనల్లోని సారూప్యతకు, మరో ఉదాహరణగా, ఒంటరి నది (పు. 44) కవితనూ, చెరువు కోళ్ళు కథనూ గమనించవచ్చు.
కవిత ఇలా సాగుతుంది:
దాహంతో ఏటిలోకి వంగిన ఆకాశం
ఒలికిన చుక్కలు
పొడుచుకు తింటూ చేపలు
వంతెన ఊయల
ఊగుతూ నది
దాదాపు ఇవే భావాలని ప్రతిఫలిస్తూ కథలో వర్ణన, ఇలా:
నీలాకాసాన్ని మేసి మేసి దప్పిగొన్న తెల్లమోడాలు చెరువులోకి వంగి నీళ్ళు తాగతా ఉండాయి. పగడాల దండను ఆకాసెంలో ఇసిరేసినట్టు, బెల్లాయిల గుంపు. నీటిపైకి తేలి మిలమిలా మెరిసే పొద్దును పొడుసుకోని తింటా ఉండాయి ఎల్లికొరదలూ, బుడ్డపక్కెలూ.
దీపం కతలు సంపుటిలో కూడా, ఉత్తీతపాట, పొద్దున్నే వచ్చిన వాన, వంటి కవితల శీర్షికలతోనే కథలూ కనపడతాయి. ఈ నేపథ్యంలో చూస్తే, కరుణాకర్ కథలనూ, కవితలనూ వేరు చేసి విమర్శ చేయడం కష్టసాధ్యమైన పని. ఒకవేళ ఆ ప్రయత్నం చేసినా, అది అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. కాబట్టి, ఈ రెండింటినీ కలిపి శ్రద్ధగా గమనిస్తే మనకు కొన్ని విషయాలు స్పష్టమవుతాయి. కథకుడిగా కరుణాకర్ నేర్పు అపురూపమైనది. కథకు ఉన్న జాగా అతని ఊహలకూ ఆలోచనలకూ స్పష్టమైన రూపాన్నిచ్చుకోగల వెసులుబాటు నిచ్చింది. వాస్తవికవాదం, విమోచనాత్మక వాస్తవికవాదం, మాంత్రిక వాస్తవికత – పేరేదైనా సరే, అందుకు అనువైన శైలి, శిల్పాలను అతడు సృష్టించుకున్నాడు. ఆ మేరకు ఈ వాదాల మీద చర్చలు చెలరేగే వీలూ కల్పించాడు. ప్రతీ కథలోనూ తన ముద్రను వేసి, కథకుడిగా తాను వాటికి ఎడమయ్యాడు.
కవితల దగ్గరకొచ్చేసరికి, కరుణాకర్‌లో ఇన్ని భిన్న దృక్పథాలు కనిపించవు. తానక్కడ కేవలం రెండే పాయలుగా చీలిపోయాడు. మొదటి పాయలో, అతడికి బాగా తెలిసిన పల్లె ప్రపంచం, అందుకు భిన్నంగా రెండో పాయలో, తానప్పటికి పూర్తిగా ఆహ్వానించలేకపోయిన ఆధునిక జీవితం కనపడతాయి. అతనికి చిరపరిచితమైన ప్రపంచాన్ని చిత్రించేటప్పుడు ఇతనిలో ఏ తొట్రుపాటు, అసంబద్ధత, అస్పష్టత, మార్మికత కనపడవు. ఆ ప్రపంచానికి తగ్గ శైలిలోనే సరళంగా పల్లె ప్రతీకలతో, కొత్త భావాలను పలికించగలిగాడు. ఈ ఒరవడి రెండో పాయలో కనపడదు. ఇది కవికే ఇంకా కొరుకుడు పడని జీవితం. ఇక్కడ కవి గొంతు వేరు. ఇది ‘కృష్ణానగర్ గాలి పీల్చకపోతే ఊపిరి ఆడదని’ చెప్పుకున్న పట్నపు వాసి గొంతు. ఇతడిలో కొంత అస్థిరత ఉంది, కొండొకచో అభద్రతాభావం కూడా ఉంది.ఇతడింకా పూర్తిగా ఆధునికుడు కాలేదు, కావాలనీ కోరుకోవడం లేదు. బాహ్యపరిస్థితుల ప్రభావం పతాక స్థాయిలో జీవితాన్ని శాసిస్తున్న సంధికాలంలో నిలబడి ఉన్నాడు. ఈ దూరం, ఈ సంక్లిష్టత, దానికి తోడుగా మొదలయ్యే అస్పష్టత, దేహం మొండిగోడల మీంచికవితలో (పు. 51) కనపడతాయి.
ఈ కవితలో –

భూమి ఒక సుడిగాలి
ఆకాశమంతా ఒకే కన్ను
సముద్రం ఒకే ఒక్క కన్నీటి చుక్క
తడికె కన్నాల నుంచి చూస్తున్నాను
మూడో కాలొకటి నడచి వస్తోంది
నల్లమబ్బు ఒకటి దేహం మీద వాలింది
అంటాడు. ఇక్కడ కవి తన మనోధర్మానికి లోబడి ఒక సంకేతభాషను రూపొందించుకున్నాడు. దానికి అనువుగా కవితనల్లుకున్నాడు. కవిని ఆ జాడల ద్వారా అందుకోగల సాన్నిహిత్యం పఠితకు లేకపోతే, కవిత అస్పష్టమై అసహనాన్ని కలిగిస్తుంది. దానిని దాటి కవి సమస్యను సహృదయంతో అర్థం చేసుకుంటూ ఈ కవితను విశ్లేషించే ప్రయత్నం చేసినప్పుడు, మనకు బోధపడే విషయాలు ఇవీ:
ఈ కవిత మొత్తంలో కవి స్తబ్దత నిండిన వాతావరణాన్ని సూచిస్తున్నాడు. విశ్వవ్యాప్తమైన ఆకాశాన్ని కుదించి ఒక కన్నుగాను, సువ్యాప్తమైన సముద్రాన్ని కన్నీటి చుక్కగాను చూపిస్తున్నాడు. అంటే, అతడు తన ప్రపంచాన్ని కుదించుకున్నాడు. ఇక్కడ అతడు ఒంటరి. అతడు చూస్తున్నది తడిక కన్నాల నుండి. ఆ చూపుకి విశాలత్వం లేదు. అలా ఉండే అవకాశం ఇవ్వని బాహ్యపరిస్థితుల ప్రభావమది. ఎగిరే కాకి వాలదు, రెప్ప కదిలిన అలికిడి లేదు, కల కలవరింతా లేదు, ఏదీ చేతికందదు, ఏదీ చెంతకు రాదు — అన్న పాదాలన్నీ, ఇదే స్తబ్దతనూ, నిర్లిప్తతనూ చూపెడుతున్నాయి. అతడి దేహం మొండిగోడ. దానిలో కదలిక తేగలిగినదేదో కావాలతనికి. కానీ తనపై తనకు నియంత్రణ లేదు. అందుకే, తానున్న స్థితిని ‘రంపపు కోత’ అన్నాడు. అస్థిరవైఖరి, డోలాయమాన స్థితి, ఈ స్తబ్దతకు తోడయ్యాయి. ‘సగం వంగిన జామకొమ్మకు, పండూ నేనూ వేలాడుతున్నాం’ అనీ, ‘తెగిన గాలిపటం గిరికీలు కొడుతూ పారిపోయింది,’ అనీ అందుకే వాపోతున్నాడు.
వాతావరణ కల్పన జరిపిన ప్రతీకల ప్రయోగం, ఉపయోగం మనకు మొదటి పాదంలో కనపడుతున్నాయి. అటుపైన, పైన ప్రస్తావించిన పదబంధాల ఆధారంగా కవి మనఃస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కవికి ఈ స్థితి ఎలా అయినా చెదిరితే బాగుండన్న ఆశ ఉంది. అందుకు కొనసాగింపుగా, ‘మూడో కాలొకటి నడచి వస్తోంది’ అని, వెంటనే, ‘నల్లమబ్బు ఒకటి వాలింది’ అని చెప్పుకున్నాడు. ఈ నల్లమబ్బు ఏమిటి? ఆ మూడో కాలు దేనికి ప్రతీక? ఏ దేహమూ లేని ఒక కాలు నడిచి రావడాన్ని అధివాస్తవికంగా ఊహించుకోగలమేమో కానీ అర్థం చేసుకోలేం. దాని అంతరార్థం మానసికావస్థ సంబంధియా, లేక అది ఒక లైంగికభావనయా? ఈ ప్రతీకలు తనకు తెలిసిన భాష, సంస్కృతులనుండి తెచ్చుకున్నవా? లేదూ కవి తనకంటూ తయారు చేసుకున్న కొత్త ప్రతీకలా?
పదాల మధ్య ఖాళీలు పఠితలను ఆకర్షిస్తాయి కానీ కవిత్వం అర్థం కాలేని భావాలతో ఉన్నప్పుడు అది అస్పష్టమవుతుంది. ఈ సమస్య నిజానికి కవిది కాదు, ఈ ప్రయాస పాఠకుడిదే అని అనుకోవాల్సిన స్థితి కూడా కాదిది. సరిత్తులాంటి సాహిత్యంలో, ఇదంతా కొత్తగా వచ్చి చేరిన నీరు. కథల నుండి అనుభవాల వైపు కవిత్వం మళ్ళినప్పుడు కూడా కొంత నవ్యతను మనం చూశాం. ఆ అనుభూతి/భావ కవిత్వాన్ని దాటి వచ్చి ఇప్పుడు మనం చర్చిస్తున్న ఈ కవిత్వం — ఆమాట కొస్తే ఈ కాలపు కవిత్వం — వస్తువును కూడా నిరాకరిస్తోంది. అమూర్తభావాల చిత్రణకు కూడా అస్పష్టమైన ప్రతీకలనే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు ఈ కాలపు కవులు. ఈ ప్రతీకలు పాఠకులకు కొత్తవి. తమ తమ అనుభూతి, ఉద్వేగాల ఒరవడిలో కవులు వాడిన ప్రతీకల అంతరార్థం ఏమిటో తెలియడం అంత తేలిక కాదు. కనుకే, ప్రతీకలను అర్థం చేసుకుంటూ కవితారసాస్వాదన చేయదలచిన పాఠకులు ఆ ఆధారం దొరక్క అసహనానికి లోనవుతారు.
ఆధునిక కవిత్వంలో సింహభాగం ఇప్పటి మనిషి జీవితంలోని సంక్లిష్టతకూ, సంఘర్షణకూ సరైన రూపాన్నిచ్చే ప్రయత్నంతో ముడిపడి ఉంది. ఆ ప్రయత్నాలు మరిన్ని జరగాలి. ఆ నవ్యతకు ఆహ్వానం పలికితీరాలి. సమర్థుడైన కవి కవిత్వాన్ని కేవలం జీవితంలోని సంక్లిష్టతకు పర్యాయపదంగా మార్చకుండా, తన భావ వ్యక్తీకరణకు సరికొత్త వ్యాకరణం తయారు చేసుకుంటాడు; కొత్త ప్రతీకలు, పదబంధాలు ఏర్పరచుకుంటాడు. పఠితలకు వాటిని అర్థం చేసుకునే దిశగా కొంతైనా వెసులుబాటు కల్పిస్తాడు. ఆ సామర్థ్యమే కవితలోని అస్పష్టతను, క్లిష్టతను నిర్మూలించడానికి సాయపడుతుంది. ఈ ఎరుకతో రాసిన కవిత్వంలో ప్రతీకలకూ అవి సూచించే అంతరార్థానికీ మధ్య ఒక భౌతిక, ప్రాపంచిక సంబంధం ఉంటుంది. ఇందుకు భిన్నంగా, ఇంద్రియగోచరం కాని శైలి, అంతఃసూత్రాన్ని విస్మరించిన పదచిత్రాలు, స్థలకాలాదుల ప్రమాణాలను తిరస్కరించి అసంబద్ధంగా నడిచే కవిత్వము, సమగ్రమైన అనుభవాన్ని పాఠకులకు ఇవ్వలేక నిరుత్సాహపరుస్తాయి.
ఈ సంపుటి మొత్తంలో కరుణాకర్‌ లోని ఒక కొత్త కోణాన్ని చూపిన కవిత ఇది ఒక్కటే కావడం వల్లనే కాక, ఈ సమస్య ఎందరో ఆధునిక కవులది కూడా కావడం వల్ల కూడా ఇంత దీర్ఘంగా చర్చించవలసి వచ్చింది. ఇక్కడ కవి మార్పుకు లోనైన తన సాంఘిక, సామాజిక వాతావరణాన్ని, తద్భవమైన ఆలోచనారీతులను, పాత పద్ధతిలో చెప్పకూడదనో, చెప్పి గెలవలేననో అనుకున్నట్టుంది.
గాలివిసురుల తావిలా తప్పించుకుని
శిరీషసుమ మార్దవపు నవనవలా జారిపోతూ
నులు మూసి, కిలకిల నవ్వి,
కనపడక మాయమయ్యే మనోజ్ఞతను
ఈ త్రెగిన త్రాళ్ళు బెట్టి, వాక్యాల
మొండిగోడల మధ్య ఎలా బంధించడం?
నిండుమదిలో తొణకిన భావావిష్ట మహాఝరులు
నిరర్థక శబ్దాల సహారాసైకతాల్లో ఇంకనీక
జనసాగర సంగమానికి ఎలా అందించడం?
అని ఆనాడే (1955లో) కలతపడ్డాడు బైరాగి (నూతిలో గొంతుకలు, పు. 39, మి. ప్ర. ప్రచురణ, 2006).
పల్లె గాలికి దూరమైనా ప్రకృతి ప్రేమికుడిగానే ఉంటూ, ఆధునికుడిగా గొంతు మార్చుకు వ్రాసిన మరొక కవిత, రెయిన్ ఫారెస్ట్. ఏ కవితలోనైనా, పాఠకుడిని మున్ముందుగా ఆకర్షించేది అక్షరరమ్యత. కవితలో కనపడే సౌందర్యము, లయ ఎటువంటివారినైనా ఆకర్షిస్తాయి. అయితే, గొప్ప కవిత అనిపించుకోవడానికి అంతకు మించినదేదో కావాలి. పొరలుపొరలుగా విస్తరించుకుపోయే అనుభవం, అనుభవైకవేద్యమైన మౌనంలోకి నెట్టే అనుభూతి, కవితలను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ కవితలో అవన్నీ సమపాళ్ళలో ఉన్నాయి. ‘రవీంద్రుని గీతమై ఎదలోయల్లో హోరున కురుస్తున్న వాన’ అనడంలోనే గొప్ప నేపథ్యం ఉంది. ‘తడిపాదాలతో మెలమెల్లగా నడిచొచ్చావు, చేతులతో కళ్ళు మూశావు’ అని చెప్పడంలో, ఎక్కడా ఇది వాన అని ఇదమిత్థంగా చెప్పడం కనపడదు. ‘తడిసిన శరీరం నులివెచ్చని మంట/ కోరికను వెలిగించుకుని ముఖం దీపమై నిల్చుంది’ అనడంలో శృంగార ప్రధానమైన అర్థం ధ్వనిలో కనపడుతున్నా, ఆ మసక చీకటిలో వానను చూసేందుకు కళ్ళను దీపాల్లా చేసుకుని చూస్తూండడమే అంతర్లీనంగా ఉన్న భావం. ‘నువ్వు ఇచ్చిన ఏడు రంగుల గాలిపటాన్ని/ ఆకాశంలోకి ఎగరవేశాను’ అనే వరకూ, కవి అనుభవిస్తున్నది వాననేనని అర్థం కాదు. వర్షం ఆగిపోయి, నువ్వు (వాన) వెళ్ళిపోయాక, ‘తడి కళ్ళల్లో నువ్వు/ ఒంటరి అరణ్యాన్ని నేను’ అని ముగించడంలో, ఒంటరితనమొక్కటే కనపడుతుంది తప్ప, అందులో ముందరి కవితలో ప్రస్పుటంగా కనపడ్డ వేదన కానీ, చంచలమైన ధోరణి కానీ కనపడవు. అనుభూతిని పదిలపరచుకుని తృప్తి చెందే ధోరణే ఇందులో తుదికంటా తోస్తుంది.

పల్లెటూళ్ళ జీవన చిత్రణలో ఒక సౌందర్యం ఉంటుంది. వర్గంగానో, సంఘంగానో కూడి బ్రతకడంలో దొరికే భరోసాని బలంగా చూపెడుతుందది. పట్టణజీవితపు ఒంటరితనంలో బిగ్గరగా చెప్పుకోలేని, ఒప్పుకోలేని, ఎవరితోనూ పంచుకోలేని, తప్పించుకోలేని వేదన ఉంటుంది. ఆశ్చర్యకరమైన ఈ వైరుధ్యాన్ని ఒకేసారి ఒకే కవితలో, లేదా ఒకే సంపుటిలో స్ఫుటంగా చెప్పడం మామూలు కవులకు దాదాపు అసాధ్యం. కరుణాకర్ మామూలు కవి కాదు.
* తొలి ప్రచురణ : ఈమాట-సెప్టెంబరు, 2016సంచికలో

గజేంద్రమోక్షం- ఆర్టిస్ట్ కేశవ్ గారి కన్నుల్తో..


ఈ కళారూపాన్ని ఏ క్షణంలో చూశానో కానీ, ఇది నా మనసును వదిలి పోవడమే లేదు! గజేంద్రమోక్షాన్ని ఇంత అద్భుతంగా తిప్పి చెప్పగల వాళ్ళు, ఎన్ని జన్మల తపస్సు చేసి, ఆ కృష్ణపరమాత్మను మనసులో నింపుకున్నారో ఊహకందడం లేదు.
"నీరాశ నిటేల వచ్చితి?" అని పదే పదే చింతించి, "ఏ రూపంబున దీని గెల్తు?నిట మీఁ దేవేల్పుఁ జింతింతు" అని వాపోయిన గజేంద్రుడు, అన్నదమ్ముల కొట్లాటలో మొండిగా పోరాడి ఓడి, ఆఖరు నిముషాల్లో అమ్మను సాయం పిల్చుకుని, ఆమె కనపడి చేయందివ్వగానే కరుచుకుపోయి గుండెల్లో తలదాచుకునే పిల్లవాడిలా, - ఆ శ్రీమన్నారాయణుడిని బిగియార కౌగిలించుకున్నాడు. "ఒకపరిజగములు వెలి నిడి, యొకపరి లోపలికి గొనే" శ్రీహరి, ప్రసన్నంగా ఆ గజరాజును చేరదీశాడు. "నిడుద యగు కేల గజమును, మడువున వెడలంగఁ దిగిచి మదజల రేఖల్ దుడుచుచు మెల్లన పుడుకుచు, నుడిపెన్ విష్ణుండు దుఃఖ ముర్వీనాథా!" అంటాడు భాగవతంలో పోతన. అది సరే, గజరాజును మడుగులో నుండి బయటకు లాగి, అతని పైని మదజలరేఖలు తుడుస్తూ, వెన్ను నిమురుతూ ఓదార్చడం దాకా పోతన కన్నుల్తో మనమందరమూ చూసిందే! చక్రహస్తుని రూపమంటారా, "సిరికిం జెప్పని వాడు" , అతడిక్కడెట్లా ఉన్నా చెల్లిపోతుంది, ఆ అలంకారాల్లో లోపాల వైపు నా చూపు వెళ్ళలేదసలు. నన్ను, (ఇంకా ఈ చిత్రం చూసిన ఎందరినో), ఆశ్చర్యపరచిందీ, పదే పదే ఈ చిత్రాన్ని వెదికి వెదికి చూసేలా చేసిందీ, కరి కాదు. మకరి. కరుణా సింధుడు శౌరి చక్రాన్ని పంపి హతమార్చడమే?! ఆ ఊహ కూడా రానీయలేదీ చిత్రకారుడు. ముందే చెప్పినట్టు, పిల్లలిద్దరు కొట్టుకుంటుంటే, ఒకింత బలహీనపడ్డ బిడ్డను అక్కున చేర్చుకున్న అమ్మతనాన్నీ, అమ్మ కనపడానే పంతాన్ని మరిచి, కోపాన్ని మరిచి, తాను చేసిన తప్పేమిటో తెలిసీ, ఏమీ ఎరుగని అమాయకుడిలా మళ్ళీ ఆ అమ్మ పాదాలే పట్టుకు వేలాడే పసితనాన్నీ పటం కట్టి చూపించాడు. హరిలో ఆగ్రహం చూపించలేదు, ఆవేశం అసలే లేదు. మొసలి కళ్ళల్లోనూ తుంటరి పని చేసి దొరికిపోయిన పసిదనమే తప్ప, పశ్చాత్తపం లేదు. పైగా, అలా ఒదిగి పట్టుకోవడంలో అమ్మ నన్నూ ఏమీ అనదన్న ధీమా ! ఆ చేయి, "ఇందరికి అభయమ్ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి.." మొసలినీ ఎలా దగ్గరకు తీస్తోందో గమనించే కొద్దీ హృదయం అమృతభాండమైపోతోంది.

ఇదీ కళకు సార్ధకత! ఇదీ!, ఇదే ఏ కళారూపమైనా చేయవలసిన పని. దీనికే మనం దాసోహమయ్యేది. మన లోపలా ఈ వెలుగున్నదని గుర్తు చేస్తున్నందుకే, వారికి కైమోడ్చేది.
గజేంద్ర మోక్షాన్ని కరి మకరి వైరంగా కాక, స్థితికర్త లీలగా, ఆయనే ముగించిన హేలగా హృద్యంగా చూపించిన ఈ చిత్రకారుడి ఊహాచమత్కృతికి వేనకోట్ల వందనాలు సమర్పించడం తప్ప, ఇంకేం చెయ్యగలను?

( One of the finest interpretations of Ganjendra Moksha I have ever seen. Painting by Keshav garu )

ఆచంట జానకీరాం: నా స్మృతిపథంలో..సాగుతున్న యాత్ర

ఒక వ్యక్తి స్వతహాగా కవీ, రచయితా అయి, సున్నిత మనస్కుడై, భావుకుడై తన ఆత్మకథను వ్రాయాలని అనుకుంటే, అందుకు తోడుగా అతనికి తన కాలంలోని దాదాపు ప్రతీ సాహితీవేత్తతోనూ దగ్గరి పరిచయం ఉండి, ఆ అనుభవాలన్నీ గుర్తుంచుకోగల జ్ఞాపకశక్తీ, ఆ అపురూపమైన సంగతులన్నీ శ్రద్ధగా గుది గుచ్చి చెప్పగల నేర్పూ ఉంటే, అది నిజానికి పాఠకుల పాలిట వరం. ఈ పుస్తకం అలాంటిది. 

"ఇవిగో! ఇంకా నిద్ర లేవని
మంచు తడి ఆరని, పారిజాతాలు!!
ఈ ధవళిమ నా భావాల స్వచ్ఛత;
ఈ ఎరుపు నా అనురాగపు రక్తిమ
ఈ పరిమళము మన స్నేహసౌరభము!
అందుకోవూ.."

అంటూ మొదలయ్యే పుస్తకమిది. ఈ పుస్తకంలోని పదాలెంత సుకుమారమైనవో, ఇందులోని భావాలెంత సున్నితమైనవో, అభివ్యక్తి ఎంతలా మనను కట్టి పడేయగలదో, ఈ మొదటి పేజీలోనే మనకు చూచాయగా తెలుస్తుంది. ఇక అది మొదలు, సంగీత సాహిత్యాలను ఇరు ఒడ్డులుగా చేసుకుని ప్రవహించే నిండైన నది లాంటి ఆచంట వారి జీవితం మన కళ్ళ ముందుకొస్తుంది. మహావృక్షాల్లాంటి మహనీయుల జ్ఞాపకాల నీడల్లో ఆగి కొంత విశ్రాంతిని పొందడం, ఆ నదిలోని చల్లని నీరు దోసిళ్ళ నిండా తీసుకుని ఎప్పటికప్పుడు దప్పిక తీర్చుకుని ఆ తీరం వెంబడి నింపాదిగా నడవడం - పాఠకులుగా ఇక మన పని.

భౌతికమైన వస్తువుల ఆత్మను దర్శించి, వాస్తవానికీ కల్పనకూ మధ్య అపురూపమైన సంధినొకదాన్ని నిర్మించి, మరొకరిని ఆ దోవలో నడిపించి ఊయలూగించడానికి మాంసనేత్రం సరిపోదు. రసదృష్టి లాంటిదేదో కావాలి. తనలో లేని సౌందర్యమేదీ ఈ ప్రపంచంలో కనపడదన్న ఓ పాశ్చ్యాత్యుని మాటలు నమ్మి చెప్పాలంటే, ఆచంట వారి మనసంతా సౌందర్యమయం.

ఆచంట స్వతహాగా కవి. లోకం పట్ల ప్రేమ, దయ ఆయన కవితల్లోనూ, నాటకాల్లోనూ కనపడుతూంటాయి. మునిమాపువేళ మిణుకుమిణుకుమనే ఒంటరి నక్షత్రమొకటి, ఆయనలో ఒకేసారి ఆశనూ, దిగులునూ కలిగిస్తుంది కాబోలు. ఆ తార ప్రస్తావన కనపడ్డ కవితలు రెండు: 

" నేను నిదురించు శయ్యాగృహంపు టాకాశ
గవాక్షమందుండి యొక్క తారకామణి
మిణుకు మిణుకంచు తన సందేశాల బరపజూచు.."

"నీ నిరంతర స్మరణ నా యెద వ్రేగునపుడు
మమతతో కూయుచు మునిమాపువేళ
గువ్వతల్లియు తన గూడు చేరునపుడు
సొమ్మసిల్లిన సృష్టియు సుషుప్తి పొందినపుడు
నిలువ నీడేలేని నిరుపేద భిక్షుకుడ నేను
బాధతో రాల్చిన మౌనభాష్పకణమ్మునందు
దూరమున దీపించు నా దివ్యతార
ప్రేమకాంతుల బరుపుచు ప్రజ్వరిల్లు"

" I, a homeless beggar. drop a silent, painful tear in which gleams the distant star of love.."  - ఎంత అపురూపమైన భావన!

కవిత్వం ఎలా ఉండాలి అన్నది, ఏనాటికీ చిక్కు ముడి వీడని ప్రశ్నే! రూపప్రథానమా, భావప్రథానమా? దేని పాళ్ళు ఎంతైతే మంచి కవిత్వమవుతుందంటే, ఎవ్వరు చెప్పగలరు? జిహ్వకో రుచి. అంతే. ఆచంట వారొకసారి రైలు ప్రయాణంలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారిని కలిసినప్పుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి మాట వచ్చి, "మీరంతా ఆయన్ను భావకవి అంటారు కదా, భావకవిత్వం అంటే ఏమిటి? భావము లేని కవిత్వమంటూ ఉంటుందా?" అని అడిగారట శర్మ గారు. 


"అది నిజమే; భావం లేనిది కవిత్వం కాదు. పూర్వపు ధోరణిలో ఉన్న కవిత్వం రూప ప్రథానమైనదనుకుంటా. కృష్ణశాస్త్రి వంటివారి రచన భావప్రథానమైనది." అన్నారు ఆచంట.

"అల్లాగా ? ఈ పద్యం విన్నారా?" అంటూ భావయుక్తంగా, ఆయనీ పద్యం చదివారట అప్పుడు:

"కలుగవు కమలంబులు, హంసలు కదులవు, చూడవమ్మ చక్కగ నెవరో, తలక్రిందుగ నాకాశము నిలిపిన వార్త, చెరువు నీళులలోన్"

ఇది భావప్రథానమైనదేనని ఆచంట ఒప్పుకున్నాక, ఇది శకకర్త, శాలివాహనునికి ముందు, అంటే రెండువేల ఏళ్ళకు పూర్వం వ్రాసినవనీ, ప్రాకృతములో వందలకొద్దీ ఇటువంటివి ఉన్నాయనీ చెప్పారట.

కాలానికొక రకం కవిత్వం అని గిరి గీయడమెవ్వరి తరం?

ప్రబంధ సాహిత్యం గురించి మాట్లడుతూ, విజయ విలాసములో ఉలూచి  తనని అమితంగా ఆకర్షించింది అంటారీయన. ఉలూచి ఆయనకు సత్యాదేవంత ప్రియమైన ప్రబంధ నాయికట. అందులోనూ నాగ కన్యక కూడానాయో!

"హేమంత ఋతువు కాబట్టి నా ఎదుట యమున అతి సన్నగా ప్రవహిస్తోంది. ఎప్పుడో ఒకనాడు ఇటువంటి నీటనే జలకమాడుతున్నాడు అర్జునుడు. అప్పుడే ఉలూచి అతన్ని తన కౌగిలిలో హత్తుకుని ఎత్తుకుపోయింది. ఆమె వచనాచమత్కృతికీ, ఆమె అసమానరూప లావణ్యానికీ, అన్నింటికంటే ఎక్కువగా ఆమె ప్రకటించే అనురాగానికీ లొంగిపోయి అర్జునుడు, మొదట కాదన్నా, చివరకు ఆమె ప్రేమను అంగీకరిస్తాడు." అని గుర్తు చేసుకుంటారు ఆచంట. 

"చక్కెర బొమ్మ నా వ్రతముచందము దెల్పితి నంతెగాక..." అంటూ మొదలయ్యే మరో పద్యంలో, "ఎక్కడ నుండి వచ్చె తరళేక్షణకున్ నును సిగ్గు దొంతరల్" అంటాడు కవి. ఇందులో మొదట 'చక్కెర బొమ్మ' అన్న పదం వినగానే, మగధీర చిత్రంలో, "పంచదారా బొమ్మా బొమ్మా" అంటూ మొదలైన పాట వింటూ, ఈ పాట ఎత్తుగడ ఎంత బాగుందో అని పదే పదే అనుకోవడం గుర్తొచ్చింది. విజయవిలాసం చదువుతోన్న ఆచంట వారూ, ఆ చక్కెర బొమ్మ దగ్గరే ఆగిపోయారట. ముగ్ధకు అతి స్వాభావికమైన సిగ్గు, ఆ ఉలూచి కన్నుల్లో కనపడి పరవశింపజేసిన తీరూ, ఆయన అక్షరాల్లో అందంగా కనపడుతుంది.

అలాగే, తెలుగునాట తొలి చైతన్య స్రవంతి నవల వ్రాసిన వారుగా వినుతికెక్కిన బుచ్చిబాబు ప్రస్తావన కూడా, ఈ పుస్తకంలో కనపడుతుంది. అదీ, చాలా ఆశ్చర్యాన్నిచ్చే ఘటనగా: 

"ఒకనాడు బుచిబాబు తాను రచిస్తోన్న ఒక క్రొత్త నవలను గురించి నాతో చెబుతూ కథావిషయము చెప్పి, ఈ రచనకు ఏకాంతము అనే పెడదామనుకుంటున్నాను, మీరేమంటారు? అన్నాడు.

నేనన్నాను : " మీరు మీ రచనలో జీవితపు విలువలను కొన్నిటిని వివరంగా పరిశీలిస్తున్నారు. ఈ కాలపు ఒకానొక యువకుని జీవితంలో కలిగే సమస్యలను వర్ణిస్తూ, కేవలమూ ఆదర్శజీవి అయిన అతని ఆశలూ, యత్నాలూ ఒక్కటీ ఫలింపపోవడం చూపిస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వానిలో వచ్చే ప్రశ్న ఏమిటంటే : ఇట్టి విపరీతపు అన్వేషణలో, ఈ మహాయత్నములో చివరకు మిగిలేది అనే పేరు పెడితే బాగుంటుందేమో."

ఆ సూచనను వెంటనే అంగీకరించారట బుచ్చిబాబు. ఎంత ఆశ్చర్యం! తెలుగు నాట విశేషంగా పాఠకుల ఆదరణ పొందిన ఈ నవల పేరు, ఇంతకీ ఆచంట వారి ఆలోచనా!, అన్న ఆశ్చర్యం ముంచెత్తక మానదు ఈ సంఘటన చదివినప్పుడు. 

ఆచంట వారి అదృష్టం సాహిత్య రంగానికి చెందిన విశ్వనాథ, చలం, దేవులపల్లి, బుచ్చిబాబు, రవీంద్రులు..ఇలా వీరికే పరిమితం కాలేదు. సంగీత రంగంలోని ఎందరో ప్రముఖులతోనూ ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆకాలంలోని వారందరి సంగీత విభావరులూ ప్రత్యక్షంగా అనుభవించగల సదవకాశమూ దక్కింది. బెంగళూరు నాగరత్నమ్మ మొదలు, వెంకటనాయుడు గారి వయొలిన్ వరకూ, ఆయన చెవుల్లో అమృతం నింపిపోయిన వారే అందరూ. నాయుడుగారు సావేరి రాగంలో వినిపించిన ఆర్ద్ర సంగీతం వినే, ఆచంట వారు రిల్కే మాటలనిలా గుర్తు చేసుకుంటారు :

"రెండు రాగచ్ఛాయల మధ్య ఉండే విశ్రాంతిని నేను. ఆ క్షణిక విరామంలో  వణికిపోతూ, కలియవచ్చిన ఆ రెండు రాగచ్ఛాయలూ మేళవించి, ద్విగుణితమైన మాధుర్యంతో గానం సాగిపోతుంది" అని.

చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా, అవతలి వారి పేరు ప్రఖ్యాతులతో సంబంధమే లేకుండా, ప్రజ్ఞను బట్టి వారిని పొదువుకున్న అపురూపమైన వ్యక్తిత్వం ఆచంట వారిది. మనస్ఫూర్తిగా వారిలోని కళకు కైమోడ్చిన సాహిత్యాభిమానులు వీరు. అంత నిర్మల హృదయులు కనుకనే, ఎందరెందరో సాహితీవేత్తల ఆంతరంగిక క్షణాల్లోకి ఆయన అలవోకగా ప్రవేశించగలిగారు. సృజనశీలుల్లో కవితాగంగ ఉప్పొంగుతోన్న వేళ, దగ్గరగా కూర్చుని దోసిళ్ళతో తాగి తన తృష్ణను తీర్చుకున్నారు. 

 " నువ్వూ నేనూ కలిసి/వెన్నెల వెలుగులా/వెలుగులో వాంఛలా
నువ్వూ నేనూ కలిసి గగన నీలానిలా/ నీలాన శాంతిలా" అన్న బాపిరాజు కవిత్వాన్నైనా, "మురళి పాటకు రగిలి/మరుగు నీ వెన్నెలలు/సొగయు నా యెదకేల తగని సౌఖ్యజ్వాల" అన్న దేవులపల్లి గీతాలనైనా, "కంటికంతా జలమయంబై, మింటివరకు నేకరాశై జంట దొరుకని మహాప్రళయపుటింటిలో వటపత్ర డోలిక నొంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దు కృష్ణా జంటగా నను బిల్వదగదోయీ?" అన్న బసవరాజు గేయాన్నైనా,  "వలపు నిండార విరిసిన పారిజాత కుసుమములు నేలరాలు వేకువలయందు ప్రసవ శయ్యాపదముల నీపాదయుగళి కదలెనో, నాదు హృదయమే కలతపడెను" అన్న అబ్బూరి రామకృష్ణారావుగారినీ, " గడ్డి పూవుని! రేకుల రెప్పల కలలు కంటూ కలవరిస్తూ కలతనిద్దురలోనె ఎప్పుడొ కళ్ళు మూస్తాను!" అన్న ఆచంట మేనత్త కొడుకు మల్లవరపు విశ్వేశ్వరరావైనా,విశ్వనాథ కిన్నెరసానినైనా, నూతిచుట్టూ ఉన్న పాలగచ్చు పళ్ళెం మీద ముక్కాలి పీట మీద కూర్చుని, గుమ్మడివడియాల వాసన పీలుస్తూ విన్న "చేతులార శృంగారము చేసి చూతు" నన్న సన్నిహితుల గానాన్నైనా, ఆఖరకు విజయనగరంలో జట్కా వాడి పాటలనైనా, అదే తన్మయత్వంతో, ఆ కవిత్వంలో, సంగీతంలో, గానంలో లీనమైపోతూ అనుభవించారు.  

అప్పటి తనలోని ఆవేశాన్ని, ఉత్సాహాన్ని, ఆయన మిత్రులు కొండేపూడి సుబ్బారావు కవితాఖండికలో ఇలా చెప్పవచ్చునేమో!

"ఉదయకాంతుల పసిడితీగొకటి మెరిసినది
మృదుపుష్ప గర్భమున రేకొకటి విరిసినది
లలితసుందర దివ్య లావణ్య నవజీవ
మధుమాస సుధలలో  హృదయమే పొంగినది"

సామాజిక జీవన చిత్రణ ఈ పుస్తకంలో ఉందని అనలేను కానీ, ప్రముఖ రాజకీయ నాయకుల ప్రస్తావన మాత్రం కనపడుతుంది. ఈ సరికే మన ఆలోచనల్లో ఒకింత ఎత్తులో సుఖాసీనులైన వాళ్ళందరి గురించీ, ఆచంట వారి మాటల్లో చదవడం బాగుంది. వాళ్ళెందుకంత గొప్పవాళ్ళయారో, మరొక్కసారి తెలుసుకున్నట్టైంది. పుదుచ్చేరిలో అరవిందులతో జరిగిన సంభాషణా, గాంధీ మదనపల్లె ఆశ్రమానికి వస్తూనే ఇచ్చిన ఉపన్యాసం, ఓ బహిరంగ సభలో సుభాష్ చంద్రబోస్ వందల మందిని రెండే మాటలతో నిలువరించి నిలబెట్టిన తీరూ, చకితులను చేస్తుంది. ఆచంట వారు వారందరికీ విధేయులుగా ఉండడమూ, అవసరమైనప్పుడల్లా, ఈ ఉద్యమాల వల్ల జైళ్ళకు వెళ్ళిన వారికి తన పరిథిని దాటుకుంటూ వెళ్ళి సాయపడడమూ కనపడుతుంది కానీ, అదంతా స్వభావసిద్ధమైన సున్నితత్వం వల్లే తప్ప, ప్రత్యేకించి రాజకీయాలంటే బలమైన ఆసక్తి ఉన్నట్టు అనిపించదు. బహుశా ఇది కూడా, రాజకీయాల్లో సహజంగా ఉండవలసిన మొండి పట్టుదల వంటిదేదో వారికి స్వాభావికముగా లేకపోవడం వల్ల అయి ఉండవచ్చు. జీవితం మొత్తం మీద ఒకేసారి ఒక వ్యక్తిపై చేయి చేసుకొనవలసి వచ్చిన సందర్భాన్ని గురించి ఎంతో మధనపడుతూ, పశ్చాత్తాపపడుతూ, తన తప్పు పూర్తిగా లేకున్నా కన్నీళ్ళ ప్రాయమైన వైనాన్ని చెప్పడం చదివితే, ఆయన మనసు  మరింత స్పష్టంగా కనపడుతుంది. ఐతే, సాహిత్యవిమర్శలో మాత్రం, ఎక్కడా వెనుదీయలేదీయన. విశ్వనాథ ఏకవీర మొదలు, "ఎముకలు కుళ్ళిన" అన్న శ్రీశ్రీ కవిత్వం వరకూ, విభేదించవలసిన ప్రతీ సందర్భంలోనూ గట్టిగా నిలబడి సుదీర్ఘమైన వ్యాసాలు వ్రాసారు. కొన్ని సందర్భాల్లో కాలం తన అభిప్రాయాలను తప్పని తేల్చినా, తానా భిన్నమైన అభిప్రాయంతోనే ఈనాటికీ నిలబడి ఉన్నానని చెప్పుకోవడానికి మొహమాటపడలేదు. అది, ఆయనలోని నిబద్ధతకు నిరూపణం.


ఇలా ఈ పుస్తకాన్ని గురించి చెప్పుకుంటూ పోతే, ఎక్కడ అపాలన్నది ఎప్పటికీ తేలదు. కనుక, రవీంద్రుల కవితొక్కదానితో, ఈ పుస్తకాన్నీ, ఆయన జీవితాన్ని కూడా-  పొదుపుగా మరొక్కసారి మననం చేసుకుంటూ, ముగిస్తాను.

"అపురూపమైన ఈ లోకపు మహోత్సవములో
పాల్గొనమని నన్ను ఆహ్వానించావు
నా జన్మ తరించింది. ఉత్సవాన్ని కళ్ళారా చూశాను!
ఆనంద గీతము చెవులారా విన్నాను.
ఈ మహోత్సవములో నా వాద్యమును
నా చేతనైనంత అందంగా వినిపించాను.."

* తొలి ప్రచురణ, సారంగలో.

చిరంజీవి

అర్ధణా ఇడ్లీ మొహంతో నువ్వలా
అమాయకంగా ఎటో చూస్తోంటే
నిన్ను చిటికెలతో నా వైపు తిప్పుకోవడం
బాగుంటుంది.
నీ ఎడమ కణత మీద
నా చిటికెన వేలొక చుక్కను దిద్దుతోంటే
నీ కనుపాపలు గండు మీనులై తత్తరపడడం
గమ్మత్తుగా ఉంటుంది.
పిట్టలు పారే వేళకి ముందే
దండెం మీది నీ బట్టలు మోసుకుని నే నో
లేరంగుల ఇంద్రధనుస్సునై ఇంటిలోకి నడవడం
రంగులకలలా ఉంటుంది.
నిదురలో నువ్వెందుకో
ఉలికిపాటుతో లేచి ఏడ్చినపుడు
అమాంతం గుండెలకు హత్తుకుని
బుజ్జగించి నిద్రపుచ్చేశాక
కన్నుల్లో నీరెందుకో చిప్పిల్లుతుంది.
“బారసాల పెళ్ళికొడుకువై…” అంటూ మొదలెట్టి
పెళ్ళి పెళ్ళికొడుకులా ఎలా ఉంటావో ఊహించి దీవించి
కాస్త సంబరపడీ, మరికాస్త కలవరపడీ,
ఊహల రెక్కలు విదుల్చుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది.
తన కోసం దాచుకున్న పేరుని నీకివ్వడం చూసి
తనే మళ్ళీ నీలా వచ్చాడని నమ్మే ఈ అమ్మానాన్నల్ని చూసి
స్వర్గంలో దేవుడి బొజ్జ మీద ఆడుకుంటూ పెరిగే పసివాడొకడు
సొట్ట బుగ్గలతో నవ్వుతూ ఉంటాడన్న ఊహే, 
ఉండుండీ మనసును కోసేస్తుంది.
తొలిప్రచురణ ఈమాట, మే-2016 సంచికలో..

"లిఖిత" - శ్రీకాంత్

మరపురాని కవిత్వాన్ని, మళ్ళీ మరొక్కసారి ఈమాట ద్వారా మరికొంతమందికి పరిచయం చేయాలని సంకల్పం. అందులో భాగంగానే, మార్చ్'16 ఈమాట సంచికలో, "కొన్ని సమయాలు" సంపుటి ద్వారానూ, "లిఖిత" బ్లాగు ద్వారానూ నాకు పరిచయమైన శ్రీకాంత్ కవిత్వాన్ని గురించి నాలుగు మాటలు వ్రాశాను. ఇది రేఖామాత్రపు పరిచయమే తప్ప, ఈ కవిత్వాన్ని గురించిన సంపూర్ణమైన విమర్శ కాదని మనవి.

ఏదో ఒక సూత్రానికి లోబడ్డ కవితలే పరిచయం చేయాలన్న నియమం లేకపోయినా, శ్రీకాంత్ కాలం మీద వ్రాసిన ఐదు కవితలు మచ్చుకు తీసుకున్నాను. ఆసక్తి ఉన్నవాళ్ళు, అతని కవిత్వ సంపద కోసం "లిఖిత" చూడగలరు.

*

నిరంతరం ఎదురయ్యే అనుభవాలు, చిరపరిచితమనిపించే భావాలు, పూనిక గల కవి చేతుల్లో మళ్ళీ మళ్ళీ చదివించే పద్యాలుగా రూపాంతరం చెందుతాయి. మనం విస్మరించే ఈ లోకపు సౌందర్యమంతా సహస్రముఖాలతో సరికొత్తగా సాక్షాత్కరించేదీ కవిత్వమనే రసవిద్య పట్టుబడ్డ నేర్పరుల చేతి చలువ వల్లే. "లిఖిత" శ్రీకాంత్ ఆ రసవిద్య నేర్చిన కవి. మనిషిలోని సంఘర్షణనీ, అతని మనసులో చెలరేగే ద్వంద్వాలనీ, అలవోకగా కవిత్వం చేయగల నేర్పు శ్రీకాంత్ సొంతం. అనిర్వచనీయమనిపించే క్షణాలను అక్షరాల చట్రంలో శ్రద్ధగా బిగించి, మరికొంతమందికి కూడా అనుభవైకవేద్యం చేయడమే ఇతని కవిత్వంలో తొంగిచూసే ప్రత్యేక లక్షణం. సంకుచితం కాని చూపొక్కటీ చాలు, కవిత్వాన్ని, ఆ మాటకొస్తే ఏ కళనైనా ఉదాత్తంగా చూపెడుతుందనడానికి నిలువెత్తు తార్కాణం ఈ కవిత్వం. లోకంలోను, మనుషుల లోతుల్లోనూ, మునుపెన్నడూ చూడని పార్శ్వాలను చూపెట్టడమా? లేదంటే జనసామాన్యం తెలుసుకున్న, తెలుసనుకున్న సంగతులనే సరికొత్తగా పరిచయం చేయడమా? ఏది ఉత్తమ కవిత్వ లక్షణం? అన్న ప్రశ్నను కలిగిస్తుంది శ్రీకాంత్ కవిత్వం. శ్రద్ధగా చదివే పాఠకులకు, బహుశా ఓ సమాధానమూ చూపెడుతుంది. నిప్పుకణికలా వెలుగులీనే నిజమూ, బాహ్యస్మృతి విముక్తులను చేసే సౌందర్యలోకాల ప్రస్తావనా, బాధల కొలిమిలో నిండా కాల్చి, మనలోలోపలెక్కడో స్వర్ణకాంతులీనే హృదయమొకటి ఉందని మరలా గుర్తు చేసే విషాదమూ శ్రీకాంత్ కవిత్వాన్ని చదివి తీరాల్సిన కవిత్వంగా మార్చిన సుగుణాలు. కవి మాటల్లోనే చెప్పాలంటే, ఊయలలూగి నిదురించే  "శిశువు పెదవిపై మిగిలిన పాల తడి" లాంటి ఇష్టాన్ని మిగిల్చే అనుభవం ఈ కవిత్వాన్ని చదవడం. వెన్నెల రాత్రినీ, మంచుబిందువులు పచ్చికను ముద్దాడే ఈరెండ ఉదయాలనీ తఱచుగానే కవితల్లో చూస్తూ ఉంటాం. కానీ, ఇవే ఉదయాస్తమయాలను మనిషిలోని భావసంచలనంతో సంధానించి కవిత్వం చెబితే ఎలా ఉంటుందో, శ్రీకాంత్ తన అక్షరాల సాక్షిగా పరిచయం చేస్తారు. ఒక్క రోజులో మన మనసు ఎన్ని రంగులు మార్చుకుంటుందో, ఎన్ని వైవిధ్యాలను, ఉద్వేగాలను ఉగ్గబట్టుకుని క్షణాలను దొరలించుకుంటుందో, అన్ని ఛాయలనూ చాకచక్యంగా కవి రెండు వేళ్ళ మధ్యా ఒడిసి పట్టుకున్న తీరు తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది.

ఒక కవిత చదవగానే, "ఇది శ్రీకాంత్ కవిత" అని ఇట్టే గుర్తించగలిగేంత ప్రత్యేకమైన శైలిని సృజించుకుని, తెలుగు కవిత్వ దారుల్లో తనదైన ముద్రలు వేస్తూ సాగుతోన్న శ్రీకాంత్ కవితలు ఐదూ- కవిత్వం కాలాన్నిలా అలవోకగా అక్షరాల్లో బంధించగలదని నమ్మే వారి కోసమూ, నమ్మని వారి కోసం కూడా  -  ఈనెల ఈమాటలో, మరికొందరికి చేరాలన్న ఆశతో..

ఓ వేసవి మధ్యాహ్నం

నిద్దుర ముంచుకొచ్చేముందు ఓ ఐదు నిముషాలు మొండిగా ఏడవడం అలవాటు నా బుజ్జాయికి. మా అత్తగారు, "తిక్క ఏడుపమ్మా, ఇక పడుకుంటాడు, రెండు నిముషాలలా తిప్పుకు తీసుకు రా" అంటూంటారు. నిన్న మధ్యాహ్నం వేళ అలాగే కాస్త మంకుపట్టాడని తిప్పడానికి బాల్కనీలోకి తీసుకు వచ్చాను. నీడపట్టునే నిలుచున్నా, చూడటానికే ఇబ్బంది కలిగించేంత ఎర్రటి ఎండ. వచ్చినంత వేగంగానూ లోపలికి నడవబోతూండగా, పొలికేక వినపడింది. ఉలిక్కిపడి వెనక్కి చూశాను. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. చెట్లు కూడా సొమ్మసిల్లినట్టు ఏ కదలికా లేకుండా ఉన్నాయి. పక్షుల కిలకిలలు అసలే లేవు. అప్పుడొకటీ అప్పుడొకటీ అన్నట్టు వచ్చి పోతున్న కార్ల శబ్దాలే, బొయ్యిమంటూ మొదలై, వెళుతూ వెళుతూ మళ్ళీ ముందరి నిశ్శబ్దాన్ని వదిలేస్తున్నాయి. కనపడ్డంతలో అందరి ఇళ్ళ తలుపులూ మూసే ఉన్నాయి. ఇంకెవరు అరిచారో ఓ క్షణం అర్థం కాలేదు. అంతలోనే స్ఫురించి కిందకి చూశాను. నా నమ్మకం వమ్ము కాలేదు.

ఇద్దరు బుడతలు. పల్చటి చొక్కాలతో దుమ్ము కొట్టుకుపోయిన దేహాలతో ఆడుకుంటున్నారు. సరిగ్గా మా ఫ్లాట్స్ వెనుకే ఉంది ఈ ఖాళీ స్థలం. దానిని ఆనుకుని రోడ్డు. రోడ్డుకి అవతలి వైపు రెండు బొమ్మరిల్లుల్లాంటి అందమైన ఇళ్ళు. ఈ ఖాళీ స్థలం పక్కన కొత్త అపార్ట్మెంట్స్ కడుతున్నారు. వీళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళ పిల్లలే అయి ఉండాలి.  

అక్కడి పనికి ఈ స్థలంలో ఇసుక, కంకర రాసులుగా పోసుకున్నారు వాళ్ళు. ఓ మూలగా బండరాళ్ళు పడి ఉంటాయి. ఎండుపుల్లల మోపులు మరోవైపు. ఖాళీ అయిన పెయింట్ డబ్బాలనే బకెట్లుగా వాడుకుంటూ, ఆడవాళ్ళు బట్టలు ఉతుక్కుని పారబోసిన నీళ్ళు ఇంకో దిక్కున. వాళ్ళూ వీళ్ళూ విసిరేసిన చెత్తా, ప్లాస్టిక్ కాగితాలు మరోవంక. వీటన్నింటి మధ్యలో వాళ్ళిద్దరూ. చంకలో కర్రలు దోపుకు కూర్చుని, మట్టి తవ్వుకుంటూ, నవ్వుతూ తుళ్ళుతూ ఏవో ఆటలు. రెండో అంతస్తు నుండి వాళ్ళనలా చూస్తూంటే, ఎందుకో చప్పున భాగవతంలో బాలకృష్ణుడు చల్దులారగించే ఘట్టం గుర్తొచ్చింది. చిన్నికృష్ణుడి చేతిలోని ఊరగాయకు బదులు ఇక్కడొకడి వేళ్ళ మధ్యలో ఎర్రటి బంతి. రెండోవాడు బలరాముడో, గోపబాలుడో!  

ఒక్కసారిగా విజయవాడలో మా ఇల్లు గుర్తొచ్చింది. సెలవ రోజుల్లో అక్కడ కూడా మా బాల్కనీలో నిలబడితే, సమయంతోనూ, సూరీడి ప్రతాపంతోనూ నిమిత్తం లేకుండా కింద కోలాహలంగా పిల్లలంతా క్రికెట్ ఆడుతూ కనపడేవాళ్ళు. ఇలాంటి వేసవిగాలుల మధ్యాహ్నాల్లో అమ్మలు ఎంత గోలపెట్టినా వినకుండా అందరూ అక్కడికే చేరేవాళ్ళు. వడదెబ్బ తగులుతుందనీ, ఎండకు మాడిపోతారనీ ఎవరెన్ని చెప్పినా లక్ష్య పెట్టేవాళ్ళు కాదు. మా అపార్ట్మెంట్‌లో పిల్లలకి తోడు, వాళ్ళ స్నేహితులు, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళూ కూడా వచ్చేవారు. ఆఖరు పరీక్షలకు పాఠాలన్నీ అమ్మలకు అప్పజెప్పి, పై ఇళ్ళ వాళ్ళం కూడా గోడ మీద గడ్డం ఆన్చుకు తీరిగ్గా కూర్చుని, ఆటనీ, వాళ్ళ అల్లరినీ చూసేవాళ్ళం. ఆడని వాళ్ళు, మనుష్యులెక్కువై ఆటలో చేరలేని వాళ్ళు, కిందే పిట్టగోడ మీద కూర్చుండిపోయేవాళ్ళు. మా కాంపౌండ్‌ని ఆనుకునే కాలేజీ గ్రౌండ్, ఎప్పుడూ ఖాళీగా ఉండేది. వీళ్ళు కళ్ళు తిరిగే షాట్ ఏదైనా కొడితే, అదెక్కడ పడిందో పై ఇళ్ళల్లో కూర్చుని చూస్తోన్న మేమే చెప్పాలి. అలా ఎవరైనా షాట్ కొట్టాలనీ, దూరంగా ఎక్కడో పడితే మేం గమనించి చెప్పాలనీ భలే తహతహగా ఉండేది. అలా కాకుండా అప్పుడప్పుడూ కొందరు గుడ్డిగా కళ్ళు మూసుకు నిట్టనిలువుగా పైకి కొట్టేవాళ్ళు, అప్పుడు ఏ ఇంటి కిటికి అద్దాలో  భళ్ళుమని పగిలేవి. "మిట్టమధ్యాహ్నం వేళ వెధవ ఆటలూ మీరూనూ, శుభ్రంగా పోయి పడుకోక.." అని పెద్దవాళ్ళు కొందరు తిట్టినా, మగవాళ్ళు "చిన్నప్పుడు మేం ఆడినా ఇలాగే పగిలేవి, పోనిద్దూ" అని వదిలేసేవాళ్ళు. నిద్ర చెడగొట్టినందుకు మాత్రం కొందరి కళ్ళు చింతనిప్పులు కురిపించేవి. ఇబ్బందులే రానీ, ఆటగాళ్ళకి దెబ్బలే తగలనీ, చీకటి పడందే ఆట మాత్రం ఆగేది కాదు. మా ఫ్లోర్‌లో పడితే, చింటూ వాళ్ళ అమ్మకి తెలియకుండా వాళ్ళింట్లో దూరి ఆ బంతి మళ్ళీ కిందకి వేసే పని నాకప్పగించేవారు. ఆ దొంగపని చేయడంలో ఎంత గర్వం! సందులో సందు, పక్కింటి మామ్మగారి తోటలో నుండి చేతికందిన కాయలు, జామకాయలో మామిడికాయలో, నాలుగు కోసుకుని తినేసేవాళ్ళు. కుదిరితే, మిగిలితే, మా పిల్లమూకకీ ఒకట్రెండు ముక్కలు ఇచ్చేవాళ్ళు. మామ్మగారి నూతిలో బంతి పడితే అప్పటికప్పుడు కొత్త బంతి తెచ్చుకుని ఆట సాగించుకునేవాళ్ళు. చెప్పిన మాట వినకుండా ఆటలకు వెళ్ళినందుకు శిక్షగా, చాలామంది ఇళ్ళల్లో తలుపులు తాళాలు వేసేసుకునేవారు. అంటే, ఆటలో పేచీ వచ్చినా, ఆట ఆగినా ఇంటికి వెళ్ళడం కుదరదన్నమాట. అప్పుడూ మళ్ళీ మేమే దిక్కు. పై నుండి చల్లటి నీళ్ళ బాటిళ్ళు విసిరేస్తే తాగుతూ కూర్చునేవారు. ఈ ఆటనిలా చూడటంలో ఎన్ని సాయంత్రాలు గడిచిపోయాయో ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. అలా ఒక పక్క వీళ్ళనీ, ఇంకో పక్క షార్జాలో సచిన్‌నీ చూసీ చూసే, అప్పట్లో సచిన్ మా ఇంటి వెనుక ఆడీ ఆడీ ఆ పిట్టగోడ మీదే అలసట తీర్చుకోవడానికి కూర్చున్నాడని కలగన్నాను. కలే, కానీ అందమైనది. తల్చుకున్నప్పుడల్లా భలే తమాషాగా అనిపిస్తుంది. ఈ ఆట లేని జీవితమా?! ఊహకే అందదు.

భుజం మీద నా బుజ్జాయి మాగన్నుగా జోగడం మొదలెట్టగానే వాడి మెత్తటి పక్క మీద హడావుడిగా పడుకోబెట్టి మళ్ళీ బయటి బలరామకృష్ణులను చూడటానికి వచ్చాను. ఇద్దరూ ఈ సారి సఖ్యంగా క్రికెట్ ఆడుకుంటున్నారు. మళ్ళీ అనిపించింది, ఈ ఆట లేకపోతే మన దేశంలో పిల్లల బాల్యం పూర్తవ్వదేమోనని. ఏ నియమాలూ అక్కర్లేదు. పదకొండు మంది ఆటగాళ్ళూ, 22 గజాల కొలతలూ..ఊఊహూ..ఇవేమీ అక్కర్లేని జల్సా ఆట మనవాళ్ళది. వీళ్ళూ అంతే, దుందుడుకుగా చేతికి దొరికిన అట్టలతో, కర్రలతో ఆ పాతబంతిని బాదేస్తున్నారు. నేను చూస్తూండగానే ఒకడు కొట్టిన వేగానికి బంతి వెళ్ళి బండరాళ్ళ మధ్యలో పడింది. వాళ్ళిద్దరూ గొడవలోకి దిగిపోయారు. అంతదూరం ఎందుకు కొట్టావనో, అలా కొడితే అవుటనో..ఏమిటో వాళ్ళ గొడవ. నాకర్థం కాలేదు కానీ వాళ్ళని చూస్తూ అక్కడే నిలబడ్డాను. మరో ఐదు నిముషాలకి ఆ గొడవ చల్లబడ్డాక బంతి కోసం వెదకడం మొదలెట్టారు. రాళ్ళ అడుక్కి వెళ్ళిపోయి ఆ బంతి పైకి తేలిగ్గా కనపడం లేదు. బంతి పడ్డప్పుడు వాళ్ళ ధ్యాస అక్కడ లేదు కాబట్టి వాళ్ళకదెక్కడ పడిందో గుర్తు రావట్లేదు. అన్ని దిక్కులూ చూస్తున్నారు. ఒకరినొకరు తోసుకుంటున్నారు, కవ్వింపుగా మాటలనుకుంటున్నారు. నవ్వొచ్చింది. మనసు మళ్ళీ గతంలోకి తొంగి చూసుకుంది. "అటు వైపు.." - బిగ్గరగా అరిచి చెప్పాను - వాళ్ళు పైకి చూడగానే చేతితో ఎక్కడ పడిందో సైగ చేసి చూపించాను. అక్కడ చూడగానే ఇట్టే కనపడింది వాళ్ళకి. బంతి దొరగ్గానే గాల్లోకి ఎగరేసి నవ్వాడొకడు. అది అటునుండటే తన చేతుల్లోకి అందుకుటూ పరుగు తీశాడు రెండో వాడు. ఇద్దరూ మళ్ళీ నా వైపు చూళ్ళేదు. నేను లోపలికి వచ్చేశాను. పక్క సరిచేస్తుంటే కళ్ళు విప్పిన బుజ్జాయిని పదే పదే ముద్దాడాను. కింద ఆట ఆగలేదనట్టు చాలా సేపు అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. 

ఇదే దారి


తెలిమబ్బు తొంగి చూసుకుంటుందని
కావి రంగు నీటి అద్దాన్ని
ఆకులు అదేపనిగా తుడిచే దారి

సరిగంగ స్నానాల్లో
కొబ్బరాకులు వణికి వణికీ
ఒళ్ళు విదుల్చుకు నాట్యాలాడే దారి

ఎవరో విసిరిన గచ్చకాయ
పచ్చిక పైపెదవిపై పుట్టుమచ్చలా
కవ్వించి ఆకర్షించే దారి

నీలి నీలి పూవులు
గరిక కురుల్లో నవ్వీ నవ్వీ
నీలాకాశపు తునకల్ని నేలకు దించే దారి

ఒక పసిపాప కేరింత, పేరు తెలియని పక్షి కూతా
నీరెండ కిరణాల్లా ఏ వైపు నుండో తేలి వచ్చి
ఉదయాన్నే హృదయాన్ని వెలిగించే దారి.

* తొలిప్రచురణ సారంగలో.

"నెమరేసిన మెమరీస్" - ముళ్ళపూడి శ్రీదేవి


సాధారణంగా గొప్ప వారి ఆత్మకథలు స్ఫూర్తి నిస్తాయనీ, తెలియని కబుర్లేవో చెబుతాయని ఆ పుస్తకాలు కొంటూంటాం. కొన్నిసార్లు వాళ్ళ కథలు చదివాకే గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాం, లేదా మునుపటి కంటే ఎక్కువగా ఇష్టపడతాం. ఉదాహరణకు ఆచంట జానకీరాం గారి "స్మృతి పథం" పుస్తకం తీసుకుంటే, ఆయనెవరో ఏమిటో నాకు మునుపు తెలియదు. అయితేనేం, ఆ పుస్తకమంతా ఆవరించి ఉన్న ఒకానొక సౌందర్య స్పృహ, ఆయన్ను పుస్తకం ముగించే వేళకి ఆప్తుణ్ణి చేసింది. తన కవిత్వంలో ఆయన పలికించిన ఉద్వేగాలూ, జీవితమంతా కవులతోనూ, కళాకారులతోనూ గడుపుతూ ఆ క్షణాలను గురించి పారవశ్యంతో చెప్పుకుపోయిన తీరు, నన్నూ ఆ కాలానికి తీసుకువెళ్ళాయి. అలాగే, దువ్వూరి వారు. ఆయన కథ చదువుతున్నా అలాగే విస్మయం. మనది కాని ఓ కాలంలోకి వీరంతా వేలు పట్టుకు భద్రంగా నడిపించుకు వెళతారు. మనవి కాని అనుభవాలు కొన్నింటిని మనసులో ముద్ర వేసి పోతారు. ఇటువంటివి కాక, సత్యసోధనో, ఓ విజేత ఆత్మకథో చదివినప్పుడు మనం పొందే స్ఫూర్తి వేరు. మన మనసు ఆలోచించే పద్ధతి వేరు. 

ఈ పుస్తకాలు సాధారణంగా బాగా పేరొందిన వారివే అయి ఉండటం చూస్తూంటాం. అలా కాకుండా, ఎవరో ఓ ఆరుగొలనులో పుట్టి పెరిగిన అమ్మాయి, జీవితం మూడొంతులు అనుభవించేశాక, "నేనొక కథ చెబుతానూ, నా కథ. నా వాళ్ళ కథ" అంటే వింటామా? అనుమానమే. అయితే, ఆవిడ ముళ్ళపూడి సతీమణి అని తెలిస్తే, కాస్త ఆసక్తి కలుగుతుందేమో. కృష్ణశాస్త్రి గారబ్బాయి "నాన్నా-నేనూ" అంటే, ఆ భావకవి జీవితాన్ని ఇంత దగ్గరగా చూసిన మనిషి ఏం చెప్పబోతున్నాడోనన్న కుతూహలంతో సర్దుక్కూర్చున్నాము కదా! అలా అనమాట.

ముళ్ళపూడి పేరూ, కవరు మీద బాపు బొమ్మా, నేనీ పుస్తకం కొనడానికి కారణం కాదని చెప్పను కానీ, నిజంగా - ఈ పుస్తకం చదివాక నేను శ్రీదేవి గారిని గుర్తు చేసుకుంటోంది మాత్రం ఆ రెండు పేర్ల ఊతంతో కాదు.

అలా తీరికగా కూర్చుని రాద్దామంటే, నిజానికి ఈ పుస్తకంలో ప్రత్యేకంగా చర్చకు పెట్టాల్సినవి లేవు, మళ్ళీ మళ్ళీ చెప్పుకొనవలసిన ముఖ్యమైన విషయాలూ లేవు. చేయి తిరిగిన రచయిత వ్రాసినవి కాదు కనుక, కోట్ చేసి దాచుకోవలసినవో, పది మందితో పంచుకోవలసినవో అయిన వాక్యాలూ లేవు. అయినా ఈ పుస్తకం ప్రత్యేకమైనదే. 

ఎందుకూ అంటే...

నా చిన్నప్పుడు బెజవాడలో, మా పక్కవీథిలోనే కొన్నాళ్ళు మా నాన్నగారి అక్కయ్య ఉండేది. లీలత్తయ్య. సాత్విక గుణానికి నిలువెత్తు రూపంలా ఉండేది. ఏ కాస్త పరుషమైన మాట విన్నా, ఎవ్వరి కే కష్టమొచ్చిందని తెలిసినా, "..చ్చొచ్చొచ్చొ.." అంటూ నిజాయితీగా దిగులుపడిపోయేది.అమ్మ స్పాట్‌వేల్యుఏషన్‌కి వెళ్ళి బందరు నుండి ఆలస్యంగా వస్తుందంటేనో, ఏ ఆదివారం మధ్యాహ్నమో ఏమైనా తెమ్మనో- ఇమ్మనో, నన్ను వాళ్ళింటికి పంపుతూ ఉండేవారు. నేను వెళ్ళగానే ఆవిడ ఓ పీట వేసి నన్ను వంటింట్లో పక్కగా కూర్చోబెట్టుకుని, కమ్మటి రుచి వచ్చేదాకా వేరుశనగ పప్పులు వేయించి, చిన్న బెల్లం ముక్క కూడా ఇచ్చి, కబుర్లాడుతూ ఉండేది. ఏవో కబుర్లు...మిగిలినవాళ్ళెవ్వరూ చెప్పనివి. వేసవిలో అవనిగడ్డ వెళితే, రాజ్యమత్తయ్య ఏం చేస్తుందో, దాన్ని ఆనుకుని ఉన్న మా తాతగారి ఇల్లు ఇప్పుడెలా ఉందో కళ్ళకు కట్టినట్టు చెప్పేది. కిష్టలో ఆటల్లో వాళ్ళు మింగేసిన నీళ్ళ రుచీ, వాళ్ళ తోటలో కొబ్బరి నీళ్ళ రుచీ, ఆవిడ చెప్తే రెట్టింపయిపోయేవి. వాళ్ళ వానాకాలం చదువులూ, కందితోటల్లో ఆటలూ, నా ఊహలకు రెక్కలిచ్చి నన్నూ ఓ అందమైన లోకానికి తీసుకుపోయేవి. మా నాన్నగారి చిన్నప్పటి ముచ్చట్లూ, ఏడుగురు సంతానంలో ఆఖరువాడిగా పుట్టినందుకు ఆయనకు దక్కిన గారం, నలుగురు అక్కల అరచేతుల్లో సాగిన ఆయన అల్లరీ అన్నీ కథలు కథలుగా చెబుతూండేది. నా చేత పాటలు పాడించుకునేది. తన పిల్లలు ఆడి దాచుకున్న వంటింటి బొమ్మ సామాను మొత్తం తాటాకు బుట్టలో ఈ మేనకోడలి ఆటల కోసం అభిమానంగా అట్టేపెట్టింది.  

ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ నాకు మా అత్తయ్యే గుర్తొచ్చింది. మనందరికీ జీవితంలో అటువంటి వ్యక్తులు తారసపడుతూనే ఉంటారు - వాళ్ళతో జరిగిన సంభాషణల్లోని మాటమాటా మనకు విడిగా, ప్రత్యేకంగా గుర్తుండకపోయినా, ఆ అనుభూతి మాత్రం మనసుపొరల్లో ఎక్కడో భద్రంగా నిలిచిపోతుంది.

అందుకే అలాంటి వాళ్ళు ప్రత్యేకం. ఇలాంటి పుస్తకాలూ ప్రత్యేకం.

నెమరేసిన మెమరీస్ అన్నారే కానీ, ఇదీ కోతికొమ్మచ్చే. జీవితం లెక్కల ప్రకారం సాగదు. మనసూ పద్ధతిగా ఆలోచించదు. కాబట్టి, ఒక డైరీ్‌లా రోజు తరువాతి రోజు గురించి యాంత్రికంగా చెప్పుకుపోయిన కబుర్లు కావివి. ఒక జ్ఞాపకం మరో జ్ఞాపకాన్ని గుర్తు చేస్తోంటే, ఆ కొసలను పట్టుకుని అనాయాసంగా కథ పొడిగించుకుంటూ వెళ్ళిపోతారీవిడ.

ఈ పుస్తకంలో కొన్ని అందమైన పొట్టి కథలున్నాయి. వాటిలో కొన్ని మనం చిన్నప్పుడే పెద్ద వాళ్ళ దగ్గర వినేసినవి. జానపద గేయాల్లా, ఎవరు వ్రాశారో తెలీకపోయినా, మనమంతా చిన్నప్పటి నుండే వింటూ ఉన్నవి. వాళ్ళ నాన్నగారు చెప్పిన నల్లపిల్ల-నల్ల పెదవులు, గయ్యాళి భార్య- కంది పచ్చడి, ధర్మరాజు దుర్యోధనుల మంచీ-చెడు, కర్ణుడు-అర్జునుల దాన గుణం, అనన్యాశ్చింతయంతోమాం అంటే ఏమిటో ఓ పసివాణ్ణి అడ్డుపెట్టుకుని సులువుగా విప్పి చెప్పిన కథ, వినాయకుడిని చకారకుక్షి అని వేళాకోళం చేసిన కాళిదాసు - ఎలా తిరిగి ఆయనను ప్రసన్నం చేసుకున్నాడు? ఒక్క చకారం లేకుండా ద్రౌపదికి పాండవులేమవుతారో చెప్పడం వీలయిందా?, హేవిళంబి నాటకం, పోలి స్వర్గం ఇలా ఎన్నో. ఇవి కాక, భజనలు, నండూరి అన్నయ్యలు వరస కట్టి పాడిన గీతాలు, 'బాల కృష్ణ ' సంస్థ ద్వారా వీళ్ళు వేసిన నాటకాలు - ఒకటా రెండా! అపురూపమైన బాల్యాన్ని సొంతం చేసుకున్నారని అసూయ పొందేటన్ని కబుర్లు చెప్పారీవిడ.

ఇన్ని కథలు చెప్పినా, ఎక్కడా పాఠకులకు విసుగనిపించదు. నిజానికి, 'మా నాన్నగారు చెప్పిన కథ', 'మా మోహనం అన్నయ్య వరస కట్టి పాడిన పాట' - అంటూ లీలగా తొణికిసలాడే అతిశయంతో ఆ కథలూ, పాటలు కూడా పూర్తిపాఠాలు వ్రాసుకుంటూ వెళ్ళిన కారణానికేమో, శ్రీదేవి గారు ఆయా చోట్ల మనకి చెంపన చేయి పెట్టుకు వినే పసి పిల్లలా కనిపిస్తారు. అటుపైన అరటి ఊచ వేలికి చుట్టుకు అత్తగారిని కంగారు పెట్టిన కొంటె కోడలిగానూ, తన పిల్లలనూ, మరిదిగారి పిల్లలనూ, బాపుగారి పిల్లలనూ కలుపుకు నాకు ఆరుగురు పిల్లలని సగర్వంగా చెప్పుకునే అమ్మగానూ, ఒక పాత్ర నుండి మరొక పాత్రలోకి జీవితం ఎంత సహజంగా తనను తీసుకువెళ్ళిందో, అంత సహజంగానూ ఆ పరిణామ క్రమాన్నంతా అక్షరాల్లోకి అనువదించుకున్నారు. సరిగ్గా ఆ కారణానికే, ఇది ఒకసారి మొదలుపెడితే చివరిదాకా చదివించే పుస్తకం అయింది. రకరకాల వయస్సుల్లో రచయితను బాపు బొమ్మల్లో ఊహించుకుంటూనే ఈ పుస్తకం తిరగేస్తామనడం అతిశయోక్తి కాదు. (నిజంగానే అంతటి లావణ్యమూ ఆవిడ సొత్తని, పుస్తకంలో జతపరచిన ఫొటోలన్నీ తీర్మానించాయి) 

శ్రీదేవి గారి రచనలో ఇంకో చమక్కు ఉంది. హాస్య సంఘటనలు చెప్పేప్పుడు, లేకి హాస్యం వ్రాసేవాళ్ళంతా రచయిత స్థానంలో ఉంటూనే వాళ్ళే పగలబడి నవ్వేస్తారు. మనమిక్కడ నవ్వాలని వాళ్ళే చెబుతారు. శ్రీదేవిగారలా కాదు. అతి మామూలుగా అన్ని సంగతులతోటే ఇదీనూ అన్నట్టు చెప్పేసినా, మనం ఫక్కున నవ్వేస్తాం. నవ్వకుండా చెబుతారంటే మళ్ళీ అదేమీ "నోటితో చెబుతూ నొసటితో వెక్కిరించే" తీరూ కాదు. అది ఒక ప్రత్యేకమైన శైలి, అంతే. "అత్తగారి కథ"ల శైలి గుర్తొస్తుంది అక్కడక్కడా. కానీ ఆ పాటి ఆరోగ్యకరమైన వ్యంగ్యం కూడా ఉండదు.  

గీత-రాత అన్న జంటపదాలకి తెలుగునాట బాపురమణలు పర్యాయపదాలుగా మారడం ఈనాటి సంగతి కాదు. ఈ కలికాలంలో ఇలాంటి స్నేహమెలా సాధ్యమని ఆశ్చర్యపోయేలా బ్రతికారిద్దరూ. వాళ్ళ సినిమాల్లో అణువణువునా కనపడే అభిరుచిని గమనించినా, అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మారిపోతూండే మనిషి మనస్తత్వాన్ని బేరీజు వేసిన తీరును చూసినా, తెలీకుండానే వాళ్ళ మీద ఆసక్తి, అభిమానమూ కలుగుతాయి. ఈ అభిరుచి గురించీ, ఆ అందమైన మనసులకు అద్దం పట్టే సంఘటనల గురించీ, ఈ పుస్తకంలో ఎన్నో ఋజువులున్నా, నాకు మరీ మరీ నచ్చిన రెండు విషయాలు ఇవీ :

"ఆళ్వార్పేట ఇంట్లో ముందు గేటు పక్కన పెద్ద జామ చెట్టు ఉండేది. అక్కడ పెద్ద ఖాళీ స్థలం ఉండేది. అక్కడ మెత్తటి ఇసుక పోయించి, ఉయ్యాల, జారేబల్ల, సీ.సా అన్నీ ఏర్పాటు చేశారు రమణగారు. సాయంత్రం చల్లబడ్డాక అక్కడ పిల్లలు ఆడుకునేవారు. చుట్టుపక్కల పిల్లలు కూడా వచ్చేవారు.

ఆ జామచెట్టు కొమ్మల మధ్య అమ్మలు ఒక దిండో, లేకపోతే రజాయో వేసి చక్కగా పక్క అమర్చుకునేది. తినడానికి ఒక డబ్బాలో కారప్పూసో, చిప్సో తెచ్చుకునేది. ఒక మంచినీళ్ళ సీసా పట్టుకుని జామచెట్టెక్కి సుఖంగా కూర్చుని ఏ పుస్తకమో చదువుకుంటూ కూర్చునేది. దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పైన బాపుగారి దగ్గర్నుండి పాత హింది పాటలు వినిపిస్తూ ఉండేవి."

ఇక రెండవది, వాళ్ళ ఇంట్లో బావి తవ్వుతున్నప్పుడు :

"మండు వేసవిలో పనివాళ్ళు చెమటలు కక్కుతూ తవ్వకం పని చేస్తుంటే చూడటానికే కష్టంగా ఉండేది. ఇంట్లో పల్చటి మజ్జిగ చేసి, ఉప్పు వేసి, నిమ్మకాయ రసం పిండి స్టీలు బిందెలలాంటి దాంట్లో పోసి ఇస్తే, కొత్త ఇంటికి తీసుకు వెళ్ళి పనివాళ్ళకు ఇచ్చేవారు. వాళ్ళంతా పరమ సంతోషంతో మజ్జిగ తాగి, సేద తీరి, మళ్ళీ ఉత్సాహంగా పని చేసేవారు. బావిలో నీళ్ళు పై దాకా వచ్చాయి. పైగా తియ్యటి నీళ్ళు. అంతే కాకుండా తెల్లవారేటప్పటికి సంపు నిండిపోయి, కార్పొరేషన్ నీళ్ళు పైకి వచ్చేసి కాలవ లాగా ఇల్లు దాటి రోడ్డు మీదకి వెళ్ళిపోయేవి. రమణ గారికి చాలా సంతోషంగా అనిపించింది. పని వాళ్ళ దాహం కనిపెట్టి చూడటం వల్ల అంత జలసంపంద వచ్చింది అనేవారు. అప్పటి నుండి అదొక సెంటిమెంట్‌గా మారిపోయింది."

ఇందులో ఉన్నదంతా సున్నితమైన హాస్యం, సరసమైన సంభాషణలూ. వెకిలితనం మచ్చుకైనా కనపడని వ్యక్తిత్వాల పరిచయమూనూ. స్నేహితులైనా సన్నిహితులైనా, భార్యాభర్తల గురించి చెబుతున్నా, అత్తాకోడళ్ళ గురించి చెబుతున్నా, అదే తీరు.

ముచ్చటగొలిపే ఓ సంఘటన గురించి ఆవిడ మాటల్లోనే -

"ఒకరోజు రమణగారు ఇంటికి వస్తూ - 'పన్నెండు దాటుతోంది. మా ఆవిడ ఎదురుచూస్తూ ఉంటుంది' అనుకున్నారట. కారులో ఉన్న ఇంకొకాయన 'ఎన్నాళ్ళయిందేమిటి మీ పెళ్ళయి?' అని అడిగారు.

'ఎనిమిది నెలలైంది' అని చెప్పారు రమణ గారు. 'పెళ్ళయి ఎనిమిది నెలలైనా ఇంకా మీ ఆవిడ నీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారా? అబ్బే ఉత్తిదే- శుభ్రంగా తినేసి రెండో జాము నిద్రలో ఉంటారు. అనవసరమైన భ్రమ పెట్టుకోకండి' అన్నారుట ఆయన. 'కాదులెండి- మా ఆవిడ మేలుకునే ఉంటుంది. నేను బెల్ కొట్టకుండానే తలుపు తీస్తుంది చూద్దురుగాని' అన్నారుట రమణ గారు. ఇంటికి వచ్చి- గేటు తీసి లోపలికి వచ్చి గేటు మూస్తుంటే వరండాలో లైటు వెలిగింది. కారులో ఆయన చేతులెత్తి దణ్ణం పెట్టి, 'మీరే గెలిచారండీ రమణ గారూ' అన్నారుట."

రమణ గారెప్పుడూ ఈ కథ చెప్పుకు మురుసుకుంటారని శ్రీదేవిగారు చెబుతోంటే, ఎంత బాగుంటుందో చదవడానికి.  ప్రేమంటే ఎదురుచూపులని కాకపోవచ్చు కానీ, ప్రేమంటే అపారమైన నమ్మకమంటే కాదనేవాళ్ళెవ్వరు?!

ఈవిడేమీ చేయి తిరిగిన రచయిత్రి కాదని నేను అన్న మాట నిజమే, అయితే, అది కేవలం వీరు మునుపు మరో రచన చేసిన దాఖలాల్లేకపోవడం చేతనే. అది మినహాయిస్తే, ఏ భావాన్నైనా నేర్పుగా పాఠకులకు చేరవేయడంలో ఆవిడ ఎవరికీ తీసిపోరనే అనిపించింది, పుస్తకం పూర్తి చేసేసరికి. రమణ గారి వియోగం గురించి చెప్పినప్పుడు బహు పొదుపుగా మాట్లాడిన ఈవిడ, మరి కొద్ది రోజులు గడిచాక సంగతుల గురించి వ్రాస్తూ "ఏడుపొస్తుంది." అంటూ మొదలెట్టినప్పుడు మాత్రం, గుండెల్ని కరిగించేశారు. నిజమే, ఆ వెలితి అనుభవంలోకి రావడానికి కూడా సమయం పడుతుందిగా. అదే కనపడుతుంది మనకి ఇక్కడానూ. అందుకే మనకీ అంత బాధ, ఆ పేజీల వద్దకొచ్చేసరికి. తెలియనిదెవరికి, "మిథునం" మన ఇంటింటి కథ! 

ఇద్దరు ప్రముఖ వ్యక్తుల జీవితాలతో ముడిపడి ఉన్న కథ కాబట్టి, మనకు పుస్తకం నిండా ఆసక్తిగొలిపే సంగతులెన్నో కనపడతాయి. అలనాటి వెండితెర రేరాణుల ప్రస్తావనా ఉంటుంది. ఆ తెర మీద వెలుగులెంత సంబరమో, ఆ తెర వెనుక నీడలెంత దుర్భరమో అన్నీ చెప్పకనే చెబుతుంది ఈ పుస్తకం. రమణ గారి కొండంత అప్పుని చూసి పిడికెడు హృదయంతో స్పందించి, ఊరటనిచ్చిన బాపుగారబ్బాయి వేణు గారి వ్యక్తిత్వం గురించి చదువుతుంటే, గుండె గొంతుకలో కొట్టాడుతుంది. "శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం". అంతే! చదివిన ప్రతి మనసూ చలించిపోయేలా చెప్పుకొచ్చారు శ్రీదేవి గారు.

లెక్కకు మించిన మనుష్యుల పరిచయాల వల్ల, అక్కడక్కడా కాస్త ఇబ్బందిపడే మాట వాస్తవమే. కొన్ని సార్లు పేర్లను చూసి కాస్త అయోమయానికీ గురవుతాము. ఒకటికి రెండు సార్లు చదివితే తప్ప కొన్ని వరసలు అర్థం కావు. ఆఖర్లో కొత్త ప్రాంతాలు చూసినప్పుడు కలిగిన ఆలోచనలు, ఆ వర్ణనలు కూడా కలిపారు. అవి, ముందంతా పుస్తకం నడచిన తీరుకి కాస్త భిన్నంగా ఉండటంతో(మనుష్యుల ప్రస్తావన లేకుండానో, లేదా తక్కువగానో..), కించిత్ అసంతృప్తి కలుగుతుంది. అయినా, ఈ పుస్తకం మిగిల్చే అనుభవం ముందు వీటిని నలుసులుగానే జమకట్టాలి.

జీవితాన్ని గొప్పగా గడపడం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు మనమిచ్చుకునే జవాబు మీద ఈ పుస్తకం నచ్చడమూ నచ్చకపోవడమూ ఆధారపడి ఉంటాయి.

వెనుతిరిగి చూసుకుంటే, మన చిననాటి అలకలూ-అల్లర్లు, ఇప్పుడు తగ్గించుకున్న మొండితనమూ, ఇప్పటికీ మనలో తొంగి చూసే అమాయకత్వమూ, మనం దాటలేమనుకున్న కష్టాలను కాలం పొత్తిళ్ళల్లో భద్రంగా దాటి వచ్చిన తీరూ, ఇక ఆపై నవ్వుకోవడమూ, మనం కోల్పోయిన వారి జ్ఞాపకాలు కూడా బాధించకుండా ఓదార్పునివ్వడమూ, మన చుట్టూ మనం గీసుకున్న పరిథి ఎంత చిన్నది కానివ్వండీ, అక్కడ కొందరికి చోటివ్వడమూ, సాయానికి చేయందివ్వడమూ, తప్పులొప్పుకుని కలిసి బ్రతకడమూ, నవ్వడమూ- నవ్వించడమూ - నా దృష్టిలో నేను గొప్పగా బతికాను అని చెప్పుకోవడానికి ఇవి చాలు. కాబట్టి నాకిది నచ్చింది.

ముందే చెప్పినట్టు, ఇది ఒక మామూలు అమ్మాయి కథ. మనని మనకు చూపించే కథ. మన వాళ్ళని గుర్తు తెచ్చే కథ. మనం మరచిపోయిన సంగతులు గిల్లి గుర్తు తెచ్చి నవ్వించే, ఏడిపించే కథ. మనను ఎత్తుకు ఆడించిన పిన్నులు, పెద్దమ్మలు, మేనత్తలు, మేనమావలు, మన తర్వాత పుట్టిన మన వాళ్ళందరూ - మనకు తెలీకుండానే జీవితాన్ని అమృతభాండంగా మార్చిన రోజులను ఏ అతిశయోక్తులూ ఏ అలంకారాలూ వాడుకోకుండా ఏ నీతి సూత్రాలతోనూ మనకు చిరాకు తెప్పించకుండా, అలవోకగా గుర్తు చేసిన అందమైన కథ. 

ఆత్మకథల్లో అరుదుగా కనిపించే నిజాయితీ ఒక్కటీ చాలు, ఈ పుస్తకాన్ని దాచుకు దిగులనిపించినప్పుడల్లా చదువుకుందుకు.

విశ్వనాథ విద్వద్వైభవము

కొన్నాళ్ళ క్రితం మిత్రులు ఫణీంద్ర ఒక ఆంగ్ల వ్యాసాన్ని తెలుగులోకి తర్జమా చేయడంలో కొంత సాయం కావాలని అడిగారు. అందులో విశ్వనాథ కవిత్వ ప్రస్తావన ఉంది కనుక ఆ వ్యాసం నాకు కూడా కొంత ఆసక్తి కలిగించవచ్చునని చెప్పారు. ఆ పేరు వినగానే, సహజంగానే నేను ఆకర్షితురాలినయ్యాను. నాకు తప్పకుండా ఆ వ్యాసం పంపించవలసిందనీ, అనువాదం నేను చేయలేకపోయినా ఊరికే చూసేందుకు, చదివేందుకు అనుమతినీయవలసిందనీ కోరాను. అలా ఇద్దరం కలిసి, ఆ వ్యాసంలో ప్రస్తావించిన కవిత్వ ధోరణుల గురించి, విశ్వనాథ గురించి చెప్పిన విషయాల్లో సత్యాసత్యాల గురించి చర్చించుకుంటూ, అనుకున్న దాని కంటే వేగంగానే, ఇష్టంగానే ఈ వ్యాసాన్ని తెలుగులోకి అనువదించాము. 

ఇంతకు మించిన ఆసక్తికరమైన విషయం మరొకటుంది - ఈ వ్యాసం మొదట తెలుగులో వ్రాసినది మరెవరో కాదు, వేటూరి వారు. ఆయన వ్రాసిన అసలు ప్రతి పోయి, దానికి వేటూరి గారి మిత్రులు శ్రీ ఎస్.రాధాకృష్ణమూర్తి గారు చేసిన ఆంగ్ల అనువాదం మాత్రమే మిగిలి ఉండటంతో, వేటూరి సైట్ నిర్వహకుల కోరిక మేరకు మేము ఈ సాహసం చేయవలసి వచ్చింది. 
*

విశ్వనాథ వారికి 1970-71 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా వేటూరి వారు వ్రాసిన వ్యాసం :


విశ్వనాథ వారికి 1970-71 సంవత్సరానికి గాను  జ్ఞానపీఠ పురస్కారాన్ని కొద్ది రోజుల క్రితం ప్రకటించినప్పుడు ఆయన “నిజానికి నాకీ పురస్కారం ఆరేళ్ళ క్రితమే దక్కి ఉండాలి” అన్నారుట! నిజమే, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన ప్రతిభనెన్నడూ తక్కువ చేసుకు మాట్లాడిన దాఖలాల్లేవు. స్వయంకృషితో, సాధనతో ఒక్కొక్క మెట్టూ దాటుకుంటూ తెలుగు సాహిత్య శిఖరాలను అధిరోహించిన ఘనత వారి సొంతం. సాహితీ ప్రస్థానపు తొలినాళ్ళలో సహచరులు కొందరు ఆయనకున్న సంస్కృతాంగ్ల పరిజ్ఞానాన్ని చులకన చేసి మాట్లాడిన కారణానికేనేమో, ఆయనకి తీవ్రమైన ఆత్మాభిమానం మాత్రం ఏర్పడిపోయింది.

ఆ రోజుల్లోని వర్థమాన కవులందరిలానే ఆయనా దేశభక్తి గీతాలతోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దేశభక్తిని, ప్రాంతీయాభిమానాన్ని కవితాత్మకంగా వ్యక్తీకరించేందుకు ఆనాటి కవులందరూ పోటీ పడుతున్న రోజుల్లో ఆయన రచించిన “ఆంధ్ర ప్రశస్తి” ఆయనకు ప్రశస్తిని తీసుకు వచ్చినా, ఈ కీర్తిని తుమ్మల సీతారామమూర్తి, రాయప్రోలు సుబ్బారావు వంటి వారితో పంచుకోవలసి వచ్చింది. ఆ తరువాత భావకవిత్వపు పూలపరిమళం తెలుగుసాహిత్యమంతా పరచుకున్నప్పుడు, మత్తెక్కని తెలుగు కవి లేడు. కొందరు షెల్లీ కవిత్వపు ఛాయల్లో తలదాచుకుంటే, ఇంకొందరు కీట్స్ వెంటపడ్డారు. మరికొందరు వర్డ్స్ వర్త్‌ని అనుకరించారు. ఇలా మనకు తెలుగు షెల్లీలు, కీట్సులు, వర్డ్స్ వర్తులు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చారు. ఒక వర్గం కవులు ఒక అడుగు ముందుకేసి కొంత అక్కడా, కొంత ఇక్కడా అన్నట్టు ఇరుభాషా ప్రాజ్ఞులనీ అనుసరిస్తూ వీలైనంత గొప్పగా వ్రాయాలని ఉబలాటపడ్డారు. మరి కొందరు ఘనులు ఈ ఆంగ్ల భావకవిత్వమంతటనీ మధించి, ఆ భావాలను తోచిన రీతిలో తెలుగులో వెళ్ళగక్కారు. మొదటి పంక్తిలో వర్డ్స్‌వర్త్‌నీ, రెండో పంక్తిలో షెల్లీని నిస్సిగ్గుగా అనువదించుకుని కవితలు వ్రాసుకున్న వారెందరో. విశ్వనాథ సైతం తమ సమకాలికుల దారిలోనే నడచి భావకవిత్వాన్నే ఆశ్రయించినా, తన శైలిని మరే ఇతర ఆంగ్ల కవి శైలికీ నకలుగా చెప్పలేని స్థితి కల్పించడంలోనే, ఆయన కవిత్వ విలక్షణత దాగి ఉంది. వారి “గిరికుమారుని ప్రేమగీతాలు”, “శృంగార వీధి” వంటి పద్యకావ్యాలు పాశ్చాత్య భావకవిత్వపు వాసనలు అంటని ఆత్మానుభవ నవసుమాలు. గమనిస్తే, వారి భావకవిత్వమంతటా కూడా సాంప్రదాయ కవిత్వ ధోరణి ప్రబలంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈయన తొలినాళ్ళ రచన, అత్యంత లయాత్మకంగా సాగిన “కిన్నెరసాని” లో విశేషంగా ఈ సాంప్రదాయ ప్రతీకలూ, శైలి కనపడుతూ ఉంటాయి. లీలామాత్రమే అయినప్పటికీ, ఈ ప్రాచ్య (టాగోర్), పాశ్చాత్య ప్రభావాలన్నింటిని, అతి వేగంగా దాటుకు వచ్చేశారు విశ్వనాథ. సామాన్యంగా తోచిన తన విశ్వాసాల పట్ల అనురక్తినీ, ప్రయోగాత్మకతనూ, విభిన్నతనూ కూడా ఆయన క్రమేణా కాదనుకున్నారు. అంతకు మించి, ఒక స్థిరమైన, సాంద్రమైన పునాదుల ఆధారంగా రచనా ప్రక్రియను కొనసాగించారు.

విశ్వనాథ నవలలు కూడా వ్రాశారు. అయితే అవి కవిత్వం వ్రాయలేని రోజుల్లో, విరామం ప్రకటించుకుని చేసిన కాలక్షేపం రచనలు కావు. నిజానికి, కవిత్వం చెప్పినంత సహజంగానూ నవలలు వ్రాసి మెప్పించడమూ, కొన్ని వచన రచనల్లో తన కవిత్వ సంపుటాలలో కూడా దొరకనంత కవిత్వ ధోరణినీ జొప్పించడమూ ఆయనకే చెల్లింది. విశ్వనాథ వారి నవలలలో తొలుతగా ప్రచురించబడినదీ, ప్రముఖమైనదీ అయిన ఏకవీర నిజమైన, నిఖార్సైన కవిత్వంతో నిండి ఉన్నది.  విశ్వనాథ సర్వోత్కృష్ట వచన రచన అయిన “వేయిపడగలు” నవల తెలుగు సాహిత్య అభిమానులందరినీ వారికి ఋణపడిపోయేలా చేసింది. టాగోర్ తాను పాడలేని వేళల్లో నవలలు వ్రాస్తానని ఓ సందర్భంలో అంటాడు (ముద్దాడలేని పెదవులే పాడతాయని మరో పాశ్చాత్య కవి అన్న రీతిలోనే). టాగోర్ నవలలు కొన్ని ఈ మాటలను నిర్ధారించేవిగానూ ఉంటాయి. తెలుగు సాహిత్య విమర్శకులు కొందరు విశ్వనాథ రచనలను టాగోర్ రచనలతో పోల్చి చూశారు. ఇటువంటి పోలిక టాగోర్ పట్ల అనుచితమైనదిగానూ, విశ్వనాథను అవమానించేదిగానూ భావించవలసి ఉంటుంది. నవలాకారుడిగా విశ్వనాథ శైలి సర్వస్వతంత్రంగా ఉంటూనే అత్యంత మనోరంజకంగా ఉండడంలో తనదైన ముద్రను వేసుకుని ఉన్నది. విస్తృతంగా అనుకరించబడినా, అనుసరణకు లొంగని శైలిగానే మిగిలిపోయిందది. అయితే, విశ్వనాథ నవలా రచనలను పరిపూర్ణతకు ఒకింత దూరంలో నిలబెట్టే నెరసొకటి ఉంది. అది, విమర్శకుల పరిభాషలో చెప్పాలంటే, ఆ రచనలు ప్రతిస్పందనాత్మకం (రేచ్తిఒనర్య్) కావడం. ప్రతిస్పందనాత్మక భావజాలం కన్నా, ప్రతిస్పందనా, సమర్థనా, వాదవివాదాలతో నిండిన వారి కథనశైలి కళారచనలోని రసజ్ఞతకు ఎక్కువ భంగం కలిగించింది. విశ్వనాథ నవలలో కొన్నింటిని ప్రగతిశీలమైన, విప్లవాత్మక ధోరణి కలిగిన చలం నవలలకు బదులుగా భావించే వారున్నారు. అయినప్పటికీ, విశ్వనాథ తన వైదుష్యవైభవంలో సింహభాగం నవలా రచన ద్వారానే సాధించారనడం అతిశయోక్తి కాదు. వైదిక ధర్మం యొక్క సప్రమాణికత పట్ల స్థిరమైన నమ్మకాన్ని కలిగి ఉంటూనే, మన గతం వైపు సునిశితమైన చూపుని విసిరి, ఆ స్వకాల ప్రాంతాల పట్ల ప్రీతిని కలిగించే రచనలు వారివి.

జీవితకాలపు సాధనా ఫలితంగా రామాయణ కల్పవృక్షాన్ని రచించిన కవి విశ్వనాథ. ఆంధ్ర మహాభారతానికి లభించిన స్థాయి కానీ, ప్రజాదరణ కానీ, ఏ ఒక్కరి రామాయణ తెలుగు సేతకీ లభించలేదన్నది నిర్వివాదాంశం. నిజానికి రామాయణం తెలుగు అనువాదాలన్నీ కాలప్రభావానికి మరుగున పడిపోక తప్పలేదు. ఆంధ్రమహాభారత స్థాయిని పొందలేకపోయినా, ఈ రెండింటినీ పోల్చి చూడటం ఏ విధంగానూ లాభించదనడం నిజమే అయినా,  విశ్వనాథ కల్పవృక్షం తెలుగు సాహిత్యానికి, మరీముఖ్యంగా శ్రీరామ కథకూ నిస్సందేహంగా  అదనపు శోభను చేకూర్చింది. మరో వైపు, మూలంలోని వాల్మీకి కథకు దూరంగా జరగడంలో విశ్వనాథ స్వతంత్రతను తెలుగు సాహిత్యకారులు సాదరంగా స్వీకరించలేకపోయారు. అయితే, మూలానికి నిబద్ధుడు కానందుకు కవిని విమర్శించినందువల్ల ఏ ప్రయోజనమూ లేదు. అక్షరమక్షరమూ మూలానికి లోబడి వ్రాసినా, లెక్కకు మిక్కిలిగా ఉన్న మన రామాయణ తెలుగు అనువాదాలు చాలా మటుకు  మూలంలోని ఆత్మను పట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాయి. విశ్వనాథలా స్వతంత్రించి మూలానికి అవసరమనుకున్నప్పుడల్లా దూరం జరుగుతూ కావ్య రచన చేసిన వాళ్ళూ లేకపోలేదు. నిజమైన ప్రశ్న, పరీక్ష – వీరందరూ రచనని పరిపూర్ణమైన కళారూపంగా మలచగలిగారా లేదా – అన్నది మాత్రమే. తమ తమ పక్షపాతధోరణితోనూ, నిర్హేతుకమైన ఆలోచనలతోనూ, విగ్రహారాధనతోనూ సంతృప్తి పొందో, సమర్ధించుకుంటూనో తెలియదు కానీ, ఈ ప్రశ్నను మాత్రం ఎవ్వరూ సంధించినట్టు కనపడదు.

విశ్వనాథ కేవలం మహోన్నత సాహిత్యకారుడు మాత్రమే కాదు. తెలుగునాట తనదైన చరిత్ర సృష్టించుకున్న చరితార్థుడు కూడా! బెర్నార్డ్‌షా తన జీవితకాలంలో సాధించినంత స్థాయినీ కీర్తినీ విశ్వనాథ ఈనాడు అనుభవిస్తున్నారు. ఎంత మంది శత్రువులను సంపాదించుకున్నారో అంతకు మించిన భక్త బృందాలనూ సమకూర్చుకున్నారు. ఎంతటి ప్రచండ వాగ్వివాదంలో చొరబడడానికైనా వెనుకాడని ధీర వ్యక్తిత్వం విశ్వనాథ సొంతం. విమర్శలకు వెరవని అభిప్రాయ ప్రకటన, ముక్కుసూటి సమాధానాలూ ఆయన నైజం. అలనాడు మాక్స్ బీర్‌బాం షా గురించి చెప్పిన మాటలే విశ్వనాథ వ్యక్తిత్వానికీ సునాయాసంగా వర్తిస్తాయి – “ఆయన అమరుడు”!

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....