వర్ణచిత్రం

కొత్తరోజులన్నీ ఖాళీ కాగితాలై
రంగులద్దుకోవాలని నా ముందు
రెపరెపలాడతాయి.

తైలవర్ణచిత్రమేదో గీయాలని
తొందరపడతాయి వేళ్ళు.
వీచే గాలికి ఉబలాటంగా ఊగుతూ
ఖాళీ కాన్వాసు మీదకి ఎగిరి చూస్తూంటాయి
డిసెంబరు పూవులు

ఊదారంగు సముద్రం, పైనేమో నీలాకాశం
గరుడపచ్చ పూసలకు గొడుగులు పడుతున్నట్టు
ఆకుపచ్చాపచ్చని కొండలు
పసిమి కాంతుల నెగురవేస్తూ వెనుకొక లోకం 
గీతలుగా మెదులుతూ చెదురుతున్న చిత్రం
పూర్తయ్యీ అవకుండానే
గుప్పెళ్ళతో కెంజాయలు రువ్వి
ఎర్రటి సూరీడెటో మాయమవుతాడా-
నల్లని రెప్పల తాటింపునాపి
నివ్వెరపాటుతో నిలబడిపోతుంది కుంచె

జీవితంలోని వర్ణాలనో
వర్ణాల్లోని జీవితాన్నో
జ్ఞాపకంగా నిల్పుకునే నేర్పు లేక
ఒళ్ళంతా ఒలకబోసుకుంటుంటే
అక్కడెక్కడి నుండో తొంగిచూసి
తెల్లగా నవ్విన చంద్రవంక
పెదాలపై నవ్వు ముద్దరై వెలుగుతుంది.

చిత్రం పూర్తవకపోతేనేం..?
చలిలోకి ముడుచుకునే వేళయ్యేసరికి
ఆనందం అర్ణవమయ్యీ,
సౌందర్యం అనుభవమయ్యీ,  
తీరం వెంట తడితడిగుర్తులతో
అసంపూర్ణ చిత్రాలన్నీ పరుగులు తీస్తాయి.
నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో,
నా బొమ్మలు నాలుగు రంగులు మిగిల్చి పోతాయి.

* తొలిప్రచురణ : ఆంధ్రజ్యోతి-వివిధ, 03-10-2016

8 comments:

  1. అద్భుతం. మంచి చిత్రం చూసిన అనుభూతి కలిగింది.

    ReplyDelete
  2. దేవులపల్లివారి "సుంత మాయనీ చిత్రపటములు ....ఏ రేయి తుడవని బొమ్మలు" గుర్తుకొచ్చింది :)

    ReplyDelete
  3. మీరు రాసిన కవిత్వానికి పూర్తి భిన్నంగా ఎన్నో రంగు రంగులతో ఈ పాట ఉంది. ఈ వీడియోను చూసి కవిత్వం రాయగలరా? :)

    https://www.youtube.com/watch?v=Dw2PDUvMpBI

    ReplyDelete
    Replies
    1. Thank you for sharing this. Many years ago, I had the pleasure of watching traditional Thai dance at Bangkok. This music somehow reminded of that beautiful dance and how all of us were lost in that world.

      I will see if I can write anything about this. (but anyways, we already had a great experience, why do we want to spoil it ;) )

      Delete
  4. Just not to lose another response :

    http://magazine.saarangabooks.com/2016/10/06/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AE%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9A%E0%B1%87-%E0%B0%95/

    ReplyDelete

  5. 1. UG SriRamTuesday, October 04, 2016
    అద్భుతం. మంచి చిత్రం చూసిన అనుభూతి కలిగింది.

    2. టి. చంద్రశేఖర రెడ్డి October 6, 2016 at 11:59 pm

    అవును. ఈ కవిత నన్నూ కదిలించింది. ఎంతగా అంటే, నాకున్న పరిధిలో, ఆ కవితలో ఉన్న భావప్రకటన ఆధారంగా ఒక బొమ్మ గీసుకునేంతగా. ఆ బొమ్మను ఈ మెయిల్ ద్వారా సారంగ సంపాదక వర్గానికి విడిగా పంపిస్తున్నాను. వీలయితే, దాన్ని కూడా ఈ కవితతో పాటు సారంగ పాఠకులకి పరిచయం చెయ్యండి.

    -------------------------------

    చూశారా మానస ji, నేన్నది నిజమైంది. నాకు బొమ్మ గీయటం రాదు. వచ్చిన అతను మీకవిత చదివి గీచాడు :)

    ReplyDelete
    Replies
    1. :))) మీకు దివ్యదృష్టి ఉందండీ! :)). but yes, it was very kind of Sri. ChandraSekharaReddy garu to post such beautiful response to my poem; వారు వాకిలిలో ప్రచురితమైన "ఆట" కు కూడా చక్కటి చిత్రాన్ని పంపారు. Glad that these poems are so well received by readers.
      Thank you!

      Delete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....