శ్రావణ రాత్రులు

శ్రావణ రాత్రులు నిద్రపోనివ్వవు

అకస్మాత్తుగా అవనిని ముద్దాడే వాన చినుకులూ
పుష్పాభిషేకాలతో పుడమి క్రొంగొత్త పులకింతలూ
గూటిలో ఒదిగిన గువ్వల వలపు కువకువలూ..
శ్రావణ రాత్రుల్లో కన్నులు మూతపడవు!

కొద్దికొద్దిగా గిల్లుతూ చలి ముల్లు
కాస్త కాస్తగా తడిపే తుంటరి జల్లూ
రేయంతా రెక్కలు తెరుచుకునే ఉండాలిక
అద్దాల మేడ మొత్తం మసకబారిపోయేదాకా

దీపాలారే వేళల్లో లయగా ఈ నేపథ్య సంగీతం
ఏనాటిదో ఓ పురాస్మృతిగీతాన్ని జ్ఞప్తికి తెస్తూ
మన్ను పరిమళంలా మెల్లగా లోలో సుళ్ళు తిరుగుతూ
ఆషాఢ రాత్రుల విరహానికి వీడ్కోలవుతోంటే

లేలేత నడుమును చుడుతూ పెనవేసుకునే బంధాలు
అనాచ్ఛాదిత గుండెలను చుంబించే నెన్నుదిటి ముంగురులూ
కొనగోటి స్పర్శల్లో ఏ స్వప్న లిపి ఆవిష్కృతమవుతుందో గానీ..
మెరుపులేమో నీలి కన్నుల్లో..వెలుగులన్నీ దహరాకాశంలో

శ్రావణ రాతురులు...లోకాలను నిదుర పోనివ్వవు...!!** Thanks to N.S.Murthy Garu, You can now find the English translation to this poem at : http://teluguanuvaadaalu.wordpress.com/2013/09/25/the-monsoon-nights-manasa-chamarti-telugu-indian/

వేడుక

 సెలవురోజు మధ్యాహ్నపు సోమరితనంతో ఏ ఊసుల్లోనో చిక్కుపడి నిద్రపోయి కలలోని నవ్వుతో కలలాంటి జీవితంలోకి నీతో కలిసి మేల్కోవడమే, నాకు తెలిసిన వేడుక...