Showing posts with label * కవితలు. Show all posts
Showing posts with label * కవితలు. Show all posts

ఇంకో వాన

 వాన పడేట్టు ఉంది.

ఆకాశపుతునకలోని నలుపంతా తాకి చూసి

మెల్లగా ఊపిరి తీసుకుంటుందో పద్యం

"ఎందుకో తెలీదు వానంటే ..."

*

ముసురుకునే చీకట్లు

ఇంకా, వాన ముందటి ఉడుకు గాలి

గదిలో ఇదిగో

నువు వెలిగించిన

పరిమళదీపం

కావలించుకుంటావు దగ్గరకొచ్చి

దాని కళ్ళల్లో వెలిగే కాంతిని.

*

గాజుకూజా అడుగు నీళ్ళల్లో

పెనవేసుకుంటూ

తాజాపూల పొడవాటి కాడలు

గదిలో నీడలు, నీడలను

నిమిరే నీ పొడవాటి వేళ్ళు

ముద్దాడుతావు నువ్వు

పెదిమలు దాచిన మాటల్ని

చలిగాలి వీస్తుంటే

ముడుచుకునే దేహాన్ని

*

వాన కురుస్తూనే ఉంది.

పూర్తి కాని పద్యమొకటి

నీ కౌగిట్లో సొమ్మసిల్లి

నిశ్చింతగా నిద్రపోతోంది.

*

"ఎందుకో తెలీదు వానంటే ..."

ఇష్టం నాకు.

చాలా.

*

తోడు

 వానాకాలం-

సాయంత్రమవుతుండగానే

మసక తెరలు విసిరి 

మేఘాలు పిలుస్తాయి

హోరుగాలులు 

కిటికీలు కొట్టుకుంటాయి

తలుపులు బద్దలవుతుంటాయి

వణికే పూలరెక్కలను చూస్తే

గుండెల్లో చలి తెలుస్తూంటుంది

నిలకడలేనివి.  నల్లని మేఘాలు

కవ్వించి కవ్వించి నన్ను

బయటకు రప్పించాయి

ఈ రాత్రిలో...ఈ చలిలో

వాటి వెనుక

ఎంత దూరం వెళ్లను 

చందమామా...నువ్వు తోడొస్తావా!

సౌందర్యం

 రాతిరంతా శుభ్రపడి తాజాగా మేల్కొంటున్న

వానాకాలపు ఉదయం

నల్లని మేఘాలతో నిర్మలంగా ఆకాశం

పల్చటి చలిగాలులు

ఇంకా జల్లుజల్లుగా కురుస్తోన్న వర్షం


తడిసిన ఆకుల మధ్య

ఓ విరిసీ విరియని పూవు

తడి తడి రెక్కలు అల్లార్చుకుంటూ

కువకువలాడే గుప్పెడు ప్రాణం

నిద్రకళ్లతో వెదుక్కుంటూ వచ్చి

నన్నల్లుకున్న నా పిల్లాడు...


ఈ ఉదయపు సౌందర్యాన్ని కొలిచి చెప్పమంటే-

నేనే కాదు, నువ్వూ కాదు

ఈ సమస్తాన్ని సృష్టించినవాడుకూడా 

సమాధానానికి తడబడతాడు.

కానుక

 కార్తీకపు వెన్నెల రేయి

లక్ష్యం లేని సంభాషణ
ఊరికే దొర్లిన ఊసుల్లో
ఎవరెవరో పురాకవులు
తుళ్లే నా సంబరం చూసి
ఊగుతూనే ఉంది పూలతీగ
వెంటపడి వచ్చింది నక్షత్రమాలిక
వేల మైళ్ళ దూరం ఉందంటారు
ఆ క్షణాల్లో అదంతా ఉత్త గాలి బుడగ
సంభాషణ పూర్తవుతుంది
నగరం నిద్రకు ఉపక్రమిస్తుంది
రాతిరంతా నన్నావరించుకున్న
సంతోషం
చలి చీకట్లో నా పూలతీగకు
పూవై పూస్తుంది.
నా ప్రపంచంలో వెన్నెల
పగలేదో రాత్రేదో మర్చిపోతుంది! ❤️

డిసెంబరు చివరి రోజులు

 రేపో మాపో రాబోతోన్న ఉత్సవాన్ని

మోసుకు తిరుగుతున్నట్టు ఉంటారు
కడుపుతో ఉన్న ఆడవాళ్ళు...
ఇంకా ఈ డిసెంబరు చివరి రోజులు.
చిన్న కంగారు, కొంత సంతోషం
తెలీనీ, తెలీకపోనీ - ...
ఎదురెళ్ళాలనిపిస్తుంది.
మంచి మాటలే చెప్పాలనీ.
చెట్టుకు వేలాడే పళ్ళను చూసినప్పుడు
గాలికి ఊగే పూవులని చూసినప్పుడు
అమ్మా నాన్నల భుజాల మీద నుండి
లోకాన్ని పరికించే పసివాళ్ళను చూసినప్పుడు
ఊళ్ళు ఊళ్ళు తిరిగొచ్చి
ఇంటి తాళం తీస్తున్నప్పుడు
ఒక సుస్తీ నుండి కోలుకుని
బలం పుంజుకుంటున్నప్పుడు
చీకట్లో గుచ్చిన చూపులను
ఓ నక్షత్రం లాక్కున్నప్పుడు
నీడల్లో నుండి పాటొకటి తాకి
నిర్జన వీధుల్లో పెదాల్ని అల్లుకున్నప్పుడు
నీళ్ళతో మెరిసే చెరువును చూసినప్పుడు
నిండుగా నవ్వి పలకరించిన అపరిచితుడు
ప్రయాణపు తోడై పక్కన కూర్చున్నప్పుడు
నిన్నటి చీకటి చివర
ఓ వెలుగురేఖ నవ్వుతుందని నమ్మకమున్నప్పుడు
ఏం లేదు.
కొంత కుదురు. మనసుకి.
ఉత్సాహమా? అది వెంబడిస్తుంది.

ఎవరు?

చిటుకూ చిటుకూ వినపడే

చిమ్మెట్ల చీకట్లో

మిణుకూమిణుకూమన్న

మోజులా కదలాడి

 

చిగురూ వలపూ వశపడే

గారాల కౌగిట్లో

కుదురూబెదురూ లేని

ఊహలా చెలరేగి


అద్దూఅదుపూ తెగిపడే

హేమంత సీమల్ని

అలుపూసొలుపూ లేని

రాగమై పెనవేసి...


అల

 

    అలల పొత్తిళ్ళలో

    అల్లరై నీ నవ్వు


అలల రెక్కల మీద
వెన్నెలై నీ చూపు

అలల ఒత్తిళ్ళలో
నలిగి నీ కేరింత
అలల ముద్దుల తడిసి
తీరాన్ని చేరాక.....❤️
No photo description available.
All reactions:
Vadrevu Ch Veerabhadrudu, Nauduri Murty and 101 others

అమాత్ర

 నది మీది పొగమంచుని 

అంచులు పట్టి లేపినట్టు ఉంటుంది
అచ్చంగిల్లాలు ఆట రాకుండా
గాల్లోకి ఎగరేసినట్టు ఉంటుంది.  

ఏడేళ్ళ నా పిల్లాడి గదిలో
దుప్పటి మార్చబోయిన ప్రతిసారీ

చీకటి వేళకి చెరువు నీళ్ళ మీద
వెన్నెల ముద్దలా తేలే చందమామ గుర్తొస్తుంది 
దిండు గలీబుని రంగురాళ్ళ రహస్యస్థావరం చేసి
అమ్మ నుండి దాచబోయిన దొంగ ఆచూకీ దొరికిపోతుంది.

ఒలికిన పాలనవ్వుల తీపి డాగులతో
చిటిపొటి  చేతులు దిద్దిన మార్మిక గుర్తులతో
ఎన్ని ఉతుకులకీ వదలని పసితనపు మరకలతో,
అల్లరితో, నలిగిపోయిన అలాద్దీన్ తివాచీ లాంటి
ఈ దుప్పటిని మార్చడమంటే

వాన చినుకులు ముద్దాడుతున్న సముద్రాన్ని 
చుట్ట చుట్టాలనుకోవడం
సీతాకోకలు నిద్రించే పూలమొక్కలనూపి
తోటను శుభ్రం చేయాలనుకోవడం
నిదురలోకి జారుకున్న పసివాడి చేతిలోంచీ
బొమ్మను తీసి పక్కన పెట్టడం!

ఎన్ని నవ్వులు, ఎన్ని సందళ్ళు
ఎన్ని కథలు రాశులు రాశులుగా
నా దోసిట్లో పడతాయీ దుప్పటి దులిపితే!
ఈ కత్తిరించిన కాగితాలు, రంగులారని పూలరెక్కలూ
గాల్లోకి లేస్తుంటే, ఎంత నక్షత్రధూళి!
గదిలో ఎన్ని మిణుగురుల కాంతి!

రేపో మాపో కాలం నిర్దాక్షిణ్యంగా ఊడ్చుకుపోయే
నా పసివాడి బాల్యాన్ని జాగ్రత్తగా పక్కకు సర్ది

జాలరివాడు వలను సిద్ధం చేసుకునట్టు
పూటా ఓ లేత రంగుల దుప్పటి పరుస్తాను.
ఒంగుళ్ళూ దూకుళ్ళలో అలసిన నా కుందేలు పిల్ల
కలలను కావలించుకు బజ్జుంటే చూడాలనుకుంటాను
గడియారపు ముల్లులాగా మంచం మొత్తం తిరిగి
ఏ మధ్యరాత్రిలోనో తన సన్నటి చేతులతో 
వాడు నా మెడను చుట్టుకుంటాడా- 

ఇక నేను పన్నిన వలలో 
నేనే చిక్కుకున్నందుకు నవ్వుకుని
నా దుప్పట్లోకి వాణ్ణి వెచ్చగా పొదువుకుంటాను.

కొసరు

 

-----

గాఢనీలిమలోకి తిరిగే ముందు

ఆకాశం పరిచే పసిడి వెలుగు


ఆదరాబాదరా ఉదయాలకు వీడ్కోలుగా

బస్ ఎక్కే పసివాడి తేనెపెదాల ముద్దు 


రెండు ఆఫీస్ కాల్‌ల మధ్య

వెచ్చగా చేతుల్లో ఒదిగే కాఫీ 


రెప్ప పడని పనిలో

కళ్ళపై చల్లగా తగిలే వేళ్ళూ


ఉరుకులుగా సాగే జీవితంలో నుండి

ఇష్టంగా కొసరుకునే క్షణాలకెంత అందం...


ఎన్నో చప్పుళ్ళ మధ్య

అనూహ్యంగా కొంత మౌనం 


ఎంతో మౌనంలో నుండీ

దయగా ఓ పిలుపూ


మూయబోయిన కిటికిలో నుండి

మెల్లగా జారే వెన్నెల 


నిదురపాకే కన్నులపైన 

కలగా పరుచుకునే కవిత్వం


ఉరుకులుగా సాగే జీవితంలో నుండి

కొసరుగా వచ్చిపడే క్షణాలకెంత అందం...


గుప్పెడు మల్లెలతో పాటు

రెండు మరువపు రెబ్బలు


వేల ఆలోచనల నడుమ

హాయిగా తడిమే ఓ ఊహ 


మరువని జ్ఞాపకాల తీవెల్లో

గుచ్చుకునే ఓ పాట


ఈ రోజుకీ రేపటికీ మధ్య

వెచ్చగా ఓ తోడు.


అయాచితమైతే బానే ఉంటుంది కానీ

అడిగితే కూడా దోషం లేదు


వ్యాపారానికి వెనుకాడని ఈ లోకంలో

జీవితాన్ని పుణికి కొసరడగడం తప్పేమీ కాదు.


కానుక

 స్పెషల్ రింగ్ టోన్ లేదు

ఊహించినదీ కాదు

గచ్చు మీద దొర్లే ముత్యాల్లా

ఫోన్ స్క్రీన్ మీద కదులుతూ

నీ పేరు...


*

" ఏం బహుమతి కావాలి?"

ఇంకానా!

కోర్కెలు రద్దయ్యే క్షణాల్లో

మాట మాటా ఓ దీవెన.

ఆవరించుకునే మౌనంలోండే

ఆత్మీయ సంభాషణ.


*


కోయిల పిలుపు.

గొంతు కలిపానంతే.

వసంతం నాదయ్యింది.


ఆకాశపు వెలుగు.

చేతులు చాపానంతే.

అదృష్టం జడివానైంది.


"ఏం కావాలి?"

ఏమీ తోచందే!

నమ్మలేని నిజం మధ్యలో

తలుపు తట్టి వచ్చాడు-

రూమి. 


వేడుక

 సెలవురోజు మధ్యాహ్నపు సోమరితనంతో

ఏ ఊసుల్లోనో చిక్కుపడి నిద్రపోయి

కలలోని నవ్వుతో కలలాంటి జీవితంలోకి

నీతో కలిసి మేల్కోవడమే,

నాకు తెలిసిన వేడుక.


నీరెండ ఉదయాల్లో అద్దంలోకి వొంగి

ఇప్పుడిప్పుడే రంగు మారుతున్న గడ్డాన్ని

నువ్వు తడుముకున్నప్పుడల్లా

ఆ గరుకుచెంపలని తొలిసారి తాకిన

లేప్రాయపు తడబాటు క్షణమొకటి,

మెరుపై నన్ను చుట్టుముడుతుంది.

పట్టరాని నా ఇష్టం ముందు  

నీ వయసు కట్టుబానిసై మోకరిల్లుతుంది.  


వెలిసిపోని జ్ఞాపకమైనందుకు

పారేయలేని నీ పాతచొక్కాలా

ఉరికే యవ్వనంలో నువ్వు ముద్దరలేసిన

ఎన్ని నిన్నలో

ఫ్రిడ్జ్ మాగ్నెట్ మీద కుదురుకున్న 

నీ అయస్కాంతపు నవ్వుల్లా లాగుతూనే ఉంటాయి.


ప్రణయఝంఝ రేపిన మోహసంచలనాలు సర్దుమణిగాక,

అలవాటైన ఉనికి ఇచ్చే స్తిమితానివై నను కమ్ముకుంటావు.

ఉత్తిమాటనై నిను కప్పుకోబోతే

పెదాల మీద సీతాకోకరెక్కల్లా వాలి చెదిరిపోయే ముద్దువవుతావు.

తప్పని ఈ లోకపు వత్తిళ్ళ నుండి తప్పించుకుని వచ్చి

నే కావలించుకునే విరామ క్షణాల సమస్తమా...


నా కన్నా ముందే అలారం మీదకి  చేరే నీ చేయీ

నా డెస్క్ మీద నువు నింపి  ఉంచే నీళ్ళ సీసా

బాల్కనీలో విచ్చిన పిచ్చి పూవు  

ఆఖరికి

మీరా షాంపూ వాసన కూడా

ప్రేమఋతువులోకి నెట్టే ఇంట్లో,  


ఇన్నేళ్ళ తర్వాత ఈ రోజుకి కూడా ...

కలలోని నవ్వుతో కల లాంటి జీవితంలోకి

నీతో కలిసి మేల్కోవడమే

నాకు తెలిసిన వేడుక.


కవిని కలిసినరోజు

నారింజ రంగులు మీద వాలే సంజ వేళల్లోనో

ఏటవాలు కొండల మధ్య జలపాతపు తుంపర్లు పడే తావుల్లోనో

నీటి అద్దం మెరిసే ఏ నిశ్శబ్ద సాగరతీరాల్లోనో నిర్మల ఉదయాల్లోనో

నీలాకాశం వైపు చూపు సారిస్తే కంటికేదీ అడ్డుపడని విశాలమైదానాల్లోనో

కవీ... నిన్ను కలుస్తాననుకున్నాను.


మిగతాలోకం మీద చేతి రుమాలు వేసి

సీతాకోకను చేసి ఎటో విసిరేయగల ఓ మాయాజాలికుణ్ణి

గంటల్ని నిమిషాలుగా మార్చగల ఓ మంత్రదండాన్ని

నిన్నెంతో ప్రేమిస్తానని చెప్పడానికి నాలుగు పూవుల్ని

నా వెంటపెట్టుకుని నిన్ను కలవాలనుకున్నాను.


నా నిర్వ్యాపక సమయాలని నీ అక్షరమొక సూది మొనై పొడుస్తుందనీ 

నీ స్వరం - దిగులు గూడు నుండి నస పిట్టలని చెదరగొట్టి ఊరడిస్తుందనీ 

నా ఎలప్రాయాన్ని నీ కవిత్వమే నిర్వికల్ప సంగీతమై ఆవరించుకున్నదనీ 

మలినపడని ఉద్వేగమేదో నీ పేరు వినపడితే చాలు- నాలో చివాలున లేస్తుందనీ 

నీకు చెప్పాలనుకున్నాను.


కవీ..!!

చివరికి  నిన్ను శబ్దాల మధ్యా సమూహాల మధ్యా కలుసుకున్నాను.

అక్షరం వినా వేరేదీ లేని ఉత్తచేతులతో కలుసుకున్నాను.

మనిద్దరి మధ్య అదృశ్య కాంతిలా నిలబడ్డ మౌనంతో...

ఈ సాఫల్యక్షణాలను దోసిట్లో పోసిన జీవితానికి వినమ్రంగా ప్రణమిల్లాను.


TGIF

పొగమంచు వాకిట్లో

సౌందర్యప్రతిమలా

మట్టిప్రమిద


గుమ్మం పక్క వైరుబుట్టలో

పాలపేకట్లు.

ఇంకా విప్పని న్యూస్‌పేపర్ ముడి

11 నవంబరు, 2022.

శుక్రవారం.

ఈవాల్టి ఉత్సాహానికి

ఇవాళన్నదే కారణమవడం- ఆహా!


ఆకాశం నుండి బాల్కనీలోకి

బంగారు కాంతుల వంతెన 

ఎర్ర మట్టి కుండీలో

లేతగా మెరుస్తూ మెంతాకులు.

పచ్చిపాలపొంగు వాసనల మధ్య

టేబుల్ మీద మూడు కప్పులు, 

వాటి చుట్టూ వారాంతపు సరదాలు

వారాంతానికే వాయిదా పడే పనులు


అనుభవిస్తేనే అర్థమయ్యే

మెత్తని నూలుబట్టల సౌకర్యంలో 

కాల్స్, కాన్సిల్డ్ మీటింగ్స్ మధ్య

చూస్తూ చూస్తూండగానే 3 PM రిమైండర్. 

స్పోర్ట్స్ క్లాస్ దుమ్మునీ

సంబరాలనీ దులుపుకుంటూ

స్కూల్ బస్. బుజ్జాయి హాయి నవ్వూ. 


Comeon comeon turn the radio on..

వీధవతలి పార్టీ మ్యూజిక్‌ని

లీలగా మోసుకొచ్చే సాయంకాలపు చలిగాలి

మునిచీకట్లను కోస్తూ

వీధిదీపాల పసుపు వెలుతురు

విద్యుద్దీపతోరణాల నడుమ

కుదురుగా ఓ కార్తీకదీపం

కాంతులన్నిటినీ లయం చేసుకుంటూ  

తదియ వెన్నెల రేయి


దోసగింజ బొట్టుబిళ్ళ

వంగపూల తెల్లదుప్పటి

పరుచుకునే జీవనానందం

నా ఈ తీరిక సమయాల్లో నుండి..


Thank God It's Friday!!   

పరవశ

 


మహానదులనూ లోయలనూ
మత్తుగా నిదరోతున్న అరణ్యాల హొయలునూ
సరోవరాలనూ సంధ్యలనూ
చప్పుడు చెయ్యని సౌందర్యప్రవాహాలనూ
చకచకా పిక్సెల్స్‌లో కుదుర్చుకునే నీ కళ్ళలో
ఒంగి వెదుక్కుంటూ ఉంటాను
మనవైన క్షణాలకు నువ్వద్దే అందాల రహస్యాల కోసం.
 
వలుపుగాలులు వీయగానే చిగుర్లేసే జీవితం నుండి
ఒక్క రేకు తుంచితే వేయి స్టేటస్ అప్డేట్‌లు.
ఏంటి స్పెషల్ అని అడిగేవాళ్ళకు ఏం చూపెట్టను?
అలవాటైన స్పర్శలోని సౌఖ్యం లాంటి నిన్ను
ఎవరికీ ఏమీ కానివై రాలిపడే క్షణాలను
హృదయంలోకి ఒంపి పారిపోయే నిన్ను..
 
నా ఉదయపు హడావుడిని నింపాదిగా లాలించే నీ గొంతునీ
నీ ఒక్కో సంబరానికీ ఒక్కో తునకై రోజంతా వెలిగే నా పేరునీ
మాటలు నేర్చిన చూపై, బుగ్గలు కందే ముద్దై
ఆదమరపు క్షణాల్లో కౌగిట్లో ఇరుక్కునే నీ ప్రేమని,  
కాఫీ మగ్గుల పైని బద్ధకపు మరకై
మాసిన గడ్డమై ఇంట నీదైన వాసనై
క్షణక్షణం గుచ్చే ఉనికిని,      
ఏ టైంలైన్‌లో దాచుకుంటూ పోను?
 
సాలెగూడంటే భయం కాదు కానీ
సెర్చ్ ఇంజన్స్‌కి దొరకని ప్రేమంటే మోజు.
ఎన్ని మెమరీ కార్డ్‌లు ముడేస్తే ఒక్క మనసు-
అంతా నీదే పిల్లా అని నువ్వంటుంటే
నా బ్రతుకంతా చిందే సందడి మీద మోజు.

ఆనవాలు

 ప్రేమసందేశాన్ని దాచి

సముద్రంలోకి విసిరిన గాజుసీసా
మళ్ళీ విసిరినవాడి పాదాలకే తగిలినట్టు
వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఊరెళితే,
లోపల చిత్రమైన కుదుపు

ఉంగరం చూపెట్టి జ్ఞాపకాలను మేల్కొల్పిన ప్రేయసిలా
అనాది నేస్తం లాంటి ఆకాశం
చందమామను వొంపి
ఈ పిట్టగోడల మధ్య పుట్టిన
ఎలప్రాయపు పాటల్ని గుర్తుచేస్తోంది.

కొబ్బరి ఈనెల మధ్య కదలే నీడల్లాంటి పురాస్మృతుల్లా
ఈ ఇల్లు, ఈ వాసనలు, నా బాల్యం, ఇంకా, యవ్వనం.

మాటుమణిగిన రేయిలో మునకలేస్తోంది జాబిలి.

మునిచీకటి వేళల్లో రహస్యంగా మెరిసి
నడిరేయి సౌందర్యానుభవాన్ని మాటిచ్చిన నక్షత్రమేదో
అదను చూసి తలుపు తెరిచినట్టు -పైనంతా
వెలుతురు పొట్లాలు చిట్లి చెల్లాచెదురైన కాంతి
దిగంతాల్లో నుండి జలజలా రాలుతోన్న స్వర్ణధూళి

“తూ సఫర్ మేరా..తూ హీ హై మేరీ మంజిల్”
హృదయాన్ని పాటగా పెదాల దాకా లాగి
ప్రాణం పెనుగులాడుతోంటే జీరగా కునికే ఆ గొంతు-
గాలి అలల్లో తేలి కాంక్షాతప్త హృదయాన్ని
కారుణ్యపుచందనప్పూతలా ఊర్కోబెడుతోంది.

రజనీడోలలో నిశ్చింతానుభవమై ఊగుతోన్న కాలం
కలతో పాటుగా మెల్లిగా కరుగుతోంది.

మేల్కొన్న రెప్పల నంటి – ప్రత్యూషహేమరాశి
గుండెల మీద, అయాచితంగా రాలిపడ్డ
పసుపుపూల సౌందర్యరాశి.

అమృతానుభవానికి ఆనవాళ్ళను వెదుక్కుంటూ
ఈ ఉదయం.

*

ఆహ్లాదజనని

 ఆరేళ్ళ క్రితం ఇదే రోజు మధ్యాహ్నం ..కేర్ర్ మంటూ తన్నుకొచ్చాడు ఈ లోకంలోకి..నా లోకంలోకి. ప్రహ్లాద్ అన్న పేరు పెట్టినందుకేనేమో..పోయినేడు పెద్ద ప్రమాదంలో నుండి ఆ నారసింహుడే చేతులతో ఎత్తి పట్టుకున్నట్టు ఏ గట్టి దెబ్బా తగలకుండా పూవులా లేచి నన్ను కరుచుకున్నాడు. ప్రాణం గిలగిల కొట్టుకుని కుదుటపడ్డ చేదుక్షణాలవి. మన అమ్మలూ నాన్నలూ ఈ వయసులో మనని ఎలా పెంచారో అనుకున్నప్పుడు ఏమీ గుర్తు రాదు. ఆలోచిస్తే మాత్రం ఇప్పుడు మనసంతా కృతజ్ఞత తప్ప వేరే భావం రాదు నాకు. 

నా చంటిగుడ్డు అల్లర్ల గురించీ, వాడు సాధించుకొచ్చిన చిట్టీపొట్టీ విజయాల గురించీ, వాడు నేర్చిన కొత్త మాటలో, కొత్త వేషాలో నా మాటల్లో దొర్లినప్పుడల్లా, "అదీ అమ్మంటే. అదీ అమ్మంటే" అంటూ విస్మయంగా అనేవారు మిత్రులొకరు. మా అన్నయ్య కూడా ఇంతేనట, నాకు ఏడాదిన్నర వయసున్నప్పుడు నన్నొక్క ఐదు నిమిషాలు విడిచి బాత్‌రూంకి కూడా వెళ్ళలేకపోయేదట...అని వాళ్ళ అమ్మ కబుర్లలో తమకు గుర్తే లేని బాల్యాన్ని పునశ్చరణ చేసుకునేవారతను.

ప్రహ్లాద్ గురించి ఏం చెప్పినా నా గొంతులో దాగని సంబరాన్ని గుర్తు పడుతూ, అతనే అన్నారొకసారి "ఆహ్లాదజననీ" అని.  ఆ మాటలా మనసులో ముద్రించుకుపోయింది. అటుపైన ఆ పిలుపే అలవాటుగానూ మారింది.

ఈ  కవిత ఎప్పుడో రాసినా, ఈ వారమే సహరిలో ప్రచురింపబడటం,  నా చేత ఈ నాలుగు మాటలూ రాయించేందుకే కాబోలు. ఈ జీవితానికి దక్కిన అతి పెద్ద కాన్క కు..ప్రేమతో...అమ్మ.. 💓


ఆహ్లాదజనని  

ఇన్ని వ్యాకులతల మధ్య
ఒక్క మెచ్చుకోలు చూపై, వాడు
నా బ్రతుకు పుస్తకానికి చివురు రంగులద్దుతాడు.  

ఇన్ని వేసటల ఘడియలను
ఒక్క ముద్దు మందై తడిమి
మళ్ళీ నా రేపటికి కొత్త ఊపిర్లూదుతాడు.

పశ్చాత్తాపాలై కాల్చే పట్టరానికోపాలకు
నిద్రపోయే ముందు కావలింతల కారుణ్యమై
విముక్తగీతాలు ఆలపిస్తాడు.  

విచ్చుకత్తుల్లాంటి విషపుటాలోచనల్నుండి
అమ్మా..! అన్న పిలుపై లాగి
ఆనందోద్విగ్న పతాకలా ఎగరవేస్తాడు.

ఎన్ని ముద్దులు పెట్టినా తీరని ముచ్చటేదో,
మాటల్లో వాడికి చెప్పమంటుంది -

కన్నందుకు కాదురా, నువ్వు
నోరారా అన్నందుకే నేను అమ్మనయ్యానని.
నన్నానుకున్న నిశ్చింతానుభవమై నిద్రించావ్ కనుకే
విచ్చుకునే నీ కలలపూలతోటకు రెప్పవేయని మాలినయ్యానని.  

నేను వదిలేసుకున్న మనుషులు, వద్దనుకున్న పనులు,
మిగుల్చుకోలేని సమయాల కన్నా,  నా చిట్టికన్నా
ఊడిన నీ పంటి సందుల్లో నుండి,
కేరింత నవ్వుల్లో తుళ్ళే తుంపర చూడట్టాన్నే  
నేనెక్కువ ప్రేమిస్తానని.
నిత్యతృప్తలా నిలబడటానికి
నీ ఉనికొక్కటే నాకు సరిపోతుందని.

ఇన్ని వ్యాకులతల మధ్య
ఒక్క మెచ్చుకోలు చూపై, వాడు
నా బ్రతుకు పుస్తకానికి చివురు రంగులద్దుతాడు.  

ఇన్ని వేసటల ఘడియలను
ఒక్క ముద్దు మందై తడిమి
మళ్ళీ నా రేపటికి కొత్త ఊపిర్లూదుతాడు.

పశ్చాత్తాపాలై కాల్చే పట్టరానికోపాలకు
నిద్రపోయే ముందు కావలింతల కారుణ్యమై
విముక్తగీతాలు ఆలపిస్తాడు.  

విచ్చుకత్తుల్లాంటి విషపుటాలోచనల్నుండి
అమ్మా..! అన్న పిలుపై లాగి
ఆనందోద్విగ్న పతాకలా ఎగరవేస్తాడు.

ఎన్ని ముద్దులు పెట్టినా తీరని ముచ్చటేదో,
మాటల్లో వాడికి చెప్పమంటుంది -

కన్నందుకు కాదురా, నువ్వు
నోరారా అన్నందుకే నేను అమ్మనయ్యానని.
నన్నానుకున్న నిశ్చింతానుభవమై నిద్రించావ్ కనుకే
విచ్చుకునే నీ కలలపూలతోటకు రెప్పవేయని మాలినయ్యానని.  

నేను వదిలేసుకున్న మనుషులు, వద్దనుకున్న పనులు,
మిగుల్చుకోలేని సమయాల కన్నా,  నా చిట్టికన్నా
ఊడిన నీ పంటి సందుల్లో నుండి,
కేరింత నవ్వుల్లో తుళ్ళే తుంపర చూడట్టాన్నే  
నేనెక్కువ ప్రేమిస్తానని.
నిత్యతృప్తలా నిలబడటానికి
నీ ఉనికొక్కటే నాకు సరిపోతుందని.

ప్లవ

ప్రేమించు మిత్రమా!

ప్రేమించు రేపటి నీ రోజుని. నీ ఉగాదిని.
నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు
నీ కలలనూ కోర్కెలనూ ప్రేమించుకున్నట్టు
ఇష్టంగా బలంగా నమ్మకంగా ప్రేమించు;
ఆహ్వానించు.

నమ్ము మిత్రమా!
నమ్ము రేపటి నీ రోజుని, నీదైన ఈ ఉగాదిని.
నీ వాకిలిని అయాచితంగా పూదోటగా మార్చే
పసుపుపూల చెట్టుని దిగాలు క్షణాల్లో నమ్మినట్టు
మునిచీకట్లలో కనపడని వెన్నెలదీపాన్ని నమ్మినట్టు
కోప్పడిన అమ్మ లాంటి కాలం, దైవం లాంటి కాలం
మళ్ళీ తానే దగ్గరకు లాక్కుంటుందనీ,
అన్నీ తానై నిన్ను లాలిస్తుందనీ, నమ్ము.

అన్నీ అక్కర్లేదు మిత్రమా, నీకైనా, నాకైనా
ఇరుక వంతెన మీద నడక లాంటిదీ జీవితం,
బరువులు మోసుకునే నడకలో మిగిలేదల్లా- అలసట.
సౌందర్యాన్ని వెదుక్కునే తీరిక లేని వేసట.  

సూర్యచంద్రులొస్తూ వస్తూ ఆకాశంలోని రంగులన్నీ చెరిపేసినట్టు  
సముద్రం ఎప్పటికప్పుడు తీరాన్ని తుడిచేసినట్టు
కలలో హత్తుకున్న అనుభవాన్ని మెలకువలో మర్చిపోయినట్టు
గాయపడ్డ క్షణాలని, దూరమైన బంధాలని
పూర్తి కాని ఆశలని, పూరించుకోలేని దూరాలని
గుండెల్లోని గుబులంత బరువుని
లోయలోకి ఈకని వదిలినట్టు వదిలి

కులాసాగా దాటుదామీ శార్వరీ వంతెన-
అదిగో ప్లవ - చేయందిస్తోంది.

నీ పలకరింపుతో మేల్కొన్న రోజు

 "బుల్లి లాంతర్.." పాటనో

మురాకామి మాటల మూటనో

ఇంకో కాలం నుండి ఇదే రోజుని

గూగుల్ ఫొటోస్ గుర్తుచేసిన జ్ఞాపకంగానో

ఉదయపు పలకరింపుకి వంకగా చూపించి

దూరాలకో తీపిగాటు పెడతావు.  


ఊబిలాంటి నా దైనందిన జీవితం

నీకు ఆత్మీయకరచాలనం చేసేలోపే

ఈడ్చుకుపోతుంది


వక్తాశ్రోతా నువ్వూనేనూ

ద్వంద్వాలను ద్వేషించే మనసు

నువు పంపిన సందేశాల మీదుగా

నిను దగ్గరకు లాక్కుంటుంది.

రోజంతా యథేచ్ఛగా మాట్లాడుకుంటుంది.  

పాటా మాటా జ్ఞాపకం -  

నెపమై మనని కలిపినదేదైనా

ఇద్దరి మధ్యా నలిగీనలిగీ

తనదైన ఉనికిని వదిలేసుకుంటుంది.  


దీపాలార్పి పడకింటిలోకి నడుస్తూ

చిరుకాంతి కోసం ఫోన్ తడుముకుంటున్నప్పుడు

నా స్పందన కోసం నువ్వక్కడే

ఓ ప్రశ్నార్థకమై ఎదురుచూస్తూ కనపడతావు

నా చీకటి క్షణాల్లోకి మళ్ళీ

బుల్లిలాంతరు వెలుగు తోసుకొస్తుంది.

మూతలు పడుతున్న రెప్పల వెనుక, నీతో

మరో సుదీర్ఘ సంభాషణ మొదలవుతుంది.  

                                                                                                        * తొలిప్రచురణ : ఆంధ్రజ్యోతి వివిధలో..


ఒక మెలకువలోకి

వర్క్ ఫ్రమ్ హోమ్
లర్న్ ఫ్రమ్ హోమ్
ఇంతింతైన భయానికి,
ఇల్లిల్లూ ఓ బందిఖానా.
మూసివేతలు, మళ్ళింపులూ
మలుపు కొత్తదైనప్పుడు -నెమ్మది
అవసరం, అనివార్యం.
ఇకపై ఉండేవారెవరో,
ఉన్నవాళ్ళని ఊరడించేదెవరో
ఊపిరాడని నిమిషాల కల్లోలం మరపురాక
బ్రతుకంతా తల్లడిల్లేదెవరో
ఇప్పుడైతే ఏం తెలీదు కానీ,
ఇదీ సమసిపోతుంది
అన్ని విపత్తుల్లాగే,
అన్ని యుద్ధాల్లాగే,
ఇదీ ముగిసిపోతుంది.
మూతబడిన స్వేచ్ఛాప్రపంచపు
తలుపులు, మళ్ళీ తెరుస్తాం.
వెలుతురుతో, లోకంతో,
కరచాలనాలు చేస్తాం.
కానీ ఈ ఆపత్సమయాల్లో
దయగా తాకిన పదాలు నేర్పినదేదో
బ్రతుకంతా గుర్తుంచుకోగలమా
అపరిచితుల స్వస్థత కోసం మోకరిల్లి
ఇలా ఇంకెప్పుడైనా ప్రార్ధించగలమా
చూసిన ప్రతి ఉదయానికీ,
చెరగా మారని ప్రతి రాతిరికీ
ఇలాగే కృతజ్ఞులమై ఉండగలమా,
దేహాన్ని హృదయం చేసి
సాటి మనిషి పిలుపునిలా వినగలమా
జాగురూకతతో శుభ్రతతో,
దేశాన్ని మనస్సుని మననివ్వగలమా
సమస్త మానవాళీ ఒకే కాంక్షతో
క్షణాలను దొర్లించడం ఊహించగలమా
నీ నుండి నాకింకా చాలా చాలా కావాలని
జీవితాన్నిలా జాలిగా ప్రాథేయపడగలమా
ముద్దాడకుండా, మాట్లాడకుండా
ప్రేమిస్తున్నామని ఎవరికైనా చెప్పగలమా
మిథ్యాప్రపంచపు రెక్కలు మూసి,
సొంత గూటిలోకి వాలిపొమ్మంటే
అనవసరపు ప్రయాణాలు మాని
ఉన్నచోటే ఉండిపొమ్మంటే,
ఉండగలమా
అన్ని తలుపులూ మూసి
నిండునిజంతోటి
రెపరెపలాడే హృదయం తోటి.
ఇలా, ఇంకెప్పుడైనా..?


* Published in Andhrajyothi, Vividha. 23-Mar-2020

వ్యాపకం

పరాయిపరాయిగానే ఉంటాం
ఒకే క్షేత్రంలో వేసిన విత్తులు కూడా
వేటికవే మొలకెత్తి పెరుగుతున్నట్టు
విడివిడిగా ఉంటాం,
పోలిక లేని బ్రతుకుల్లో
పోలిక వెదుక్కునే తీరిక లేని పరుగుల్లో
ఎటు నుండో ఓ గాలి వీస్తుంది
నీకూ నాకూ తెలిసిన పరిమళమేదో మోసుకుంటూ,
నీకూ నాకూ అర్థమయ్యే మాటలన్నీ మోసుకొస్తూ
ఊపిరాడుతుంది
తెరిపిగా ఉంటుంది
దారులు కలవ్వు కానీ
దగ్గరితనం తెలుస్తుంది
ముందడుగు ఎవరిదో
హద్దులేదిక్కు నుండి చెదురుతున్నాయో
ఎవరు చూడొచ్చారు ?
విచ్చుకోవడం విస్తరించడం
వ్యాపకాలయ్యాక...

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...