TGIF

పొగమంచు వాకిట్లో

సౌందర్యప్రతిమలా

మట్టిప్రమిద


గుమ్మం పక్క వైరుబుట్టలో

పాలపేకట్లు.

ఇంకా విప్పని న్యూస్‌పేపర్ ముడి

11 నవంబరు, 2022.

శుక్రవారం.

ఈవాల్టి ఉత్సాహానికి

ఇవాళన్నదే కారణమవడం- ఆహా!


ఆకాశం నుండి బాల్కనీలోకి

బంగారు కాంతుల వంతెన 

ఎర్ర మట్టి కుండీలో

లేతగా మెరుస్తూ మెంతాకులు.

పచ్చిపాలపొంగు వాసనల మధ్య

టేబుల్ మీద మూడు కప్పులు, 

వాటి చుట్టూ వారాంతపు సరదాలు

వారాంతానికే వాయిదా పడే పనులు


అనుభవిస్తేనే అర్థమయ్యే

మెత్తని నూలుబట్టల సౌకర్యంలో 

కాల్స్, కాన్సిల్డ్ మీటింగ్స్ మధ్య

చూస్తూ చూస్తూండగానే 3 PM రిమైండర్. 

స్పోర్ట్స్ క్లాస్ దుమ్మునీ

సంబరాలనీ దులుపుకుంటూ

స్కూల్ బస్. బుజ్జాయి హాయి నవ్వూ. 


Comeon comeon turn the radio on..

వీధవతలి పార్టీ మ్యూజిక్‌ని

లీలగా మోసుకొచ్చే సాయంకాలపు చలిగాలి

మునిచీకట్లను కోస్తూ

వీధిదీపాల పసుపు వెలుతురు

విద్యుద్దీపతోరణాల నడుమ

కుదురుగా ఓ కార్తీకదీపం

కాంతులన్నిటినీ లయం చేసుకుంటూ  

తదియ వెన్నెల రేయి


దోసగింజ బొట్టుబిళ్ళ

వంగపూల తెల్లదుప్పటి

పరుచుకునే జీవనానందం

నా ఈ తీరిక సమయాల్లో నుండి..


Thank God It's Friday!!   

No comments:

Post a Comment

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....