Posts

Showing posts from September, 2014

మానసచోరుడు

ధారాళంగా గాలి వీస్తున్నా ఆ మందిరంలో ఎవ్వరికీ ఊపిరాడటం లేదు. అందరి చూపూ ఒకే యువతి మీద. నిన్న లేని అందమేదో ఆమెలో అకస్మాత్తుగా కనపడి స్థాణువులుగా మార్చింది వారందరినీ. ఆ ఒంపుసొంపులూ వయ్యారాలూ సరే, రాజ్యమంతా జల్లెడ పడితే చూపు తిప్పుకోనివ్వని అందగత్తెలకేమంత కొదువ లేదు. వాళ్ళని ఆకర్షిస్తున్నది ఆ మచ్చెకంటి కన్నుల్లోని మెరుపు. ఆమె పగడపు పెదవులపైని సిరినవ్వు. ఈ అదనపు ఆభరణాల విలువేమిటో తెలిసినదానిలా అతిశయంగా కూర్చుని ఉందామె. ప్రియసఖులందరి మధ్యా ఉన్నదన్నమాటే కానీ, ఉండుండీ ఆ నగుమోములో మెరుస్తోన్న నవ్వొకటి ఆమె మనసక్కడ లేదనీ, మరెక్కడో చిక్కుకుని ఊగిసలాడుతోంటే, ఈమె తీయని అవస్థేదో ఇష్టంగా అనుభవిస్తోందని చెప్పకనే చెబుతోంది.
"ఇంతకీ ఎవరతను?" కుతూహలాన్ని అణచుకోలేని ఓ చెలి ప్రశ్నించింది.
ఆ ప్రశ్న వినపడ్డ వైపు ఇష్టంగా చూసిందామె. అటు తిరిగి సర్దుకు కూర్చుంది. కాలిమువ్వలు ఘల్లుమన్నాయి. మెడలోని హారాలు, చేతి గాజులు సన్నగా సవ్వడి చేసి ఆమె చెప్పబోయే సంగతులకు శ్రుతి సిద్ధం చేశాయి. 
"ఏ రాజ్యమో తెలిసిందా" "దేవలోకమే అయి ఉంటుంది కదూ" "జగదేకవీరుడట? మచ్చలేని చందమామట?"
జలజలా రాలుత…

శివం సుందరం - గోకర్ణం

Image
శ్రావణమాసం!

గోకర్ణం అని బస్ వాడు పిలిచిన పిలుపుకు ఉలిక్కిపడి లేచి క్రిందకు  దిగగానే పన్నీటి చిలకరింపుల ఆహ్వానంలా కురిశాయి తొలకరి జల్లులు. ‘చంద్రుణ్ణి చూపించే వేలు’లా, మట్టి రోడ్డు ఊరిలోకి దారిని చూపిస్తోంది. మనసును పట్టిలాగే మట్టి పరిమళం వెంటే వస్తోంది. పచ్చటి పల్లెటూరు గోకర్ణం. భుజాల మీదకు బ్యాగులు లాక్కుంటూ మేం వెళ్ళవలసిన హోటల్‌కు నడక మొదలెట్టాము. ఆదిలోనే హంసపాదు. ముందురోజు గోకర్ణం వచ్చాకే రూం తీసుకోవచ్చునన్న హోటల్ వాళ్ళు, తీరా వెళ్ళాక, రూములేవీ ఖాళీల్లేవన్నారు. చేసేదేమీ లేక, ఒక హోం స్టేలో  అద్దెకు దిగాం. 

ఇక్కడ ఇళ్ళన్నింటికీ చిత్రంగా రెండేసి తలుపులు. ఒకటి గుమ్మం బయట మోకాళ్ళ వరకూ. రెండవది మామూలుగా- గుమ్మానికి లోపలివైపు. దాదాపు పగలంతా, ఎవరూ లోపలి తలుపు వేసుకున్నట్టే కనపడలేదు. బహుశా, దొంగల భయం ఉండి ఉండదు. రూం ఏమంత సంతృప్తికరంగా లేకపోయినా త్వరత్వరగా స్నానాలవీ ముగించి మహాబలేశ్వరుడి గుడికి బయలుదేరాం. చిన్న ఊరే కావడంతో అన్నీ నడచి వెళ్ళగల్గిన దూరాలే. గుడికి నాలుగడుగుల ముందు, రవికల్లేకుండా, కుడిపవిటతో, నడినెత్తిన కొప్పులతో ఉన్న కొందరు యువతులు మమ్మల్ని అటకాయించి, అధికారంగా చేతుల్లో తామరాకు పొట…

ఇలాక్కూడా

ఒక్కోసారి ఒంటరిగా ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఎవరూ లేని బోగీలో, రగ్గుల్లో ముడుచుక్కూర్చుని, ఒక్కరమే, రాత్రంతా గడపాల్సి రావచ్చు.
చవితి చంద్రుణ్ణి చూస్తూ, నక్షత్రాలు లెక్కపెడుతూ, నీడల్లా వెనక్కు మళ్ళుతోన్న చెట్లను చూస్తూ, గంటలు కరిగించుకున్నా,

అంత తేలిగ్గా తెల్లవారకపోవచ్చు.

హాండ్బాగును సీటు క్రిందకు నిర్లక్ష్యంగా తోసి, వెంట తెచ్చుకున్న కవిత్వాన్ని మాత్రం గుండెలకు పొదువుకుని, నిన్ను నీకు దూరం చేసిన ఆ ఒకే ఒక్క కవితను- లేదా నిన్ను నీకు కొత్తగా పరిచయం చేసిన ఆ ఒకే ఒక్క కవితను విప్పారిన కళ్ళతో మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ నిండుగా కప్పుకుంటూ..నువ్ నిద్రలోకి జారుకోవచ్చు.

తెల్లవారాక, నువ్వు కాఫీ కప్పు పట్టుకుని పేజీలు తిరగేసే వేళకి, పైబెర్తు నుండి క్రిందకు దిగిన మనిషి, "కవిత్వం ఇష్టమా తల్లీ?" అని చిరునవ్వుతో కబుర్లు మొదలెట్టినప్పుడు..మొదట ఒకింత ఆశ్చర్యంతోనూ, అటుపైన పట్టిచ్చిన పుస్తకం గుర్తొచ్చి ఒకింత సంతోషంగానూ, ఇంకాస్త హుషారుతోనూ,

నచ్చిన కవిత్వం గురించీ, నచ్చే కవుల గురించి, ఎప్పటిలాగే నువ్వు కబుర్లు చెప్పవచ్చు.

ఊ కొట్టాల్సిన మనిషి అకస్మాత్తుగా మాయమై, మాయమైనంత వేగంగానూ తిరిగి ప్రత్యక్షమై..."నచ్…