అమాత్ర

 నది మీది పొగమంచుని 

అంచులు పట్టి లేపినట్టు ఉంటుంది
అచ్చంగిల్లాలు ఆట రాకుండా
గాల్లోకి ఎగరేసినట్టు ఉంటుంది.  

ఏడేళ్ళ నా పిల్లాడి గదిలో
దుప్పటి మార్చబోయిన ప్రతిసారీ

చీకటి వేళకి చెరువు నీళ్ళ మీద
వెన్నెల ముద్దలా తేలే చందమామ గుర్తొస్తుంది 
దిండు గలీబుని రంగురాళ్ళ రహస్యస్థావరం చేసి
అమ్మ నుండి దాచబోయిన దొంగ ఆచూకీ దొరికిపోతుంది.

ఒలికిన పాలనవ్వుల తీపి డాగులతో
చిటిపొటి  చేతులు దిద్దిన మార్మిక గుర్తులతో
ఎన్ని ఉతుకులకీ వదలని పసితనపు మరకలతో,
అల్లరితో, నలిగిపోయిన అలాద్దీన్ తివాచీ లాంటి
ఈ దుప్పటిని మార్చడమంటే

వాన చినుకులు ముద్దాడుతున్న సముద్రాన్ని 
చుట్ట చుట్టాలనుకోవడం
సీతాకోకలు నిద్రించే పూలమొక్కలనూపి
తోటను శుభ్రం చేయాలనుకోవడం
నిదురలోకి జారుకున్న పసివాడి చేతిలోంచీ
బొమ్మను తీసి పక్కన పెట్టడం!

ఎన్ని నవ్వులు, ఎన్ని సందళ్ళు
ఎన్ని కథలు రాశులు రాశులుగా
నా దోసిట్లో పడతాయీ దుప్పటి దులిపితే!
ఈ కత్తిరించిన కాగితాలు, రంగులారని పూలరెక్కలూ
గాల్లోకి లేస్తుంటే, ఎంత నక్షత్రధూళి!
గదిలో ఎన్ని మిణుగురుల కాంతి!

రేపో మాపో కాలం నిర్దాక్షిణ్యంగా ఊడ్చుకుపోయే
నా పసివాడి బాల్యాన్ని జాగ్రత్తగా పక్కకు సర్ది

జాలరివాడు వలను సిద్ధం చేసుకునట్టు
పూటా ఓ లేత రంగుల దుప్పటి పరుస్తాను.
ఒంగుళ్ళూ దూకుళ్ళలో అలసిన నా కుందేలు పిల్ల
కలలను కావలించుకు బజ్జుంటే చూడాలనుకుంటాను
గడియారపు ముల్లులాగా మంచం మొత్తం తిరిగి
ఏ మధ్యరాత్రిలోనో తన సన్నటి చేతులతో 
వాడు నా మెడను చుట్టుకుంటాడా- 

ఇక నేను పన్నిన వలలో 
నేనే చిక్కుకున్నందుకు నవ్వుకుని
నా దుప్పట్లోకి వాణ్ణి వెచ్చగా పొదువుకుంటాను.

No comments:

Post a Comment

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....