ఇంటి వైపు

 ఎయిర్ పోర్ట్ బస్. ఎదురూబొదురూ సీట్లు.

అమ్మా నాన్నా ఒకవైపు. అమ్మ నిద్రలో. నాన్న కాల్ లో.
పది పదకొండేళ్ల పిల్లాడు, నావైపు. నా పక్కన.
వేళ మించిదేమో, మగత నిద్రలో. సోలిపోతో...
"..సీదా బైఠో...సీదా బైఠో.." ఉండీఉండీ పిల్లాడి పాదాలు తడుతూ అమ్మానాన్నలు గుర్తు చేస్తూనే ఉన్నారు.
బస్ మలుపు తిరుగుతుంటే మొత్తంగా తల వాల్చేసాడు. జారిపోతాడని చెంపల మీద చెయ్యి పెట్టి ఆపాను. నిద్రలోంచీ లేచి చూసుకుని ఈసారి నిశ్చింతగా వాలిపోయాడు.
అమ్మా నాన్నలు పిల్లాడి పాదాలు తట్టడం ఆపేశారు. బస్ తలుపులు తెరుచుకుంటూ మూసుకుంటూ ఉన్నాయి. స్ట్రీట్ లైట్ల వెలుతురో హోర్డింగ్ ల వెలుతురో ఉండీ ఉండీ కళ్ళ మీద పడుతోంది.
నా పిల్లాడూ నిద్రపోయే ఉంటాడు. ఇల్లు చేరడానికి ఇంకో అరగంట.
పున్నమి నిండుతనం తగ్గని చందమామ వెంబడిస్తూ వస్తున్నాడు. భుజం మీద పసి వాడి తల, నిద్ర బరువుతో, భారంగా, అలాగే.
All reactions:
Vadrevu Ch Veerabhadrudu, Nanda Kishore and 95 others

No comments:

Post a Comment

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....