ఫ్రెంచ్ ఫ్రైస్

 ఏళ్ళు గడిచే కొద్దీ అన్నీ మారిపోయినట్టు ఉంటాయ్ కానీ మారిన వాటిల్లో కూడా పాత పేటర్న్స్ కనపడినప్పుడు ఒక చిత్రమైన ఫీలింగ్. వేసవి సెలవల్లోనూ, బడులయ్యాక సాయంకాలాల్లోనూ, పిల్లలని చూస్తే అలాంటివే ఏవో గుర్తొస్తూ ఉంటాయ్. ఆటల వేళ అయితే ఎంతటి మండుటెండలైనా పట్టని అదే పిచ్చితనం. అకాలపు వానల్లో ఆటలొద్దు పడతార్రా అని అరిచి గీపెట్టినా వినకుండా వాన నీళ్ళు నిలిచిన కారిడార్ లో పరుగులుగా ఆడటంలో అదే మొండితనం. ఊరెళ్ళి వస్తూనే చెప్పులైనా విప్పకుండా పక్క ఫ్లాట్ స్నేహితులను కలుసుకోవాలని అదే పాత ఆరాటం. కొత్తగా కొనుక్కున్న ఆట వస్తువులో కొత్తగా నేర్చుకున్న విద్యలో, ఎవరైనా వీడికి ఇచ్చిన బహుమతులో మిత్రులతో చకచకా పంచుకోవాలన్న ఉత్సాహంలో, అదే అనాది స్నేహపరిమళం. కంది తోటల్లో కిష్ట నీళ్ళలో మమ్మల్ని తిప్పి ఆడించలేకపోయినందుకు మా నాన్నగారు అప్పుడప్పుడూ దిగులుపడేవారు. మాకు పట్టేది కాదు. ఇప్పుడు వీడూ ఆరుబయట ఇంకాస్త స్వేచ్ఛగా ఆడుకుంటే బాగుండనీ, ప్లే ఏరియా అని గిరి గీయని లోకంలో వాడికి వాడుగా హాయిగా మసలుకుంటే బాగుండనీ అనిపిస్తుంది. చెబితే, వాడూ పెద్ద పట్టించుకున్నట్టు ఉండడు. వాళ్ళ సంతోషాలు ఎక్కడ దాచిపెట్టుకుంటారో, వాళ్ళే తెచ్చి చూపించేదాకా మనం కనిపెట్టలేం. బహుశా ఈ పిల్లల ప్రపంచమొకటి ఎప్పుడూ ఇలాగే సమాంతరంగా నడుస్తూ ఉందేమో. మళ్ళీ నా గమనింపులోకి వచ్చింది మాత్రం పిల్లాడు గడప దాటాకే.


సరిగ్గా ప్రహ్లాద్‌కు ఆరు నెలల వయసున్నప్పుడు ఈ అపార్ట్‌మెంట్‌కు వచ్చాం. మొదట్లో గుమ్మం దాటినా నేనూ వెనుకవెనుక వెళ్ళిపోయేదాన్ని. ఆటలకు కిందకెళ్ళినా మావయ్యగారిని తోడు పంపాకే నేను లోపలికెళ్ళేదాన్ని. అలా అలా ఏడేళ్ళయ్యాయా, ఇక ఇప్పుడు అడుగు బయటపెడితే వీళ్ళంతా మనవాళ్ళే లెమ్మన్న ఫీలింగ్ నాకూ, ఈ మొత్తం అపార్ట్‌మెంట్‌ అంతా మాదే అన్న ఫీలింగ్ పిల్లమూకకూ వచ్చేసింది. సెక్యూరిటీ గార్డ్ పనిని కాస్త కాస్తగా తగ్గించేసుకున్నాను. మనం వెంట తిరగని వయసొస్తే, వాళ్ళకు ఊరు చాలనంత స్వేచ్ఛ. ఇప్పుడు బడి నుండి రాగానే బట్టలు మార్చుకుని, ఏమైనా తిని ఆటలకు వెళ్ళిపోతారు. ఐదూ ఐదున్నరకు మళ్ళీ పాలు తాగడానికి రండ్రా అని అమ్మలం కేకలు పెడుతూ ఉంటాం. తాగి మళ్ళీ పరుగు! ఎప్పటికో అలసి సొలసి వాళ్ళింటికి చేరాకా, స్నానం, చదువు, భోజనం, నిద్ర. ఇదొక చక్రం.

చిన్న ప్లే ఏరియా మాది. అక్కడ మరీ పసివాళ్ళు తప్ప ఎవరూ ఆడుకోరు. కాస్త పెద్దపిల్లలంతా, ఆ పూటకి ఎవరి ఫ్లోర్, ఎవరి ఇల్లు సౌకర్యంగా ఉందనిపిస్తే ఆ ఇంట్లోకి దూరిపోతూ ఉంటారు.

సరే, మొన్నొకసారి ఏమయిందీ..మా ఫ్లోర్‌లో మా ఇంటి పక్కన ఉన్న ప్లేస్‌లో క్రికెట్ ఆడటం మొదలెట్టారు. అంతా పదీ పదకొండేళ్ళ లోపు పిల్లలు. లిఫ్ట్ ఆపేసుకుని దాని ముందు వికెట్‌లు పెట్టుకుని ఆడుతున్నారు. మధ్యాహ్నమనగా అన్నం తిని ఆటకుపోయిన వాళ్ళు సాయంత్రం ఐదవుతున్నా రామని గోల.

పిలిచీ పిలిచీ "ప్రహ్లాద్, నువ్విక రెండు నిమిషాల్లో రాకపోతే దెబ్బలు పడిపోతాయ్!" గుమ్మం ముందు నిలబడి గట్టిగా చెప్పాను.

"అమ్మా ప్లీజ్"
"ఆంటీ ప్లీజ్"
"లాస్ట్ ఓవర్ ఆంటీ.." మొత్తం పిల్లలంతా నా మీదకొచ్చేశారు.

మరీ అంత రాకాసిలా ఏం మీద పడనూ! మొహమాటపడి వెనక్కి తగ్గాను కానీ, పది నిమిషాలాగి మళ్ళీ పోయాను.

"ఏమైనా తిని వెళ్ళండిరా..."

మళ్ళీ మూకుమ్మడిగా దాడి. ఒక్కణ్ణైతే అడగగలం, అదిలించి కోప్పడి ఇంటికి లాక్కు రాగలం. అంతమంది పిల్లలు ముద్దు మొహాలతో బతిమాలే కళ్ళతో చుట్టుముడితే నిజం కోపం సరే, అసలు నటనైనా నావల్ల కాలేదు.

ఏదో నా అదృష్టం పండి ఇంకో ఇద్దరు అమ్మలు కూడా అదే వేళకి బయటకొచ్చి కేకలేయడంతో అంతా నీరసపు మొహాలతో అయిష్టంగా ఇళ్ళకు కదిలారు.

మా వాడు లోపలికొస్తూనే " అమ్మా! బనానా వద్దు నాకు. రోజూ అరటిపళ్ళు తింటావ్, నువ్వేమన్నా కోతివా అంటున్నారు; నాకీ రోజు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి" హుకుం జారీ చేశాడు.

ఉడికించి ఉంచిన స్వీట్ కార్న్ ఒలిచి చిన్న గిన్నెలో వేసి ఇచ్చాను, ఈ లోపవి తింటూ ఉండమని.

బాత్‌రూం లో నుండి చేతులు కడుక్కుని వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడో లేదో,

"బ్రో..." గుమ్మం దగ్గర నుండి కేక.

ప్రణద్ కులకర్ణి. మా వాడి దోస్త్.

"అప్పుడే తినేశావా?" ఆశ్చర్యంగా అడిగాను.
"I had a big glass of milk and AND a laddoo" గర్వంగా చెప్పాడు.

"కొంచం స్వీట్ కార్న్ తిను.." గిన్నె ఇచ్చాను. "నో ఆంటీ, I just had" తిప్పి ఇచ్చేశాడు.

"My mom is preparing french fries Da, you can eat them."
"ఐ హాడ్ దెం లాస్ట్ వీక్ బ్రో.."

ఇక పుట్టి బుద్ధెరిగినప్పటి నుండీ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిన్నారో, ఎన్నెన్ని తిన్నారో, తినగలరో కుర్చీలు తోసుకుని ఒకరి మీదకు ఒకరెళ్ళిపోయి మరీ ఉత్సాహంగా చెప్పుకుంటున్నారు.

వాడికివి ఇష్టమని నాకు తెలుసు. ఇష్టమైనవేవైనా తినేటప్పుడు వాటిని పట్టుకునే పద్ధతీ...ఇష్టంగా కొరుకుతూ చప్పరిస్తూ తినే పద్ధతీ నాకు చూడముచ్చటగా ఉంటుంది. ఆ కాసేపూ వాడూ మహా బుద్ధిమంతుడైపోతాడు. ఎడమ చేతి వేళ్ళని రకరకాలుగా గాల్లో తిప్పుతూ నాకు రేటింగ్స్ కూడా ఇస్తాడు. పిడికిలి బిగిస్తే ఒక రేటింగ్, ఓ లా చూపెడితే ఇంకోటి. వి లా చూపెడితే, అరచేయంతా విప్పితే- ఒక్కో దానికీ ఒక్కో లెక్క. ఆ సంబరం కోసమే శుక్రవారం ఈ బంగాళాదుంపలన్నీ నిలువుగా శ్రద్ధగా తరిగి, నీళ్ళలో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి, శనాదివారాలు వేయించి ఇస్తూంటాను.

సరే, ఆ రోజు ఇద్దరు పిల్లలకీ ఒక వాయ వేశాను.
కెచప్ ప్లేట్‌లో వేసుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చెరి సగం ఇచ్చాను.

నేను రెండో వాయకు తీస్తుండగానే మా వాడు కిచెన్ లోకి వచ్చి నన్ను కిందకు గుంజి, "అమ్మా నాకింకా కావాలి" అని రహస్యంగా చెప్పాడు.

ఇస్తాను పండూ, వెళ్ళి తిను..బుజ్జగించి పంపేశాను.

"My mom will give us more Da" బిగ్గరగా అనౌన్స్ చేశాడు

వార్నీ!

వీళ్ళిద్దరూ పెట్టించుకు తింటూడగానే ఇళ్ళకు వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరిగా ఏదో ముంచుకు పోతునట్టే పరుగుపరుగున వచ్చేస్తున్నారు.

"ప్రహ్లాద్! కమ్ డా..." అరుపులు మొదలైపోయాయ్ గుమ్మం లో నుండి.

వీళ్ళిద్దరూ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నామని అరిచి చెప్పారు.

ఒకరిద్దరు లోపలికి వచ్చేశారు.

ఆంటీ, నాకూ చాలా ఇష్టం. ముద్దుగా చెప్పాడొకడు.

ఇంకో ప్లేట్ పెట్టాను.

నిన్నే తిన్నాం మేము..ఇంకొకడు టేబుల్ దగ్గర చేరి చెబుతున్నాడు.

నేను ఇంకో వాయ తీసుకెళ్ళేటప్పటికి డైనింగ్ టేబుల్ చుట్టూరా పిల్లలు.
పెద్ద ప్లేట్ పెట్టి మధ్యలో ఇవన్నీ పోసి, చుట్టూ కొంచం కొంచం గా కెచప్ వేశాను.

వీళ్ళకి సరిపోకపోతే అల్లరల్లరి చేసేస్తారు. ఒక్కొక్క ముక్కకీ లెక్కలు కూడా చూసుకుంటారు. నాకు ఎక్కువా నీకు తక్కువా అని.

"అమ్మా...పెరి పెరి మసాలా ఉందా?" మా వాడికి ఉన్నట్టుండి గుర్తొచ్చింది.

యెస్. ఉంది కదా. మర్చేపోయాను.

తరువాతి బేచ్‌కి మసాలా వేసి ఇచ్చాను. నేను వెళ్ళేసరికి ప్లేట్ ఖాళీగా ఉంది. అందరూ వేళ్ళు చప్పరిస్తున్నారు. ప్లేట్ నింపి వెనక్కి వచ్చేశాను.

మర్నాటికి, మా ఇంటిల్లిపాదికీ అని ఉంచిన గిన్నెను మళ్ళీ ఫ్రిడ్జ్ లో నుండి తీసి, ఇంకో వాయ, ఇంకో వాయ, ఆఖరు వాయ వేశాను. కాస్త క్రిస్పీ గా, మంచి బంగారు రంగులో..కొద్దిగా మసాలా చిలకరింపుతో నోరూరే బేచ్ - ప్లేట్ నిండా నింపుతుండగానే పుల్లలాంటి వేళ్ళతో ప్లేట్ మీదకొచ్చారు. చెప్పద్దా, నాకు కంగారు మొదలైంది. అక్కడెంతమంది ఉన్నారో లెక్కపెట్టే ధైర్యం లేకపోయింది. ఇప్పుడవి క్షణాల మీద అయిపోతాయ్. ఎవరో ఒకడు కేకేస్తాడు. సరిపోలేదనో, ఇంకా కావాలనో అంటాడు. కొందరు తిన్నామంటారు, కొందరు తినలేదంటారు. అల్లరి మొదలవుతుంది. అయిపోయాయని చెప్పచ్చూ...కానీ పొద్దుటి నుండీ ఆడుతున్నారు పిచ్చి వెధవలు. ఫ్రెంచ్ ఫ్రైస్ చాలనే పిల్లలని నేను చూడనే లేదు!
ఇన్స్టంట్ డెలివరీ ఆప్ లో చూద్దామని ఫోన్ కోసం హాల్‌లో కి వచ్చాను.

అక్కడ పళ్ళెం మధ్యలో ఓ నాలుగు ఫ్రైస్. అంత మంది పిల్లల మధ్యలో. ఏ ఒక్కరూ వాటిని ముట్టుకోవట్లేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా. వాళ్ళు ఏమనుకుని వాటిని వదిలేశారో నాకు తెలిసే వీలేమీ లేదు. కానీ,

ఏడేళ్ళ పిల్లాడికి అమ్మగా, అసలు ఇలాంటివి ప్లేట్‌లో మిగిలి ఉండటం అసంభవమని నాకు బాగా, చాలా బాగా తెలుసు. ఆ నాలుగు ముక్కలూ ఆ పిల్లల మధ్య స్నేహానికి గుర్తు. అబండెన్స్ కి గుర్తు. నీ దగ్గర ఎంత ఉన్నా సరే, నీకిష్టమైన వాళ్ళతో పంచుకునేటప్పుడు, లేమి పొడచూపదనడానికి గుర్తు. పిల్లలు అట్లాగే దాని చుట్టూ కూర్చుని ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉండీ ఉండీ బిగ్గరగా నవ్వుతున్నారు. ఒక్కొక్కరుగా చేతులు కడుక్కోవడానికి లేస్తున్నారు.

"ఫస్ట్ బాల్..." బయట నుండి బిగ్గరగా ఓ గొంతు.

వాళ్ళంతా మళ్ళీ ఆటలోకి మళ్ళిపోయారు. వాళ్ళ ముఖాల్లోని కాంతి, వాళ్ళ గొంతుల్లోని ఉత్సాహం, వాళ్ళ నవ్వుల్లోని సంబరం నా ఇల్లంతా పరిచి పరిచి...

No comments:

Post a Comment

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....