Mother'sDay'23

మహామహా హడావుడిగా సాగిపోయే జీవితంలో నన్నిలా పట్టి కూర్చోబెట్టి మాట వినేలా చేసేది వీడొక్కడే! మంతనాలు, బుజ్జగింపులు, కథలు ఏమీ చెయ్యలేని పనిని చాలాసార్లు నా మోకాలిదండ చేసేస్తుంది. ఏమైంది నాన్నా... అని గడ్డం లేపి అడిగితే, వాడేమీ చెప్పని క్షణాల్లో కూడా, ఏమైందో చూచాయగా తెలుసుకునే శక్తి ఎలా అబ్బిందో, నాకూ ఆశ్చర్యమే. స్నానం చేయించేటప్పుడు బయటపడ్డ భుజాల మీది దెబ్బలో, పక్కింటావిడ నిన్న ఆటల్లో వీళ్ళంతా ఏం చేశారో తెలుసా మానసా అని వివరంగా చెప్పినప్పుడో, అంతెత్తున అరుపులతో పిల్లలంతా కోలాహలంగా ఇంటిలోకొచ్చి నెమలి కంఠం రంగున్న పక్షి డాబా మీద నుండి పోవట్లేదని నన్ను చుట్టుముట్టి అబ్బురంగా చెప్పినప్పుడో, పిల్ల జనాభా అంతా కలిసి ఒకే పాట ముక్త కంఠంతో పాడినప్పుడో - నాకు తెలీకుండా ఇంత పాట ఎప్పుడు నేర్చుకున్నాడు, ఎక్కడ తిరిగొచ్చాడు, ఇన్ని అల్లర్లు నా కంట పడకుండా ఎలా చేస్తున్నాడు, ఇన్ని దెబ్బలు నాకైనా చెప్పకుండా ఎలా ఓర్చుకున్నాడని దిగులుగా, ఆశ్చర్యంగా వాణ్ణి చూసుకుంటాను. పరదాలను ఎగరకొడుతూ చలిగాలి మా గదిలోకి పాకే రాత్రుల్లో నాకు దగ్గరగా జరిగి, నా పొట్టని కరుచుకుని పడుకుని వాడు కబుర్లు చెబుతున్నప్పుడు, ఆ చీకట్లో వాడి వెన్ను నిమురుతూ, ' చిన్న కన్నా! డాబా మీదకి ఒక్కడివే పోకూడదు, చివర్లలో అసలే ఉండకూడదు ' అనో, ' ఎన్ని ఆటలు ఆడుకున్నా, దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలి నాన్నా ' అనో, ' ఎవ్వరింట్లోనూ టివి చూడొద్దు..' అనో చెప్తుంటే... మెల్లగా గొణిగినట్టుగా అడుగుతాడు, ' నీకన్నీ ఎలా తెలిసిపోతాయమ్మా...' అని. పసితనం ఇంకా వదలని వాడి మెత్తటి బక్క ప్రాణాన్ని ఇంకా దగ్గరకు లాక్కుంటూ అనుకుంటాను...చిన్నప్పుడు అమ్మ గురించి నేను కూడా అచ్చు ఇలాగే అనుకునేదాన్నని.

No comments:

Post a Comment

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....