అతిథి

 ఈ ఆరేడెనిమిదేళ్ళ పిల్లల్ని తీసుకుని ఎవరింటికైనా వెళ్ళాలంటే భలే ఇబ్బంది. ఇబ్బందంటే, అది చిన్నప్పటిలా సంచీలో కూరాల్సిన తిండి డబ్బాలు, ఇంకో జత బట్టలు...ఇలాంటివి కాదు.

ఓ నెల క్రితం తెలిసినవాళ్ళు పిలిచారని బెంగళూరుకి ఇంకో మూల ఉండే వాళ్ళింటికి వెళ్ళాం, మేమూ, మా మరిది కుటుంబమూ. వాళ్ళు ముచ్చటగా కట్టించుకున్న ఇంటిని గది గదికీ తిప్పి చూపిస్తున్నారు. సరికొత్త ఇల్లు. విల్లా. వెనుక చిన్న తోట. ఆ తోట మధ్యలో ఓ బుద్ధుడు. చిన్న ఫౌంటైన్. ఒక వైపుకి అందమైన ఉయ్యాల బల్ల. మా పిల్లలు ముగ్గురూ వస్తూనే ఆ తోటలోకి దూరిపోయారు.
ఇంటివాళ్ళు పై అంతస్తులు చూపిస్తాం రమ్మంటే, అడుగడుక్కీ ఫ్రేం కట్టించి పెట్టుకున్న వాళ్ళ జీవితమంతా చూస్తో పైకెక్కాం. కింద వీళ్ళు ఏం చేస్తున్నారో అని మనసు లాగుతూనే ఉంది కానీ, చాన్నాళ్ళకి కలిసిన ఉత్సాహంలో మాటల్లో పడిపోయాం. తీరా కిందకొస్తే ఏముంది! మొక్కలకీ చొక్కాలకీ నిండా నీళ్ళు పట్టించుకుని, ఆ తడి కాళ్ళతో ఉయ్యాల మీదకెక్కి అంతా ఒకేసారి ఊగుతున్నారు. బురద కాళ్ళతో లోపలికీ వచ్చినట్టే ఉన్నారు. తోటలోని బుద్ధుడి ముఖమే కోపమొచ్చినట్టు కనపడింది నాకు. ఇక ఇంట్లో వాళ్లని చూసే ధైర్యమేదీ! "వదినా...భోజనానికి ఉండమంటున్నారు" వినయంగా వచ్చి చెప్పిన మా మరిదిని రెక్క పట్టి కార్ దగ్గరికి లాక్కు రావాల్సి వచ్చింది.
ఇదైన మరుసటి వారం, హైదరాబాద్‌లో పని పడి వెళ్ళాం. మళ్ళీ మా మరిది కుటుంబమూ, మేమూ కలిసే. విశాలమైన వాళ్ళ హాల్‌లో ఎక్కడి నుండో తెప్పించి అమర్చుకున్న అందమైన ఉయ్యాల బల్ల. అది హాల్‌కి మధ్యలో ఉంది. బలమైన ఉయ్యాల. అంత త్వరగా ఎటూ కదిలేదీ కాదు. అట్లాంటి ఆ ఉయ్యాల మీదకెక్కి, మా వాళ్ళు ఏ వేగంతో ఊగారో, ఎలా ఊగారో కానీ, అది పోయి ఐమూలగా ఉన్న ఓ గోడ అంచుని ఢీకొట్టి చిన్న పెచ్చు ఊడేలా చేసింది. నాకు నోట మాట రాలేదు. సిగ్గుతో సగం చచ్చిన నాకు తోడుగా తోడికోడలు పక్కనుండి ధైర్యం చెప్పబట్టి కానీ, నేనసలు ఇంకో రెండేళ్ళు ఇల్లే కదలనని ఒట్టు పెట్టుకోవాల్సిన సందర్భం.
మొన్నొక సాయంకాలం డాబా మీద నుండి బట్టలు తీసుకుని కిందకొస్తుంటే, మా ఎదురింటావిడ పలకరించి, " ఏమిటీ, మీ వాడు పెద్దయ్యక ఇంజనీర్ అవుతాడటగా..!" అని అడిగారు.
"ఆఁ ఏదో అంటూ ఉంటాడు, సైంటిస్ట్ అవుతానని కూడా అన్నాడు" అని నా ధోరణిలో నేను చెప్పుకుపోతుంటే ఆపి, అక్కడే ఉన్న ఓ గోడ మీద వరుసగా దిగబడిన మేకుల వరుస చూపించారావిడ.
"ఇల్లు కట్టడంలో ఇదీ ఓ పనిట. మీ వాడే చెప్పాడు" వెక్కిరించి చక్కా పోయిందావిడ.
ఆ మేకులు నా నెత్తి మీద కొట్టినట్టే కుంగిపోయాను.
పిల్లలన్నాక ఏవో నాలుగు వస్తువులు పాడవకుండా ఎలాగులేమ్మా అంటారు మా అత్తగారు. ఉన్న వస్తువు చెడునది కొత్త వస్తువు వచ్చేందుకే అన్న సిద్ధాంతం ఆవిడది. అట్లాంటి ఇంట్లో మీకు తోచినట్టు అల్లర్లు చెయ్యండ్రా అంటే, ఆ ఊళ్ళో అసలు ఇంట్లోనే ఉండరు మా ముగ్గురు పిల్లలూ. వెనకింట్లో కట్టేసిన దూడలకి గడ్డిని చూస్తే వాంతులయ్యే దాకా పెడుతూనే ఉంటారు. వీధి చివరి నుండి చూపు సారించినంతమేరా కనపడే పొలాల వైపు ఆటలంటూ వెళ్ళిపోతారు. గడ్డివాముల మీద దొర్లి చొక్కాలు విప్పేయమంటూ పేచీకోరు గొంతులతో ఇంటిమీదకొస్తారు. దక్షిణం వైపునుండే పనస చెట్టు నుండి కాయలు కోసి దొర్లించుకుంటూ ఇంట్లోకి తెస్తారు. ముట్టుకుంటే మాసిపోయేట్టూ, అడుగేస్తే బ్రహ్మాండం బద్ధలయ్యేట్టూ అపురూపంగా ఉండే ఇళ్ళకి తీసుకుపోయి పిల్లలని కట్టడి చెయ్యాలనుకుంటే ఎలా అని అక్కడున్నంతసేపూ పదే పదే అనిపిస్తుంది. ఏం చేసినా ఏమీ కానట్టుండే ఇళ్ళు ఎంత సుఖం!
అమ్మా, అక్క, అత్తగారు ఇలా హక్కుగా మసలుకునే ఇళ్ళు తీసేస్తే, వీధి గుమ్మం దగ్గర నుండే హాయి పలకరింపులు మొదలయ్యే ఇళ్ళు ఇప్పటి నా జీవితానికి కొన్నే మిగిలాయి. అలాంటి ఓ ఇల్లు తిరుపతిలో ఉంది. గుబురుగా అల్లుకున్న లేలేత తీవెలతో ఆకుపచ్చని అందమై, ఆహ్లాదమై చల్లగా ఆహ్వానించిన ఆ ప్రాంగణంలోకి ఓ ఏప్రిల్ మధ్యాహ్నం అడుగుపెడుతూనే ఎంత సేదతీరామో. రేఖ ఇల్లది. ఆమె నా స్నేహితురాలు. కవయిత్రి, పెయింటర్, నేనైతే గ్రీన్ థంబ్ తో పుట్టారంటూ ఉంటాను. బాపు సంపూర్ణ రామాయణం, రవివర్మ పెయింటింగ్స్, హాల్‌లో కిటికీలకి పల్చటి తెల్లటి పరదాలతో, వాకిట్లోని హాయిని అలాగే కొనసాగించే ఇల్లామెది. దర్శనానికి టికెట్లు అవే దొరుకుతాయని అనిల్ నన్ను లాక్కుపోతే, ఆ రాత్రి తిరుపతి వీధిలో ఝాంఝామ్మని షికార్లు చేశాం. మర్నాడు పొద్దున టోకెన్లు వేయించుకుని సాయంత్రపు దర్శనానికి వెళ్ళబోతుంటే భోజనానికి రావాలని పట్టుబట్టింది.
ఆంధ్రా వేసవి ఎండలకి వెర్రెత్తిపోయి, మధ్యాహ్నం వాళ్ళింటికి వెళితే, "బంగాళదుంప వేపుడైతే మీ బుజ్జాయిని బతిమాలక్కర్లేదనీ" అంటూ వాడిని పక్కన కూర్చోబెట్టుకుంది. వేడిగా తినకపోతే నీకు రుచేం తెలుస్తుందీ, వీడికి నేను పెడతానంటూ అమృతం లాంటి పాయసాన్ని ఆ కబురూ ఈ కబురూ చెప్పి వాడికి తినిపించేసింది. అన్ని రుచుల్లోకీ కంది పచ్చడి కావాలని మావాడు కోరుకుంటే, ముద్దలు చేసి కొసరి తినిపించింది. తన బొటిక్‌లో చీరల మీద కళ్ళకింపుగా కనపడుతున్న పెయింటింగ్స్ ని చూస్తూ అక్కడే ఉన్న రంగులు తెచ్చి నేనూ వేస్తానంటూ గంతులేశాడు మా వాడు. వేరే ఇంట్లో అయితే నాకెంత కంగారు పుట్టునో! "వద్దు నాన్నా, వద్దు నాన్నా" అని నేను ప్రహ్లాద్‌ని బతిమాలుతుంటే, రేఖ మాత్రం నింపాదిగా -వేసుకో బంగారం - అంటూ వాడికో ప్లాంక్ ఇచ్చి తామర వేయించింది 🙂. బుల్లి ఆర్టిస్ట్ శాంతించాడు.
మూడు వారాల క్రితం ఏలూరులో కజిన్ పెళ్ళికి వెళ్ళాను. పొద్దున ఏడింటికే మండుటెండ. తాతగారి ఇంటికి కాకుండా ఎక్కడికో వచ్చామని మా వాడు చిరచిరలాడిపోయాడు. ప్రయాణపు విసుగు ఉండనే ఉంది. మా (ఇంకో) తోడికోడలు బంగారు రంగులో గిఫ్ట్ రాప్ చేసిన కవర్ తెచ్చి మా వాడి చేతిలో పెట్టింది. బ్యాటరీలు వేసుకుని విమానాన్ని ఆకాశంలోకి ఎగరేసిన కళ్ళలోని సంతోషాన్ని ఎవ్వరమూ పట్టలేకపోయాం. ఐదే నిమిషాల్లో వాళ్ళ పిల్లలూ మా వాడూ కలిసి ఆటల్లో పడిపోయారు.
"ఏంటి రమ్యా ఇవన్నీ..." అని నేను సిగ్గుపడితే, "వెళ్ళేటప్పుడు ఇద్దామనుకున్నా, ఎప్పుడైతే ఏముందక్కా, వాడికేగా" అంది. కారెక్కించి వాణ్ణి తాతగారింట్లో దింపేద్దాం అనుకున్న మమ్మల్ని ఆపి, వాడి ఉత్తుత్తి మంకుని కట్టిపెట్టిన ఆ పిల్ల మీద ఎంత ప్రేమ పుట్టిందో ఎలా మాటల్లో చెప్పడం!
అమ్మలు, మరీ ముఖ్యంగా చంటి పిల్లల అమ్మలు ఇంత thoughtful గా ఉండటం నాకెప్పుడూ ఆశ్చర్యంగా, గొప్పగా అనిపిస్తుంది. అమ్మలు, కానివాళ్ళు, ఆడా మగా అని కాదు కానీ, కొందరలా స్వభావసిద్ధంగా ఎదుటి మనిషి పట్ల అక్కరతో ఉంటారు. కాలేజీ రోజుల్లో కూడా మా రమ్య ఎప్పుడూ నేను తిన్నానా లేదా అని కనుక్కుంటూ ఉండేది. ఉత్తికే నోటి చివరి మాటగా కాదు, నోటి చివరి మాటే అయితే ఇలా పదిహేనేళ్ళ తర్వాత కూడా నాకు గుర్తుండేది కాదు. తన దగ్గర ఐదు రూపాయలుంటే, నాకిష్టమని స్టెల్లా కాలేజీ దగ్గర చాట్ బండి దగ్గరకు తీసుకుపోయేది. నా స్నేహితుడు సుబ్బు అన్నం తినకపోతే ఇరిటేట్ అవుతాడని, శరత్, రమేశ్ ట్రిప్స్‌లో అతన్ని కాచుకుని చూసుకునేవాళ్ళు. మేమిద్దరం రైల్లో ఒకసారి పోట్లాడుకుంటుంటే, ఆ కోపానికి, మాట అనడం చేతకాని ఉక్రోషానికి నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయని చూసి రమేశ్ తన DSLR కెమెరా బాగ్‌లో నుండి తీసి నా చేతిలో పెట్టాడు. అది పాతదనీ, తను కొత్తది కొనుక్కున్నాడనీ, నా దగ్గర ఉంచాలనీ ఏవేవో చెప్పుకుపోతుంటే, నా దుఃఖం నుండి మరల్చడానికి అంటున్నాడని కూడా తెలుసుకోకుండా విన్నాననీ; కోపం కన్నీళ్ళు మర్చిపోయానని గుర్తు చేసుకుంటుంటే, నాలో కొన్ని వేల ఉద్వేగాలు రేగుతాయి ఈ క్షణానికీ.
ఆకలో కోపమో అలసటో- అర్థం చేసుకుని ఊరడించడం కొందరికి నేర్పించకుండానే వస్తుంది. అల్లర్లనీ అసహనాన్ని మెత్తగా మచ్చిక చేసుకుని తగ్గించి, ఉత్తపుణ్యానికి ప్రేమించగల అదృష్టం కొందరికే వరమై ఉంటుంది. ఎదుటి మనిషి పెంకితనంలో పసితనాన్ని చూసి ఓరిమిగా మాట్లాడేందుకు ఏం కావాలో కానీ - అది అర్థమవ్వడానికి, అది ఉన్నవాళ్ళు నా చుట్టూరా కూడా ఏనాటి నుండో ఉన్నారని గమనించుకోవడానికి, నిజానికి అలాంటి కొందరి వల్లే ఈ జీవితంలో శాంతి రాశులుగా పరుచుకుంటోందని తెల్సుకోవడానికి, నేనొక అమ్మను కావలసి వచ్చింది!

No comments:

Post a Comment

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....