సంగమ

 

బెంగళూరు నుండీ ఓ 90 కిలోమీటర్లు. పేరు తెలియని గుబురు చెట్ల నడుమ, అర్కావతి, కావేరి నది కలిసిన సంగమ స్థలి. అక్కడికి వెళ్దామని నా స్నేహితురాలు ఎప్పటినుండో పోరు పెడుతోంది. వర్షం కురిసి తీరుతుందని ఆకాశం హామీ ఇచ్చిన ఓ ఆదివారం గానీ మా రెండు కుటుంబాలకూ తీరిక చిక్కలేదు.
**
అర్కావతీ కావేరి అక్కడి అడవి గుండెల్లోని నదులు. అడవి గుండె చప్పుడు లాంటి నదులు. అడవి చెట్ల అందాన్ని, మారే ఆకాశపు రంగులనీ నీటి మిలమిలల్లో చూపించే నదులు. అడవీ, ఆకాశం, కొండలు, నదులు. నీటి మధ్యలో బండరాళ్ళు. నీటి నిండా పరుగులు తీసే చేపలు. చూపులకే తప్ప దోసిలికి చిక్కని ఆ చిరుమీల మెరుపులు. నదిలోకి జారిగిలబడినా, నా ఎత్తుకి నడుం కూడా దాటని నీళ్ళు. లేజీ రివర్ అని వాటర్ వర్ల్డ్ లో చెప్తారే, ఆ నకలుకి అసలు ఆనాటి మా అనుభవం. చేతులు చేతులు పట్టుకుని ఆ ప్రవాహంలో కుదురుగా కూర్చోవడం దానికదే ఓ ఆట. మెలమెల్లగా సాగే ప్రవాహం ఉండీ ఉండీ ఉధృతమైతే ఎవరో మెత్తంగా తోసినట్టే కొన్ని అంగుళాలు కదులుతాం. అంతే. మళ్ళీ అడవి గాలి. నింపాది నదీప్రవాహం. నది మధ్యన ఇసుక పాయల్లో తడుస్తూ మెరుస్తూ గవ్వలు. రమ్మని పిలిచే గులకరాళ్ళు. మేఘాల నీడ ఆవరించుకుంటే ఆశ్చర్యంగా తలెత్తి చూడటం, ఆకాశమే గొడుగు విసిరేసినట్టు వానపడితే ముద్దైపోవడం...చిట్టిదోసిళ్ళు అల్లరి నింపుకుని నా మీదకొస్తే, ఇష్టంగా ఒంగి లొంగిపోవడం, తడిసిపోవడం, ఆటగా వెనక్కి వాలిపోవడం...
**
తినడానికి వెనక్కి వచ్చేస్తుంటే విశాలమైన మైదానం, ఖాళీగా ఉండి పిలుస్తోంది. ఆ మైదానం అంచుల దాకా డ్రైవ్ చేసుకెళ్ళిపోయాడు అనిల్. దిగి చూస్తే, కనుచూపు మేరంతా నిర్మానుష్యం, ఆవలి వైపున కొండలు. ఆ కొండలను కవ్వింపుగా తాకిపోతున్న మేఘాలు. తెంపరి గాలి.
ఆకలో ఇంకా ఉపశమించని ఉత్సాహమో, పిల్లలు రెట్టించకుండా తిని తిరిగి ఆటలకు వెళ్ళిపోయారు. మేం పరుచుకున్న దుప్పట్లు మాత్రం ఉంచి, మిగతావన్నీ కార్‌లో సర్దేసింది దీప్తి.
ఆ మైదానంలో వెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకుంటే, నా రెప్పల వెనుక ఒక మేఘపు బరువు. కళ్ళు తెరిస్తే, రెప్పల మీద వాలనుందా అన్నంత దగ్గరగా ఆకాశం. ఉండీ ఉండీ కొండ దారిని మెలిపెడుతూన్నట్టు ఓ గొర్రెల మందను తోలుకుపోతున్న కాపరి గరుకు గొంతు. దూరంగా ఎక్కడో స్నేహితులతో అనిల్. తూనీగలను పట్టుకోవాలని పరుగెడుతున్న పిల్లల కేరింతలు. చేయి కదిపితే అందే దూరంలో, గడ్డి పరక మీద వాలి ఉన్న ఓ తూనీగ. దాని రెక్కల మీద ఎగిరిపోయిన నా కాలం.
**
తిరుగుప్రయాణం. దారంతా అటూ ఇటూ వేపచెట్లు. కేవలం మా కోసమే ఆగినట్టు ఆగి, మళ్లీ మొదలైన జడివాన. రాలిపడ్డ పండుటాకును తోయలేని ప్రయాసతో, ఊగుతూనే ఉంది వైపర్. ఎదురొచ్చే వాహనాల మీదుగా ఒక్కో వెలుగు కిరణం ఆ వానలో వెయ్యి రంగులుగా చీలిపోతోంది. నీళ్ళల్లో చేపలా, మైదానంలో తూనీగలా అటూ ఇటూ పరుగులు తీసిన పసి ప్రాణం నిద్రకు నా ఒళ్ళో చోటు చూసుకుంటోంది. అలవాటుగా సర్దుకుని జోకొడుతున్నాను. వాడి జేబుల్లో నది చల్లదనాన్ని దాచుకున్న గులకరాళ్ళు. వాటి నున్నదనానికో చల్లదనానికో ఒళ్ళు ఝల్లుమన్నట్టైంది. ఎ.సి గాలి పాదాల్లోకి వణుకు తెస్తోంది. ముందు సీట్‌లో నుండి ఊ కొడుతూ వినగల ఓ తేలికపాటి సంభాషణ. వెన్నంటి వస్తోన్న మెరుపులు. బెంగళూరు పొలిమేరలు చేరినట్టు గుర్తుగా దీపాల కాంతులు. ఇష్టమైన ప్లే లిస్ట్‌లోని పాట వినపడుతోంది... "చెలువము ఉన్నది నిన్నలరించగ...".

No comments:

Post a Comment

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....