గజేంద్రమోక్షం- ఆర్టిస్ట్ కేశవ్ గారి కన్నుల్తో..


ఈ కళారూపాన్ని ఏ క్షణంలో చూశానో కానీ, ఇది నా మనసును వదిలి పోవడమే లేదు! గజేంద్రమోక్షాన్ని ఇంత అద్భుతంగా తిప్పి చెప్పగల వాళ్ళు, ఎన్ని జన్మల తపస్సు చేసి, ఆ కృష్ణపరమాత్మను మనసులో నింపుకున్నారో ఊహకందడం లేదు.
"నీరాశ నిటేల వచ్చితి?" అని పదే పదే చింతించి, "ఏ రూపంబున దీని గెల్తు?నిట మీఁ దేవేల్పుఁ జింతింతు" అని వాపోయిన గజేంద్రుడు, అన్నదమ్ముల కొట్లాటలో మొండిగా పోరాడి ఓడి, ఆఖరు నిముషాల్లో అమ్మను సాయం పిల్చుకుని, ఆమె కనపడి చేయందివ్వగానే కరుచుకుపోయి గుండెల్లో తలదాచుకునే పిల్లవాడిలా, - ఆ శ్రీమన్నారాయణుడిని బిగియార కౌగిలించుకున్నాడు. "ఒకపరిజగములు వెలి నిడి, యొకపరి లోపలికి గొనే" శ్రీహరి, ప్రసన్నంగా ఆ గజరాజును చేరదీశాడు. "నిడుద యగు కేల గజమును, మడువున వెడలంగఁ దిగిచి మదజల రేఖల్ దుడుచుచు మెల్లన పుడుకుచు, నుడిపెన్ విష్ణుండు దుఃఖ ముర్వీనాథా!" అంటాడు భాగవతంలో పోతన. అది సరే, గజరాజును మడుగులో నుండి బయటకు లాగి, అతని పైని మదజలరేఖలు తుడుస్తూ, వెన్ను నిమురుతూ ఓదార్చడం దాకా పోతన కన్నుల్తో మనమందరమూ చూసిందే! చక్రహస్తుని రూపమంటారా, "సిరికిం జెప్పని వాడు" , అతడిక్కడెట్లా ఉన్నా చెల్లిపోతుంది, ఆ అలంకారాల్లో లోపాల వైపు నా చూపు వెళ్ళలేదసలు. నన్ను, (ఇంకా ఈ చిత్రం చూసిన ఎందరినో), ఆశ్చర్యపరచిందీ, పదే పదే ఈ చిత్రాన్ని వెదికి వెదికి చూసేలా చేసిందీ, కరి కాదు. మకరి. కరుణా సింధుడు శౌరి చక్రాన్ని పంపి హతమార్చడమే?! ఆ ఊహ కూడా రానీయలేదీ చిత్రకారుడు. ముందే చెప్పినట్టు, పిల్లలిద్దరు కొట్టుకుంటుంటే, ఒకింత బలహీనపడ్డ బిడ్డను అక్కున చేర్చుకున్న అమ్మతనాన్నీ, అమ్మ కనపడానే పంతాన్ని మరిచి, కోపాన్ని మరిచి, తాను చేసిన తప్పేమిటో తెలిసీ, ఏమీ ఎరుగని అమాయకుడిలా మళ్ళీ ఆ అమ్మ పాదాలే పట్టుకు వేలాడే పసితనాన్నీ పటం కట్టి చూపించాడు. హరిలో ఆగ్రహం చూపించలేదు, ఆవేశం అసలే లేదు. మొసలి కళ్ళల్లోనూ తుంటరి పని చేసి దొరికిపోయిన పసిదనమే తప్ప, పశ్చాత్తపం లేదు. పైగా, అలా ఒదిగి పట్టుకోవడంలో అమ్మ నన్నూ ఏమీ అనదన్న ధీమా ! ఆ చేయి, "ఇందరికి అభయమ్ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి.." మొసలినీ ఎలా దగ్గరకు తీస్తోందో గమనించే కొద్దీ హృదయం అమృతభాండమైపోతోంది.

ఇదీ కళకు సార్ధకత! ఇదీ!, ఇదే ఏ కళారూపమైనా చేయవలసిన పని. దీనికే మనం దాసోహమయ్యేది. మన లోపలా ఈ వెలుగున్నదని గుర్తు చేస్తున్నందుకే, వారికి కైమోడ్చేది.
గజేంద్ర మోక్షాన్ని కరి మకరి వైరంగా కాక, స్థితికర్త లీలగా, ఆయనే ముగించిన హేలగా హృద్యంగా చూపించిన ఈ చిత్రకారుడి ఊహాచమత్కృతికి వేనకోట్ల వందనాలు సమర్పించడం తప్ప, ఇంకేం చెయ్యగలను?

( One of the finest interpretations of Ganjendra Moksha I have ever seen. Painting by Keshav garu )

14 comments:

  1. Beautiful - the painting & the way you have written :-)

    ReplyDelete
  2. ఎంత అందమయిన చిత్రం! అంతకన్నా అందమయిన వ్యాఖ్యానం. ఆ కేశవ్ గారు ఎవరో కానీ సమరం లో కూడా సామరస్యం చూడొచ్చు అని ఎంత చక్కగా చెప్పారు - ఈ చిత్రంలో. వారికి నా శుభాభినందనలు!

    ReplyDelete
    Replies
    1. https://www.facebook.com/keshav.keshav?fref=ts - Check this, if you have an FB account! It's a treat to get his "Krishna for the day" paintings in our stream on a regular basis.

      Delete
  3. శ్రీనివాసుడుFriday, September 09, 2016

    లలిత గారూ!
    కేశవ్ గారు ’’హిందూ‘‘ పత్రికలో ఆస్థాన కార్టూనిస్టు. సంపాదకీయ పుటలో సమకాలీన సంఘటనలపై ఆయన వేసిన కార్టూన్లు మీరు చూడవచ్చు.
    మీరు గజేంద్రమోక్షం ఘట్టం సంస్కృత వ్యాసభాగవతం అనువాదం చదివితే తెలుగు పోతన భాగవతానికి,సంస్కృత భాగవతానికి గల వ్యత్యాసం మీకు బోధపడుతుంది.
    సర్వాంతర్యామి అయినవాడు ’’సిరికిం జెప్పడు‘‘ ఎక్కడినుండో అని పరుగెత్తుకు రానక్కర్లేదు, హృషీకేశుడైనవాడు మకరి ఇంద్రియాలను స్తంభింపజేయలేడా? గజేంద్రుడు కూడా తన దేహ రక్షణ కోసం కాదు పిలిచింది. మోక్షం కోసం మాత్రమే పిలిచాడు.
    అధ్యాత్మ రామాయణం లాగానే అధ్యాత్మ భాగవతం కూడా వుంటేవుంటుంది. ఈ సంఘటన వెనుకనున్న రహస్య అంతరార్థం ఏమిటీ అనేది తత్త్వవేద విశారదులే చెప్పగలరు.

    పోతనగారి గొప్ప ఊహ సిరికిం జెప్పడు. కేశవ్ గారి గొప్ప ఊహ మకరి, గజేంద్రులను అనునయించడం. ఇద్దరి కళనూ చూసే భాగ్యం మనకి కలిగించిన మానస చామర్తి గారికి నెనర్లు.
    ......శ్రీనివాసుడు.


    ......శ్రీనివాసుడు.

    ReplyDelete
    Replies
    1. ఏమండి శ్రీనివాసుడు గారు, యు.జి. పుస్తకాలు చదివిన మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? ఇందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఎముంది? ఆధ్యత్మికత క్లుప్తంగా చెప్పాలంటే 6 ను 6 గా , 9 ను 9 గా చూడటం.
      6 ను9 గా, 9 ని 6 గా చూడటం ఎమోషనల్ నాన్ సెన్స్. రేపు కృష్ణుడు ధర్మరాజు,ధుర్యోధనుడు భుజాలమీద చేయి వేసి నడుస్తూండే బొమ్మ ఆయన గీస్తే ఇలాగే అన్వయిస్తారా? :)

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. శ్రీనివాసుడుFriday, September 09, 2016

      శ్రీరామ్ గారూ!
      మీరు అధ్యాత్మ రామాయణం చదివేరా? రామాయణంలోని పాత్రలు, సంఘటనలు అన్నింటినీ ప్రతీకలుగా వివరిస్తారు దానిలో.
      నేను ఆధ్యాత్మిక రహస్యం వున్నదన్నది కేశవ్ బొమ్మని ఉద్దేశించి కాదు, సంస్కృత భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టం గురించి.
      రాక్షసులకే కాదు, సరిగ్గా చెప్పాలంటే, దేవ, మానవ, తిర్యక్, స్థావరాలలోని జీవులకు వారి వారి కర్మలను బట్టి ఆ దేహం ఇచ్చేది నారాయణుడే అని విశిష్టాద్వైతం చెబుతుంది.

      Delete
    4. అధ్యాత్మ రామాయణం చదవలేదండి.

      Delete
    5. ఆరునీ తొమ్మిదినీ దాటి- ఈ అంకెలన్నింటినీ దాటి చూడటమని అనుకుంటానండీ నేనైతే.. :). ;)

      నన్నిప్పటికీ ఈ ఊహ విస్మయపరుస్తూనే ఉందండీ! పోతే, మీరన్న ఆఖరు ప్రశ్నకు - కృష్ణుడు అలా వెయ్యకపోతే ఆశ్చర్యం..! కాదూ?!

      మీ ఇద్దరికీ ధన్యవాదాలు. నన్నింకోసారి ఈ ఊహల్లో మునకలేయించినందుకు! ;)

      Delete
    6. ఈప్రపంచం ఏ భావంతో చూస్తే ఆవిధంగానే కనిపిస్తుంది. మీరు అంతా ప్రేమమయంగా చూడాలనుకొంటే అలానే చూడవచ్చు. ఈ వీడీయోను కూడా చూసి ఆనందించండి.

      The Story of Wounda the Chimpanzee and Her Hug to Jane Goodall During her Liberation

      https://www.youtube.com/watch?v=5Mw8uXDRTIw

      Delete
    7. :) I think you are right. Thanks for suggesting this video.

      Delete
  4. గజేంద్రమోక్షం కథ క్లైమాక్స్ చిత్రలేఖనంలో ఇలాక్కుడా చెప్పొచ్చా? చిత్రకారుడి ఆలోచనా తీరుకి జోహార్లు!

    "పిల్లలిద్దరు కొట్టుకుంటుంటే, ఒకింత బలహీనపడ్డ బిడ్డను అక్కున చేర్చుకున్న అమ్మతనాన్నీ, అమ్మ కనపడానే పంతాన్ని మరిచి, కోపాన్ని మరిచి, తాను చేసిన తప్పేమిటో తెలిసీ, ఏమీ ఎరుగని అమాయకుడిలా మళ్ళీ ఆ అమ్మ పాదాలే పట్టుకు వేలాడే పసితనాన్నీ పటం కట్టి చూపించాడు"

    చక్కని వ్యాఖ్యానం మానసా!

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....