సంక్రాంతి

గొబ్బెమ్మలు లేవు,
భోగిమంటలూ ఈ చేతులతో వెయ్యలేదెప్పుడూ
అపార్ట్మెంటు జీవితం అందివ్వని భోగాల్లో
ఇవీ ఉన్నాయన్న బెంగ కూడా లేదు
పండగంటే, కొత్తబట్టలు, పిండివంటలూ
బొమ్మల కొలువులూ, నా నలుగురు స్నేహితులు-
ఇంతే,
మాటల్లో చెప్పుకోవటానికి ఇంతకన్నా ఏం లేదు కానీ

అక్షతలతో కలిసిన భోగిపళ్ళు, బంతిపూరేకులు
తలమీద నుండి ఇలా జారుతాయో లేదో
కుర్చీల్లో నుండి చప్పున కిందకు దూకి
చప్పుడు చేసిన రాగిబిళ్ళల కోసం వెదికే పిల్లల్లా
ఒకదానివెనుక ఒకటి దీవెనల్లా సాగిపోతున్న రోజుల్లో కూడా,
సంక్రాంతి పేరు వినపడగానే,
కోల్పోయిన జ్ఞాపకాల కోసం
గతంలోకి వంగి వంగి చూస్తాయి ఆలోచనలు

ఎక్కడ చిక్కుకుంటే ఏం,
దారపు కండెను వదిలి వెళ్ళిన గాలిపటాలను
ఇప్పుడు కాసేపైనా గమనించాలని ఉంది

5 comments:

 1. ఇంతకీ మీ "చిరంజీవి"కి భోగిపళ్లు పోశారా?

  ReplyDelete
 2. భోగిపళ్ళు పోశామండీ :). బెంగళూరులో వాడికి అక్కాచెల్లెళ్ళు ఉన్నారు. అందరం కలిసి పండుగ చేసుకున్నాం. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. :)

  ReplyDelete
 3. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంతోషం మీ టపా చూసి. నిన్ననే +లో అన్నాను సంక్రాంతి సంబరాలు నీరసం గా ఉన్నాయి అని.......దహా

  ReplyDelete
  Replies
  1. ఇప్పుడే మీ విశేషాలన్నీ చదివి వస్తున్నానండీ! కాసేపు మా ఇంటికెళ్ళి వచ్చినట్టుంది..థాంక్యూ! :)

   Delete
 4. నాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవని కృష్ణ శాస్త్రి గారిలా
  సంక్రాంతి లేదని దిగులెందుకు మీకు మానస గారు తెలుగు నాట ఇంకా ఊరంతా సంక్రాంతి ఉంది.
  మా బ్లాగ్ లో పేస్ బుక్ లో ఆ సందడి చూడండి కావాలంటే
  మచ్చుకు నాలుగు నా మాటల్లో
  మంచుతెరల చేమంతుల దోబూచులు
  బంతిపూల పూబంతుల విరబూతలు
  హేమంతం చేసెనంట సీమంతం
  పుడమితల్లి కడుపుపంట లోగిళ్ళను చేసెనంట శ్రీమంతం ..సిరివంతం!
  సిరుల విరులతో అలరారే కాలం
  ఆబాలగోపాలం ఆలపించు భూపాలం
  శుభ సంక్రాంతి శోభకిదే సంకేతం!
  దినకర మకర సంక్రమణ సరంభాని కిదే యిదే స్వాగతం!
  ముంగిళ్ళ రంగవల్లి వేదికగా అదిగదిగో...
  హరిలో రంగహరీ...కీర్తనల హరిదాసు నర్తనలు
  ముద్దులొలుకు గుమ్మల గొబ్బెమ్మల పాటలూ..
  ఇవిగివిగో...బొమ్మల కొలువులు...భోగిపళ్ల బోసి నవ్వులు
  అందాల అనుబంధాలు...ఆనందాలు పెనవేసిన బంధాలు
  ఇలా తెలిగింటి వెలుగులతో వెలిగెనంట భోగిమంట
  మంగళకరమై శోభాయమానమై ఆదివారం అరుదెంచే
  మకర సంక్రాంతి కిదే యిదే స్వాగతమంటా..
  డబడబ బుడబుక్కల సడులు...డోలు...సన్నాయి తోడ
  డూడూ బసవన్నలాడు సందడులు..
  కోడిపుంజుల రంజైన ఎడ్లపందాల గెలుపుల ఈలలు
  గాలిపటాల అలలు అహహా..
  అంబరాలు తాకినవి సంక్రాంతి సంబరాలు
  సర్వాంగ సుందరమీ ధనుర్మాస సోయగాలు
  పాడిపంటల వేడిమంటల భోగి పండుగ
  పిండివంటల పొంగలి పొంగుల పెద్దపండుగ
  పశువుల మేనినునుపుల మా కనుమ పండుగ..కలల పండుగ
  ఆ పర్వదిన మాధుర్యం...అపూర్వ సంప్రదాయ సౌరభం
  మూడునాళ్ళూ ముచ్చటగా సంక్రాంతి...తెలుగునేల తియ్యదనాల స్రవంతి
  జాలువారాలి నిరంతరం...తరలిరావాలి తరం తరం
  తరం తరం... నిరంతరం....నిరంతరం ..తరంతరం.
  సత్యసాయి విస్సా ఫౌండేషన్.

  ReplyDelete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...