లోలకం

1)

రెక్క ఒకటి తెరిచే ఉంచుతాను
రాత్రికి రానని చెప్పే వెళ్ళావనుకో-
మరి వస్తేనో?

2)

నీదిగా చేసుకున్న గది అదుగో
నవ్వుల్తో, సూదంటు చూపుల్తో
నీ మౌనంతో
నువ్వు వెలిగించి వదిలేసిన
దీపం లాంటి గది ఇదిగో!

ఏ ఈదురుగాలికీ బెదరకుండా,
ఇలాగే, ఇక్కడే.

3.

సంద్రాన్ని కోసుకుంటూ పోయిన నౌకలా
మది మీద నవ్వు నురగలు వదిలే
నీ జ్ఞాపకం
మెత్తగా కోస్తుంది కదా,
ఎక్కడో నొప్పి.

4.

త్వరగానే వస్తావులే నువ్వు-
నేరేడు పళ్ళు రాలిన డొంకదారి మీద
అడుగేయడానికే అల్లాడిపోయే ప్రాణావివి
నన్ను తల్చుకుని,
నువ్వు లేని నన్ను ఊహించుకుని

రావా?

5.

ఋతువులు మారే కాలం
పూలు పూస్తాయో పూయవో
ఎగిరిపోతున్న పక్షులు
రేపీ వంక గొంతు విప్పేనో లేదో
అన్ని రంగులనూ తుడిచేసుకుని
నిశ్చలమైన నలుపులోకి తిరుగుతూ
ఆకాశం.
నిను హత్తుకుని పడుకున్నప్పుడు
కళ్ళ వెనుక ఊడ్చుకుపోయిన లోకంలా.

6.

ఉండచుట్టుకు పడిపోయిన వేల కాగితాల లోపల
ఎవరికీ ఎన్నటికీ చేరని భావంలా,
నాలోపల,
నువ్వలాగే!


**తొలిప్రచురణ -ఆంధ్రప్రదేశ్ సాహిత్య మాసపత్రిక, సెప్టెంబరు సంచికలో.

No comments:

Post a Comment

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...