"రంజాన్ చంద్రుడు"

విజయవాడలో మొదటి నుండీ సందడికొచ్చిన లోటేమీ ఉండేది కాదు. అటు తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనో, ఘంటసాల సంగీత కళాశాలలోనో, బందరు రోడ్డులోని టాగోర్ లైబ్రరీలోనో..ఎప్పుడూ ఏవో సంగీత సాహిత్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతూనే ఉండేవి. ఇంజనీరింగ్ రెండో ఏడో..మూడో ఏడో...,వయసు "మరోప్రస్థానాని"కీ, మనసు "అమృతం కురిసిన రాత్రి"కీ ఓటేస్తున్న సంధికాలం. జావాలూ, "సి" నోట్సులూ గీతాంజలి కవితలతో నిండిపోయి లోకమంతటినీ కొత్తగా చూపెట్టిన కాలం. రోజూ వీచే గాలీ, ప్రతి రోజూ కనపడే సూర్యాస్తమయాలూ,  పొద్దున నవ్వి రాత్రికే వాడి నేల ఒడి చేరే పూవులూ...అన్నింటిలోనూ అందాకా తెలియని సౌందర్యాన్ని దర్శించిన రోజులవి. సహజంగానే కవిసమ్మేళనాలంటే కలిగిన ఆసక్తితో, ఒకరోజు స్నేహితురాలిని వెంటేసుకుని, ఒక సభకు వెళ్ళాను. వెళ్ళే దాకా బానే ఉన్నాను కానీ, వెళ్ళాక ఆ వాతావరణం అదీ చూస్తే గుబులుగా అనిపించింది. నిర్వాహకులు "రంజాన్ చంద్రుడు" అనే శీర్షిక మీద కవితలు వ్రాయమన్నారుట. చాలా మంది కవులు కవితలు వ్రాసుకు తీసుకు వచ్చారు. నేనేమీ వ్రాయనే లేదూ...పోనీ వెళ్ళిపోదామా అనుకుంటూనే తటపటాయిస్తూ ఉండిపోయాను. ఒక్కొక్కరూ వెళ్ళి, తమ కవితలు చదివి వినిపిస్తూండగా...ఒక మధ్య వయసు వ్యక్తి హడావుడిగా వచ్చి నా పక్కన కూర్చున్నారు. "చాలా సేపయిందా మొదలయ్యీ?" వినపడీ వినపడకుండా అడిగారు. "లేదండీ, ఇప్పుడే, ఓ పది నిముషాలైందేమో.." తలతిప్పకుండా బదులిచ్చి మళ్ళీ కవితలు వినడంలో మునిగిపోయాను. మరో ఐదారుగురు చదివాక, నా పక్కన కూర్చున్న వ్యక్తి స్టేజీ మీదకు వెళ్ళి తన కవిత చదవడం మొదలెట్టారు.  ఆయన గొంతు..ఆ పలుకుల్లో మెత్తదనం....ఆ కవిత, ఆ ఎత్తుగడ, వాడిన పదాలు..ముగింపూ....ఆయనలా చదువుతుంటే నేనొక కొత్త లోకానికి వెళ్ళిపోయాను. మనసంతా పట్టరాని ఆనందం.

అసలు కళాకారులని ప్రత్యక్షంగా చూసీ చూడటంతోటే మనలో ఏదో కొత్త శక్తి పుట్టుకొస్తుందని కూడా నాకనిపిస్తూ ఉంటుంది. శోభన గుర్తుంది కదా..అదేనండీ..యమునా తటిపై నల్లనయ్యకై ఎదురు చూసిన రాధ- టి.విల్లో చూసి బాగుందనుకుని వదిలేసేదాన్ని కానీ, అవే కళ్ళు, అదే నవ్వు ఆమె భరతనాట్యం చేస్తుండగా చూస్తే మాత్రం ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాను. అలాగే మొన్న ఎలక్ట్రానిక్ సిటీలో లిటరరీ ఫెస్టివల్ ఒకటి జరిగింది. మా ఆఫీసుకి ఐదు నిముషాల నడకలో ఉన్న ప్రాంతం కనుక, శుక్రవారం చకచకా పనులవ్వగొట్టుకుని, మధ్యాహ్నం నుండి ఉన్న మీటింగులన్నీ సోమవారానికి వాయిదా వేసి మరో ఇద్దరిని వెంటేసుకుని వెళ్ళిపోయాను. అక్కడ అడుగు పెడుతూండటమేమిటీ...మనది కాని లోకంలోకి వెళ్ళినట్టు ఎంత సంబరంగా ఉంటుందనీ!  గుల్జార్, హరిప్రసాద్ చౌరాసియా లాంటి మహామహులొచ్చారు. ఫరాన్ అక్తర్ పాట (Rock On) బోనుస్. :). ఇవన్నీ ఏంటంటే, మనని విసుగెత్తించే రోజువారీ పనుల నుండి మనకో గంట విముక్తి ప్రసాదించడమే కాకుండా, మళ్ళీ కొన్నాళ్ళు బతుకు బండి రయ్యిరయ్యిన దూసుకెళ్ళడానికి కావల్సిన శక్తి ఇస్తాయన్నమాట. కవిసంగమాలూ వీటికి మినహాయింపేం కాదు. ఒక మంచి కవితను, దానిలో తన మనసు కూర్చి వ్రాసిన కవి స్వయంగా చదివితే, అందులో జీవం తొణికిసలాడుతుంది. కవి గొంతులో అది మననో జీవితకాలం వెంటాడుతుంది. ఆ ఒక్క కవిత, మనలో పేరుకున్న ఎన్నేళ్ళ నిస్సత్తువనో అలవోకగా వదిలిస్తుంది. హృదయాన్ని కదిలించి కొత్త కవితలను వ్రాసే ఉత్సాహాన్నిస్తుంది. కారణం తెలీని దిగులు నుండి వేరు చేసి, కారణాలక్కర్లేని సంతోష తరంగాల్లో ఓలలాడిస్తుంది.  వాళ్ళను అలా దగ్గరగా గమనిస్తున్న కొద్దీ, ఆ విజయమేమీ తేలిగ్గా వచ్చినది కాదని తెలుస్తున్న కొద్దీ, కొత్త స్పూర్తి నరనరానా నిండుతూంటుంది. కవులందరూ అంత గొప్పగా తమ కవితలను చదివి వినిపించగలరా అంటే, ఏమో, నాకూ సందేహమే!  కానీ ఆ సామర్థ్యం ఉన్న కవులున్నారా, మీరు వాళ్ళు కవితలు చదువుతూండగా విన్నారా, ఆ అనుభవం కోసం మీరిక అర్రులు చాచడం  మానరు.

ఆయన మళ్ళీ వచ్చి నా పక్క కుర్చీలో కూర్చోగానే ప్రశ్నల మీద ప్రశ్నలతో ఆయన్ను విసిగించేశాను. ఆయన కృష్ణవేణీ స్కూల్‌లో టీచరుగా చేస్తారుట. బళ్ళో కూడా పిల్లలకు కవితలూ అవీ సరదాగా వ్రాసిస్తూ ఉండేవాళ్ళట. ఆ రోజు జరిగిన ఆ పది నిముషాల పొడి పొడి సంభాషణలో, నాకర్థమైనదల్లా ఆయనకు కవితల మీద ఆసక్తి ఉందనీ, అప్పుడప్పుడూ వ్రాస్తూ ఉంటారనీ..అంతే. ఇన్నేళ్ళలోనూ, రంజాన్ మాసంలో ఒక్కసారైనా ఆయన్ను తల్చుకోకుండా లేను నేనెప్పుడూ. అదెందుకూ అంత ఇష్టం అంటే...దానికి చాలా కారణాలున్నాయి కానీ, మొత్తానికి నాకు కవిసంగమాల పట్ల వల్లమాలిన ఆసక్తినీ, కవిత్వం  మీద  అపారమైన ప్రేమనీ కలిగించిన వ్యక్తిగా, ఆయన్ను గుర్తు పెట్టుకుంటాను. ఇది దాదాపు పదేళ్ళ క్రితం నేను విన్న కవిత. ఇన్నేళ్ళ తరువాత, ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆయన చెప్పుకున్నంత సాదాసీదా కవిత్వాభిమాని మాత్రమే కాదనీ, ప్రచురించిన ఒక్క కవితా సంపుటికే అనేక అవార్డులు అందుకున్న కవి అనీ తెలిసి ఆశ్చర్యపోయాను. ఆయన పేరు.."చిత్తలూరి సత్యనారాయణ". ఆ సంపుటి..."మా నాయిన". ఆ కవిత పూర్తి పాఠం ఇదిగో...

"నా బ్రతుకు మలుపులో
తారసపడిన ప్రతి ముస్లిం మిత్రుడూ
నాకో రంజాన్ చంద్రుడే!
ఐదు గంటలకే అజా అరుపు
అమ్మ చేతి కంటే ముందు
నా అంతరంగపు దుపట్టాను పట్టి లాగేది
అల్లా కూడా కూసింది లేరా అంటూ
నాయిన మాటల్లోనూ అదే ఆర్ద్రతాగీతం
సిర్ప టోపీలు పెట్టుకున్న
నా చిన్ననాటి ముస్లిం సోదరులంతా
ఎర్ర దుబ్బ ఇసుకల్లో నమాజుకేసి సాగుతుంటే
చుక్కలు పొడిచిన ఎన్ని ఆకాశాలో
నేల మీద కదిలిపోతునట్టే ఉండేది
అత్తరులో ముంచిన దూదిపండును
చెవివొంపులో కళాత్మకంగా దోపుకుంటూ
మాబాయికాడికి అలా కదిలొచ్చేరో లేదో
నీళ్ళు లేక ఎండిన మా బీడు భూమిలో సైతం
వేనవేల గులాబీ తోటల పరిమళాలు
అలాయిబలాయీల్లో ఆత్మీయతను కురిపించే
ఆ తెల్లని ఆకాశాలు
అల్లాహో అక్బర్ అంటూ ఆ ఆకాశాన్నే
నేలకు దింపే పిల్లి గడ్డాలు
దేశంలోని జాతీయ సమైక్యతకు
మ ఊరిలోనే ప్రాణం పోస్తుండేవి
మసీదు గడియారం 'అల్లా'రంతోనే
మా ఊరి దినచర్య మొదలయ్యేది
నా చలి ఉదయాల్ని టీ చుక్కలతో
వెచ్చబరిచే హనీఫ్ భాయీ
నొక్కుకుపోయిన నా సైకిలు బుగ్గలకు
ప్రాణాలూదే జబ్బార్మియా
జైలుబడి నుండి అమ్మవడినెప్పుడు చేరాలా
అన్న మా ఆరాటాలకు
ఇష్టమైన ఇంటిగంట కొట్టే ప్యూను జాఫరుమియా
వచ్చీరాని ఉర్దూపదాలతో
ఉబుసుపోని నా మాటల కబుర్లకు
భాషామధురిమల్ని పంచిపెడుతూ
భాష్యం చెప్పే బాషా భాయీ
వయసుకు చిన్నవాణ్ణయినా 'మామా' అంటూ
ఆత్మీయ కంఠాన్ని ఒలకబోసే యూసుఫ్ అల్లుడూ
ఏ ఒక్కరిలోనూ నాకు ముస్లిం కనిపించలేదు
ఏ ఒక్కరికీ నాలో హిందువు కనిపించలేదు
మానవత్వం నింపుకున్న ఇద్దరు మనుషులు తప్ప!
మా చుట్టూ బిర్యానీ రుచుల పరిమళాలూ
సేమ్యా పాయసాల తీపి ఘుమఘుమలూ తప్ప
మతవాసనల జాడలే కనిపించేవి కావు.
మానవత్వాన్ని చెరిపే ఏ సరిహద్దులూ మొలిచేవి కావు
మోకాళ్ళ మీద వంగుని నేనూ నమాజు చేస్తున్న
భంగిమలో ఉన్నప్పుడు
నా దేశ సమైక్యత మీద నాకు తెలియకుండానే
ఎన్ని బాల్య సంతకాలో!
ఒక భగవద్గీతతో పాటు
ఒక బైబిల్‌తో పాటు
ఒక ఖురాన్‌నూ తిరగేస్తున్నప్పుడు
నా మిత్రుడి కళ్ళల్లో
విస్ఫోటించిన ఒక మెరుపు సంతకం
నాకింకా గుర్తే!
ఎర్రని పింగాణీ పాత్రల్లోంచి
ఖీరాతో పాటు ఆప్యాయతను తోడి పెడుతున్న
ముస్లిం తల్లి రజియా బేగుం
ఇఫ్తార్ విందులో
మా అమ్మను గుర్తుకు తెచ్చేది.
పల్ల నర్సిమ్మకా పొట్టే, బహుత్ పడ్నేవాలా
అచ్ఛా లడ్కా హై అంటూ
ఖాసీం కుటుంబం మెచ్చుకోలు చూపు విసిరినప్పుడు
నాయిన ముఖంలో వెలిగిన
వేయి మతాబుల చిరునవ్వుల కాంతి
నాకింకా గుర్తే!
నా బాల్యపు పేజీల నిండా
కుడి నుండి ఎడమకీ, ఎడమ నుండీ కుడికీ
ఎన్ని తీపి జ్ఞాపకాల అక్షరాలో!
ఎన్ని ముషాయిరాలో, ఎన్ని గజళ్ళో!
నా బాల్యాన్ని ఒక ఖురాన్‌ను చేసి తిరగేస్తే
ఆ ఖురాన్‌ను మోసిన రెహాల్‌లు ఎంతమందో!
నా బ్రతుకు మలుపులో తారసపడిన
ప్రతి ముస్లిం మిత్రుడూ
నాకో రంజాన్ చంద్రుడే!


నా బ్రతుకు మలుపులో  తారసపడ్డ ఆ ఒకే ఒక్క రంజాన్ చంద్రుడికి శుభాకాంక్షలతో...:-) 

8 comments:

  1. చాలా బావుందండీ కవిత. షేర్ చేసినందుకు థాంక్స్!

    ReplyDelete
  2. simply superb..!! 'మన' బెజవాడని మళ్ళీ గుర్తుకుతెచ్చావు కదా... నేను నాలుగైదేళ్ళు ట్యూషన్ కి వెళ్ళిన నా ఫేవొరేట్ టీచర్ సుల్తానా మిస్..! ఏలూర్రోడ్డు రామమందిరం ఎదురు రోడ్డులో ఉండేవారు. సూర్యారావు పేట నూండీ రోజూ అక్కడికి వాకింగే. రంజాన్ రోజుల్లో సుల్తానా మిస్ వాళ్ళింట్లో అంతా ఉపవాసాలు ఉండేవారు..నక్షత్రం కోసమో, చంద్రుడు కోసమో ఎప్పుడు వస్తాడా అని వాళ్ళ అమ్మగారు మేడ మీదకి వచ్చి చూస్తుండేవారు... మేo పిల్లలం కూడా వెతికేవాళ్ళం ఎవరిమటుకువాళ్లమే అదిగదిగో..అని ముందు చెప్పేయాలని..:) నువ్వు బెజవాద కబుర్లు రాసినప్పుడల్లా నేనిలా ఏవో పాత రోజుల్లోకి వెళ్పోతుంటాను... నా ప్రాణాలని పన్నీటిలో ముంచి తోసే అందమైన రోజుల్లోకి..

    ReplyDelete
  3. కవిత ఎంత ఉన్నతంగా ఉందో... అనిపించటం కన్నా ఆ భావాలను సృస్టించిన కవి హృదయం గొప్పది అనిపిస్తుంది.
    మతాలూ,కులాలూ మానవత్వాన్ని మెరుగుపరచాలని మరోమారు గుర్తుచేసింది ఈ కవిత అభినందనలు.

    ReplyDelete
  4. బాగుందండీ...
    చాలా... చాలా... ;)

    ReplyDelete
  5. మానసగారూ,
    అద్భుతమైన షేర్ (Pun is not intended).
    మీ జ్ఞాపకాలు పంచుకోడంలో సామల సదాశివగారిని గుర్తుతెచ్చేరు. కొత్త కవి పరిచయం బోనస్.
    Hearty Congrats and A thousand thanks.

    ReplyDelete
  6. పుట్టినప్పుడు 'క్యార్.. క్యార్..'మని ఏడ్చారా? 'కవిత్వం.. కవిత్వం..' అని ఏడ్చారా అని నాకో డౌటు. కాలేజ్‌ రోజుల్లో కవి సమ్మేళనాలకు వెళ్లారంటే మీరు సామాన్యులు కారు. అమ్మా.. సరస్వతి నమోన్నమః ;)

    ReplyDelete
  7. *సురేశ్ గారూ, *ఫాతిమా గారూ, *రాజ్‌కుమార్ గారూ. నాతోపాటుగా ఈ కవితను, కవిత పట్ల నా అభిమానాన్ని కూడా పంచుకున్నందుకు థాంక్స్..! :)

    *తృష్ణగారూ... :)) అవునండీ, విజయవాడ కబుర్లు వ్రాయడం మొదలెడితే ఒక పుస్తకమే వ్రాయచ్చు కదా! ;). మీ మాటల్లో మన ఊరి పేరు వినపడగానే తన్నుకొచ్చే హుషారు చూడటం నాకు భలే సరదాగానూ, ఇష్టంగానూ ఉంటుంది. :)

    *మూర్తిగారూ, ఈ పదేళ్ళ క్రితం నాటి కబుర్లు మీకు ఆహ్లాదాన్ని కలిగించినందుకు సంతోషం. నాకంత అర్హత లేకపోయినా సదాశివంగారి వంటి గొప్పవారితో నా మాటలకు పోలిక పెట్టిన మీ అభిమానానికి ధన్యురాలిని. థాంక్యూ..

    *చాణక్యా...చెప్తా చెప్తా! :)))

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....