పుస్తకాలను పెనవేసుకున్న కబుర్లు


విజయవాడ వెళ్ళడమంటే నాకూ మా అక్కకీ మహా సరదా! అల్లుళ్ళిద్దరూ వస్తున్నారంటే అమ్మ చేతి అమృతపు రుచి పదింతలు కావడం ఒక కారణమైతే, నాన్నగారితో కలిసి ప్రతి సాయంకాలమూ అక్క-నేనూ పుస్తకాల ప్రదర్శనకు కాళ్ళ నొప్పులొచ్చే దాకా తిరగడమన్నది రెండో కారణం. పి.డబల్యూ.డి గ్రౌండ్స్‌లో అక్క పిల్లల చేతులు పట్టుకు పరుగెడుతూ, వాళ్ళ మూడ్ మారిపోక మునుపే వీలైనన్ని పుస్తకాలు కొనాలని ఉబలాటపడుతూ, సిమ్లా బజ్జీల వాసనకు ఒకసారి, గాలిలో తేలి వస్తున్న మసాలా ఛాట్‌ ఘుమఘుమలకు మరో సారి, ముంత జున్ను కోసం ముచ్చటగా మూడోసారి, పుస్తకాల నుండి కాస్త పక్కకు జరిగి, ఇంట్లో సరిగా తినకపోతే అమ్మ చంపేస్తుందన్న మాటను ఒకటికి వందసార్లు విధిగా గుర్తు తెచ్చుకుంటూనే ఇవన్నీ తినేస్తూ తిరగడం, జీవితంలోని అత్యంత మధురమైన అనుభవాల్లో ఒకటి. అబ్బా, సొంత ఊరిలో ఏం మహత్యం ఉందో కానీ, తల్చుకుంటే చాలు ఎన్ని వేల కబుర్లు ఉప్పొంగుతాయో!

ఒకానొక మల్లాది నవలలో, హీరో ప్రతి ఏడాదిలానే పుస్తక ప్రదర్శనకు వెళ్ళి, ఎప్పటిలానే ఎంతగానో వెదికి వెదికి, చిట్టచివరకు ఒకేఒక పుస్తకంతో ఇంటికి చేరతాడుట. నిద్రపోయే ముందు పుస్తకం మూసి, తన లైబ్రరీలో పెట్టబోతూ, ఎందుకో గత సంవత్సరం ఏం కొన్నానోనని చూడబోతే, అది - "జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం ఎలా" అన్న పుస్తకం. ఆశ్చర్యపోతూ ఆ రోజు కొన్న పుస్తకం పేరు చూస్తే, అదే ఇది. వెంటనే రెండేళ్ళ క్రితం కొన్నది, మూడేళ్ళ క్రితం కొన్నదీ, అసలంతకు ముందు కొన్నవన్నీ లాగి చూడబోతే...ప్రతి పుస్తకం మీదా ఇదే పేరు వెక్కిరిస్తూ కనపడుతుందట. హీరోగారికి అన్నేళ్ళలోనూ పెరిగిన జ్ఞాపకశక్తి అదీ!

అచ్చుగుద్దినట్టు ఇదే కథ కాకపోయినా, ఈ స్థాయిలో కాకపోయినా, మిత్రులకు బహుమతులుగా ఇచ్చేసి కొన్ని, మరీ దగ్గరవాళ్ళు వేడుకోళ్ళు సైతం వినకుండా విదిల్చికొట్టి లాక్కుపోయినవి కొన్ని, పోగొట్టుకున్నవి కొన్ని -ఏతావాతా కొన్నవే కొంటూండటం నాకూ మా అక్కకూ రివాజు. ఈ సారి సఖ్యంగా ఒక ఒప్పందానికి వచ్చాము. "నాదనేదీ నీదేనోయ్--నీదనేదీ నాదే.." అంటూ ప్రేమలు ఒలకబోసుకుని, మార్మిక కవిత్వాలూ(నా కోటా..) - పిల్లల పుస్తకాలూ(మా అక్క వాటా) మినహాయించుకుని, మిగిలినవన్నీ ఇద్దరం కలిసి కొనుక్కోవాలని రాజీకి వచ్చి, సంచీల నిండుగా కొనుక్కుని విప్పారిన మొహాలతో ఇంటికెళ్ళాము. వాటిలో కొన్ని ఎంపిక చేసిన పుస్తకాల గురించి - ఏవో నాలుగు మాటలు - అవి నాకు మిగిల్చిన అనుభవాలూనూ!కవిత్వం : అందమైన కవిత్వం చదవడంలో ఉన్న మజా మాత్రం ఇంకెందులోనూ దొరకదు నాకు. అసలా మహత్తేమిటో తెలిస్తే బాగుండును.

"ఆకాశం" -బి.వి.వి.ప్రసాద్

బి.వి.వి గారు ఇప్పటి కవుల్లో నన్ను అత్యంత ఆశ్చర్యంలో ముంచిన వ్యక్తి. ఎక్కడా విషాదపు ఛాయలు కనపడకుండా, ఆశావహ దృక్పథంతో, ఆర్ద్రతతో "జీవితమెలా ఉన్నా జీవించడమే ఆనందంగా ఉంటే చాలు" అన్న భావాన్ని ఈ కవిలా బలంగా కవిత్వంలోకి చొప్పించిన వాళ్ళు అరుదు. బహు అరుదు. నన్నింకా ఆశ్చర్యంలోకి నెట్టేదేమిటంటే, ఆయనలోని ఈ తత్వం "ఆకాశం"లో మాత్రమే కనపడ్డది కాదు. "దృశ్యాదృశ్యం" కంటే ముందే కవి రచించిన "ఆరాధన"లో కూడా ఇదే భావధోరణి. (కవి యువకులుగా ఉన్న రోజుల నుండీ అన్నమాట). బి.వి.వి గారి హైకూలు కూడా నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా "పూలు రాలాయి" సంపుటి. హైకూ తత్వమంతా తెలిసిన వారవడం వల్లేమో, కొన్ని కవితల్లోనూ ఆ "హైకూ క్షణాల్లో" నిలబెట్టగల్గిన నేర్పు కనపడుతుంది. నిస్సందేహంగా మనకున్న అత్యంత ప్రతిభావంతులైన కవుల్లో బి.వి.వి గారొకరు. ఈయనలా అక్షరాల ఆసరా తీసుకుని అమ్మలా అనునయించే కవిత్వం, ఈ మధ్య కాలంలో నాకెక్కడా తారసపడలేదు. మనసును చల్లబరిచే మంచి గంధమే ఈ కవిత్వం. "శాంతి దూతలు" ఈయన కవితలు. శ్రీశ్రీ ఎక్కడో అన్నట్టు, "క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం" మిగిల్చే శక్తి గల కవిత్వాన్ని సృజించిన కవి. (ఆకాశంపై నా స్పందన సవివరంగా ఇప్పటికే బ్లాగులో వ్రాసి ఉన్నాను కనుక, మళ్ళీ మొత్తం చెప్పి విసిగించను. :)

"దూప" -రవీందర్ వీరెల్లి

నలభై కవితలూ చదివేశాక, "కవిత్వమొక తీరని దాహం" కదూ అని గుర్తొస్తుంది. ప్రకృతీ, కొన్ని జ్ఞాపకాలూ పసందైన పదాలలో ఒదిగి కూర్చున్న తీరే ఈ సంపుటికి ప్రాణం. హేమంత తుషారాలూ, శారద రాత్రులూ చాలా మందికి ప్రత్యేకంగా కనిపిస్తాయి కానీ, అరుణ వర్ణపు రెక్కలతో ఆకాశం భూమి మీదకు వంగిన ప్రతి క్షణాన్నీ ఒడుపుగా తన హృదయంలోకి ఒంపుకునే వారే అరుదు. ఆ అందాలన్నీ తమ కవిత్వంలో పునఃప్రతిష్టించుకునే వారు ఇంకానూ. ఇదేదో నేను మాటవరసకు అంటున్నానని మీరనుకోకూడదు కనుక, "దూప" నుండి కొన్ని సాక్ష్యాలు -

"పడమటి కొండల్లో కోసిన
వెలుగు పంటను
తూర్పు కల్లంలో పైకెత్తి
తూర్పార పడుతూ
సూర్యుడు"

"పడమటి కొండల చాటున మాటేసి
వెలుగును మత్తుగా వాటేసుకుంటున్న చీకటికిని చూసి
చిరు సిగ్గుతో ఓ సంధ్య ఎరుపెక్కుతుంది"

"గుక్కపట్టి ఏడుస్తున్న రాత్రికి
వెన్నెల పాలిచ్చిన వెండిముద్ద
అడ్డున్న మేఘంపై విసుక్కుంటూ
ఇప్పుడే వెళ్ళిపోయినట్టుంది
చీకటి వేళ్ళను చీకుతూ రాత్రి కమ్మగా నిద్రపోతుంది" (ఈ కవిత పూర్తి పాఠం ఎంకి పాటనే గుర్తు తెస్తుంది..)

- ఇవి మచ్చుకి మాత్రమే. ఇలాంటివింకా ఉన్నాయీ సంపుటిలో. అలాగే, బాధనూ కన్నీళ్ళనూ ప్రతీ కవితలోనూ అలవాటుగా చొప్పించడమే తప్ప, ఆ బాధల లోయల లోతులకు చేరిన తడి పాదాల గుర్తులను ఎక్కడ చూస్తున్నాం? ఎన్నని చూస్తున్నాం? ఆ తడి ఒక్క కవితలో కనపడ్డా చాలనుకుంటే, దూపలో "కాసిన్ని నీళ్ళయినా.." ఆ సాహసం చేసినట్టు తోచింది నాకు.

"పునరపి" -మో (వేగుంట మోహనప్రసాద్)
ఏం పుస్తకమిది! అనుభూతులనూ, ఆలోచనలనూ, జీవిత చిత్రణనూ ఇలా కూడా వ్రాయడం సాధ్యమవుతుందా అన్న ఆలోచనలోకి నెట్టే రచన. బహుశా, కవులు, కవిత్వమే వ్యక్తిత్వంగా కలవారు తమ జీవితాన్నుండి ఎంచుకున్న అరుదైన క్షణాల గురించి వ్రాయవలసి వస్తే, అది ఇలాగే ఉంటుందేమో మరి. మో గురించి నాకు ఆట్టే ఏమీ తెలియదు కనుక, అసలీ పుస్తకమేమిటో నాకర్థం కాలేదు మొదట. అయితేనేం, అసలు చదవడం ఆపాలనిపించాలి కదా! సీతారాం మో గురించి మాట్లాడుతూ, ఇలా అంటారొక చోట :

"వేదనల నీడలుగా కదిలే కవిత్వంలో "మో" అన్వేషకుడిగా కనిపిస్తాడు. ఈయన కవిత్వమొక దుఃఖాన్వేషణ. దేని గురించి వెదుకులాడుతున్నాడో తనకే తెలీని, అన్వేషించదగినదేదో ఉండే ఉండాలనీ, తాను వెదుకుతున్నాను కనుకనే దొరకదగినదేదో ఉండే ఉందనే ధోరణి "మో"లో కనిపిస్తుంది. అందువల్ల ఈయన కవితల్లో apparent irrelevance and unrelatedness of things మనకు ఎక్కువగా కనిపిస్తాయి. "

నిజమే ననిపించింది. వెర్రి ఆవేశం, తనతో బలవంతంగానైనా లాక్కుపోయే దుడుకుతనం, మన మెదడును ముప్పతిప్పలు పెట్టే అక్షరాలగారడీ, అటుతిప్పీ ఇటుతిప్పీ ఎడారిలో పరుగుల్లా మనను హడావుడి పెట్టి వదిలేసి, అకస్మాత్తుగా పుస్తకం మూసేయాలన్నంత కోపం తెప్పించి, మళ్ళీ చప్పున ఏదో స్ఫురించినట్టై అదాటున పుస్తకం తెరవాలనిపింపజేసి...కవ్వించి, నవ్వించి, ఏకాంతంతో క్షణకాలపు ముడి వేసి... - మో! అదీ నాకు మో!

కొన్ని నవలలు :

అక్కర్లేని ప్రయాణాలు మీద పడినప్పుడు, ఆ రైల్లో పొద్దున్నే లేచి (రాత్రి నా వల్ల కాదు కాబట్టి;)) ఫ్రెష్ అయిపోయి, మాంఛి కాఫీ సాధించి (రైల్లో..మాంఛి కాఫీ - ఇందుకే కదూ నవ్వారు! ఉంటాయుంటాయి- అక్కడక్కడా నీళ్ళు కలపని మంచి కాఫీలుంటాయి - కాస్త అర్ధించాలి) - ఇలా ఆపకుండా నవల్లు చదివేయడం భలే ఇష్టం నాకు. అదేమిటో కానీ, రైల్లో నాకు వేరే ఏ ఇతర సాహితీ ప్రక్రియా చదవాలనిపించదు. మరీ ఆవేశం ముంచుకొస్తే నేనే వ్రాసేస్తాను.

"ఏదీ నిన్నటి స్వప్నం" - బలభద్రపాత్రుని రమణి

బహు చక్కటి కమర్షియల్ రచన. ఆవిడ ఇతర రచనల్లానే ఇదీ ఆపకుండా చదివిస్తుంది. ఒకటిన్నర పేజీల ప్రేమకథ మాత్రం రసవత్తరంగా ఉంది. రెండోసారి చదవలేం, చదవక్కర్లేదు కూడా!

"కలవారి కోడలు" - గోగినేని మణి

నవ్యలో సీరియల్గా వచ్చిందట. బహుమతి పొందిన నవల. వారు వైజాగ్‌లో ఉంటారట. మా అక్క వారి కథల సంపుటి కోసం ఇల్లు వెదుక్కుంటూ వెళితే, "మొగలిపువ్వు"తో పాటు ఇదీ బహుమతిగా ఇచ్చారుట. నాకు మణిగారి శైలి ఇష్టం. ఏ ఆర్భాటాలూ అనవసర వర్ణనలూ ఉండవు. ఆ సరళతే ఆవిడ రచనలకు అందం తెచ్చేది.

"స్వేచ్ఛ" -ఓల్గా

ఆడపిల్లలకు ఈ దేశంలో చాలా చిత్రమైన వాతావరణం ఉంటుంది. చాలా కుటుంబాల్లో, స్వేచ్ఛ ఉండీ లేనట్టుగా ఉంటుంది. పిల్లలు చదువుకోవాలి, నలుగురిలోకీ చొచ్చుకుపోయి నెగ్గుకురాగల సామర్థ్యం ఉండాలి. బిల్లులన్నీ కట్టుకోగల, ఇంటిని నడుపుకోగల తెలివి ఉండాలి. ఉద్యోగం చేయాలన్న ఆశ ఉండాలి, అక్కడా గెలవాలి. అన్నీ బానే ఉంటాయి కానీ, ఇన్ని ఆలోచనలు, ఆత్మాభిమానమూ, తన మీద తనకు నమ్మకమూ ఏర్పడ్డాక, అన్ని విషయాల్లోనూ తమ ఆశలు నెరవేరాలని కోరుకుంటారని మాత్రం చాలా మంది పెద్దలకు తెలీదు. అదో దీన స్థితి. జాలిగొలిపే పరిస్థితి. ఓల్గా స్వేచ్ఛలో ఆడపిల్ల కోరుకునేదేమిటో వ్రాస్తారు. ఈ స్వేచ్ఛా కాంక్షకు నూటికి అరవై మంది అతీతులు కారు. అందులో అనుమానమే లేదు. చాలా సన్నివేశాలు సహజంగా, ఏ మాత్రం నాటకీయత లేకుండా చులాగ్గా సాగిపోయాయి. ముగింపు మాత్రం నాకు నిరాశగా అనిపించింది. అహ, ఒక జంట విడిపోయిందన్న బెంగేం కాదు. జీవితాన్ని అంతలా అనుభవించాలన్న ఆశ ఉన్న మనిషికి, పెళ్ళి అంటే ఇంకాస్త మెరుగైన అవగాహన ఉంటే బాగుండనిపించి. అంతే.

"నాన్నా-నేనూ" - బుజ్జాయి

మొదటిసారి ఎవరు చెప్పగా విన్నానో గుర్తు లేదు కానీ, "కృష్ణశాస్త్రి గారి అబ్బాయి కథ. ఆయన జీవితం మొత్తం బడికెళ్ళలేదుట తెలుసా" అన్న ఒక్క మాటా పట్టుకు కొన్న పుస్తకం ఇది. పుస్తకం చదివినంత సేపూ మళ్ళీ మళ్ళీ అదే ఆలోచన. పిల్లలంటే ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళూ ఉంటారా అని! బడికి పంపకుండా అలా ఎలా, అని విస్మయం! "నాతో ఉండడమే వాడికో ఎడ్యుకేషన్" అన్న కృష్ణాస్త్రి ధైర్యం ఎంత అచ్చెరువొందించిందో, బాపిరాజు వంటి మహామహుల ఒళ్ళో కూర్చుని, పూర్వజన్మ పుణ్యఫలమేనేమో అనిపించే తీరులో, బుజ్జాయి చిత్రకళలో ఓనమాలు నేర్చుకుని, స్వీయముద్రతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క్రమమూ అంతే ముచ్చటగొలిపింది. బుజ్జాయిది అదృష్టమేనేమో తెలియదు కానీ, అసూయపడకుండా ఉండలేకపోయాను. నచ్చిన కళతో జీవితకాలపు సాహచర్యం ఎంత మందికి దొరికే వరం?!

కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు - త్రిపురా రహస్యం - చాగంటి వారి ప్రవచనాల్లో దీని ప్రస్తావన విన్నాను. మొన్నా మధ్య అరుణాచలం వెళ్ళినప్పుడు, మహర్షి ఆశ్రమంలో పుస్తకాలు తిరగేస్తుంటే ఇదీ కనపడింది. భలే సంబరపడుతూ కొనుక్కున్నానా, సుబ్రహ్మణ్యుడి గురించి కూడా చాగంటి వారు చెప్పిన పేజీలు తప్ప మరేమీ అర్థం కాలేదు. నా స్థాయికి సరిపోవనిపించింది. మహర్షి లేఖలు, "ఆనందం నీకు సహజమైనదే" ఇతరత్రా పుస్తకాలు బాగా నచ్చాయి. ఇష్టంగా చదువుకుంటున్న పుస్తకాల్లో ఇవీ కొన్ని.

"Veronika decides to die" -By Paulo Coelho : ఓ నేస్తం పంపిన బహుమతి. అదీ నాకు ఉవ్వాయి వచ్చి రోజుకి పది పదిహేను గంటలు సీలింగ్ ఫేన్ రెక్కల పరిభ్రమణాన్ని చూస్తూ, చేతి వేళ్ళను ఒకటికి వంద సార్లు లెక్కేసుకుంటూ గడిపిన రోజుల్లో! ఇది చాలా మంచి పుస్తకమట కానీ, నాకెందుకో ఏ చలనమూ కలుగలేదు.

"If God Was A Banker" -Ravi Subrahmanian

నాకో వ్యసనం ఉంది, పుస్తకం మొదలెట్టాక, అచ్చకపోయినా అది అవ్వగొట్టాలనే తపన. ఇది చదివాక, అది మహా దుర్వ్యసనమని అర్థమైంది. చాలా పెద్ద తప్పు చేశాను ఇది చదివి. మీరు చదవకండి. చెడు పుస్తకాలు చదివినప్పుడు మనసులో ఓ వెర్రి బెంగ పుడుతుంది కదా, అలాంటిదేదో కమ్ముకుంది ఇది చదివాక. రెండు గంటల్లో చదవడం అయిపోయినా, ఆ రోజంతా అన్యమస్కంగానే ఉన్నాను.

****************

మంచి కవిత్వమేదైనా అందుబాటులో లేకపోయినా, ఆలస్యంగా చదివినా నాక్కాస్త బెంగగా ఉంటుంది.

"నీవు నీ కవితలను ఈ దేశంలో కాదు, వేరే చోట వినిపించు
ఎందుకు వినిపిస్తారు రాయికీ రత్నానికీ తేడా తెలీని చోట గాలిబ్!" - అన్న మాటలే కవులకెవరైనా చెప్తారేమోనని. కవిత్వమనే కాదూ, మంచి పుస్తకాలన్నింటి విషయంలోనూ అదే బెంగ. అందుకనీ, ఈ బెంగలకు ఆస్కారమివ్వకుండా...2013కి కొనవలసిన పుస్తకాల జాబితా తయారు చేసి అట్టే పెట్టుకోవాలి , సాయం చేద్దురూ..!

8 comments:

 1. మానసా, క్రింద లింక్ లో ఉన్న postలోని కామెంట్లలో ఒకరికి నేను కొన్ని లింక్స్ ఇచ్చాను..ఆ లింక్స్ లోకి వెళ్తే బోలెడు మంచి పుస్తకాల జాబితాలు దొరుకుతాయి..good luck for 2013 :-)
  http://trishnaventa.blogspot.in/2011/12/blog-post_19.html

  ReplyDelete
 2. విజయవాడ.. పిడబ్ల్యూ గ్రౌండ్స్... మిర్చి బజ్జీలు -- పుస్తకాల సంగతి తర్వాత ఇవెందుకు గుర్తుచేశావ్, మానసా! :(

  "మంచి కవిత్వమేదైనా అందుబాటులో లేకపోయినా, ఆలస్యంగా చదివినా నాక్కాస్త బెంగగా ఉంటుంది. "

  ఏం చెప్పమంటావ్.. నీ నించి 'నిర్వికల్ప సంగీతం ' గురించి విన్నప్పుడు నాదీ అచ్చు ఇదే బెంగ..

  ఇవి చదివావా??

  మో - నిషాదం
  బలభద్రపాత్రుని రమణి - ఆలింగనం (నాకు బాగా నచ్చేది మాత్రం 'ఏదీ నిన్నటి స్వప్నం ' )
  బిభూతిభూషణ్ బంధొపాధ్యాయ - వనవాసి

  ReplyDelete
 3. చెడు పుస్తకాలు చదివినప్పుడు మనసులో ఓ వెర్రి బెంగ పుడుతుంది కదా...వావ్ నాకే అనుకున్న..ఇది అందరికి కలుగుతుందా? టపా ఎప్పటి లా బాగుంది ....

  ReplyDelete
 4. పుస్తకాలను సునాయాసంగా మీరు సమరైజ్ చేసిన విధానం బావుంది. ఎంత శ్రద్ధగా, ఇష్టంగా మీరు పుస్తకాన్ని సమీపిస్తారో మీ మాటలు చెబుతున్నాయి. నేను చదవాలనుకొని చదవని కొన్ని పుస్తకాలని ఇక్కడ రెండు ముక్కల్లో పరిచయం చేసి, అవి చదవని బెంగని కొంత పోగొట్టారు.

  మీరు చదవొద్దు అన్న పుస్తకం లాంటి అనుభవం నాకు గోపీచంద్ అసమర్ధుని జీవయాత్ర చదివినప్పుడు కలిగింది. మనిషికి తెలివి పెరిగి, హృదయం ఆవిరైపోతే జీవితం ఎలా విషాదభరితం అవుతుందో ఆ నవల చదివాక బోధపడింది. గోపీచంద్ ఎందుకు రాసినా, ఇది నా అనుభవం. బహుశా నా మొదటి ఇరవైలలో చదివి వుంటాను. చదివినప్పుడు రెండురోజులు మామూలు మనిషి కాలేక పోయాను. అయితే, ఒక పుస్తకం మనిషిని ప్రేమలోకీ, కాంతిలోకీ, వివేకంలోకీ నడిపించకపొతే, దానిని ముగించాక లోలోపలి బెంగలకో, ప్రశ్నలకో జవాబు దొరకకపొతే, అది సాధించే సాహిత్య ప్రయోజనమేమిటో నాకు బోధపడదు.

  త్రిపురా రహస్యం నాకు చాలా ఇష్టమైన పుస్తకాలలో ఒకటి. అయితే రమణాశ్రమం వారిది నేను సరిగా చదవలేదు. మరొకరిది చదివాను.

  అరుణాచలం వెళ్ళే మనవంటి సాహిత్య జీవులు కొనాల్సిన పుస్తకం భగవాన్ స్మృతులు. చలం గారు, మహర్షి గురించి సేకరించి రాసిన జ్ఞాపకాలు. ఈ పుస్తకం చదవటం నా జీవితం లో ఒక గొప్ప మలుపుకి కారణమయింది. మహర్షి ఒక జ్ఞాని అన్నది తరువాత, ఒక మనిషి ఇంత సరళంగా, ఇంత దయగా జీవించే వీలుందా అని ఆశ్చర్యం కలిగింది. తరువాత ఆధ్యాత్మికత అంటే అంతకు పూర్వం ఉన్న అనుకూల, ప్రతికూల భ్రమలన్నీ భగవాన్ మాటలతో తొలగిపోయాయి.

  మీ విజయవాడ పుస్తక ప్రదర్శన లోనే నేను కూడా అమూల్యమైన నిధుల్ని పోగేసుకొన్నాను. త్రిపురారహస్యం అక్కడే కొన్నాను. మరింతగా రమణ మహర్షినీ, ఖలీల్ జిబ్రాన్ నీ, నిసర్గదత్త మహారాజ్ అయాం దట్ నీ అక్కడే సంపాదించుకోన్నాను.

  మీ వ్యాసం కలిగించిన ఉత్సాహం లో చాలా రాసేసినట్టున్నాను...

  ReplyDelete
  Replies
  1. ప్రసాద్ గారూ - మీ మాటలు కూడా మీ కవిత్వంలాగే హాయిగొలుపుతాయండీ! త్రిపురా రహస్యం మీరెవరిది చదివారు ? అది ఎలా ఉంది? వీలైతే వివరం పంచుకోండి. భగవాన్ స్మృతులు చదవాలండీ, లిస్ట్‌లో ఉంది. ఖలీల్ గిబ్రాన్, "I am that" గురించి మీ నుండి విన్నాకా, మరికొంత నెట్‌లో సమాచారం సాధించాను. 2013లో తప్పక మరింత మంచి సాహిత్యం చదువగల ననుకొంటున్నాను. :)
   Thanks a million for the wonderful response.

   Delete
  2. మానసా.. ఎక్కడో పొరబడ్డాను. త్రిపురారహస్యం నేను చదివింది కూడా రమణాశ్రమం వారిదే. పుస్తకంలో ఆ వివరాలు ఇలా వున్నాయి. శ్రీ త్రిపురారహస్య జ్ఞానఖండసారము (బాలప్రియ వ్యాఖ్యాసహితము)రచన: శ్రీ పోలూరి హనుమజ్జానకీరామశర్మ. ఈ పుస్తకం లో మనస్సు గురించి, సత్యం గురించి చేసిన విశ్లేషణలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
   తత్వ చింతనకు సంబంధించి నాకు బాగా ఇష్టమైన పుస్తకాల లిస్టు చెప్పమంటే కొన్నిపేర్లు చెప్పగలను కానీ, అవి సాహిత్యపరిధికి అవతలివి గనుక ఇక్కడ రాయటం లేదు.
   సాహిత్య పరిధిలోనిదే ఒక పుస్తకం గురించి మాత్రం చెబుతాను. అది మైఖేల్ నైమీ రాసిన మిర్దాద్ నవల. ఇది తెలుగులో పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రచురణగా లభిస్తుంది. ఓషో 'మనిషి ఈ భూమి మీద బ్రతికినంత కాలం 'మిర్దాద్' పుస్తకం శాశ్వతం గా జీవించి వుంటుంది' అంటారు. నా వరకూ ఆ పుస్తకం చదవటం ఒక గొప్ప అనుభవం. నెట్ లోకంలో వెదికితే, మిర్దాద్ ఇంగ్లీషు పుస్తకం దొరకవచ్చు.

   Delete
  3. "మిర్దాద్"- అవునాండీ? నేను వెదుక్కుంటానైతే! :)) థాంక్యూ!

   Delete
 5. తృష్ణగారూ - ఎన్ని పుస్తకాలండీ, అది చదివి తేరుకోవడం అయ్యే పనేనా అసలు. నేను ఆ జాబితాలో చాలా పుస్తకాలు చదివాను కానీ, చాలా బోలెడు చదువలేదు :)))). థాంక్యూ! వ్రాసి పెట్టుకున్నాను.
  నిషీ- :) చూశారా, విజయవాడ అమ్మాయిలిద్దరూ ఊరిపేరు చూడగానే వచ్చేశారు :). ఊఁ..PWD grounds -అక్కడే పసితనపు జ్ఞాపకాలన్నీ చిక్కుపడిపోయాయి; పుస్తకాలూ, దీపావళి టపాకాయలూ, ఏ ఏటికాయేడు కొత్తగా కనిపించే ఎగ్జిబిషన్‌లూ...- అన్నీ అక్కడేగా! :) "మో" నిషాదం తప్ప మిగిలినవి చదివేశాను నిషీ, నిర్వికల్ప సంగీతం నీ దగ్గరకొస్తుంది చూడు - ఎప్పుడూ అని మాత్రం నిలదీయకు :)))
  @Anon - థాంక్యూ! ఒకరిద్దరికని కాదులెండి. చాలా మందికి ఉండే సమస్యే! :)

  ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....