తెలుగు పాటలకు పట్టు పరికిణీలు

మలి ప్రచురణలు : నమస్తే ఆంధ్రా జనవరి 2012 సంచికలోనూ, జంధ్యావందనంలోనూ..


కొబ్బరి నీళ్ళ జలకాలాడినంత హాయిగా
లిపి లేని కంటి భాషలేవో చదివి వివరించినట్టుగా.....
లేత చలిగాలులేవో చక్కిలిగింతలు పెడుతున్నట్టుగా
సరిగమపదని స్వరధారలో తడిసిపోతునట్టుగా.......

పై వాక్యాలు చదువుతుంటే, మనసులో ఏవో స్పష్టాస్పష్ట జ్ఞాపకాలు మెదులుతున్నాయా? స్వప్న రాదారుల్లోకి పగలల్లా అలసిన మనసు పయనం మొదలెట్టబోయే క్షణాల్లో మీ చెవి పక్క రేడియో రహస్యంగా వినిపించిన రాగాలేమైనా గుర్తొస్తున్నాయా? నిజమే! ఇవన్నీ ఆ మళ్ళీ రాని, మదినొదిలి పోని రోజుల మధుర జ్ఞాపకాలే! అంతే కాదు,  ఆ అనుభూతులన్నింటి వెనుక, ఒకటే పాటల తోటలో పుట్టిన జట్టు చేసిన అద్వితీయమయిన కృషి, అన్యులకు సాధ్యం కానిదనిపించేంత చాకచక్యం చెలిమి చేసి ఉన్నాయి.

ఈ సరికే మీలో కొందరు సినీ అభిమానులకు ఇవి ఏ దర్శకుడి వరదానాలో అర్థమైపోయి ఉంటుంది .  సినీ గేయ రచయితలంటే అపార గౌరవం ఉండి, మనం ఒక పాటను తల్చుకున్న ప్రతి సారీ, సదరు రచయితనూ స్మరించి తీరాల్సిందేనన్న సూత్రాన్ని బజ్‌లో మనందరికీ పంచిన సాహితీ మిత్రులు భాస్కర్ వంటి వారికి మాత్రం, వేటూరి కలం కనపడి ఉంటుంది. దశాబ్దాల పాటు తెలుగు సినీ సంగీతానికి వన్నెలద్దిన ఒక అపురూప, అమృత గళం .. - బాలూ గుర్తొస్తున్నాడంటే..ఆశ్చర్యమొకింతైనా లేదు నాకు!

అందరి సంగతి తెలీదు కానీ, నా వరకూ - ఒక్కో పాట, జీవితంలోని ఒక సందర్భంతోనో, ఒక మనిషితోనో, అనుభవంతోనో ముడిపడిపోయి, మమేకమైపోయి, ఎన్నేళ్ళ తర్వాత విన్నా, తిరిగి తీసుకు వెళ్ళి ఆ గతపు వాకిలి ముందే నిలబెడుతుంది. మస్తిష్కంలో మూలకు ఒదిగి మరుగునపడ్డాయనుకున్న ఆనాటి తీపి తలపులు, మర్చిపోయామనుకున్న జ్ఞాపకాలు ..చిమ్మ చీకటి ఆవరణలో వెలిగిన ప్రమిద చుట్టూ పరుచుకునే వెలుగులా, మళ్ళీ ఒక్కసారిగా  చుట్టుకుపోతాయి.

నా ఒరియా రూమ్మేట్, ఉత్కళిక, శనాదివారాల్లో పొద్దున్నే హాల్‌లో లాప్పీ బేబీని పెట్టుకుని గజల్స్ వినేది. ఫ్లాట్‌లో ఇద్దరమే ఉండేవాళ్ళం కాబట్టి, నేనూ నా రూం నుండి బయటకు వచ్చి, నచ్చకపోయినా సరే, సుప్రభాతం విన్నంత శ్రద్ధగా "గం కా ఖజానా తేరాభీ హైన్, మేరా భీ.." , "ఆజ్ జానే కీ జిద్ నా కరో.." అన్న పాటలు ఆమె పుణ్యమా అని కొన్ని నెలల పాటు విని ఉంటాను. ఇది జరిగి మూడేళ్ళు దాటిపోతున్నా, ఆ పాటలెక్కడైనా వినపడితే, వెనువెంటనే ఆ అమ్మాయి గుర్తొస్తుంది. అప్పుడే శనివారం వచ్చేసిందా అనిపిస్తుంది. లేదా ఆదివారపు ఉదయం ఆడవాళ్లలో సహజంగా కలిగే అందమైన బద్ధకం కమ్ముకుంటుంది. పాటైపోయాక నిరాశలూ, నిట్టూర్పులూ పరుగులూ మామూలే! 

అలాగే, నేను పైన ఉదహరించిన పాటలన్నీ, నా దృష్టిలో, నా మాటల్లో చెప్పాలంటే, రేడియో పాటలు. నేను చిత్రీకరణ ఎలా ఉండి ఉంటుందో అన్న ఆలోచన కూడా లేకుండా, ఒళ్ళంతా చెవులు చేసుకుని ఆనందంగా విని పాడుకున్న పాటలు. దర్శకుడు, సంగీత దర్శకుడు, గాయనీగాయకులు, గీత రచయితల అభిరుచులు-నైపుణ్యాలు-పరస్పర సహకారాల మీదే ఒక గీతం చలనచిత్ర చరిత్రలో ఎన్నాళ్ళు మనగలదన్న అంశం ఆధారపడి ఉంటుంది. " రెహ్మాన్ దగ్గర చక్కటి బాణీలను కొల్లగొట్టాలంటే మణిరత్నమే!" , "రాజమౌళికి చేసినట్టు కీరవాణి వేరెవ్వరికీ చెయ్యలేడేం చెప్మా!" , "ఇళయరాజా ఒక సంగీత సముద్రం, ఆణిముత్యాలు సాధించుకుంటారో, నత్తగుల్లలేరుకుని తృప్తిపడతారో..అది దర్శకుడి అభిరుచిని బట్టి ఉంటుంది.." , "వేటూరి బూతు పాటలు రాశారా? ఆ మహానుభావుడకేం ఖర్మ ? దర్శకులలా కావాలంటూ వెంట పడ్డారేమో...."   --- ఇలా ఎన్నో కబుర్లు, అవాకులూ-చెవాకులూ చిత్ర పరిశ్రమలో వింటూనే ఉంటాం. ఏతావాతా వారు చెప్పేదేమయ్యా అంటే, దర్శకుడి ప్రతిభను బట్టే, ఏ రంగంలోని వారికైనా పేరొచ్చేది అని!

ఇలాంటి మాటలనే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకుండా,  మన పక్కింటమ్మాయిలా కనపడే పూర్ణిమను కథానాయికగా చూపించడమూ, ఒక "గ్యాంగ్ లీడర్"ను "చంటబ్బాయి"గా మలచగలగడమూ, హాస్యంతో హృదయాలను కొల్లగొట్టడమూ, తనకు వెన్నతో పెట్టిన విద్యేమో అనిపించేంతలా రాణించిన దర్శకులొకరు తెలుగు పరిశ్రమకూ ఉన్నారు.

నేను ఇంత మంది దర్శకుల్లో ఈయన్నే ఎంచుకోవడానికి వెనుక ఒక కారణం ఉంది. ఆయన అసలు సిసలు తెలుగు దర్శకులు. తెలుగుతనాన్ని మాత్రమే తన చిత్రాల్లో నింపిన దర్శకులు. పరికిణీ అమ్మాయిలు, తెలుగు తిట్లు, తెలుగుతనం ఉట్టిపడే పాటలు, ఆరోగ్యకరమైన హాస్యాన్ని ఆంధ్రులకు పంచిన నిఖార్సైన ఆంధ్రావాలా! ఆనందాల ఊయలలో ఓలలాడించి, సంగీత సాహిత్యాలతో మెరుగులద్ది, తెలుగు చిత్రానికి కొత్త ప్రాణాన్నిచ్చిన హాస్య బ్రహ్మ -- పరిచాయాలక్కరలేని పండిత పామర మనోరంజకుడు -- జంధ్యాల!! 

అటువంటి అభిరుచి ఉన్న దర్శకుల చిత్రాల్లోని పాటల సంగీతంతో పాటు, సాహిత్యం కూడా తెలుసుకోదగ్గదిగానే ఉంటుందని చెప్పేందుకు, చాటేందుకు ఈ చిరు ప్రయత్నం!

జంధ్యాల సినిమాల్లో ఎక్కువ పాటలు వేటూరే వ్రాశారు. అన్నీ వెన్నాడే గీతాలే! ఆకాశవాణిలో మ్రోతమోగిపోయిన అజరామరమైన అద్భుతాలే ! మచ్చుకు కొన్ని :
"నీ కోసం యవ్వనమంతా.." అన్న పాటలో, వేటూరి కలం చూడండి - చలి చీకటి చీర మీద చెక్కిన అక్షరాల్లో ప్రణయ భావనలను చూడమని తొందరపెట్టడం లేదూ :
"అటు చూడకు జాబిలి వైపు - కరుగుతుంది చుక్కలుగా
చలి చీకటి చీరలోనే సొగసంతా దాచుకో
అటు వెళ్ళకు దిక్కుల వైపు - కలుస్తాయి ఒక్కటిగా
నా గుప్పెడు గుండెలోనే జగమంతా ఏలుకో..."

 అలాగే నాకు బాగా చిలిపిగా, తమాషాగా అనిపించిన మరొక గీతం :
"కాస్తందుకో... దరఖాస్తందుకో.." సాహిత్యం నుండి :


"చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు, మేరుపంత నవ్వునా చినుకైన రాలునా?
జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు, వరదల్లె పొంగునా కడలింట చేరునా?
<.....>
చలిగాలి దరఖాస్తు తొలియీడు వినకుంటే, చెలి చెంత చేరునా చెలిమల్లే మారునా?
నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు, ఎరుపెక్కిపోవునా? ఎన్నెల్లు పండునా?
దరి చేరి కూడా దరఖాస్తులేలా? "           
                  - - - అంటూ ముగించడంలో, భామ అంగీకారాన్ని ప్రియుడికి చేరవేసిన పుణ్యం కూడా సంపాదించేసారు మన వేటూరి. ఇది నిజానికి ఒక హిందీ గీతాన్ని( "యాద్ ఆ రహీ హైన్...తేరీ యాద్ ఆ రహీ హైన్..") అనుసరించి చేయాలని అనుకున్నారట. అయితే, ఆ రాగానికి, సంగీతానికి అనుగుణంగా, ఇంత అందంగా పదాలను పేర్చడం మాత్రం, వేటూరికి తప్ప వేరెవ్వరికీ సాధ్యపడకపోవచ్చు. ఇటువంటి పాటలు రాసినప్పుడల్లా, జంధ్యాల పసివాడిలా సంతోషపడిపోయి, "ఎవరయ్యా వేరే కవులున్నారన్నది, కవి అంటే వాడే! కవి అంటే వేటూరే!"  అంటూ అందరితోనూ అభిమానంగా చెప్పుకునేవారని, ఈ మధ్యనే "పాడుతా తీయగా" కార్యక్రమంలో బాలు చెప్తూంటే విన్నాను.

"జీవితం సప్తసాగర తీరం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం"

అంటూ 'కలా ఇలా కౌగిలించిన చోట" పాటలల్లడం వేటూరికి వెన్నతో పెట్టిన విద్య. ఆశాభోస్లే కి ఈ పాట ఇవ్వడం వెనుక ఉన్న కారణాలు తెలీవు కానీ, నాకెందుకో ఆవిడ గొంతీ పాటకి నప్పినట్టే అనిపించింది. అదో రకం తాత్విక చింతనను పరిచయం చేసే ఈ పాటకు, ఆవిడ గొంతులో ఉండే గమ్మత్తైన నిషా న్యాయం చేసిందన్నది స్వాభిప్రాయం.

"అలివేణీ ఆణిముత్యమా..- నా పరువాల ముత్యమా..."లో నుండి,  బాలు తీయతేనియ గొంతులో అమృతంలా పలికిన కొన్ని అక్షర లక్షలు :
"తొలి జన్మల నోముకి, దొరనవ్వుల సామికి
చెలిమై నేనుండిపోనా...చల్లగా
మరుమల్లెలు చల్లగా.."


ఇలా ఒకే పదాన్ని వెంట వెంటనే వేరు వేరు అర్థాల్లో వాడటం వేటూరి వారి పాటల్లో తఱచుగా కనిపించి మురిపించే మంత్రమే. అందులోనూ ఇవి సంగీతానికి తగ్గట్టుగా మెరుపులల్లే మెరిసినప్పుడు , "వాహ్ వేటూరి..వాహ్!" అని చేరవని తెలిసినా అభినందనలందించకుండా ఉండలేం.

మరో చోట "మల్లె పందిరి" నీడలో నింపాదిగా కూర్చుని,
"సందె గాలి తావి చిందుల్లోనా..అందాలన్నీ ముద్ద మందారాలై..నావిగా
ఏ వంకా లేని వంక జాబిల్లీ..నా వంక రావే నడచే రంగవల్లీ..
."
అంటూ పదాల అందాలతో విందు చేస్తారీ మాంత్రికుడు.

" కన్నెపిల్లా కాదు కలల కాణాచి
కలువ కన్నులా కలల దోబూచి " అంటూ ఒక పక్క వేటూరి రాయడం, మరో పక్క జంధ్యాల అంతే అందంగా తెరకెక్కించడం, తెర మీదీ అందమైన తెలుగు పాట వినపడుతుంటే, మనసు 

" ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్విందీ సింగారం
ముద్ద మందారం .. ముగ్ధ శృంగారం "
అంటూ అందుకుపోతూ తాళం వేయదూ ?

" అథరాల కావ్యాలకు ఆవేశమందించనా
వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా
మందార ముకుళాతో పాదాలు పూజించనా
అలనై కలనై విరినై ఝరినై నిన్నే కోరనా "
- ఈ పాట వింటుంటే లేత చలిగాలుల్లో తిరిగినట్టు అనిపించని వారుంటే, వలపు వాకిలిని ఎవరో తడుతునట్టుగా అనిపించకపోతే.....పల్లవి మళ్ళీ ఇంకోసారి వినాల్సిందే! :). అన్నట్టూ..నేనెప్పుడూ ఈ పాట వేటూరిదే అనుకునేదాన్ని. జ్యోతిర్మయి అన్న పేరుతో విశ్వం అనే రచయిత రాసే వారని ఈ మధ్యే తెలిసింది.

ఇహ జంధ్యాల దర్శకత్వంలో, మహదేవన్ స్వరకల్పనలో ఆత్రేయ రాసిన పాటలు, నాకు భలే ఇష్టం! ఒక్క నాకు మాత్రమనేమిటి, "కళ్యాణ వైభోగమే " పాట సన్నాయి వాళ్ళు సంబరాల్లో మునిగి తేలుతూ మోగించకుండా తెలుగు పెళ్ళిళ్ళు ఎలా పూర్తవుతాయి ?

అలాగే "రాళ్ళల్లో ఇసుకల్లో ..రాశాము ఇద్దరి పేర్లు.." పాట కూడా పసితనపు స్నేహాలేవో గుర్తు తేకుండా మరలి పోదు. ఎన్నాళ్ళైనా సరే! ఎన్నేళ్ళైనా సరే! ఇప్పటికీ నే నే సముద్ర తీరానికైనా వెళ్ళినప్పుడు, కాస్త వీలు చిక్కగానే తడి ఇసుక మీద నాకు నచ్చిన పేర్లు రాయకుండా వెనక్కు రాను. అలా రాసిన ప్రతిసారీ, తోడొచ్చిన స్నేహితులో బంధువులో నా ఆటలకు నన్నొదిలేసి కెరటాల మీదకు ఉరుకులతో వెళ్ళిపోయినా, నా పెదవులను క్షణాల్లో ఈ పాట అల్లుకుపోతుంది.  సాగర తీరాన మనసు కోరిన ఏకాంతంలో నచ్చే తోడై వెంట నిలుస్తుంది.  ఎక్కడ పడితే అక్కడ తన ప్రియుడి పేర్లు చెక్కుతూ పాటంతా అల్లరి చేసే రజని నాకిప్పటికీ గుర్తుందంటే, గొప్పదనం ఎవరికి ఆపాదించాలంటారు ? జంధ్యాలకా, ఆత్రేయకా, లేదా మామకా? కళలో కూడా వంతులేమిటమ్మాయ్...మొత్తంగా దొరకబుచ్చుకుని అనుభవించాలి కానీ అంటున్నారా? నాదీ అదే మాట!!

ఇంకా అతి ముఖ్యంగా నేను చెప్పాల్సిన పాటలింకా మిగిలే ఉన్నాయి. "మనసా తుళ్లి పడకే..", "తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.."  పాటలు తెలుగు అమ్మాయిలందరికీ  పెళ్ళిచూపులయ్యాక తడుముకోనవసరం లేకుండా గుర్తొచ్చే పాటలు.  ఒక్కో సందర్భానికీ ఒక్కో పాట చప్పున, ఇన్ని వేల సినిమాల్లో కొన్ని లక్షల పాటలు వచ్చి ఉంటాయి. కానీ కన్నె గుండెల్లోకి తొంగి చూసినట్టుగా ఒకరో గీతాన్ని రాయడం, ఆమె నునుసిగ్గులనూ, కళ్ళలోని మెరుపులనూ, రంగుల తెరపై తడబాటు లేకుండా చూపించడం, ఎలా సాధ్యం ? అతనికి కాక మరెవరికి సాధ్యం ?

ఆ సంగీత సాహిత్యాల గురించి ఇలా చెప్పుకుంటే పోతే పొద్దు చాలదు. మొదలెట్టాక పూర్తి చేయకుండా పోదామంటే మనసూరుకోదు. ఇది నా ఉత్సాహమే తప్ప, ఆ మహా మనిషి శ్రమనంతా ఒక చోట కూర్చడం నా శక్తికి అసాధ్యమని నాకు తెలుసు.  ఒక్కరమూ ఒంటరి అడుగేస్తే భయం కానీ, ఒకే అభిప్రాయాలున్న వాళ్ళు పది మంది జత కూడితే అలుపేముంటుంది ? మొదలెడితే అందుకునే వారు నలుగురున్నారన్న ధైర్యం, మననెందుకు వెనకడుగు వేయిస్తుంది ? అందుకే మొదలెట్టాను..

 దివ్యకాంతిలో ఐక్యమైన జంధ్యాల, తెలుగు వారికి కొత్తదనాన్నీ, చక్కని హాస్యాన్నీ పంచిన వారిగా చిరస్మరణీయులు. విధి కొట్టిన దొంగదెబ్బకి ఊహించని విథంగా తిరిగిరాని లోకాలకు తరలిపోయినా, వారి మాటలు, పాటలు, పంచిన నవ్వులు, వారి వల్ల స్పందించిన హృదయాలు, జంధ్యాలను ఇప్పటికీ ఎప్పటికీ జ్ఞాపకాల్లో చిరంజీవిగా నిలబెడతాయి.  కానీ, వీటినింకా రుచి చూడని వాళ్ళు, మన ముందు తరాల వారు వీటి గొప్పతనం గురించి తెలుసుకునేందుకు, కాసిన్ని నవ్వులు మనతో పంచుకునేందుకు, మనమూ కాస్త బాధ్యత తీసుకోవాలని గుర్తెరిగి, అందుకు గానూ సగర్వంగా ముందుకొచ్చిన మంచివారు కొందరు - ఇక్కడ జత కూడారు. వారికి మీ వంతు సహాయం తప్పకుండా అందించండి!!
"జంధ్యా వందనాని"కి రెండు చేతులు సరిపోవని, మీ అందరూ తలో చెయ్యి వేసి మరీ  తీర్మానించండి.

44 comments:

 1. చదువుతూ ఉంటే ఎన్నెన్నో జ్ఞాపకాలు గుర్తొచ్చి మనసంతా ఆనందసాగరంలో తడిసిపోయింది.

  జంధ్యాల చదివుంటే ఆకాశానికీ భూమికే పసిపిల్లాడిలా ఎగిరుండేవాడు! హ్మ్.. నీ ఆర్టికల్ కొంచం లేట్ :(

  ఒక్కో పాట, జీవితంలోని ఒక సంధర్భంతోనో, ఒక మనిషితోనో, అనుభవంతోనో ముడిపడిపోయి, మమేకమైపోయి, ఎన్నేళ్ళ తర్వాత విన్నా, తిరిగి తీసుకు వెళ్ళి ఆ గతపు వాకిలి ముందే నిలబెడుతుంది.

  పాటలప్రియులందరికీ ఇది వర్తిస్తుంది.

  సముద్రతీరం గురించి ప్రస్తావిస్తూ "చినుకులా రాలి, నదులుగా సాగి, వరదలై పోయి..." పాటగూర్చికూడా రాస్తావనుకున్నాను!

  ReplyDelete
 2. వ్యాఖ్యానానికి మాటలే లేవు. తెలుగు చిత్రానికి ల్యాండ్ మార్క్ జంధ్యాల గారు. పాటకి..చిరునామా ..వేటూరి.. రెండు పాయలుగా విడివడి భావ సాగరములో ఓలలాడించిన ఇద్దరు స్రష్టలు గురించి ఎంత చెప్పుకున్నా మిగిలి ఉంటుంది.మానసా..మంచి పాటలు ని పరిచయం చేసారు. ధన్యవాదములు. కాకతాళీయంగా.. మూడుముళ్ళు లో పాత గురించి వ్రాసాను. గూగుల్ సెర్చ్ లో..శ్రీమతి జ్యోతిర్మయి అని ఒక చోట చూసి వచ్చి.. ఈ నాటి పోస్ట్ గీత రచయిత్రి జ్యోతిర్మయి..అని వ్రాసుకున్నాను. మీరు తెలిపిన వివరాలు వేరుగా ఉన్నాయి.ఎనీ హౌ పాట సాహిత్యం బాగుంది. అక్కడ స్త్రీ మూర్తులు ఉంటె చాలా బాగుంటుందని నా ఆకాంక్ష.

  ReplyDelete
 3. ఎంచక్కా రాసారో! మీరా మధుమానసమంటే!! మీ మనసంతా ఒలకబోసి టపా మొత్తం తేనెవాక చేసేసారుగా! అసలు శీర్షికే తెలుగుదనం ఉట్టిపడేలా, జంధ్యాలని, వేటూరినీ, బాలుడినీ పట్టి చూపేలా ఉంది. అభినందనలు, పట్టలేని ఆనందంతో ఆలింగనాలూను!

  ReplyDelete
 4. ఇంతగొప్పగా ఎలా చెప్పగలుగుతున్నారండీ.కొంత అసూయతో, చాలా మీరు రాసిన టపాపైన ఇష్టంతో ఎలా చెప్పాలో తెలియకపోయినా,ఎలాగైనా నచ్చిందని చెప్పాలన్న తపనతో ఇదిగో ఈ వ్యాఖ్య ఇలాగ రాస్తున్నా.చాల బాగ రాసారంటే తక్కువవుతుందేమో.

  ReplyDelete
 5. మానస గారూ చాలా బాగా రాసారు,మన సైట్ లో వేసుకోడానికి పంపి ఉంటే బాగుండేది కదా

  ReplyDelete
 6. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 7. చాలా బాగా వ్రాసారు. మరోసారి ఆ పాటల్లో తడిచిపోయాను.
  తెలుగు పాటలకు పట్టు పరికిణీలు..అసలు టపా టైటిలు ఎంతందంగా ఉందో..ఇది చూసే నేను మీ బ్లాగుకి వచ్చాను.

  ReplyDelete
 8. భాస్కర్ - థాంక్యూ! ఏం రాసినా చక్కటి స్పందనతో బలాన్నిస్తున్నారు. మీరేమీ మాట్లాడకపోతే సరిగ్గా రాయలేదేమో అన్న అనుమానం మొదలవుతుందేమో నాకిక.

  వనజ గారూ : జ్యోతిర్మయి కలం పేరనుకుంటాను. మీరన్న ముక్క మాత్రం నిజమే! తెలుగులో గీత రచయితలుగా ఆడవాళ్ళెక్కువ రాణించలేదు, ఎంచేతనో మరి.


  కొత్తావకాయ్ గారూ :
  మీ ఆత్మీయ స్పందనకు వేనవేల కృతజ్ఞతలు! వేటూరి ఎన్ని వేల హృదయలాను కొల్లగొట్టారో! మహా ధనవంతులు! మీకూ కొన్ని జ్ఞాపకాలు మదిలో మెదిలాయనీ ...సంతోషపెట్టాయని ఆశిస్తూ...

  ReplyDelete
 9. శ్రీనివాస్ గారూ :
  సైట్‌లో అంత మంచి వ్యాసాల పక్కన నాది దిష్టి చుక్క అయిపోతుందేమో అని, పబ్లిసిటీతో సరిపెట్టాను. పంపాల్సిందంటారా? మీ స్పందనకు ధన్యవాదాలు.


  శ్రీదేవి గారూ :
  తప్పకుండా..మెయిల్ పంపాను.

  సిరిసిరిమువ్వ గారూ :
  ధన్యవాదాలండీ!! టపా శీర్షిక - ఊరికే, సరదాగా...జంధ్యాల గురించి కదా-- కాస్త తెలుగుతనం కనపడేలా రాద్దామని చిరు ప్రయత్నమన్నమాట! :)

  ReplyDelete
 10. మానస గారు...చాల చాల బాగుంది..
  నాకు సినిమా జ్ఞానం సున్నా...కానీ ఈ బ్లాగులోకానికి వచ్చిన తర్వాత...కాస్త తెలుస్తోంది..!!
  నాకు ఆనందమేసిన విషయం ఏంటంటే మీరు రాసిన కొన్ని పాటలు నాకు favorite ..!! అంటే గొప్ప వారి పాటలు నేను కూడా వింటున్నా అనే ఆనందం కలిగింది నాకు :D
  ఇక జంధ్యావందనం గురించి ఏం చెప్పను...అలా పెట్టాలి అని ఆలోచన వచ్చి దాన్ని ఆచరణలో పెట్టిన వారందరికి అభినందనలు...:)!

  ReplyDelete
 11. Thank you sooo much for the feedback, Kiran! So, you like Vetoori -Jandhyala combination. Cool!

  I am an ardent admirer of the above mentioned songs; I managed to get a web link where I have a playlist with all these songs.

  and yes, Jandhyavandanam guys are awesome. Their efforts to update the site quite regularly is impressive too.

  by the way, this article is now available on that site. Pappu Sreenivas Sir wanted to have it there.

  ReplyDelete
  Replies
  1. /* I managed to get a web link where I have a playlist with all these songs.

   Can you please share the web link if you dont mind?

   Delete
  2. http://chimataamusic.com/telugu_songs/displayNew.php?st=jandhyala

   if they have changed some options, then am not sure. Please check there for all the songs that I have mentioned in this blogpost.

   Regards,

   Delete
  3. Thank you! Looks like the link did change, here is the latest one:

   http://www.allbestsongs.com/telugu_songs/displayNew.php?st=jandhyala

   'నీలాలు కారేనా...కాలాలూ మారేనా' పాట చిన్నప్పుడు నాకు బాగా నచ్చిన పాటల్లో ఒకటి. కానీ కాలక్రమంలో ఆ పాటని పూర్తిగా మర్చిపోయాను, చివరిసారి ఎప్పుడు విన్నానో కూడా గుర్తులేదు. ఆ పాట ఈ లింక్ లొ ఉన్న జంధ్యాల గారి చిత్రాల్లోని పాటల క్రమం లొ రెండవది, చూడగానే చాలా ఆనందం వేసింది. పాత చిత్రాల్లొ నాకు నచ్చిన పాటలు చాలా వరకు నా దగ్గర ఉన్నాయి, ఇది ఎలాగో తప్పిపోయి
   ఇన్నాళ్ళకు మళ్ళీ దొరికింది. మిగిలిన దర్శకుల, రచయితల పాటలు కూదా చూసి ఇలాంటి ఆణిముత్యాలు ఇంకేమైనా మర్చిపొయానేమో చూసి వెతికిపట్టుకొవాలి :)


   జంధ్యాల గారి పెరు చెప్పగానే వెంటనె గుర్తుకు వచ్చేవి ఆయన హాస్యభరిత చిత్రాలు అయినా 'ఆనంద భైరవి ' వంటి హాస్యేతర చిత్రరత్నాలని మర్చిపొలేము.

   మీ బ్లాగ్ 'About me' లొ నచ్చిన చిత్రాలు ఏమీ రాయకపొతే అసలు చూడరేమో అనుకున్నాను :)

   --శ్రీనివాస్

   Delete
  4. Oh! I thought it was someone else asking for that link - Didn't realize that it was you, Sreenivas. :)
   Nice. Every single song on that list reminds me of my schooldays. and how my sister used to fight with me to keep that small radio right next to her etc.

   సినిమాలు చూస్తాను, చూడకేం! :). కాకపోతే మొదటి నుండీ తక్కువే. అలా అభిమాన నాయకులూ నాయికలూ లేరన్నమాట . జంధ్యాల సినిమాలు అన్నీ ఇష్టమే నాకు - ఇంకా హాస్యమే అక్కడక్కడా మింగుడు పడలేదేమో కానీ, ఆయన మాటలందించిన "శంకరాభరణం" లాంటివి నాకు చాలా ఇష్టం.

   Delete
  5. I just realized that I did not leave any signature on my first comment. Sorry.

   పేరు చూసి గుర్తు పట్టినందుకు ధన్యవాదములు :-)
   /* అలా అభిమాన నాయకులూ నాయికలూ లేరన్నమాట
   మంచిదే :-)
   /* ఇంకా హాస్యమే అక్కడక్కడా మింగుడు పడలేదేమో కానీ
   హ్మ్మ్..నాకు అర్థం కాలేదు, కొంచం విడమరిచి చెప్పగలరా? Please.

   --Srinivas :-)

   Delete
  6. శ్రీనివాస్ గారూ -:)
   అంటే - అలా వివరించడమంటే..ఉహూ కొద్దిగా కష్టం లెండి. కొన్ని...(కొన్నంటే కొన్నే..) సినిమాల్లో నాకు కొందరి హాస్యం పెద్ద నచ్చేది కాదు. అంతకంటే ఎక్కువ చెప్పలేను :))
   -
   నిజానికి, కేరళ వ్యాసంలో నిన్న మీ ఆఖరు ప్రశ్నకు బదులిచ్చానా, అది చూస్తూ మా వారన్నారు - అవున్నిజమే కదా, నువ్వు పావురాయి రెక్కలు టపాటపా కొట్టుకోవడాన్ని, చిరుమీలు తుళ్ళిపడడాన్ని గురించీ వ్రాశావే కానీ, ఆ పావురపు రెట్టల్తో గుడి గోపుర భాగం తెల్లగా అయిపోవడాన్ని గురించి అక్షరమైనా వ్రాయలేదు; సముద్రపుటొడ్డున ఎండలో ఇసుకలో పాదాలు మంటపుట్టిన క్షణాలేవీ ప్రస్తావించకుండా, సాయంకాలపు వేళ నీకు కనపడ్డ అద్భుతాలనే ఏకరువు పెట్టావు.." అని..

   నేను కాస్త చిన్నబుచ్చుకున్న మాట వాస్తవం. మరి ఇంటికొచ్చాక నాకవేమీ గుర్తు లేకపోవడమూ అంతే వాస్తవం. చాలా కాకతాళీయంగా, గత మాసపు పాలపిట్ట సంచిక అన్యమస్కంగా తిరగేస్తుంటే, వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి వ్యాసం ఒకటి కనపడింది. అందులో భాగాన్ని యథాతథంగా మీకు చెప్పేయాలని ఆశపడ్డాను కానీ, ఆ వ్యాసం , ఈ బ్లాగ్ మళ్ళీ చూస్తారన్న ఆశ లేనందున, అక్కడితో వదిలేశాను. మీరేమిటో నా మాట వినేందుకే నన్నట్టు ఈ రోజు మళ్ళీ పలకరించారు.
   ఆ వ్యాసంలోని చిన్న భాగం క్రింద ప్రత్యేకించి మీ కోసమే చచ్చేట్టు టైప్ చేశాను. తప్పకుండా చదవండేం..,.;)

   Delete
  7. " సెల్ఫోన్‌లో పరిచయమైన మాళవిక అనే పిల్ల కూడా చాలానే నేర్పింది. మాటలు మొదలుట్టగానే ఇలా చెప్పేది.."ఇప్పుడు సరిగ్గా మీరే గుర్తొచ్చారు.ఎందుకంటే ఈ కిటికిలో నుండి కనపడే ఆకాశమూ, మామిడిచెట్టు చిగుళ్ళూ నన్ను పలకరిస్తున్నాయి. గుమ్మంలోకి రాగానే కుండిలో నుండి తొంగి చూసే చుక్కమల్లి నను గమనించావా? అని అడుగుతోంది" అనేది.

   మరో మాటు పలకరించినపుడు "పెరట్లో పూసిన మందారాన్ని ఆ మంచుబిందువులతోటే కోసి తెచ్చి అమ్మవారి మీద అలంకరిస్తే ఎంత కళకళలాడిందనుకున్నారూ" అనేది. "ఈ సాయంత్రం వీథి మెట్ల మీద కూచుని టీ తాగుతూ ఆకాశంలోకీ ఎగిరే పక్షుల వరుసల్ని లెక్కపెడుతూ స్టౌ మీద పాలు పొంగబెట్తేశానండీ" అని మురిసేది.
   ఇలా ఆమె నా ఊహలో తన అందమైన ఇంటి విశాలమైన వీథి వరండానూ, పెరటి తోటలనూ వేడి వేడి కాఫీలు తాగే ఉదయాస్తమయాల్నీ, మంచి మంచి పాటలు వింటూ హాయిగా విశ్రమించే బెడ్‌రూంలనూ పరిచయం చేసింది. కుతూహలాన్ని అణచలేక ఒకరోజు వెళ్ళాను. ఇరుకు సందుల్లోంచి వెళ్ళగా లోపల ఒక పాత పెంకుటిల్లు. అందులో రెండు గదుల వాటా..కాస్త వీథి. దోసెడు పెరడు. వంటింటి చిన్న కిటికీ.
   చుట్టూ మూసేసిన అప్పార్ట్మెంట్ల మథ్య చిన్న ఆకాశం ముక్క. ఆ మూల ఎక్కడో మామిడి చెట్టు ఉందన్న గుర్తుగా ఓ చిగురు కొమ్మా కనిపిస్తున్నాయి. వీథిలో రెండు పూలకుండీలూ, ఆ కాస్త పెరట్లోనూ నాలుగు మొక్కలూ. ఇంట్లో అంతా పేదగా బీదగా. ఆ చిన్న పరిథిలో నుండి ఆమె తన జీవితాన్ని ఆస్వాదించిన తీరు ఆమె అంతరంగ సంపదను పరిచయం చేసింది. ఇలాంటి "ఆర్ట్ ఆఫ్ లివింగ్" తెలిసినవాళ్లను చూసినప్పుడు, ఎప్పుడో చదివిన ఒక అనువాద కవిత గుర్తొస్తుంది.

   "సాథారణమైన మనిషికి ఆకాశం ఆకాశంగానూ, చెట్టు చెట్టుగానూ నీళ్ళు నీళ్ళుగానూ కనిపిస్తాయి. కళాకారుడికి ఆకాశం నీలపు లోయలాగా చెట్టు హరిత ఛట్రంలాగా నీళ్ళు మబ్బుల సమూహాల్లాగానూ తొస్తాయట; యోగికి మళ్ళీ ఆకాశం ఆకాశంగానూ, చెట్టు చెట్టుగానూ, నీళ్ళు నీళ్ళుగానే".

   వాస్తవ ప్రపంచాన్ని రూపాంతరీకరణ చెందించుకోగల, జీవితాన్ని రంగులహరివిల్లుగా భావించగల ప్రత్యేక వ్యక్తులు కవులు కళాకారుల్లోనే కాదు, మామూలు వ్యక్తుల్లోనూ ఉంటారని మాళవిక చెప్పకనే చెప్పింది."
   --
   చూశారా, నేనూ మామూలు అమ్మాయినే అయినా, ఎంత బలమైన వాదన తోడు తెచ్చుకున్నానో! :))- ఇప్పుడేమంటారు ? :p

   Delete
  8. /*కొన్ని...(కొన్నంటే కొన్నే..) సినిమాల్లో నాకు కొందరి హాస్యం పెద్ద నచ్చేది కాదు
   అర్థం అయింది, నేను కూడా ఒప్పుకుంటాను.
   మీకు జంధ్యాల గారి సినిమాలు అన్నీ నచ్చుతాయని అన్నారు. నాకూ చాలా వరకు నచ్చాయి, కానీ 'శ్రీవారి శొభనం' లాంటి సినిమాలు ఎదొ జంధ్యాల గారి మీది అభిమానంతొ చూసాను అనిపించేసాను :))

   /* మరి ఇంటికొచ్చాక నాకవేమీ గుర్తు లేకపోవడమూ అంతే వాస్తవం
   నాకు అనిపించెది ఏమిటంటె ప్రకృతి రమణీయత చూసిన ప్రతి ఒక్కరికి గొప్ప అనుభూతి కలుగుతుంది (కేవలం కొన్ని క్షణాలైనా)..కొన్ని అంతగా నచ్చనివి కూదా ఉంటాయి. నా లాంటి వారు సగటు చూసి మొత్తానికి మంచి (గొప్ప కాదు) అనుభూతి గా మిగుల్చుకుంటారు, మీరు కేవలం మిమ్మల్ని అమితంగా కదిలించినవే గుర్తు ఉంచుకొని (??) గొప్ప అనుభూతి గా చేసుకుంటారు. :)


   మొత్తానికి మీ బ్లాగ్ లు మీ వారితో కూడా విశ్లెషిస్తారన్నమాట. శుభం! జీవితంలొ monotony లేకుండా ఉంటుంది. భావాలని పంచుకోగలిగినవారు దొరకటమూ అదృష్తమే! :)

   /* మీ కోసమే చచ్చేట్టు టైప్ చేశాను

   మీరు నిజంగానె ఇదంతా టై ప్ చేసారా? చాలా చాలా ధన్యవాదములు.

   నాకు మంచి పుస్తకాలు, బ్లాగ్ లు చదవటమే నచ్చుతుంది, కానీ వ్రాయటం/comment చెయ్యటం మీద అంత ఆసక్తి ఉండదు. మీరు గమనించి ఉంటె, మీ కేరళ వ్యాసంలొ కూద తెలుగులొ వ్రాయటం కొసం, ఇందులొ పాటల లింక్ కొసమే నేను comment చెసాను. కాని మీరు పడ్డ శ్రమ చూసి కనీసం మీ బ్లాగ్ల వరకు అయినా నా బధ్ధకాన్ని వదిలించుకొవటానికి ప్రయత్నిస్తాను. :))

   ఈ వ్యాసానికి పూర్తిగా సమాధానం ఇవ్వటానికి కొంచెం సమయం పడుతుంది, వీలైనంత తొందరగా వీలైనంత వివరంగా ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. కొంచెం వ్యవధి ఇవ్వండి :)

   --శ్రీనివాస్

   Delete
  9. మీరు పంపిన వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి వ్యాసం చదివిన తరువాత ఎన్నో ఆలోచనలు, కానీ మళ్ళీ ఆలోచించి చూస్తే అవ్వన్నీ ఈ వ్యాసానికి అసందర్భం అనిపించింది. అందుకని ప్రస్తుతానికి సందర్భోచితమైన వ్యాఖ్యలతో సరిపెడతాను :)

   /* సాథారణమైన మనిషికి ఆకాశం ఆకాశంగానూ, చెట్టు చెట్టుగానూ నీళ్ళు నీళ్ళుగానూ కనిపిస్తాయి. కళాకారుడికి ఆకాశం నీలపు లోయలాగా చెట్టు హరిత ఛట్రంలాగా నీళ్ళు మబ్బుల సమూహాల్లాగానూ తొస్తాయట

   నేను చెప్పింది కూడ ఇదేనండీ - నాలాంటి సాథారణమైన మనిషికి ఆకాశం ఆకాశంగానూ, చెట్టు చెట్టుగానూ నీళ్ళు నీళ్ళుగానూ కనిపిస్తాయి, మీ లాంటి కవయితృలకు ఆకాశం నీలపు లోయలాగా చెట్టు హరిత ఛట్రంలాగా నీళ్ళు మబ్బుల సమూహాల్లాగానూ తొస్తాయి.మీరు మీకు మీరే 'మామూలు అమ్మాయీ అని తగిలించేసుకుని నా వాదనని మీది అంటే ఎలా? ;)
   వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి వ్యాసం కష్టపడి పంపినందుకు మరొక్క మారు ధన్యవాదములు :-)


   --శ్రీనివాస్

   Delete
  10. Hi Srinivas :) - Thank you. It was fun reading your response. I enjoyed it.
   --
   ఆ వ్యాసం చదూతుంటే చాలా బాగా అనిపించింది. అస్సలు నా కోసమే, మీకూ, మా అక్కకూ నేను చెప్పదలచిందేమిటో మరింత స్పష్టంగా చెప్పుకునేందుకు ఎదురూగ్గా కనపడ్డ వరమల్లే తోచింది. అందుకే శ్రమే అయినా ఇష్టంగానే టైప్ చేసుకున్నాను.

   సరి - ఇక మీకు టైపింగ్ పని పెట్టను. :). Have fun n keep in touch.

   Warm Regards,


   Delete
  11. లేదండీ, నిజానికి నాకు ఇలా తెలుగులో వ్రాయటం (సరే-టైప్ చెయ్యటం) బాగా నచ్చింది. మొదలుపెట్టి రెండు రోజులయింది కదా, ఇప్పుడు కొంచెం తొందరగానే చెయ్యగలుగుతున్నాను. అందులోనూ ఈ యాంత్రిక ఉద్యోగ జీవితంలొ పడి తెలుగు చాలావరకు మర్చిపోయాను, ఇంట్లో వాళ్ళతొ మాట్లాడేటప్పుడు కూడా సగం అంగ్ల మాటలే వస్తున్నాయి. ఇలా తెలుగును గుర్తు చేసుకొవటం బాగుంది. దానికి తోడు మీకు మాట కూడా ఇచ్చాను కదా (మీకు గుర్తు లేకపొతే ఈ వాక్యం కూదా మర్చిపోండి ;) ). కాబట్టి ఇలాగే వీలు దొరికినప్పుడల్లా కొనసాగిద్దామని నిశ్చయించుకున్నాను :)

   అందుకే ఒక కొత్త ఖాతా కూడా తెరిచాను :))

   -- శ్రీనివాస్

   Delete
  12. అబ్బో అబ్బో...!:)
   పార్టీ టైమ్ :). ఏంటి మెక్సికోనా, అమెరికానా? అంతలా తెలుగెలా మర్చిపోతున్నారు :) . కొత్త ఖాతా కొత్త వివరాలేం చెప్పలేదు!

   Delete
  13. బెంగుళూరు ;)...అందరూ మీలా ఉండరు కదా :-)))))

   Have fun!!

   Delete
  14. Really?! :). Alrighto, I buy that :D

   Delete
 12. hey pillaa..intha chakkati telugu chaduvutuntey maatram bhaley anandam gaa undi. jandhyala cinamaala gurinchi vetturi geethala gurinchi chaala articles chadivaa kaani intha manchidi nenu chadavaledu.. ilaa manchi vi raayalani rastavani aasistunaanu

  ReplyDelete
 13. Hey manasa ..Nuvv rasina vatillo naaku ee article baaga nachhindi ... Veturi kalam nunchi jalu vaarina konni muthyalanti patallani malli gurtu chesav ... Thanks for this ..and keep going on..

  ReplyDelete
 14. you reminded me about very nice Telugu songs which ofcourse I keep singing. Sorry for not typing in telugu as I have no idea how to install the font and stuff. I felt you could have continued the article further. As you have rightly said the songs in Jandhayala movies always have good lyric values. Veturi himself acknowledged Jandyala's taste of literature. Please try to write further about his movies and his trade mark dialogues which we use daily. His journey in the film industry is little different. He himself once said that he initially wants to be a hero then changed his decision and started writing. Those great dialogues from Shankarabaranam were penned by him. So one cant expect anything less when he started directing the films. By far he is the only director of modern age whose films we are able to watch with our parents.

  ReplyDelete
 15. సుబ్బూ : : :-) చాలా చాలా థాంక్స్! నువ్వు నా బ్లాగ్ ఇంకా చదువుతున్నావన్నమాట.
  ఇక పాటలంటావా - అవున్నిజమే! ఇవన్నీ మనసుకు నచ్చే పాటలే! ఈ పాటల్లో ఒకటి నువ్వెక్కడైనా రియాలిటీ షోలో పాడితే వినాలని ఉంది :). అదివరకటిలా ప్రోగ్రాం అయిపోయాకా వీడియోలు చూపెట్టటం కాదు, ఈ సారి కాస్త ముందు చెప్పు మరి!


  @Voice of heart :థాంక్యూ!
  మీ స్పందనకు కృతజ్ఞతలు.

  ReplyDelete
 16. @సాయి పాద ధూళి :

  తెలుగులో టైప్ చేయడానికి (lekhini.org) వాడితే సరిపోతుందండీ.!
  నేను ఇప్పటికే వ్యాసం పెద్దది అయిపోయిందని బెంగ పడుతున్నాను. రాయడానికి ఎన్నో పాటలింకా మిగిలున్నాయని తెలుసు. పైన రాసినట్టుగా, అన్నింటి గురించి ప్రస్తావించడం, వివరించడం నా శక్తికి మించిన పని.

  జంధ్యాల- వేటూరి అందించిన అజరామరమైన పాటలను అందరమూ కలిసి స్మరించుకోవడం, వ్యాసాన్ని చదివిన మిత్రులందరూ నిడివి గురించి ప్రస్తావించకుండా పాత పాటల ఊయలలో కాస్త ఊగిసలాడడం నాకెంతో తృప్తినిచ్చిన విషయాలు.
  మీ ఆత్మీయ స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

  ReplyDelete
 17. Actually I have shared your article with my friends. I like both of them equally (Jandhayla and Veturi). I hope you might have already read this. But Veturi gaari meeda manchi article okati undi : http://santosh-surampudi.blogspot.com/search/label/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82
  I cant explain how much this article moved me.

  ReplyDelete
 18. నాకు మీరు వ్రాసిన శీర్షిక బాగా నచ్హింది మా ఆఫీసులొ అందరికి చూపించాను. ఇంకా రాస్తే చదవాలనిపించింది ఎందుకంటే నాకు జంధ్యాల వేటూరి గార్లు చాలా ఇష్టం .
  ఇది చదవండి మీకు తప్పక నచ్చుతుంది. తెలుగు లో టైపు చెయ్యడం ఇదే మొదటి సారి. చాలా సమయం పడుతోంది రాయడానికి కాని టైపు చేసాక చూడడానికి బాగుంది
  మంచి పాటలు గుర్తు చేశారు (నీ కోసం యవ్వనమంతా, రాళ్ళల్లో ఇసకల్లో, కళ్యాణ వైభొగమే, చినుకులా మారి ). సంగీత సాహిత్య సమలంకౄతే అన్నట్లు ఉంటాయి
  http://santosh-surampudi.blogspot.com/search/label/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82

  ReplyDelete
 19. @సాయి గారికి,

  తెలుగులో అదగొట్టేహారంతే! చదవడానికి మాక్కూడా చాలా బాగుంది :)
  కొత్తలో కాస్త సమయం తీసుకున్నా, మెల్లిగా అలవాటైపోతుంది. మీ మంచి మాటలు కాస్త హుషారునిచ్చాయి. మరోసారెప్పుడైనా వేటూరి పాటలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను.
  ఇక మీరు చెప్పిన బ్లాగ్ గురించి : పక్క ఇంట్లో ఉండేవారి గురించి తెలీకపోవడమా..భలేవారే! :-).

  ReplyDelete
 20. మానస గారూ మీ ఈ వ్యాసాన్ని "జంధ్యావందనం" లో పబ్లిష్ చేసాము చూసారా?చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండీ.
  లింకిదిగో.
  http://www.jandhyavandanam.com/index.php/2011-09-28-17-02-35/70-2011-11-06-07-17-05

  ReplyDelete
 21. శ్రీనివాస్ గారూ : అంత చక్క చక్కని వ్యాసాల నడుమ నా వ్యాసమూ, మిత్రుల స్పందనా చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ కృషికి అభినందనలు.
  జంధ్యావందనం వేన్నోళ్ళ కీర్తించబడాలని మనస్పూర్తిగా అభిలషిస్తూ...

  ReplyDelete
 22. మానస..
  ఒక టపా చదివాక దానికి ఖచ్చితంగా అద్భుతమైన వ్యాఖ్య పెట్టాలి అని మనసు గట్టిగా కోరుకుని, ఎలా పెట్టాలా అని పరిపరి విధాలా ఆలోచించి, ప్రియురాలికి తొలిప్రేమలేఖ రాసే ప్రియుడు మాదిరి వ్యాఖ్య రాసీ తీసేసీ, మరల రాసి తీసేసి.. ఏది రాసినా మనసులోని భావాల్ని మొత్తంగా చూపెట్టలేకపోతుంది అని కాసేపు బాధపడి, ఒక్క అక్షరం కూడా ఆసరా రాకుండా ఎటుపోతోందో అని ఆలోచించి..

  ఇంత సంఘర్షణని ఎదురుకోవడం సాధారణంగా జరగదు. కానీ అదేంటో దాదాపు మీ ప్రతి టపాకి నాకు పరిచయమయ్యే ఘర్షణ అచ్చంగా ఇదే..

  ReplyDelete
 23. మీ వల్ల ఇంకొక మంచి తెలుగు సైటు తెలిసింది :)
  http://www.jandhyavandanam.com/
  జంధ్యాలగారిని అభిమానించే వాళ్ళు ఇంక ఉన్నరంటే తెగులు పట్టని తెలుగు సినిమా ఇష్టపడే వాళ్ళు ఇంకా మిగిలి ఉన్నారన్నమాట...
  అందరితో కలిసి చూసే సినిమాలు పోయి ఇంట్లో వాళ్ళతో కలిపి చూడాలంటే సిగ్గుతో మొహం దాచుకోవాల్సి వచ్చే డైలాగులు పాటలు దగ్గరనుంచీ కనీసం బూతు అర్థం వెతుక్కుని తీస్కుకోడానికి కూడ వీలు లేనీ స్టేజీలో ఉన్నాం ఇప్పుడు.

  ReplyDelete
 24. అద్భుతం మానస.. ధాంక్ యూ

  ReplyDelete
 25. wowwww... Really awesome post.. It made my day.. I am not much familiar with classic telugu literature. But after reading your post, I just want to try reading it once. Thanks a lot.

  ReplyDelete
 26. అపర్ణా...

  ప్రతిసారీ నీ మంచి మాటలతో మరికాస్త ధైర్యం వచ్చేలా, ధైర్యంగా రాసేలా చేస్తున్నావ్! థాంక్యూ!! :). ఇంత చక్కటి స్పందనకు చప్పని బదులివ్వద్దంటూ నా చేతులు కూడా మొండికేసాయి :). అందుకే ఆలశ్యం :)

  @సాయి...గారూ,

  మీ ప్రతిస్పందనలు జంధ్యావందనం వారికి కూడా చేరవేయండి. వారికి మరి కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది.

  జ్యోతిగారూ,

  హృదయపూర్వక కృతజ్ఞతలండీ! :)

  ReplyDelete
 27. Ramesh Garu,

  Thank you very much. Really glad to know that you liked it. All the lyrics mentioned above are from Jandhyala movies and most of them were written by Vetoori.

  Regards,
  Manasa

  ReplyDelete
 28. అసలు ఈ టైటిల్ చూసి మీ పోస్ట్ కి వచ్చాను .......... అబ్బ టైటిల్ ఎంత బాగుందండి ..టైటిలే కి ఓ వంద మార్కులు ఇవ్వొచ్చు ...... పోస్ట్ కి ఇంకో తొమ్మిది వందల మార్కులు ఇవ్వొచ్చు అనుకోండి .. ఇవి నా ప్లే లిస్టు లో ఉన్నపాటలు నాకు చాలా చాలా నచ్చే పాటలు ...

  ReplyDelete
 29. శివరంజనీ, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి:)
  థాంక్యూ అమ్మాయీ..!!
  ఈ పాటలన్నీ నా పెదాల మీద ఇరవైనాలుగు గంటలూ ఆడుతూ ఉండేవే!

  ReplyDelete
 30. Hi Nuvv rasina vatillo naaku ee article baaga nachhindi ... Veturi kalam nunchi jalu vaarina konni muthyalanti patallani malli gurtu chesav ... Thanks for this ..and keep going on.

  ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....