క్రియేటివ్ ఆటలు-కొన్ని కులాసా కబుర్లు

ఇది నేను పూనె(హం, తుం, ఆప్, ఘర్, పానీ లాంటి పదాలు బట్టి కొట్టి పదో తరగతి హింది పరీక్ష గట్టెక్కిన నా లాంటి వాళ్ళకి కూడా, తమకు తెలీకుండానే పదాలన్నీ కలుపుకుంటూ వాక్యాలను నిర్మించగలిన శక్తిని, ఆ మహా నగరం మాత్రమే ప్రసాదించగలదు.)లో ఉండగా జరిగిన సంఘటన.  నేను ఆఫీసులో రిపోర్ట్ చేసిన మూడో రోజో, నాలుగో రోజో, మా బేచ్ అందరికీ హెచ్.ఆర్ మేనేజర్‌తో మీటింగ్ ఉంటుందని పిలుపొచ్చింది. యే గది, ఎన్నింటి నుండి ఎన్నింటి వరకూ తదితరాలతో కూడిన ఆ నాటి సమావేశం తాలూకు వివరాలన్నింటితో వెను వెంటనే మరో మెయిల్. 

నేను ఇలాంటప్పుడే నా తెలివితేటలను విచ్చలవిడిగా వాడేసుకుంటాను.  ఆ మీటింగ్ రూం దాకా వెళ్లాక, ముందు వరుసల్లో మొత్తం ఖాళీగా ఉన్న కుర్చీలను చూస్తూ నా స్నేహితులు అటు వైపు అడుగులు వేయబోతుంటే, వాళ్ళ చేతులు పట్టి ఆపి, అక్కడికి నేనేదో పది సంస్థల్లో ఇలాంటివి చూసేసినట్టు, "కాస్త వెనుక కూర్చుంటే నచ్చకపోతే నిద్రపోయే అవకాశమైనా ఉంటుంది. హెచ్.ఆర్ వాళ్ళ మాటలంటే కంపనీ గురించి డబ్బా తప్ప ఇంకేమీ ఉండదు" అని సెలవిచ్చాను. శ్రీ కృష్ణుడిని నమ్ముకున్న పార్థుడంత భక్తిగా, ఆరాధనగా వాళ్ళు నా వంక చూసి, వెనుకే వెనుక వరసలకు దారి కట్టారు. వాళ్ళల్లో ఒకరు చిట్ట చివరి వరుస, చిట్ట చివరి కుర్చీ ఏరుకుని కూర్చోబోతుంటే మందలించాను. "ఒక వరుస విధిగా వదిలెయ్యాలి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే! మరీ ఆఖరుకు చేరితే ప్రమాదం, ఏ ప్రశ్నలు అడగాలన్నా ముందు వాళ్ళే కనపడతారు. అదీ గాకా పూర్తి మొద్దులమేమో అని పొరబడే అవకాశమూ లేకపోలేదు." - ఇలా చెప్పడంలో నా ఇంజనీరింగ్ నాటి అనుభవాలు కొన్ని పనికొచ్చినట్టున్నాయ్.

మరో పది నిముషాల్లో మొత్తానికి ఆ గదంతా మనుషులతో నిండిపోయింది. రావలసిన మేనేజర్‌గారు రానే వచ్చారు. అభినందనలతో మొదలెడుతూ, ఆ ఆఖరు వరసల్లో వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుందని సలహా విసిరేసారు. మేం చెవిటి అవతారాలెత్తి, కదలకుండా కూర్చుండిపోయాం. మా వెనుక వరసకి మాత్రం తప్పలేదు. ఆవిడ కళ్ళార్పకుండా చూస్తూ ఉండటంతో, విధి లేని పరిస్థితుల్లో మొదటి వరసకు వెళ్ళి కూర్చున్నారు. నేను నా స్నేహితుల వైపు గర్వంగా చూశానొకసారి. ఆ క్షణంలో వాళ్ళు కూడా నా మేధస్సును, ముందుచూపును అభినందించినట్టుగానే కనపడ్డారు.

హెచ్.ఆర్ మేనేజర్ ఆఖరి అవకాశం అన్నట్టు మా వరుస వైపు చూస్తూ, "మీలో ఎవరైనా ముందుకు రాదల్చుకుంటే ఇప్పుడే రండి. మొదలెట్టాక, అటూ ఇటూ తిరగడం అంటే నేను ఇష్టపడను" అని పునరుద్ఘాటించారు. మేమొక మొహమటపు "పర్లేద"న్న దరహాసం బదులిసిరేశాం!

సరీగ్గా నేను ఊహించినట్టుగానే, ఆవిడ అసలు ఈ సంస్థ ఈ దశకు రావడం ఎంత పెద్ద విషయమో, మమ్మల్ని, అంటే, ఇంత సరైన మేధా సంపత్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఎన్ని ప్రణాళికలను వేసిందీ, ఆ అంచనాలను నిలబెట్టేందుకు మేవేమేం చేయాలీ..ఇటువంటివేవో చెప్పుకుంటూ పోతున్నారు. వాటికి సంబంధించిన వివరాలు, లెక్కలు వగైరా పి.పి.టి లలో చూపించే ముందు కాసేపు మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం అంటూ ఆగారు.
వెనక్కి నక్కిన మేమంతా ఆవలింతల్లోకి దిగిపోయాం ఆపాటికే!

ఆవిడ పరిచయాల పద్ధతి ఎలా ఉండాలో వివరిస్తాను అని మొదలెట్టారు. "ప్రతి ఒక్కరూ, వాళ్ళ పేరు పక్కన, వాళ్ళకి నప్పే విశేషణమేదో ఒకటి చేర్చుకుని చెప్పాలి. ఆ విశేషణం, మీ పేరులోని మొదటి అక్షరంతో మొదలవ్వాలి. ఉదాహరణకు, మీ పేరు శ్రేయ అనుకోండి - మీరు "ఎస్"తో ఒక విశేషణం చెప్పాలి. సింపుల్ అనో, స్వీట్ అనో!
మరొక్క వాక్యం ఏదైనా వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. అది తప్పనిసరి మాత్రం కాదు". నాకీ ఆట వినగానే నచ్చేసింది. ఈ సారి మా కజిన్స్ పెళ్ళిలో పనికిరాని ఆటలు చెప్పమని పెద్దవాళ్ళు పోరినప్పుడు, ఇది నేనే కనిపెట్టినంత ధీమాగా చెప్పేసి, మార్కులు కొట్టేసి.....
నా ఆలోచనలకు అంతరాయం కల్గిస్తూ, ఆవిడ మళ్ళీ అందుకుంది..." ఇక్కడ చిన్న మెలిక ఏంటంటే, ప్రతి వాళ్ళూ తమ పేరు చెప్పబోయే ముందు, అందాకా పూర్తైన పేర్ల పరిచయాలు చెప్పి కొనసాగించాలి"
నాకు గుండెకాయ ఆగిపోయింది. ఠపీమని ఒకసారి వెనక్కు తిరిగి చూసుకున్నాను. ఖాళీ వరుసలు నా తెలివితేటలను వెక్కిరిస్తూ కనపడ్డాయి. నా స్నేహితుల చూపులను, వాళ్ళు పెదవి విప్పకుండానే నాదాకా పంపిన పొగడ్తల పొగడ మాలల పరిమళాలను నేను మీకు ప్రత్యేకంగా వివరించనక్కర్లేదనుకుంటాను.

ముందుకు బలవతంగా తీసుకెళ్ళిన వాళ్ళ ముఖాల్లో సంబరం చూడాలసలు! హబ్బ! కోటి చిచ్చుబుడ్లు ఒక్క మాటున వెలిగాయన్నా పోలిక సరిపోదు. అసలైనా ఆ మేనేజర్ చూడ్డానికి చిన్నగానే ఉంది మరి, అంత చాదస్తం ఏమిటో!
ఈ ముందు వాళ్ళ పేర్లు చెప్పుకోవడమేమిటో విచిత్రంగా, ఇదేమన్నా శివ ధనుర్భంగ ఘట్టమా, మనమేమైనా స్వయంవరానికి వెళ్ళామా..." అవ్యక్త రూపం నుండి బ్రహ్మ ఉద్భవించినది మొదలు ,మరీచి, కాస్యపుడు, సూర్యుడు, మనువు, ఇక్ష్వాకువు, కుక్షి, వికుక్షి, భానుడు, అరరణ్యుడు, పృథువు, త్రిశంకువు, దుందుమారుడు, ధాత, సుసంధి, ధ్రువసంధి-ప్రసేనజిత్, భరతుడు, అసితుడు, అల్లదిగో సగరుడు, అతనికి అసమంజసుడు, వారి పుత్రుడూ అంశుమంతుడు, ఆ తర్వతా దిలీపుడు, అప్పుడొచాడయ్యా అపర భగీరధుడు..కపుచ్హుడు, రఘువు, కల్మషపాదుడు, శంఖనుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు , మరువు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, అజుడు, దశరథుడు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.. ......" అంటూ చరిత్ర మొత్తం తవ్వుకుంటూ వెళ్ళడానికి ?

అదీ గాక, నాకింకో గండం కూడా ఉంది. అకస్మాత్తు ప్రశ్నలకి నా మెదడెప్పుడూ జవాబివ్వలేదు! పాపం అది దాని బలహీనతగా ఒప్పుకోవాలి మనం! ఇది నాకు చిన్నప్పటి నుండీ ఉన్న సమస్య.

ఏదో నాకు లెక్కలు బాగా నేర్పిద్దామని మా నాన్నగారు, పదిహేడో ఎక్కం దాకా వచ్చాక, కింద నుండి పైకి చెప్పడం అలవాటు కావాలని, ఎక్కడ ఏది అడిగినా చెప్పేంత పట్టు రావాలని సవా లక్ష ఆంక్షలతో (ఆశలతో), నేను వేరే ఏదో పనిలో ఉన్నప్పుడు, " ఏదీ, పదిహేడు పదమూళ్ళెంత?" అన్నారనుకోండి, నేను షాక్ కొట్టిన దానిలా అయిపోయేదాన్ని. ఉన్నట్టుండి తెలుగు భాష నాకు అర్థం కానిదైపోయేది. అకస్మాత్తుగా అల్జీమర్స్ వ్యాధి బారిన పడిన అభాగ్యురాలిలా అల్లాడిపోయేదాన్ని.

"నాన్నగారూ, ఏమన్నారూ? పదిహేడో ఎక్కమా?"
"ఊ, ఇంత సేపెందుకూ దీనికి?"
" అంటే, ఏమడిగారూ, పదిహేడు పదమూళ్ళా?" - వెధవ లెక్కలు మనసులో కట్టుకుంటూ, లెక్కలు కనిపెట్టిన వాళ్ళను తిట్టుకుంటూ..
"అవునంటుంటే!!"
" అంటే..పదమూడు పదిహేళ్ళు"
" !! "
< నా నుండి జవాబు, ఎట్టకేలకు >.
<అది సరిపోతే నేను బతికిపోయినట్టు, సరిపోకపోతే ఏమయ్యేది అనా మీ ప్రశ్న - ప్రియమైన పాఠకులారా, మీ ఊహా శక్తికి పదును పెట్టి కథలల్లుకోండి ఏం జరిగి ఉంటుందో..>

అచ్చం ఇలాగే, పూనే లో కూడా నాకు మేనేజర్ మొదలెట్టిన క్రియేటివ్ ఆటలో, నా పేరుకి ముందు ఏ విశేషణం జోడించాలో తోచలేదు. ఆలోచించుకునే వ్యవధీ లేదు, ఎందుకంటే, ముందున్న ముప్పై ఎనిమిది మంది పేర్లు గుర్తుంచుకుని అప్పజెప్పాలి కదా, ఏమాటకామాటే, జ్ఞాపకశక్తి లేదు అనిపించుకోవడం అంటే అవమానం కిందే లెక్క.

నా కన్న ముందు 'ఎం' అన్న అక్షరంతో పేర్లున్న వాళ్లల్లో ఒకబ్బాయి కూడా నా బాపతేనేమో, దిక్కు తోచని దయనీయ స్థితిలో "మైండ్‌లెస్స్" అని చేర్చుకున్నాడు. నా బాధ పదింతలైంది. ఇహ నాకు తోస్తున్న విశేషణాలన్నీ, సామాన్యులు ఊహించదగినవి, ఉచ్ఛరించదగినవీ కావు. దాదాపు అందరూ బానే గుర్తు పెట్టేసుకుని తిరిగి చెప్తున్నారు పేర్లని. ఒకబ్బాయి పేరు శైలేష్. బాగా ఘనంగా ఉండాలని, "స్టుపెండస్ శైలేష్" అని చెప్పుకున్నాడు. సుమారు పది మంది దాకా ఆ విశేషణం పట్టుకోలేక, "స్టుపిడ్ శైలేష్" అంటే గది మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయింది. పది సార్లూనూ! పైపెచ్చు ప్రతి సారి ధ్వని రెట్టింపయ్యిందేమో కూడా! ఎర్రబడ్డ ఆ శైలేష్ మొహం నాకిప్పటికీ గుర్తే!

అలా సాగుతూ సాగుతూ నా వంతు రానే వచ్చింది. సరీగ్గా నా ముందు అమ్మాయి "లవ్లీ లిండా" అని చెప్పి కూర్చోగానే , నాకు నా పేరుకు తగ్గ విశేషణం తట్టింది. మొప్పై ఐదు మంది పేర్లు జాగ్రత్తగా అప్పజెప్పి, అర క్షణం ఆగి, నా మనసు మరేదీ వెదకలేకపోయాను క్షమించంటుంటే, వేరే దారి లేక, గొంతు సవరించుకుని, బలంగా నిశ్వసించి, "మైటీ మానస" అని చెప్పాను.

గదిలో వినపడీ వినపడని చిరునవ్వుల గుసగుసలు.  అప్పటికి నేనొక ఫిఫ్టీ కేజీ తాజ్ మహల్‌ని మరి. నాకు "మైటీ" అన్న పదం అస్సలు సూట్ అవ్వలేదని పుర జనుల నవ్వుల వెనుక ఉన్న ఆంతర్యమేమో! ఏదేమైనా, పెద్ద గండం గడిచినట్టు అనిపించింది. నేను ఆ పైన పది రోజుల్లో పూనె నుండి దొంగ కారణంతో హైదరాబాదు వచ్చిన మాట పక్కన పెడితే, ఉన్న కొన్నాళ్ళూ, కలిసిన కొద్ది మందినీ ఇలానే ఇంటి పేరు మార్చి పిలిచి సరదాగా నవ్వుకునే వాళ్ళం. అదో మధుర జ్ఞాపకం!
********************
నాకు ఎప్పటి నుండో, నేను చాలా మితభాషిననీ , అంతర్ముఖిననీ, అస్సలు కొత్తవాళ్ళతో కలవలేదు- నెమ్మది పిల్ల అనీ, అందరూ చెప్పుకుంటుంటే వినాలని వెర్రి ఆశ.

నా మొహం చూసిన వాళ్ళూ, నాతో ఒక్కసారి మాట్లాడిన వారు ఇలా అనే అవకాశం రాలేదు. అది నాకో పెద్ద బెంగ. చిన్ని జీవితంలో చెల్లుబాటవ్వని వేన వేల కోరికల్లో ఇదీ ఒకటి. అందుకనీ, నేననుకున్నానూ, నా రెండో ప్రాజెక్ట్‌లో నేను తెలిసిన వాళ్ళు ఎవ్వరూ అదృష్టవశాత్తూ లేరు కనుక, మొదటి నుండీ గంభీరంగా, ఇంకా కుదిరితే కాస్తంత కోపంగా ఉంటే, నా చిరకాల కోరిక కాస్త నెరవేరే అవకాశాలు ఉన్నాయని!

నేను పైన చెప్పిన పుణె సంఘటన జరిగాక దాదాపు మూడేళ్ళకి, నాకు రెండో ప్రాజెక్ట్ దక్కింది. మా మేనేజర్ నన్ను, నా కన్నా కాస్త ముందు చేరిన వ్యక్తిని పిలిచి, పరస్పర పరిచయాల ప్రహసనం పూర్తి చేసారు. నా మనసులో లీలా మాత్రంగా మిగిలిన స్మృతి పుణ్యమా అని, నేను కాస్త మొహమాటాన్ని పక్కన పెట్టి అతన్ని పరికించి చూశాను. ఆ అబ్బాయి నా కన్నా కాస్త మెఱుగు. మరీ నాలా పాత సినిమా సూత్రధారులను గుర్తు తేకుండా, మాటల్లేకుండా టేకులు మింగకుండా, వెంటనే గుర్తు పడుతూ అన్నాడు.
"Hey...! You are Mighty Manasa right.." -అతని కళ్లల్లో నేను స్పష్టంగా చూడగల, చదవగల ఆశ్చర్యం.
"and you are Rocking Rupmeet!!" -చెప్తూంటే నా తల నవ్వుల జోరుకు పక్కకు వాలిపోతోంది.
మా మేనేజర్ మా నుండి జరిగింది తెలుసుకుని, " I never knew you were Mighty, Manasa" అని ఒక చిన్న విసురు విసిరి, ( ఇక్కడ కూడా నేను ఫిఫ్టీ కేజీ తాజ్ మహల్‌నే, , జస్ట్ ఫర్ ద రికార్డ్..;) ) నవ్వులు కాస్త పంచుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేం ...
"Do you remember Kind Kanika ? and Lovely Linda?"
"Oh yea, she was my roomie for more than 2 years"
"remember how funny Sailesh was .." he laughs.
"poor soul, he never meant that"
"Well well..that's some game"
"indeed, if a game could make us remember the names of stragers for 4 years, then it's really something"

అయిపోయింది. నా మహా నటనా మేలి ముసుగు, జ్ఞాపకాల సుడిగాలికి ఎగిరిపోయింది. నేను నవ్వులతోనూ, ఆనాటి రోజులు తల్చుకోగానే పొంగి వచ్చిన ఆగని కబుర్లతోనూ తుళ్ళిపడుతున్న సెలయేరైపోయాను. మళ్ళీ! మళ్ళీ మళ్ళీ!
మనసును దాయడమెంత కష్టం!
**********
కాబట్టి మై డియర్ కామ్రేడ్స్, క్రియేటివ్ ఆలోచనలను, ఆటలను చిన్న చూపు చూడకండి.  ఒక ఆట మీ జీవితాన్నే మార్చేస్తుంది. ;)

15 comments:

  1. ఈ క్రియేటివ్ ఆట టపా భలే నవ్వించింది మైటీ మానస :)
    అలాగే ఈ రచనా శైలీ కూడా సూపర్బ్..

    ...శ్రీ కృష్ణుడిని నమ్ముకున్న పార్థుడంత భక్తిగా, ఆరాధనగా..

    ..ఇదేమన్నా శివ ధనుర్భంగ ఘట్టమా, మనమేమైనా స్వయంవరానికి వెళ్ళామా..." అవ్యక్త రూపం నుండి బ్రహ్మ ఉద్భవించినది మొదలు ,మరీచి, కాస్యపుడు, సూర్యుడు..

    ఈ ఉపమానాలు అవి అద్భుతం :) Enjoyed the post thoroughly!

    ReplyDelete
  2. బై ది వే, నీ బ్లాగు పేరు కూడా క్రియేటివ్గానే ఉంది :)

    ReplyDelete
  3. మీరేదో నాలుగైదు ఆటలు చెప్తే క్లాస్ లో ఖాళీగా ఉన్నప్పుడు, కొత్తగా ఎవరైనా అమ్మాయిలు పరిచయమైనప్పుడు సొంతంగా కనిపెట్టినవని ఆడించేద్దామనుకుంటే. ఒక్క ఆట చెప్పి "కాబట్టి మై డియర్ కామ్రేడ్స్, క్రియేటివ్ ఆలోచనలను, ఆటలను చిన్న చూపు చూడకండి. ఒక ఆట మీ జీవితాన్నే మార్చేస్తుంది. ;) అని ఫలశృతి చెప్పేశారేంటండి.
    వీ డిమాండ్ ఫర్ మోర్ గంస్ ఇన్ నెక్స్ట్ పోస్ట్.
    కానీ ఈ ఆట అదిరింది. .

    ReplyDelete
  4. పక్కింట్లోకి మారి దాదాపు ఆర్నెల్లవుతోంది. అందుకే ఇలా ఇరుగింటమ్మల్ని పలకరిస్తున్నాను. ఖాళీగా ఉన్నప్పుడు మీరూ వచ్చి చూసివెళ్లండి.
    అన్నట్టు మీకూ మీ కుటుంబానికీ వినాయకచవితి శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. అకస్మాత్తు ప్రశ్నలకి నా మెదడెప్పుడూ జవాబివ్వలేదు!
    ఆహా నాకు తోడూ మీరు ఉన్నారు.బావుందండి.ఏమి రాసినా కలం అలా అలవోకగా వెళ్ళిపోతోంది.

    ReplyDelete
  6. మీరు రాసిన మొదటి వాక్యం [దీనిని నేను సమర్ధించను.. ఎందుకంటే నాకిప్పటికీ హిందీ రా(లే)దు కనుక)] తప్ప మిగతాదంతా నవ్వు తెప్పించింది.

    ReplyDelete
  7. ఈ ఆటల్లో క్రియేటివిటీని ఒప్పేసుకుంటూనే చల్లని పల్చని హాస్యం జల్లు జల్లుగా కురిపించిన నీ చాతుర్యానికి మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటున్నా! ఎక్కాల ప్రహసనం చదివి ఒక సారి భుజాలు తడిమేసుకుని (అదే ట్రిక్కు ఇప్పుడు నా కూతురి మీద కూడ్డా ప్రయోగిస్తున్నా)హాయిగా నవ్వేసుకున్నా!

    రఘు వంశావిష్కరణ ఘట్టం బాగుంది!:-))

    ఖాళీ వరుసలు నా తెలివితేటలను వెక్కిరిస్తూ కనపడ్డాయి. నా స్నేహితుల చూపులను, వాళ్ళు పెదవి విప్పకుండానే నాదాకా పంపిన పొగడ్తల పొగడ మాలల పరిమళాలను ________ :-)))

    ReplyDelete
  8. ఎస్.ఆర్.రావు గారూ: కృతజ్ఞతలు.
    హేమంత్ : ఎంత ఘోరం! మీకు నిజ్జంగా హిందీ రాలేదా? నాకే వచ్చేస్తేనూ- మీకు రాకపోవడం ఎలా? How?
    శైలబల గారూ, మీ అభిమానానికి, అభినందనలకి హృదయపూర్వక కృతజ్ఞతలు.
    సుజాత గారూ : ధన్యవాదాలు. మీలా ప్రతి మాటలోనూ హాస్యాన్ని, అభిమానాన్ని అంతర్లీనంగా రంగరించి పంచే వాళ్ళకి నా మాటలు రుచించాయంటే - ధన్యోస్మి! :)

    ReplyDelete
  9. మానసా.... ఎంత బాగా రాశావో ! నిజంగా నీకీ ఇక్ష్వాకు వంశ చరిత్ర అంతా ఎలా తెలిసింది?
    ఎక్కాల ప్రహసనం మాత్రం సరిగ్గా గుర్తుంచుకుని సిగ్గు పడకుండా చెప్పావు.
    నీ మాటల్లో ప్రేమ గురించి చదివితే ఎంత బావుందో, హాస్యం గురించి చదివినా అంతే అద్భుతంగా ఉంది. ఎప్పటికైనా నీ జీవిత చరిత్ర రాస్తే ( కోతి కొమ్మచ్చి లాగా ) చదవాలని కోరికగా ఉంది. నా కోరిక తీర్చవూ !

    ReplyDelete
  10. ఈ ఆట మా అఫీసులో ఒకసారి మీటింగ్ ముందు ice braking లాగా ఆడాము. మీటింగులో నలభై మంది దాకా ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ పేర్లు గుర్తు పెట్టుకున్నారు, నా పేరుతో సహా.

    ReplyDelete
  11. ಮಧು ಮಾನಸಂ ಗಾರೂ
    ಮೀ ಭಾಷಾ ಭಾವಪ್ರಕಟನಾ ಚಿಲಿಪಿತನಂ ಚಿರುನವ್ವುಲು ಕುರಿಪಿಂಚೇ ಶೈಲೀ ದೇನಿಕದೇ ಅದ್ಭುತಂ.
    ಅದಿರಿಪೋಯಿಂದಿ.

    ReplyDelete
  12. మైటీ మానస గారూ,

    అదిరిపోయింది.

    ReplyDelete
  13. ROFL.. idi chadivina chaalaa sepati varaku navvu aagaledu.. Mighty Manasa.. Lovely Linda.. wow.. ee characters tho parichayam vallanemo navvu aagatledu.. meeru use chesina upamaanaalu superb ga unnaay..

    ReplyDelete
  14. వేణూ శ్రీకాంత్‌గారూ, శ్రీ గారూ : ధన్యవాదాలండీ!

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....