జీవన వసంతం

**********************

ఉత్సాహమో విజయ కాంక్షో
సగం దూరం నడక సాగాక
అలసటో అపజయమో
అడుగు పడక నిలిచిపోయాక...

కనురెప్పల కొసల కాచుకున్న
కోటి కలల కవ్వింపులకు
నడి రాతిరి నిదుర కాస్తా చెదిరిపోయిందా..
నిజమవ్వాల్సిన స్వప్నాలకై ఆపలేని ఆరాటమిక!


రేయంచుకు ఊగిసలాడుతున్న
రేపటిని ఆశగా ఆర్తిగా స్మరిస్తూ
మరోసారి అడుగు ముందుకు పడిందా
విజయలక్ష్మి కౌగిళ్ళలో ఊపిరాడని బంధమిక!


ఆ అడుగులేయించగల తోడూ
ఆ కలను పరిచయం చేసేవాడూ
నిన్ను నీవు జయించిన అమృత క్షణాన
తెరలన్నీ తప్పించుకు తారసపడినప్పుడు

పండుటాకులు రాలినా..తృణపత్రాలను తుంపినా
ఒక్క గొడ్డలి వేటుతో నిలువెల్లా నరికినా
వడగాలులు వీచినా ..ఉప్పెనలు ముంచినా
అభివృద్ది పేరిట అడవంతా కొట్టేసినా..

కూలిన చెట్లన్నీ..వడలిన ఆకులూ పూలన్నీ
ఆశలన్నీ కూర్చుకు చిగుర్లు తొడగడంలోనూ
రెమ్మ రెమ్మా కలసి కొమ్మల దాగడంలోనూ
మళ్ళీ వసంతాలను విరబూయడంలోనూ...

అంతర్లీనంగా దాగున్న రహస్యమేదో ద్యోతకమవుతుంది...
మందకొడిగా సాగే కొన్ని మానవ జీవితాలకదే చెట్టంత బలాన్నిస్తుంది!************************
*తొలి ప్రచురణ హంసిని అంతర్జాల పత్రికలో.

7 comments:

 1. కవిత కదిలించింది... inspirational గా ఉంది :)

  ప్రాసలూ, పదప్రయోగాలూ బాగున్నాయి. కొన్ని వాక్యాలు కూర్చిన విదానం కొత్తగా అనిపించాయి నాకు. మంచ్ణి భావాన్ని వెలికితేవాలంటే పదాల పాత్ర చాలానే ఉంటుంది. అలాంటిపదకూర్పుంది ఇందులో.

  "రేయంచుకు ఊగిసలాడుతున్నరేపు" - పదప్రయోగం చాల కొత్తగా చక్కాగా ఉంది. ఎంత నచ్చిందో నాకు.
  రెమ్మ రెమ్మా కలసి కొమ్మల దాగడంలోనూ
  మళ్ళీ వసంతాలను విరబూయడంలోనూ...
  అలానే "తృణపత్రాలను తుంపినా" పదప్రయోగంకూడా :)

  //నిన్ను నీవు జయించిన అమృత క్షణాన
  తొలగించుకు తెరలన్నీ తారసపడతాడు తప్పక!//
  ఈ వాక్యం అర్థంకాలేదు.

  ReplyDelete
 2. ధన్యవాదాలు భాస్కర్ గారూ!
  ఇక్కడ నేను చెప్పదల్చుకున్న భావాన్ని క్లుప్తంగా చెప్తాను.
  మనలో చాలా మంది ఒక లక్ష్యంతో ప్రయాణం మొదలు పెడతాం. మొదలెట్టినప్పుడు అది కేవలం ఉత్సాహం అయినా అయి ఉండవచ్చు, గెలవాలన్న తపనైనా కావచ్చు.
  కొంత దూరం వెళ్ళాక (ప్రయత్నించాక) ఆ మొదటి హుషారు పోవడమో, అనుకున్న స్థాయిలో ప్రయత్నించలేకపోవడమో, మన ప్రయాణాన్ని నిలువరిస్తుంది.

  3) ఆ దశలో మనకి ఎవరైనా తిరిగి ప్రోత్సాహం ఇస్తే, మళ్ళీ మన స్వప్నాలను గుర్తు చేస్తే, మళ్ళీ ఒక్కసారి మనం ప్రేరేపితులమై ముందడుగు వేయగలిగితే, ఇక ఆగడం విజయం సిద్ధించాకే!
  4) అయితే, ఈ ప్రేరణ, ఈ ప్రోత్సాహం ఎవరి నుండో ఆశించకుండా, మనని మనం గెలిస్తే, మనని మనం నిగ్రహించుకోగలిగితే, ఆ వ్యక్తి - ఆ శక్తి ఎక్కడో లేదనీ, మన మనసుల్లోనే ఉందనీ అర్థం అవుతుంది.
  "నిన్ను నీవు జయించిన అమృత క్షణాన" అనడంలో నా భావం అదే!

  ఆఖరు రెండు పేరాల్లో, చెట్లు ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే ప్రయత్నం చేశాను. అది సూటిగానే రాసాను. మొదలంటా నరికినా తమంతట తాముగా మళ్ళి వసంతాలను విరబూయడంలో వాటికున్న శక్తిని సమర్ధించేందుకు అచ్చుల ఆసరా తీసుకున్నాను.

  ReplyDelete
 3. రసజ్ఞ గారూ : కృతజ్ఞతలు

  ReplyDelete
 4. మానస గారు, నేను మీకు అభిమానిని అయిపోయాను అండీ :)) మరింకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు:)

  ReplyDelete
 5. ಮಾನಸ ಗಾರೂ,
  ಚಕ್ಕಟಿ ಕವಿತ.

  ReplyDelete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...