స్వాతికుమారి కవిత్వం - కోనేటి మెట్లు

ఈ మంత్రలోకపు అలౌకిక సౌందర్యాన్ని తన ఆలోచనాలోచనాలతో దర్శించి, కవిత్వంగా మన ముందుకు తీసుకు వచ్చిన నేటి తరం కవయిత్రి - స్వాతి. తన మానసిక పరిస్థితికి అనుగుణంగా ప్రకృతికి పదాల హారతి పడుతూ ఆ వెలుగుల్లో మనకీ ఓ కొత్త అందాన్నిపరిచయం చేయగల సమర్ధురాలీమె. కవిత్వమెందుకూ వ్రాయడమంటే... "మనదైన ఒక స్వాప్నిక జగత్తు మనకోసం ఎప్పుడూ ఎదురు చూస్తుందనే ధీమాతో వాస్తవ జీవితం తాలూకూ కరకుదనాన్ని, నిర్లిప్తతని ధిక్కరించగలిగే ధైర్యాన్నిస్తుంది కవిత్వం. కవిత్వమంటే అనుభూతుల పెదవులపై నర్మగర్భం గా వెలిసే ఒక చిలిపి నవ్వు, నవ్వులనదులన్నీ ఆవిరైపోయాక చివరికి మిగిలే ఓ కన్నీటి బొట్టు. అన్నీ ఆశలూ అడుగంటాక కూడా బ్రతకడంలో కనిపించే చివరి అర్ధం”   అని బదులిస్తూ , "కోనేటి మెట్లు" అన్న శీర్షికను ఎంచుకోవడంలోనే తన అభిరుచిని మచ్చుగా చూపెడతారు.

సంపుటిలోని ఒక్కో కవితా ఒక్కో కోనేటి మెట్టులా..లోతుగా ఉంటూనే, ఆఖరకు కోనేటి నీరంత స్వచ్ఛమైన ప్రశాంతమైన ప్రదేశానికి మనను తోడ్కొని పోతాయి. ఈ సంపుటికి ముందుమాట వ్రాస్తూ, మిత్రులు మూలా సుబ్రహ్మణ్యం గారు అననే అంటారు - "కోనేటి మెట్లు తీసుకెళ్ళే లోతుల్లోనే కోనేరు ఉంటుంది -  ఎంతటి గోపురమైనా, చివరికి ఆకాశమైనా అందులో ప్రతిఫలించాల్సిందే! కవిత్వానికి ఇంతకు మించిన ప్రతీక ఏముంటుంది" అని.

ప్రశ్నా చిహ్నాలు కనపడని ఆలోచనలు, సందేహాలంటూ మన ముందుంచే లోతైన ప్రశ్నలు ఈ సంపుటిలో కోకొల్లలు. ఎన్ని వేల ఆలోచనల ప్రతిఫలమో ఈ ఒక్క కవితా అనిపించే సందర్భాలూ ఉన్నాయి.

"నీటి మడుగు చుట్టూ రెల్లు గడ్డి పహారా
సుడులు రేపుతూ కలల గులకరాళ్ళు"ఇక్కడ నీటి మడుగు - ఉత్త నీటి మడుగేనా? లేక ఒక్క గులకరాయి తాకిడికే సుడులు సృష్టించుకునే చంచల చిత్తానికి ప్రతీకా? ఒకవేళ అదే అయితే, రెల్లుగడ్డి దేనికి ప్రతీక? అల్లుకున్న ఒక జీవిత బంధమా? ఆ పహారా కలల గులకరాళ్ళను నియంత్రించలేక ఓడిపోతోందా? అంటే - ఈ కలలూ, ఆలోచనలూ ఇవన్నీ వ్యక్తిగతమనీ, ఇవి ఎంత దగ్గరి బంధానికైనా, బందోబస్తులకైనా లొంగవనీ కవి చెప్పదలచారా అన్న ప్రశ్నలు చుట్టుముడతాయి. "ఎవరి కలల కోటకు మహరాజు వాడేలే" అన్న శాస్త్రిగారి మాటలోనూ ఇదే భావం కదూ ?

కవిత్వంలో కవుల జీవితం ఉండడం ఎంత నిజమో, జ్ఞాపకాలు ఒదిగిపోవడమూ అంతే సహజం. అయితే, వ్యక్తిగతమైన కవితలన్నీ, అన్ని సార్లూ పాఠకులను అట్టే దూరం వెన్నాడవు. మరి స్వీయానుభవాలను కవితలుగా మలచడం వెనుక కవుల ఆంతర్యం ఏమై ఉంటుందని ఆలోచిస్తే రెండు కారణాలు మొదటి క్షణాల్లోనే ఎదురొస్తాయి. 
ఒకటి - పాఠక లోకపు స్పందనతో నిమిత్తం లేకుండా, ప్రియమైన వారెవరి జ్ఞాపకాలనో తనదైన శైలితో, నైపుణ్యంతో స్మరించుకోవాలన్న, భద్రపరచుకోవాలన్న తపన.
రెండు - బంధాలు వ్యక్తిగతమైనా, భావాలు సార్వత్రికమైనవన్న స్పృహతో, పూర్తి ఎఱుకతో చదివిన ప్రతి ఒక్కరూ, తమ జీవితాల్లోని సదరు బంధుత్వాన్ని తరచి చూసుకునేలా వ్రాయగల ప్రజ్ఞ.

ఈ సంపుటిలోని "ప్రియమైన తాతయ్యకు.." అన్న కవితలో, ఈ రెండు లక్షణాలూ పుష్కలంగా ఉన్నాయి.

"అన్నట్టు చెప్పడం మరచాను-
చివరి రోజుల్లో నువ్వు నన్ను గుర్తు పట్టలేకపోవడం
ప్లాస్టిక్ పూలదండ వెనుక నీ ఫొటో చూసినప్పుడల్లా గుర్తొస్తుంది"

అంటూ గమ్మత్తుగా ముగింపబడిన ఈ కవిత, తెల్ల మీసాల తాతయ్యలను జ్ఞప్తికి తేకుండా  పుట దాటనీయదు.

 ఇక ఈ సంపుటిలో ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన కవిత "సింధువు". ఇది, బహుశా, సునామీ సృష్టించిన ఆటుపోట్లకు కవి స్పందన అయి ఉండవచ్చును. సమకాలీన సమాజ సమస్యలనూ, వ్యధాభరిత జీవన చిత్రాలను కవిత్వంలో చొప్పించడం ఈనాటి మాట కాదు. కనుక, ఈ కవితను ప్రత్యేకం చేసింది ముమ్మాటికీ కవిలోని ఆర్ద్ర హృదయమొక్కటే కాదు. నాలుగు భాగాలుగా సాగిన కవిత ఇది. సాగరుడితో సగటు మానవుని సామాన్య అనుభవాలే అవన్నీనూ. కడలి ఒడిలో పసితనపు కేరింతలు, 'మాటలు దొరకని తీరం"లో కెరటాల లాలింపులు, "ఆటుపోట్ల అంతస్సంఘర్షణల" కల్లోలాలు మొదటి మూడు పాదాలైతే, నాలుగ పాదం,

"జీవితాల్నీ ఆశయాల్నీ
ఇళ్ళనీ ఊళ్ళనీ
సుడిగుండాలతో, సునామీలతో
మున్నీట ముంచిన
మహార్ణవం"


అని ముగుస్తుంది. అంతర్లీనంగా మానవ జీవితపు నాలుగు దశలను కవితలో పొందుపరిచే ప్రయత్నం జరిగినట్లు రెండవ పఠనం తేల్చి చెప్తుంది. జీవితపు చిట్టచివరి దశలో, మరణం మన తలుపు తట్టిన క్షణంలో, జీవితమూ, ఆశయాలూ...మనవైనవన్నీ, మనవనుకున్నవన్నీ, నిర్దయగా మన నుండి విడివడతాయనీ, ఆ క్షణాలిక మనవి కావనీ అన్యాపదేశంగా చెప్పడమే ఇక్కడి చమత్కారం. ఇదొక ఆసక్తికరమైన ప్రయోగం.

సంపుటిలోని కవితలన్నీ వైయక్తిక ధోరణిలోనే సాగిపోయినా, కవి సున్నితత్వాన్నీ, లోతైన పరిశీలనా శక్తినీ, ఏ అనుభవాన్నైనా కవితాత్మకంగా వ్యక్తీకరించగల్గిన నేర్పునీ చాలా కవితలు ప్రస్ఫుటంగా చూపెట్టాయి. ఇవన్నీ కాక, ఇటీవల వ్రాసిన కవితలన్నింటిలోనూ అవ్యక్తంగా కనపడే తాత్విక చింతన, అవసరమైతే మెతమెత్తని మాటలతోనే మానవుల అస్తవ్యస్తపు ఆలోచనా ధోరణిని ఎండగట్టిన తీరూ అచ్చెరువొందిస్తాయి.

" చావు గీటురాయి మీద తప్ప
జీవితాన్ని విలువ కట్టలేని అల్పత్వంతో
కాలంతో బేరాలాడుతూ మనం.." అన్న చోట అకస్మాత్తుగా కవిలో అందాకా కనపడని కొత్త కోణాన్ని దర్శిస్తాం. నాకెందుకో " మానవులు భూతకాలానికి బానిసలు, సాంప్రదాయ భీరువులు" అని విమర్శించిన తిలక్ గుర్తు వచ్చాడు. "గతంలో కూరుకుపోయిన మనుష్యులు" // "వీళ్ళందరూ తోకలు తెగిన ఎలుకలు/ కలుగుల్లోంచి బయటకు రాలేరు" అని ఆయనే ఏనాడో చెప్పారు. ఎవరెంత చెప్పినా...జీవితపు విలువ
తెలియడానికి, జీవితాన్ని ప్రేమించడానికి - మరణమొక్కటే గీటురాయి అవ్వడమే ఇవాళ్టి విషాదం.

కవితలకు ధీటుగా నిలబడగల ఐదు వచన రచనలు ఇందులో పొందుపరచబడ్డాయి. అవి ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. "సన్నజాజుల్లో లేని విశేషం పారిజాతాల్లో ఏముందని అడిగితే, నీ తెల్లని అరచేతి మధ్య గోరింట చుక్కని తలపించడం కాబోలు.." లాంటి వాక్యాలు స్వాతి పరిశీలనా శక్తిని పరిచయం చేయడంతో పాటు, పారిజాతాలను చూసిన ప్రతిసారీ, ఆమెనూ ఓ సారి గుర్తు చేస్తాయి.

చెప్పకుండా వదలలేనీ విషయాలూ కొన్ని ఉన్నాయి. అవి అచ్చుతప్పులు. గట్టిగా తిరగేస్తే యాభై పేజీలు మాత్రమే ఉండే ఈ పుస్తకంలో అచ్చుతప్పులు  ఏ లెక్కన చూసినా నివారింపదగినవే అనిపిస్తాయి. మరింత శ్రద్ధ పెట్టి ఉండవచ్చుననిపించింది.  (పు:28). అలాగే కేవలం 25 కవితలతో ప్రచురింపబడ్డ పుస్తకమిది. రాసి కంటే వాసి ముఖ్యమని మనసారా నమ్మే వాళ్ళమే అయినా, మరిన్ని కవితలు కూర్చితే నిండుగా ఉండేదని - కళ్ళకూ మనసుకూ కూడా - అనిపించక మానదు. ఈ పాతికలోనూ ఒకట్రెండు కవితల్లో స్వాతిగారి మార్కు భావుకత్వం కానీ, భావాల పరంపర కానీ, కట్టి కుదిపేసే అనుభవ చిత్రణ కానీ లేవు [ఋణపడ్డాను తదితరాలు].

కవిత్వమెప్పుడు వ్రాస్తారూ అంటే, "వ్రాయడం తప్ప మరేదీ చేయలేని అశక్తతలో ఉన్నప్పుడు కాబోలు.." అని చెప్పే ఈ కవి కవితాపథంలో మరిన్ని అడుగులు వేయాలనీ, కొంగొత్తగా మొదలెట్టిన కథారచనలోనూ తనదైన ముద్ర వేస్తూ సాహితీలోకంలో ఈ ప్రస్థానం కొనసాగించాలనీ ఆశిద్దాం.

* తొలి ప్రచురణ - వాకిలి- e పత్రిక మార్చ్ సంచికలో..

6 comments:

 1. మానస గారు నిస్పక్షపాతంగా కవిత్వం ని పరిచయం చేసిన తీరు బావుంది. ఈ సమీక్షలోను మీదైన శైలి ఇంకా నచ్చింది

  పాఠక లోకపు స్పందనతో నిమిత్తం లేకుండా, ప్రియమైన వారెవరి జ్ఞాపకాలనో తనదైన శైలితో, నైపుణ్యంతో స్మరించుకోవాలన్న, భద్రపరచుకోవాలన్న తపన.
  బంధాలు వ్యక్తిగతమైనా, భావాలు సార్వత్రికమైనవన్న స్పృహతో, పూర్తి ఎఱుకతో చదివిన ప్రతి ఒక్కరూ, తమ జీవితాల్లోని సదరు బంధుత్వాన్ని తరచి చూసుకునేలా వ్రాయగల ప్రజ్ఞ.

  ఈ మీ పరిశీలన చాలా బావుంది

  ReplyDelete
  Replies
  1. వనజ గారూ - థాంక్యూ అండీ! ఎలా ఉన్నారు? స్వాతి గారు బ్లాగర్. నేను కొంచం వ్రాయడం మొదలెట్టేసరికే ఆమె "పెయింటింగ్స్" మీద ఆసక్తితో కొంచం బ్లాగ్‌ను వెనక్కు నెట్టారు. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్‌గా వ్రాస్తున్నారు. ఇదీ ఆమె బ్లాగ్ లింక్ -- http://swathikumari.wordpress.com/

   Delete
 2. మానసగారు పరిచయం చేసినతీరు బావుంది. good post

  ReplyDelete
  Replies
  1. పద్మార్పిత గారూ- మీకు తప్పకుండా స్వాతి తెలిసే ఉంటారు :)). మీరు సీనియర్ బ్లాగర్ కదా!
   థాంక్యూ!

   Delete
 3. మానసా.. మంచి కవిత్వాన్ని ఇట్లా అపురూపంగా, సున్నితంగా తాకాలా అనిపిస్తోంది మీ సమీక్ష చూస్తుంటే. ఇట్లాంటి పాఠకులున్నందుకైనా కవులు మరింత మంచి కవిత్వం రాయాలి కదా అని కూడా.. :) స్వాతిగారి కవిత్వం చదవాలనిపిస్తోంది మీ సమీక్ష చూసాక.

  ReplyDelete
  Replies
  1. ప్రసాద్ గారూ, ఆలస్యపు ప్రతిస్పందనకు మన్నించాలి. కారణాలు మీకు తెలియనివి కావనుకోండీ..!
   ఇహ కవిత్వ పరిచయం అంటారా...కవిత్వం మంచిదైతే పాఠకులూ మంచి వాళ్ళైపోతారు. :-). మాదేముంది సర్, మీ వంటి మంచి కవులు ఆకాశాన్ని అర చేతుల్లో నింపుతుంటే అందుకుని ఆనందపడే మామూలు వాళ్ళం. :))

   Delete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...