ఊహలకందని బహుమతులొస్తే...


"నాకు ప్రైజులన్నా, సర్ప్రైజులన్నా చిరాకు" అని మొహమంతా ముడుచుకుని చెప్పే బ్రహ్మానందం మున్ముందుగా గుర్తొచ్చేస్తాడేమో మీ అందరికీ! :). నాకు మాత్రం ఆ రెండూ భలే ఇష్టం. "వేళ కాని వేళా.." ఎవరో మన ముందుకొచ్చి ఊహించని రీతుల్లో సంబరపెట్టి ఉబ్బితబ్బిబ్బవుతున్న మనను చూసి మనసారా నవ్వేస్తోంటే, ఆ నవ్వుల వెన్నెల్లో తడవాలనుకోని వారెందరుంటారు ? తడి తడి చూపుల మరకలు తుడుచుకుని, విస్మయమంతా మెల్లగా లోలోపల దాచుకుని, విప్పారే పూబాలలమై కళ్ళెత్తి చూస్తుంటే లోకం ఎంత స్వచ్ఛంగా కనపడుతుందో కదూ!

ఒక వయసొచ్చే దాకా, ఇంట్లో చిన్నపిల్లలుగా పుట్టిన నాబోటి వారికి, తీసుకోవడమే తప్ప ఇవ్వడమంటే ఏమిటో తెలిసే అవకాశమే ఉండదు. ఏదైనా ఇవ్వకపోతే అరిచి గోలెట్టడం, ఆ పంతాన్నెవ్వరూ పట్టించుకోకపోతే కాసేపు బెంగపడ్డట్టు నటించి నిద్దరోవడమూ తప్పిస్తే, ఇవ్వడం గురించి అన్నన్ని ఆలోచనలూ ఏమీ ఉండేవు కావు.

చిన్నప్పుడు త్యాగాలంటే ఏం ఉంటాయి ? అరిటాకు కంచం కోసం ప్రతిరాత్రీ యుద్ధం చేయకుండా అక్కకి ఇచ్చేయడం; అమ్మ దుప్పట్లో అక్క కంటే ముందు దూరిపోయి, తల మాత్రం బయట పెట్టి వెక్కిరించే అలవాటుని అప్పుడప్పుడూ మానుకోవడం; సన్నటి సెగ మీద గులాబీ రంగులోకి వచ్చేదాకా మరగ కాచిన పాలతో, కాఫీ పొడి ధారాళంగా వేశాక వేడి వేడి నీళ్ళు తాకీ తాకగానే బొట్లు బొట్లుగా క్రిందకి జారే అమృతం లాంటి డికాషన్ తో, పొగలు కక్కుతున్న అమ్మ చేతి కాఫీను అర చేతుల మధ్య పెట్టుకుని, ఆదివారం ఈనాడు కథను చదవడం దేనికీ సాటి రాదని తెలిసినా, అమ్మ కోసం త్యాగం చేయడం; ప్రతి నెలా ఒకటో తారీఖు పరిపరి విథాల మెప్పించి సాధించిన "పాకెట్ మనీ"ని మట్టి కుండలో నింపుకుని గలగలలాడించి చూసుకుంటుంటే, నెల చివర్లో నాన్నగారు వచ్చి, వడ్డీతో సహా ఇచ్చేస్తానని నమ్మబలికితే తలాడించి ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయడం; బెదురుతూ బెదురుతూనే బిట్‌పేపర్ చూపించమని అడిగిన నేస్తానికి ధైర్యం చేసి జవాబులు చెప్పేయడం.


వాటికే ఏనుగెక్కినంత ఆనందంగానూ, గర్వంగానూ ఉండేది నాకు. చదవట్లేదనో, అన్నం తినట్లేదనో, కొత్త రకం తగవుల్లోకి దిగుతున్నాననో, ఇంట్లో పెద్దవాళ్ళు నా మనోభావాలను దెబ్బతీసి అవమానించినప్పుడల్లా, మర్చిపోకుండా నేను చేసిన సాయాలన్నీ ఏకరవు పెట్టేదాన్ని. ఆ సరికి వాళ్ళవన్నీ మర్చిపోయి ఉండేవాళ్ళనుకోండీ- మానవ ప్రయత్నాన్ని నేను గట్టిగా నమ్ముతానని మీకందరికీ చెప్పడమన్నమాట.

                                                                                  ***

నాకు పుట్టినరోజుల నాడు కేక్ కటింగ్ అంటే మొదటి నుండీ మహా విసుగు. తప్పుడు లెక్కలు చెప్పి, ప్రతి ఏడాదీ ఆఫీసులో ఈ ప్రహసనం నుండి తప్పించుకోజూసేదాన్ని. ఇష్టసఖులందరూ అడిగినా, అలిగినా ఆ విషయంలో నా మంకుపట్టు మాత్రం వీడేదాన్ని కాను. సింగపూర్ నుండి వచ్చేసే ఏడాది మాత్రం, మూడేళ్ళ కక్షనూ తీర్చుకునేలా చాలా భారీ ఏర్పాట్లే చేశారు మా వాళ్ళు.

రెండు గంటలకి గాఢ నిద్రలో ఉన్న నన్ను లేపి, లల్లాయి కబుర్లు చెప్పి, ఇ.సి.పి బీచ్ కి తీసుకువెళ్ళారు. అక్కడ రెండు గంటలంటే పట్టపగలల్లే ఉంటుంది. భయమూ గట్రా ఏమీ ఉండవు. సరే ఆ వేళలో, అక్కడికి వెళ్ళేసరికి, అలలు తీరాన్ని తాకేంత దూరంలో బోలెడు బెలూన్లు, కొవ్వొత్తులు, కేక్, నాకు బాగా, బాగా ఇష్టమైన మిత్రులు కొందరు. ఇహ చెప్పేదేముంది, సంబరాలు మొదలు. కేక్ కట్ చేయన్నన్న పంతం ఏ అలల తాకిడిలో కలిసిపోయిందో మరి! మొహమంతా కేక్ పట్టించాకా, సముద్రపు నీటితో అంతా కడిగేసుకుని, ఉప్పుప్పగా తాకి పెదవులను చురుక్కు మనిపిస్తున్న నీటినంతా తుడిచేసుకుని, పక్కనే ఉన్న Mc.D లో ఐస్క్రీంస్ తెచ్చుకుని కూర్చున్నాం. నేను ఆ రోజుల్లో మహా ప్రీతిగా తిన్న వంటకం - కన్నడిగుల పులియోగర రైస్. నా కోసం స్వహస్తాలతో వండి తెచ్చిన మిత్రులనీ, వాళ్ళందరి అభిమానాన్ని ఆల్బం అంతా నింపుకున్న ఫొటోలు ఎప్పటికప్పుడు గుర్తుకు తెస్తూనే ఉంటాయి. దిగులు ఊబిలోకి జారుతున్న గుండెను పదిలంగా పట్టుకుని మళ్ళీ సేదతీరుస్తుంటాయి.

నా పెళ్ళికి వీసా ఇబ్బందుల వల్ల రావడం కుదరడం లేదని మాయమాటలు చెప్పి, మధుపర్కాలిచ్చే వేళకి పీటల పక్కనున్న మిగిలిన మిత్రులతో చేరి చిరునవ్వులొలికించిన నా ప్రియసఖి - ఆ రోజు నాకు పంచిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. చెప్పుకుంటూ పోతే నేను నడచిన దారుల్లో ఎదురొచ్చిన వాళ్ళందరి గురించీ ఎంతో కొంత వ్రాయాల్సి ఉంటుంది. అంతగా నేను "తీసుకోవడానికి" అలవాటు పడిపోయాను.

అయితే అలవాటుకు భిన్నంగా అప్పుడప్పుడూ కొన్ని మంచి పనులూ చేయాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఠక్కున గుర్తొచ్చేది మా మాధవీ ఆంటీ! అమ్మ స్కూల్ నుండి రావడం అర నిముషం ఆలస్యమైనా, "ఇదుగో పిల్లా, నీ కోసం ఒక స్పెషల్ చేశానీ రోజు, అర్జంటుగా రా" అంటూ చెయ్యి పట్టి వాళ్ళింటికి లాక్కెళ్ళి, అది తినేదాకా ఊరుకునేవారు కాదు. " ఇడ్లీనే చేశారా ఈ రోజూనూ, పిల్లల్నిటు పంపండి, నేనూ- మా వారూ కలిసి సేమ్యా ఉప్మా చేసాం" అంటూ అమ్మను ఊదరగొట్టి మరీ మమ్మల్ను తీసుకెళ్ళిపోయేవారు. ఆవిడ ప్రేమకు వెలగట్టగలదేదీ నాకీ జన్మకు కనపడదు కానీ, నా పసితనాన్ని తన ప్రేమతో నింపిన ఆంటీకి బహుమతిగా పుట్టినరోజుకో, పెళ్ళిరోజుకో మొహమాటంగా పేరు కూడా వ్రాయకుండా పువ్వులేమైనా పంపాననుకోండీ - అవి అందుకున్న మరుసటి క్షణంలో కాల్ వచ్చేస్తుంది - "ఏయ్ పిల్లా, నీ సంగతి నాకు తెలీదనుకున్నావా" అంటూ . ఆ గొంతులో కట్టడి చేయరాని సంతోషం ఉందే - అది అనుభవించడానికి మధ్యలో ఉన్న ఇన్ని వేల మైళ్ళూ అడ్డు రావు. అదీ వింత. గాఢాలింగనాల్లోనూ అవ్యక్తంగానే మిగిలిపోయే ఆత్మీయత, గుండెకూ గొంతుకూ అడ్డం పడి మాటలు రానీయకుండా చేసినా, మౌనంలో అన్ని స్పందనలూ చదువుకోగలిగిన నేర్పు - ఆ కొద్ది క్షణాలకూ వరమల్లే దొరికే తీరుతుంది.

సరే, పైన చెప్పినట్టు అంతా సజావుగా సాగకుండా, కొన్ని సార్లు అడ్డంగా దొరికిపోయే అవకాశాలున్నాయి. మన సర్ప్రైజులు ఎదురు తిరిగి, మన ముందరి కాళ్ళకే బంధాలయ్యే అవకాశాలూ ఉన్నాయి . తస్మాత్ జాగ్రత్త! అసలు నేను చిత్తుచిత్తుగా ఓడిపోయేది మా అమ్మను ఆశ్చర్యపరుద్దామనుకున్నప్పుడు. ఒకటి - ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ బహుమతిగా ఇచ్చేందుకు ఏదో ఒకటుంటుందనిపిస్తుంది కానీ, అమ్మ దగ్గరకు వచ్చేసరికి ఒక్క ఆలోచనా తట్టదు. రెండు - మనం తెచ్చేవన్నీ వాళ్ళు అస్సలు లక్ష్యపెట్టనివీ, వాళ్ళు పట్టించుకోనివే అయి ఉంటాయి. అందుకనీ, వీళ్ళకు ఇలాంటి విషయాల్లో మినహాయింపు ఇవ్వాలి.

ఇంతకీ ఈ రోజేమైందో చెప్పనే లేదు కదూ - నాన్నగారు వెదుక్కుంటున్న ఒక పుస్తకం బ్లాగర్ మిత్రులొకరి వల్ల సాధించగలిగాను. నేను అడిగిన విషయం గుర్తుంచుకోవడమే కాకుండా, ఎంతో శ్రమకోర్చి, మా ఇంటికి వెళ్ళి మరీ దానిని అందజేసినందుకు పట్టరాని సంతోషం కలిగింది . ఈ జ్ఞాపకాల తేనెతుట్టె కదిలిందీ అందుకే!

ఇలాంటివి జరిగినప్పుడల్లా ఏమనిపిస్తుందంటే - మనని ప్రేమ పాశంతో బంధించి వేస్తూ, ఆశ్చర్యంలో ముంచేస్తూ ఆత్మీయులందించే బహుమతులందుకోవడం ఎంత సమ్మోహనకరంగా ఉంటుందో, అంతకు పదింతలు ఉద్వేగంగానూ, హుషారెత్తించగల అనుభవంగానూ మిగిలిపోగలదేమిటంటే - మనమే ఎదుటి వాళ్ళను సంభ్రమానందాల్లో తేలియాడించడం. వయసొక అడ్డంకి కాదు, మోమాటాల ముసుగులేం చేధించరానివీ కాదు - చేయాలన్న తలంపు కలిగితే, చిత్తచాంచల్యానికి తలొంచకుండా చేసేయాలంతే! ప్రయత్నించి చూడండొకసారి!

10 comments:

  1. చాలా బాగుందండీ...

    అమ్మ దగ్గరకు వచ్చేసరికి ఒక్క ఆలోచనా తట్టదు. రెండు - మనం తెచ్చేవన్నీ వాళ్ళు అస్సలు లక్ష్యపెట్టనివీ, వాళ్ళు పట్టించుకోనివే అయి ఉంటాయి. అందుకనీ, వీళ్ళకు ఇలాంటి విషయాల్లో మినహాయింపు ఇవ్వాలి.
    >>
    కఱెక్ట్.... ;))))))

    ReplyDelete
  2. పద్మార్పిత గారూ - నిన్ననే జరిగిన ఒక విషయం మనసంతా బోలెడు బోలెడు బోలెడు సంతోషం నింపడంతో, ఆ ఆవేశంలో పంచుకున్న అనుభూతులివి. :). చాలా స్మృతులే పంచుకున్నాను నిన్న మీతో - థాంక్యూ!


    రాజ్, చెప్పేదేముంది, ఈ లోకంలో అమ్మల హవా అలా నడుస్తూంటుందంతే...! వాళ్ళకి మనిమిచ్చే అతి పెద్ద బహుమతి నొప్పించకుండా ఉండడటమొక్కటే! :)

    ReplyDelete
  3. నాకెప్పుడూ ఎవ్వరూ ఇలా ఊహలకందని బహుమతులివ్వలేదు.
    //////
    అరిటాకు కంచం కోసం ప్రతిరాత్రీ యుద్ధం చేయకుండా అక్కకి ఇచ్చేయడం; అమ్మ దుప్పట్లో అక్క కంటే ముందు దూరిపోయి, తల మాత్రం బయట పెట్టి వెక్కిరించే అలవాటుని అప్పుడప్పుడూ మానుకోవడం; సన్నటి సెగ మీద గులాబీ రంగులోకి వచ్చేదాకా మరగ కాచిన పాలతో, కాఫీ పొడి ధారాళంగా వేశాక వేడి వేడి నీళ్ళు తాకీ తాకగానే బొట్లు బొట్లుగా క్రిందకి జారే అమృతం లాంటి డికాషన్ తో, పొగలు కక్కుతున్న అమ్మ చేతి కాఫీను అర చేతుల మధ్య పెట్టుకుని, ఆదివారం ఈనాడు కథను చదవడం దేనికీ సాటి రాదని తెలిసినా, అమ్మ కోసం త్యాగం చేయడం; ////

    మా చెల్లి కూడా మీ లాగే ప్రతి దానికీ వంతుకొస్తుంది. బట్టల విషయంలో, పుస్తకాల విషయంలో, అమ్మ విషయంలో కూడా..

    ReplyDelete
    Replies
    1. అయ్యా/అమ్మా,

      :) నేను వంతులకు పోయేదాన్ని కాను :). నేను మహా మహా త్యాగాలు చేశానని చెప్పాననుకున్నానే. మీకిలా ఎందుకు అనిపించింది? :)
      (సరదాగా రాశాన్లెండి. వంతులకు పోవడం, పేచీలు పెట్టి పంతం నెగ్గించుకోవడం చిన్న వాళ్ళ జన్మ హక్కు). బదులుగా మీకు చాలా బోలెడు ప్రేమ ఇస్తారుగా!

      Delete
  4. మొత్తానికి "ఇచ్చుటలో ఉన్న హాయి" అని ఆలింగనం చేసుకున్నావన్నమాట :-)

    ReplyDelete
    Replies
    1. కొంచం అలాంటిదే అనుకోండీ :) - మీకు హైదరాబాదుకి సంచీల నిండా కాశీభట్ల పాత పుస్తకాలను తెచ్చి పెట్టిన మంచి మిత్రులే నాకీ సాయం చేసిపెట్టింది కూడానూ. వారికి థాంక్స్ చెప్ప్పుకోవడం కోసం ఇది వ్రాయాలనుకున్నాను, కానీ ఎలా చెప్పినా కృతజ్ఞత ప్రకటించలేననిపించి వదిలేశాను :)

      Delete
  5. టపా చాలా బావుందండీ.
    నేనూ మా ఫ్రెండ్ ఒకరి పెళ్లికి ఒక గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. వాళ్ల పెళ్లి జరిగే రోజు నుంచి మొదటి పెళ్లిరోజు వరకూ ఉండే ఏడాది కాలానికి "పెళ్లి పుస్తకం" పేరిట డైరీ ఒకటి ప్రింట్ చేయించి మధురానుభూతులు వ్రాసుకునేందుకు బహుమతిగా ఇద్దామని ఆలోచన. వధూవరులిద్దరి ఫోటోలు అక్కడక్కడా అందంగా వచ్చేలా తయారుచేస్తున్నాను.
    ఇంతకీ ఐడియా ఎలా ఉంది. ఏదైనా చక్కని మార్పులుంటే సూచించండి.
    ఇక్కడ ఈ ఐడియా ఇంత ధైర్యంగా ఎందుకు ప్రచురిస్తున్నానంటే ఆ ఫ్రెండ్ కి బ్లాగులు చదివే అలవాటు లేదు.

    ReplyDelete
    Replies
    1. పవన్ గారూ,

      చాలా చాలా మంచి ఆలోచనండీ..మీరు ఉండేదెక్కడో నాకు తెలీదు కానీ, బెంగళూరులో "పర్సనలైజ్డ్ గిఫ్ట్స్" ఇచ్చేందుకు కొన్ని అవకాశాలున్నాయి.

      మీరు ఇచ్చింది నాకెందుకింతలా నచ్చిందంటే, నాకు నేనే ఈ 2012 జనవరి ఒకటికి, మా ఇద్దరి ఫొటోలూ/కొన్ని జ్ఞాపకాలూ ప్రతి నెలకూ ఒక ఫొటో చప్పున వచ్చేట్టు డైరీ తయారు చేయించుకున్నాను. నేను "ప్రింటో" సహాయం తీసుకున్నాను. నేను కోరుకున్నట్టే వచ్చింది. చాలా ప్రత్యేకం గా అనిపిస్తుంది కూడానూ. మీ ఆప్తమిత్రులైతే మీరిది తప్పకుండా ప్రయత్నించి చూడవచ్చు.
      ( www.printo.in)
      నేను దాచుకున్న మరో రెండు ఆలోచనలు మీ కోసం :

      -- 12 ఫొటోలు+ కవర్ ఫొటోలతో - కాలెండర్, - ప్రతి నెల మీదా మీకూ(లేదా వారికి) నచ్చేలా ఒక ఆత్మీయ సందేశం
      -- ఇది నిజానికి చిన్న పిల్లల కోసం తయారు చేస్తున్నారు, కానీ "పర్సనలైజ్" చేయించే పక్షంలో మనకూ ఒక వెసులుబాటు ఉంటుంది - ఇంతకీ ఇదేమిటంటే - తొలి పరిచయం, తొలిసారి కలిసిన రోజు, నిశ్చితార్థం, మొదట కలిసి కొన్నది, తొలి ముద్దు, తొలి సినిమా, ఇలా అన్నింటి గురించీ రాసి భద్రపరచుకునే ఆల్బం. పైన మీకు /వారికి నచ్చే ఒక అందమైన ఫొటో, అందంగా అమరే కాప్షన్ రాసి బహుమతిగా ఇస్తే, జీవితాంతం దాచుకోవాలనిపించే బహుమతి అవుతుంది.

      Delete
    2. ఆమె పెళ్లి డిసెంబరులో ఉంది. చాలా ముఖ్యమైన స్నేహితురాలు. అందుకే ఇలా ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నాను. మీరిచ్చిన సలహా చాలా బావుంది. thank you.

      Delete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....