కాంచీపుర క్షేత్ర వైభవం


చిన్నప్పుడు "కంచి" అని ఎవరైనా అనగానే, "కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు.." అంటూ బిగించిన పిడికిలి నుదుటి మీద పెట్టుకుని, కళ్ళు మూసినట్టు నటిస్తూ "సోది" చెప్పడానికి సిద్ధపడేవాళ్ళం. పాతికేళ్ళ క్రితం మా అక్క, అమ్మ చీర చుట్టుకుని, కొప్పు పెట్టుకుని, ఈ "పసి"డి పలుకులను బడిలో అప్పజెప్పి ఓ బహుమతిని నెగ్గించుకున్నప్పుడు తీసుకున్న ఫొటో, ఈ రోజుకీ తన బాల్యపు స్మృతుల్లో భద్రంగా నిలిచే అనుభవమే. కాలి మీద బల్లి పడిందని చెంగు చెంగున ఎగిరి గందరగోళం సృష్టిస్తున్న చిన్న పిల్లలను నిలువరించి, కాసిన్ని పసుపు నీళ్ళు తలపై జల్లి, కంచి వెళ్ళొచిన వారెవరింటికైనా పంపి, తాకి రమ్మనడం తెలుసు. తాకితే ఏమవుతుందో తెలీదు. శ్రీకాళహస్తిలో ఉండే నా ఆత్మీయ మిత్రులొకరి ఇంటికి వెళ్ళి వచ్చేస్తునప్పుడు, నెమలిపింఛం రంగు పట్టుచీర వాళ్ళమ్మగారు ఆప్యాయంగా కానుకిచ్చి, "ఇదుగో బంగారు తల్లీ, కంచి నుండి ప్రత్యేకంగా తెప్పించిన చీర! కామాక్షి అనుగ్రహంతో త్వరగా పెళ్ళి కుదిరి, ఆ కంచిలోనే పెళ్ళి పట్టుచీర తీసుకునేందుకు తప్పకుండా రావాలి సుమా" అంటూ ఆశీర్వదించి పంపిస్తే, ఆ కలనేత చీర సొబగులన్నీ అబ్బురపడుతూ తడిమి చూసుకున్న మధుర జ్ఞాపకమొకటి రెప్పల వెనుక ఇంకా రెపరెపలాడుతూనే ఉంది.

ఇలా అడపాదడపా వినడమే తప్ప, ప్రయాణానికి పూర్వం కంచి గురించి నాది నిజంగా మిడిమిడిజ్ఞానమే! కాంచీ క్షేత్ర వైభవం ఏ కాస్తా తెలుసుకోకుండానే అక్కడికి వెళ్ళినా, ఆ "కంజ దళాయతాక్షి కామాక్షి -కమలా మనోహరి త్రిపుర సుందరి" దర్శనం అయిపోయాక మాత్రం తెలివొచ్చినట్లైంది. తెల్లవారు ఝామున అభిషేకానికి వెళ్ళామేమో, ధారలుగా పడుతూన్న పసుపు నీళ్ళు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేస్తుంటే, రెప్ప వాల్చకుండా చూస్తున్న అందరికీ అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. అటుపైన తెరల చాటున క్షణాల్లో చేసిన అలంకారం, మమ్మల్ని ముగ్ధులను చేసి, మనసులో ఇతఃపూర్వం ఉన్న ఆలోచనలన్నీ నిర్ద్వంద్వంగా చెరిపి వేసింది. "చంచలాత్ముడేను యేమి పూర్వ - సంచితముల సలిపితినో.. కంచి కామాక్షి నేను నిన్నుపొడగాంచితిని.." అంటూ మనసులో కీర్తించుకోవడమే కర్తవ్యమైన దివ్య క్షణాలవి.కంచిలో మొత్తం 360కి పైచిలుకు ఆలయాలు ఉన్నాయట. సత్యవ్రతక్షేత్రంగా పేరుబడ్డ ఈ నగరం, విశేషమైన స్థల పురాణం కలిగి, "శివకంచి", "విష్ణుకంచి" అన్న భాగాలుగా విడివడి, శైవులనూ, వైష్ణవులనూ సరిసమానంగా ఆకర్షిస్తుంది. ఉన్న 360 వారాంతంలో చూడడం ఎలాగూ అయ్యే పని కాదుకాబట్టి, తప్పక చూడవలసిన ఆలయాల జాబితాను కామాక్షి ఆలయ ప్రాంఘణంలోని అర్చకులను అడిగి సిద్ధం చేసుకున్నాము. అలా, కంచి కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకామ్రేశ్వరాలయం, కుమరకొట్టం సుబ్రహ్మణ్యుడి గుడి, వామన గుడి, శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము, శ్రీ కైలాస నాధుని ఆలయము, శ్రీ వరదరాజస్వామి ఆలయము - వీటన్నింటినీ దర్శించుకోగలిగే భాగ్యం లభించింది.

తమిళనాడు వాసుల భాషాభిమానాన్ని, భాషను సజీవంగా ఉంచడానికి వాళ్ళ ప్రభుత్వం తీసుకునే చర్యలనీ శంకించే అమాయకులింకా ఎవరైనా ఉంటే, కంచి లాంటి నగరాలకి ఒక్కసారి వెళ్ళాలని నా ప్రార్థన. బస్సులు, దుకాణాలు, పుస్తకాలు, వసతి గృహాలు - ఒక్కటని కాదు, ప్రతిచోటా, ప్రతీ చోటా...తమిళమే. మిగిలిన ప్రాంతాలలో ఎంతలా నవ్వుకున్నా, గుడి ప్రాంగణంలో అత్యంత ముఖ్యమైన విశేషాలు, మండపాల్లో ఉంచిన అనేకానేక మూర్తుల వివరాలు సైతం తమిళంలోనే ఉండేసరికి బాగా నొచ్చుకున్నాము. ఏ మూర్తికి దణ్ణం పెడుతున్నామో తెలియనివ్వని తికమకతనం ఎంత జాలిగొలిపే అనుభవమోనని అనిపించని క్షణం లేదు.

సరే, గత్యంతరం లేదు కనుక "అడుగని వాడజ్ఞుండగు.." అనుకుంటూ కనపడ్డ వారందరినీ పలకరించి బానే కాలక్షేపం చేశామనుకోండీ..! అన్య భాషలకైతే స్థానం లేదు కానీ, మంచి వారికీ, సాయం చేయగల సద్భుద్ధి కలవారికీ కొదువేం లేదక్కడ. "తమిళ్ తెరియుం", "తమిళ్ తెరియాదు" సందర్భోచితంగా వాడుకుంటూ కొంగుకు కబుర్ల మూటలు కట్టుకుని క్షేమంగానే ఇంటికి చేరాము. అవిగో, ఆ మూటల్లోని ముత్యాలే ఇప్పుడిక్కడ!

సకల కామితార్థ ప్రదాయినీ కామాక్షీ..:

భారతదేశంలో కామాక్షి ఆలయాలు చాలానే ఉన్నాయి. నెల్లూరులో జొన్నవాడ కామాక్షి గురించి చాలా మంది తెలుగు వారికి తెలిసే ఉంటుంది. కాశికామేశ్వరి గురించీ, అస్సాంలోని "కామాఖ్య" అమ్మవారి ఆలయం గురించీ, ప్రయాణ ఏర్పాట్లూ చూస్తూ మా నాన్నగారి దగ్గర కొన్ని కబుర్లు లీలామాత్రంగా నేనూ విని ఉన్నాను. అయినా, కంచి అంటే కామాక్షి , కామాక్షిని స్మరించగానే కంచి- వెనువెంటనే గుర్తు రావడం ప్రత్యేకమైన విషయమే! అమ్మవారి అవతారానికి సంబంధించి పురాణాల్లో ఆసక్తికరమైన వివరాలున్నాయి.

భీకర తపస్సుతో బ్రహ్మను మెప్పించి వరములొందిన బండకాసురుడనే రాక్షసుడు, ఆ గర్వాతిశయముతో దేవతలనూ, మునులనూ పీడించడం మొదలుపెట్టాడట. వారంతా కరుణించమంటూ శివుని శరణు వేడితే, ఆ రాక్షస సంహారం గావించగలిగినది పరాశక్తి మాత్రమేనని చెబుతూ, వారందరినీ కాంచీపురంలో ఉన్న అమ్మను ప్రార్ధించమని పంపివేస్తాడట ఆ చంద్రశేఖరుడు. దేవతలు, మునులూ ఆ పరాశక్తిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి, ప్రసన్నం చేసుకుని మనవిని విన్నవించగానే, ఆ తల్లి భైరవి రూపంతో కైలాసానికి వెళ్ళి, అక్కడ నిదురిస్తున్న బండకాసురుడిని వధించి, అతని కేశాలను పట్టుకుని కంచికి ఐదేళ్ళ బాలికగా తిరిగి వస్తుందట. ఆ ఉగ్రరూపాన్ని దర్శించి భీతిల్లిన దేవగణాలను కరుణించేందుకు తిరిగి ఆమె ప్రసన్న రూపంతో కనపడిందని కథ (బాలా త్రిపుర సుందరి). అటుపైన దేవతలే ఇక్కడ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలకు గురుతులుగా 24 మూల స్థంభాలతో గాయత్రీ మండపాన్ని నిర్మించి, ప్రసన్న రూపంతో కనిపించిన అమ్మవారి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించుకుని, తలుపులు వేసి బయటకు వచ్చి, ఆ రాత్రి శక్తి నామస్మరణలో గడుపుతారట. మరుసటి రోజు తెల్లవారుఝామున తలుపు తెరిచి చూసేసరికి, ఆ విగ్రహానికి బదులుగా, దేవగణాలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ, సాక్షాత్తూ రాజరాజేశ్వరీదేవి దర్శనమిచ్చి, అక్కడే కామాక్షిగా స్థిరపడిందని కథనం.

వామనమూర్తి గుడి :

కామాక్షి ఆలయానికి నాలుగడుగుల్లో నడచి వెళ్ళిపోగలిగిన గుడి ఇది. నల్లటి నలుపుతో మెరిసిపోయే రాతి మీద అత్యద్భుతంగా చెక్కిన వామన రూపం, తలలెత్తి హారతి వెలుగుల్లో కళ్ళు విప్పార్చుకుని చూస్తే తప్ప అర్థమవని శిల్పకళా చాతుర్యం ఈ గుడి ప్రత్యేకతలు.

"రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్"

-- అంటూ పోతనగారు ఆంధ్రులకు చూపించినది ఈ అవతారమే కదూ అనుకుంటూ హడావుడి పడకుండా "ఇంతింతై వటుడింతయై మరియు దానింతై..." అన్న రీతిన ఎదిగిన వామనావతారాన్ని ఒకసారి మన కళ్ళతో మనమూ చూడగలమిక్కడ. ఇహ మరెక్కడా వామన్మూర్తి అవతారానికి గుడులే లేవని అర్చకులు చెప్పారు. నిజమేనా? గుడుల సంగతేమో కానీ, మహాబలిపురంలో ఒకచోట ఈ అవతారాన్ని చాకచక్యంగా చెక్కడం చూసిన గుర్తు ...మీలో ఎవరికైనా గుర్తొస్తోందా?

ఏకామ్రేశ్వర ఆలయం :

ఈ పృథ్వీ లింగ క్షేత్రమొక ఆధ్యాత్మిక పుణ్యధామం. ఏక అంటే ఒక, ఆమ్ర మామిడి అని అర్థాలు. మావిడి చెట్టు క్రింద కొలువైన స్వామి కాబట్టి ఆ పేరు. 3500 ఏళ్ళ క్రితం నాటి మమిడి వృక్షం కొన్నాళ్ళ క్రితం దాకా కూడా ఇక్కడ ఉండేదట. ప్రస్తుతం ఉన్నది మాత్రం అది కాదని చెప్పారు.ఇక్కడ కథా పెద్దదే. సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.

ఒకసారి కైలాసంలో శివుడూ పార్వతీ ఏకాంతంగా ఉన్నప్పుడు, పార్వతీదేవి పరిహాసానికి శివుడి రెండు కళ్ళూ మూసిందట. సూర్య చంద్రులుగా చెప్పబడే ఆ పరమేశ్వరుడి రెండు కళ్ళూ మూసుకుపోవడంతో, సృష్టి మొత్తం చీకటిమయమై, సర్వ ప్రాణులూ భయాందోళనలకు గురి కావడంతో, శివుడు మూడవ కన్ను తెరిచి, లోకాన్ని శాంతింపజేశాడట. అటుపై, ఆ హిమగిరి నిలయుని ప్రియ ప్రణయిని, ప్రాయశ్చిత్తానికై తపస్సు చేయబూని, భూలోకంలోని బదరికాశ్రమమునకు చిన్న పిల్లగా వస్తుందట. అక్కడి ముని కాత్యాయనుడామెను చూసి, తన సంరక్షణలో పెంచుతాడు కనుక, ఆమె కాత్యాయని అయింది. ఆయన ఆదేశం మేరకు, కంచి చేరుకుని, ఇక్కడి మామిడి చెట్టు క్రింద కూర్చుని సైకత శివలింగం చేసుకుని, తపస్సు చేయడం మొదలు పెడుతుందట. మహాశివుడా తపస్సును పరీక్షింపదలచి, గంగను విడిచి వరదలు సృష్టించి తపోభంగం చేసే ప్రయత్నం చేస్తాడట. అప్పుడు సైకత లింగమెక్కడ కరిగిపోతుందోనన్న బెంగతో, శైలబాల గాఢాలింగనంతో శివలింగాన్ని కాపాడే ప్రయత్నం చేయడంతో- ఆ పరిష్వంగానికి పరవశుడై, ప్రత్యక్షమై,ఆమెను కరుణించాడన్నదే స్థల పురాణం!

కొమరకట్టం సుబ్రహ్మణ్య స్వామి :

సుబ్రహ్మణ్య స్వామి నాకు భలే ఇష్టం. అసలు చూడటానికే చాలా ఇష్టం. చిన్నప్పుడు భజనలంటే "సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథా సుబ్రహ్మణ్యం" అని గొంతెత్తి ఎడాపెడా పాడేసేవాళ్ళం. అసలు షణ్ముఖనాథుడి కథ తెలుసుకున్నది మాత్రం చాలా బోలెడు పెద్దయ్యాకే! త్రిపురా రహస్యాలని రంగరించి మరీ చాగంటి వారు చెప్పిన జన్మవృత్తాంతం విన్నాక ఈయన మహత్తు ఇదా అని ఆశ్చర్యపడిపోయాను.

సరే, ఇక ఇక్కడి కథంటారా, -- ఒకసారి సుబ్రహ్మణ్యుడికి తనను చిన్నవాడిగా పరిగణిస్తున్న బ్రహ్మ మీద కోపం కలిగి, ఆయనను ప్రణవనాదానికి భాష్యం చెప్పమని అడుగుతాడట. ఆయన సమాధానం రుచింపక, సృష్టి బాధ్యతను తనే తీసుకుని బ్రహ్మను కదలనీయడట. నారాయణుడు వెళ్ళి శివుడిని కల్పించుకోమని ప్రార్థిస్తే, ఆయన బ్రహ్మను విడిపించేందుకూ, సుబ్రహ్మణ్యుడికి మరింత ఉన్నత స్థానాన్ని ఇచ్చేందుకు, తానే స్వయంగా వచ్చి, కుమారుడి వద్ద శిష్యుడిలా మారి ప్రణవ రహస్యం తెలుసుకుని, బ్రహ్మను విడిచిపెట్టమని చెప్పాడట .( ఆ ప్రాంతం స్వామిమలై - సాక్షాత్తూ ఆది గురువుకే నేర్పాడు కనుక, శివగురునాథ/స్వామినాథ అనే పేరు). భగవంతుడి హేలను అర్థం చేసుకున్న సుబ్రహ్మణ్యుడు, ప్రాయశ్చిత్తానికై "ప్రళయజిత్ క్షేత్రం"గా పేరుబడ్డ కంచికి వచ్చి, ఇక్కడ తపస్సు చేసాడట. అదే కుమరకొట్టం, ఆయన అర్చించిన శివలింగమే, దేవసేనాపతీశ్వరుడు.

వరదరాజ స్వామి ఆలయం:

108 సుప్రసిద్ధ వైష్ణవ ఆలయాల్లో, మూడవ స్థానంలో నిలిచే గుడి ఇది. ఎత్తైన గోపురాలు, విశాలమైన గుడి. బ్రహ్మ కాంచీపురంలో అశ్వమేథ యాగం చేసి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకుని వరదరాజ అవతార దర్శనం పొందారని స్థలపురాణం. బంగారు బల్లి, వెండి బల్లి ఉండేది ఇక్కడే! ఉక్కపోతలు, ఉరుకు లైన్లు భరించి వెళ్ళారంటే చేతిని పైకెత్తి, గది పైగోడల పైనున్న బల్లిని పట్టుకుని దోషాలు పోగొట్టుకోవచ్చు. అన్నట్టూ, ఇక్కడే ఇంద్రుడికి శాపవిమోచనం అయిందట. అలా అయిన క్షణాల్లో సాక్ష్యాలుగా ఉన్న రెండు బల్లులకు గుర్తుగానే వీటిని కట్టించారని విన్నాను. పాపం, ఆ దేవేంద్రుడికి అన్నీ శాపాలే, ఎక్కడ చూడండి ఏదో ఒక కథ ఉంటుంది :)

ఇక్కడితో నేను స్థలపురాణాలు తెలుసుకుని వెళ్ళిన గుడులు అయిపోయాయి. శ్రీశిత్చ్ఛిపేశ్వరుని ఆలయం కంచి గుడికి దగ్గరే కనుక అదీ చూడగలిగాం. మిగిలినవేవీ కుదరలేదు. జయేంద్ర సరస్వతి దర్శనం అయింది. ఊహించని వేళలో, ఊహించని రీతిలో! మరోసారెప్పుడైనా కాంచీపురానికి వెళ్ళాలనీ, అన్నీ ఇంకా తీరిగ్గా చూడాలనీ ఉంది.

ఇక మీకు మిగిలిన ప్రశ్నేమిటో నాకు తెలుసు..కంచి వెళ్ళి, చీరల ప్రసక్తి లేకుండా ముగించడమేమిటనేనా..:) తీరిక చిక్కకపోవడమే అసలు కారణమనుకోండీ, అయినా నెపం కాలం మీద వేయకుండా "కంచి పెట్టు చీర కొనిపెట్టాలన్న ఆలోచనైనా రాలేదు, కించిత్ ప్రేమైనా ఉంటే క్షణకాలమేం దొరక్కపోదు.." అని నిష్ఠూరాలాడదామన్నా,

"అవనీ మహారాజ్ఞి కనిపె నే మారాజు పచ్చిక మేల్వన్నె పట్టుచీర,
గగనకాంత కెవండు కట్టబెట్టెను రేయి నీలి రంగుల జరీపూల చీర?"    

- అంటూ తప్పించుకోజూసే చతురులు శ్రీవారు. కనుక ఈశుడిదే భారం :)

17 comments:

 1. మీరు పాడిన కీర్తనలూ, చెప్పిన పద్యాలూ, వర్ణనలూ అన్నీ కంచి దర్శనం చేయించాయి మా చేత. చాలా బాగా వ్రాసారు.
  కైలాసనాథ గుడి గురించి రాయలేదే?

  ReplyDelete
  Replies
  1. కైలాసనాథ గుడి చూడడానికి సమయం సరిపోలేదండీ; మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 2. Nice! బాగా రాశారు! చిన్నప్పటి నుంచి కంచి చూడాలని కోరిక. మీలాంటివాళ్లు నా ఉత్సుకతను మరింత పెంచుతున్నారు. ఎప్పటికి తీరుతుందో కోరిక!

  ReplyDelete
  Replies
  1. చాణక్యా - కంచికి ఒకరోజు సరిపోదనిపించింది, నేను కేవలం స్థలపురాణాలు మాత్రమే వ్రాశాను, ఇవి కాక ఆశ్చర్యం కలిగించే కథలు, ఆపెద్ద పెద్ద గుడుల్లో ప్రతిచోటా విశేషంగా కనపడే మూర్తులు, శివలింగాల గురించి వ్యాసం నిడివి పెరిగిపోతుందని వ్రాయలేదు. మీరు చూడడం జరిగితే శేషభాగాన్ని పూర్తి చేయండి. :)

   Delete
 3. అది ఏకామ్రేశ్వర ఆలయం అంటారా ? నేను ఏకాంభరేశ్వర ఆలయం అనుకున్నానండి !
  Nicely written !

  ReplyDelete
  Replies
  1. శ్రావ్యా - థాంక్యూ! రెహ్మాన్ గారు చెప్పినది నిజమే! రెండూ వాడుకలో ఉన్నాయి. కాకపోతే మామిడిచెట్టు సాక్ష్యం ఇంకా ఉంది కనుక, ఏకామ్రేశుడు అనే ఎక్కువగా వినపడుతుంది.

   Delete
 4. ఏకామ్రము - ఒక మామీడి చెట్టు
  ఏకాంబరేశ్వరుడు -- ఒకే వస్త్రాన్ని ధరించే వాడు. రెండూ వాడుకలో ఉన్నాయి

  ReplyDelete
 5. చాల చక్కగా వివరించారు....వెళ్లి చాల కాలం అయింది.
  తమిళనాడు లోని దేవాలయాలు మాత్రం చూడదగ్గవి.
  వాటిని కాపాడుకున్న పూర్వ రాజులకు జేజేలు

  ReplyDelete
  Replies
  1. Thank you, Sekhar. తమిళనాడు రాజులు, ప్రజలు కూడా వాళ్ళ దేవాలయాలను ఇన్నేళ్ళ నుండీ కాపాడుకోవగల్గడం నిజంగా ఆశ్చర్యపరచే విషయం.

   Delete
 6. Hi Manasa,

  Baaga raasavu..
  Juss monne amma vallu TN trip lo ala rameswaram anchula daaka velli vacharu..

  even memu vcellalanukuntunnam but sringeri to modalu pettalni vundi....

  ReplyDelete
 7. మిత్రా, థాంక్యూ! ఎలా ఉన్నావు? హరిత ఎలా ఉంది ? శృంగేరి తీసుకు వెళ్ళమంటోందా? :) తప్పకుండా వెళ్ళండి. హరిత బాగా ఎంజాయ్ చేస్తుంది - నాదీ హామీ! తనకు నచ్చే విషయాలు చాలానే ఉన్నాయి - శివుడి గుడి, తోటలు, అడవులు, పూలు, మౌనం:)

  ReplyDelete
 8. Hi Manasa, how are you doing ? I dont understand telugu..but glad to know you are still actively writing cool stuff Good luck!

  M.....C..

  ReplyDelete
 9. Hey! Great to hear from you, dear MC! I am doing good, thanks.

  ReplyDelete
 10. Manasa Gaaru...Chala Bavundi...nice naration great.

  ReplyDelete
  Replies
  1. Anil Garu,

   Thank you so much for the feedback.

   Warm Regards,
   M

   Delete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....