ఓ దిగులు గువ్వ

1

ఏమీ గుర్తు లేదు..

తెలిసిన పాటే ఎందుకు పాడనన్నానో
తెలీని త్రోవలో
తొలి అడుగులెందుకేశానో
గాలివాన మొదలవకుండానే
గూటిలో గడ్డి పరకలు పీకి
గువ్వ ఎందుకలా ఎగిరిపోయిందో..

2

రెల్లుపూల మధ్య నడుస్తూ
పాటల్ని పెనవేసుకోవడం గుర్తు
వెన్నెల రవ్వలు విసురుకుంటూ
సెలయేరు వెనుకగా నవ్వడం గుర్తు
పల్లవి కూడా పూర్తవని పాటకి
మనం కలిసి చరణాలు రాసుకున్నట్టూ
కాలం ఆశ్చర్యపోయి
అక్కడే ఆగిపోయినట్టూ..గుర్తు.

3

చుక్కలు నవ్వితే ఇష్టమే కానీ
చీకటెప్పుడూ భయమే
ఎటు కదిలినా కూలిపోయే వంతెన మీద
ప్రయాణమెప్పుడూ భయమే
ఒక్క మాట వేయి యుద్ధాలయ్యే క్షణాల్లో
పెదాల మీద సూదులు గుచ్చే నిశ్శబ్దమన్నా..
నీ పాట నా చుట్టూ గింగిర్లు కొట్టదంటే
బరువెత్తిపోయే ఈ బ్రతుకన్నా…

4

పూవులన్నీ రాలిపోయాక
మధువు రుచి కవ్వించేదెందుకో
ఆకాశమంత స్వేచ్ఛ కోరి రెక్కలల్లార్చాక
గూటి నీడ కోసమింత తపనెందుకో
ఒక్క దిగులుసాయంకాలం,
చీకటి లోయల వైపు తోస్తున్నదెందుకో..

అంతా అర్థమయీ కానట్టుంది..
ఏం కావాలో
ఏం కోల్పోవాలో…

5

శిశిరం
ఆఖరి ఆకు కూడా రాలిపోయింది
గుండెలోనూ గొంతులోనూ విషాదం
ఒక్కమాటా పెగలనంటోంది
ఎందుకలా అనిపిస్తుందో ఒక్కోసారి-
ఈ దిగులంతా ఓదార్పని
లోలో జ్వలిస్తోన్న మాట నిజమే కానీ,
ఇది కాల్చేయదనీ..
                                                                                                                   * తొలి ప్రచురణ సారంగలో.
Special thanks to Nandu:) and Swathi

6 comments:

 1. Nice andi .meeru rese vidhanam naaku chaalaa nacchutundi simple gaa raastaaru kaanii baavam nindugaa vuntundi
  Radhika(nani)

  ReplyDelete
  Replies
  1. రాధికగారూ, చాలా సంతోషమండీ, ధన్యవాదాలు. మీ "చిత్తరువు"కి నేను వీరాభిమానినండీ...:))
   A picture is worth thousand words అని కదా సామెత. అలా మీరొక్క బొమ్మతో ఎన్ని కవితలు చెబుతారో..ఎంత అల్లరిని చూపెడతారో, ఎంత అమాయకత్వాన్ని పదిలంగా దాచి ఆశ్చర్యపరుస్తారో....నిజ్జం. ఆ చూపు అందరికీ దొరికేది కాదు. Keep posting those pics. Good luck and thank you.

   Delete
  2. అవును చాలా మందిలా భావాన్ని చెప్పలేను కాబట్టే ఈ దారినెంచుకున్నా .. చాలా థాంక్స్ మానస గారు :)
   Radhika (nani)

   Delete
 2. ఒక అటోమేటడ్ స్క్రిప్ట్ వ్రాసిపడేయ్యాలనుంది. మీరు టపా వ్రాసినప్పుడల్లా 'అద్భుతః ' అని నా కామెంటు పడిపొయేటట్లు :)

  ReplyDelete
  Replies
  1. :)) Thank you Thank you. I am so happy that you are enjoying madhumanasam. Please keep posting your feedback :)

   Delete
 3. Elaa rastaaru intha baagaa..?
  mee baavukathaku secret ???

  ReplyDelete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...