తామరాకుపై నీటిబొట్టు


గులాబిముళ్ళను దాటి మెత్తని రేకుల తాకలేని చూపుల్తో
మిటారివెన్నెల నీడల్ని వదిలి జాబిలిని పట్టలేని జీవితాల్తో
కోర్కెల చిదుగులు పోగేసి చింతల చితి రాజేస్తున్నప్పుడు
తనవైనవన్నీ త్యజిస్తూనే తనవి కానివేవీ లేవనే విరాగిలా
ఎవరో కనిపిస్తారు, కదిలిస్తారు
మన అత్యాశల మీద అసహ్యాన్నికలిగిస్తారు.

త్రిశంకుస్వర్గాన చీలిపోయే గెలుపు నిచ్చెనపై వణికే దేహంతో  
కోరివెళ్ళిన మార్గాల్లో కోల్పోయిన వర్ణాలకై మరిగే ప్రాణంతో
దిగులుకలుగులో చేరి నిరాశానిప్పుల్లో దహనమౌతున్నప్పుడు
శిశిరోత్తర వేళల్లోనూ వసంతాన్ని స్వప్నించగల లతానెలతల్లా
ఎవరో ఎదురొస్తారు, నిలదీస్తారు
మనలోని లోటునీ లోలోపలి చీకట్లనీ పరిహసిస్తారు.

సంఘర్షణ మొదలవుతుంది, జీవితం మారదు
దాహం తీరదు, మోహపాశమూ తెగదు
సంద్రపునీరెంత ఉప్పనో గొంతు దిగందే నేర్వరెవ్వరూ.
అంతర్యానం కొనసాగుతుంది - దుఃఖం ఆగదు
బ్రతుకంతా అలవాటో పొరబాటో తెలిసిరాదు
ఎడారిలో పరుగెందుకాపాలో విప్పి చెప్పరెవ్వరూ.

సంఘర్షణల రాపిడికి
స్వర్ణకాంతులీనుతోన్న హృదయంతో,      
ఏ చీకటి లోతుల్లోనో
వెలుగులు చూసిన ఉద్వేగంతో,
ఎదురుచూడని ఏదో మలుపులో, జ్ఞానం-
కాలం పొత్తిళ్ళలో కళ్ళువిప్పుతుంది.

ఆత్మ ముందు నిగర్విలా మోకరిల్లే ఆ పూర్ణక్షణాల్లో
జతపడ్డ చేతులే జల్లెళ్ళై జీవితాన్నివడకడుతోంటే
తామరాకుపై నీటిబొట్టులా మసలడమూ  
చీకటింట వెలుగురవ్వలా మెరవడమూ
ఎవరికి వారే నేర్వగల్గిన మర్మవిద్యలై
జీవనసౌందర్యాన్ని పునర్నిర్వచిస్తాయి.

* తొలి ప్రచురణ: ఆటా జ్ఞాపక సంచిక- అక్షరలో 

12 comments:

  1. చాలా బావుందండీ. చిక్కటి జీవితతత్వాన్ని కవితాత్మకంగా బోధించినట్టుంది. మిటారీ, లతానెలతల్లా... ఈ పదాలు ఫస్ట్ టైమ్ వింటం. నాకూ ఇలాంటి జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుందో, ఏమో??? :-)

    ReplyDelete
  2. చాలా బావుంది మాన్సా..

    ReplyDelete
  3. Ahhooo...reallly superb...no words:):)

    ReplyDelete
  4. Very matured writing .. అద్భుతంగా రాశారండీ :)

    ReplyDelete
  5. ** నాగరాజ్ గారూ, ధన్యవాదాలండీ! బమ్మెరపోతన సినిమాలో అనుకుంటాను, ఓ పాట ఉంటుంది..నాకు సరీగ్గా గుర్తు లేదు కానీ, మిటారిపోకడలా వదినా అని కాబోలు ఉంటుంది. చిట్టి మరదలు పిల్ల వదినను ఆటపట్టిస్తూ పాడే పాట. చాలా బాగుంటుంది.
    ఆంధ్రభారతిలో చూస్తే నేనెందుకు వాడానో తెలిసిపోతుంది :). నెలత అంటే స్త్రీ అని.
    మీరు ఈనాడులో రాసే వ్యాసాలు చదువుతూంటానండీ...మీరీ మాటలు తెలియవనడం నన్ను ఆటపట్టించేందుకు కాదు కదా!

    **

    తృష్ణగారూ, కార్తిక్, నాగ, నాగినిగారూ..హృదయపూర్వక ధన్యవాదాలండీ.

    **

    ReplyDelete
  6. బావుందండి..వీలైతే అక్షరలో మీ కవిత ప్రచురింపబడిన పేజీని ఫోటో కాపీ తీసి పెట్టండి.

    ReplyDelete
  7. * లోకేష్‌శ్రీకాంత్ గారూ, ధన్యవాదాలండీ! నా కాపీ ఇంకా అందలేదండీ. రాగానే అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. :))

    * సుమగారూ - ధన్యవాదాలు. :)

    ReplyDelete
  8. A poem with very refined sensibilities and deep philosophical content. I admire you Manasagaru for this wonderful poem.

    ReplyDelete
  9. Nice poem manasagaru.
    మీ అనుభవాలను భావాలుగామర్చి అక్షరాలలొ భందించి మా మనసులకు అందించినందుకు Thanks.

    బావం అక్షరం కావలలైతే అది కవిత్వం. :-)

    ReplyDelete
  10. Nice poem manasagaru.
    మీ అనుభవాలను భావాలుగామర్చి అక్షరాలలొ భందించి మా మనసులకు అందించినందుకు Thanks.

    బావం అక్షరం కవలలైతే అది కవిత్వం. :-)

    ReplyDelete
  11. * మూర్తిగారూ, మీ మాటలు వినడం ఎప్పటిలాగే చాలా సంతోషం..మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలండీ..

    * శ్రీధర్ గారూ - ధన్యవాదాలండీ!

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....