అమ్మ వెళ్ళిన రాత్రి


మళ్ళీ నాలుగు రోజులకు సరిపడే దోసెల పిండీ,
డబ్బాల నిండా కారప్పొడులూ,
కొత్తిమీరా, గోంగూరా పచ్చళ్ళూ..
అమ్మ ఊరెళుతూ కూడా
కొంత కష్టం నుండి తప్పించే వెళ్తుంది.
పగిలిన తన పాదాల కోసం
నే కొన్నవన్నీ వదిలేసి,
విరిగిపోతున్న గోళ్ళకు అద్దుకోమని
నేనిచ్చిన రంగులన్నీ వదిలేసీ,
కొంత దిగులునీ, కొన్ని కన్నీళ్ళనీ
నాకు వదిలేసి
అమ్మ వెళ్ళిపోతుంది
మళ్ళీ వస్తానుగా అన్న పాత మాటనీ
ఏమంత దూరం, నువ్వైనా రావచ్చులెమ్మనీ..
తనను కరుచుకుపడుకున్న నా చెవిలో
ధైర్యంలా వదిలేస్తూ,
నన్నిక్కడే వదిలేస్తూ
అమ్మ వెళ్ళిపోతుంది.
అమ్మ వెళ్ళిన రాత్రి,
నిద్ర పిలువని రాత్రి,
బాల్కనీలో తీగలను పట్టుకు
ఒక్కదాన్నీ వేలాడుతోంటే,
ఆరలేదని అమ్మ వదిలిన చీర
చెంపల మీద తడిని ముద్దాడి పోతుంది.
మసకబారిన మొహాన్ని దాచుకోబోతే
అద్దం అంచు మీద అమ్మ బొట్టుబిళ్ళ
తన కళ్ళతో సహా కనపడి సర్దిచెబుతుంది.
అలవాటైన అమ్మ పిలుపు వినపడక
ఖాళీతనమొకటి చెవులను హోరెత్తిస్తోంటే
తను పిలిస్తే మాత్రమే పలికే ఇళయరాజా పాట
రింగ్‌టోన్‌లా ఇల్లంతా మోగిపోతుంది.

( * ప్రచురణ: తెలుగు వెలుగు, జులై 2019 )

6 comments:

 1. పగిలిన పాదాల కోసం కొన్నవి తీసుకెళ్ళకపోతే కంప్లైంట్ చెయ్యడం తెలుసు కానీ అందమైన కవితలు రాయచ్చని ఇప్పడే తెలిసిందండీ ..brillient as usual

  ReplyDelete
 2. Thank you so much, Vamsi :) Thank You!

  ReplyDelete
 3. Very nice. Touching.

  మీ కవితలు చాలా బాగుంటాయి. మీ రచనల్లో మొదట నా కంటబడింది కవితే. అంతర్జాలంలో అటూఇటూ తిరుగుతూ అవీఇవీ చదువుతూంటే నాఅభిమాన కవి తన పేజీలో బహుమతి పొందిన మీ కవితనొకదాన్ని ఉటంకించారు లింకుతో సహా. ఆ లింకు పట్టుకలాగితే బ్లాగంతా బయట పడింది. వెంటనే ఒక వాయ బింజ్ రీడింగ్ చేసేసి తరవాత ఫాలో బటన్ నొక్కకున్నా రెగ్యులర్ గా ఫాలో అవుతూవున్నా మీ రచనల్ని. మీరు కథలు, వ్యాసాలు వగైరా కూడా చాలా బాగా రాస్తారు. Good stuff. Thank you. And keep it up. - రవి

  ReplyDelete
 4. కంటతడి పెట్టించారు.భావోద్వేగానీకీ లాలిత్యానికి మధ్యే మార్గంగా
  సహజంగా రాసారు.

  ReplyDelete
 5. "ఆరలేదని అమ్మ వదిలిన చీర,మళ్ళీ వస్తానుగా అన్న పాత మాటనీ
  ఏమంత దూరం",ఈ రెండు మాటలు చాలండి ఈ కవిత అందం గురించి చెప్పడానికి, అమ్మాలనే ఈ కవిత కూడా ఎవ్వరు పెద్దగా గుర్తించని విషయాలు ఎప్పటికి మనతో గుర్తుండిపోయేలా చెప్పారు.

  ReplyDelete
 6. చాలా అద్భుతంగా రాసారు!!

  ReplyDelete

వేడుక

 సెలవురోజు మధ్యాహ్నపు సోమరితనంతో ఏ ఊసుల్లోనో చిక్కుపడి నిద్రపోయి కలలోని నవ్వుతో కలలాంటి జీవితంలోకి నీతో కలిసి మేల్కోవడమే, నాకు తెలిసిన వేడుక...