చిరంజీవి

అర్ధణా ఇడ్లీ మొహంతో నువ్వలా
అమాయకంగా ఎటో చూస్తోంటే
నిన్ను చిటికెలతో నా వైపు తిప్పుకోవడం
బాగుంటుంది.
నీ ఎడమ కణత మీద
నా చిటికెన వేలొక చుక్కను దిద్దుతోంటే
నీ కనుపాపలు గండు మీనులై తత్తరపడడం
గమ్మత్తుగా ఉంటుంది.
పిట్టలు పారే వేళకి ముందే
దండెం మీది నీ బట్టలు మోసుకుని నే నో
లేరంగుల ఇంద్రధనుస్సునై ఇంటిలోకి నడవడం
రంగులకలలా ఉంటుంది.
నిదురలో నువ్వెందుకో
ఉలికిపాటుతో లేచి ఏడ్చినపుడు
అమాంతం గుండెలకు హత్తుకుని
బుజ్జగించి నిద్రపుచ్చేశాక
కన్నుల్లో నీరెందుకో చిప్పిల్లుతుంది.
“బారసాల పెళ్ళికొడుకువై…” అంటూ మొదలెట్టి
పెళ్ళి పెళ్ళికొడుకులా ఎలా ఉంటావో ఊహించి దీవించి
కాస్త సంబరపడీ, మరికాస్త కలవరపడీ,
ఊహల రెక్కలు విదుల్చుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది.
తన కోసం దాచుకున్న పేరుని నీకివ్వడం చూసి
తనే మళ్ళీ నీలా వచ్చాడని నమ్మే ఈ అమ్మానాన్నల్ని చూసి
స్వర్గంలో దేవుడి బొజ్జ మీద ఆడుకుంటూ పెరిగే పసివాడొకడు
సొట్ట బుగ్గలతో నవ్వుతూ ఉంటాడన్న ఊహే, 
ఉండుండీ మనసును కోసేస్తుంది.
తొలిప్రచురణ ఈమాట, మే-2016 సంచికలో..

6 comments:

 1. మసక వెన్నెల్లో కలువల అందం..!పొద్దుపొడుపుతో కనుమరుగవడం..! ఎంతటి విషాదం..!!
  తొలికిరణం స్ఫ్రుసించినపుడు కమలం నవ్వడం..!ఇంకెంతటి ఆనందం..!!
  ఒకరి తర్వాత మరొకరు..!ఈ పరంపర నిరంతరమే..!!
  కనుమరుగవడం..!తిరిగి కనిపించిడం..!సజీవమీ స్రవంతి..!!
  ఊహా ప్రపంచపు అంచుల్లోనే మనస్సు చిక్కబడుతుంది..!
  తనకు తానే ధైర్యం చెప్పుకుంటుంది..!!  ReplyDelete
 2. తన మాటలను సంబరాలనూ గుర్తు చేసారు.

  ReplyDelete
 3. This comment has been removed by the author.

  ReplyDelete
 4. ఇడ్లీ మొహం
  - ఇది మా ఇంటి మాటే అనుకున్నాను - మీ కవితలో ఇలా చదవడం బాగుంది :)

  లేరంగుల ఇంద్రధనుస్సునై
  - మిమ్మల్ని ఊహించేసుకున్నాను - ఒకప్పటి నాలా :)
  ఆ ఆఖరి ఐదు లైన్లు లేకపోతే బాగుండుననిపించింది - నాకు మాత్రమే సుమా!
  ఈమాట జులై సంచికలో ఈ కవిత చదివినప్పట్నుంచీ ఈ మాటలు చెబ్దామని - ఇప్పటికి కుదిరింది.

  మీ బుజ్జి బుజ్జాయివి మరిన్ని కబుర్లు పంచుకుంటారని ఎదురు చూస్తూ...
  శుభాభినందనలతో-
  ~ లలిత

  ReplyDelete
  Replies
  1. థాంక్యూ లలిత గారూ! ఆ "ఇడ్లీ" మా అమ్మదండీ ;). బుజ్జాయి ఆ మాత్రం వీలు కల్పించాలే కానీ తప్పకుండా పంచుకుంటానండీ! :)

   Delete

ఒక నిన్న

బయట ఇంకా పూర్తిగా చెదరని చీకటి. ఇంకా భంగమవని నిశ్శబ్దం. ఇంకా కురవని నల్లమబ్బు తునక. నన్ను పిలిచీ పిలిచీ అలసినట్టు, కూత ఆపేసిన బుల్లిపిట్టల ...