కుందాపన – రవి వీరెల్లి




సతాతీహైఁ గుర్బత్‌ మే యాద్‌-ఎ-వతన్ జబ్
గలే మిల్‌కే రోతాహూఁ హర్ అజనబీ సే!
ప్రవాసంలో నా దేశపు జ్ఞాపకం బాధించినప్పుడల్లా/ ప్రతీ అపరిచితునీ కౌగిలించుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటాను– రానా సాహ్రీ ఘజల్ లోని ఈ షేర్ గురించి మిత్రులు మాధవ్ గారి మాటల్లో వింటూండగానే, కుందాపన మనసులో మెదిలింది.

కుందాపన (2017)
వాకిలి ప్రచురణలు, రూ. 100/-
కవిత్వం కొందరికి అస్థిరపరచే ప్రశ్నల పుట్ట, మరికొందరికి అది స్థిమితపరచే సమాధానం. ఇంకొందరికి, ప్రశ్నల పరంపర ప్రతి రాత్రీ మీదకొచ్చి పరీక్ష పెడుతోంటే, ఏ జవాబూ ఎదురుపడని వేళ తానే అడ్డంగా నిలబడి కాచుకునే కవచం. ‘నేనెందుకు కవిత్వం వ్రాస్తున్నాను?’ అనేది కవికి చాలా సంక్లిష్టమైన ప్రశ్న; తనకు తానే చెప్పుకునేందుకైనా, తన దారిలోకి ఎదురొస్తున్న వారికి చెప్పేందుకైనా. కవులందరికీ ఈ ప్రశ్నకు జవాబివ్వవలసిన (ఇచ్చుకోవలసిన) బాధ్యత, అవసరం ఉన్నాయని నేననను గాని, కొందరి కవిత్వం ఎవ్వరూ అడగకుండానే ఈ ప్రశ్నకు జవాబు చెబుతుంది. ఆ దృష్టితో చూస్తే, రవి వీరెల్లి కవిత్వసంపుటి కుందాపన తన లక్షణమేమిటో, లక్ష్యమేమిటో, ప్రతి కవితలోనూ విప్పి చెబుతూనే వచ్చింది.
ముందుమాటలో కవి బాహాటంగా తన ఊరి తాలూకు జ్ఞాపకాలే తనని ఈ కవిత్వపు త్రోవలో అడుగులేయించాయని చెప్పుకుంటాడు: ‘కవిత్వానికీ ఊరికీ ఏదో లంకె ఉంటుంది. బొడ్డు తాడు తెంపాక కూడా పిల్లాణ్ణీ అమ్మనీ కలిపి ఉంచే అదృశ్య దారంలాగా, ఊరు వదిలాక కూడా ఇంకా ఊరుతో తెగని అదృశ్య బంధం నీడలా నన్ను వెంటాడుతూనే ఉంది. ఊరు మీదున్న మమకారంతోనో, జ్ఞాపకాల్ని మోయలేకనో, ఆలోచనలని బంధించలేకనో – కారణం ఏదైనా కవిత్వం తొవ్వ నడవాలనిపించింది.’
అయితే, ఇక్కడ జ్ఞాపకాలంటే మన చిన్నప్పటి ఫొటోలు మళ్ళీ మళ్ళీ చూసుకుని మురుసుకోవడమో, చిననాటి స్నేహితుడు అకస్మాత్తుగా కనపడి అలనాటి ఊసులేవో గుర్తు చేస్తుంటే ఆ రోజుల్లోకి మళ్ళిపోవడమో కాదు. వర్తమానంలో ఎదురొస్తున్న అనుభవాలను బట్టి, గతమంతా జ్ఞాపకంలా ఓ లిప్తకాలం మాత్రమే మెరిసి వెళ్ళిపోవడమూ కాదు. అంటే, ఇది ఒక క్షణికమైన లేదా తాత్కాలికమైన ఉద్వేగం కాదు. మనలో నిద్రాణ స్థితిలో ఉంటూ, వర్తమాన ప్రపంచంలో జరిగే ఏ సంఘటనకో మీట నొక్కినట్టు ఎగసిపడి వాటి ఉనికిని చాటుకునే జ్ఞాపకాల సంగతిది.
జ్ఞాపకాలతో ముడిపడ్డ రవి కవిత్వంలో కనపడే అనుభూతి ఆహ్లాదకరమైనదో, తలచిన కారణానికే మనని సంతోషం లోనికి నెట్టేదో కాదు. నివురుగప్పిన నిప్పులా లోపల్లోపల నిత్యం జ్వలించే అనుభూతిని అక్షరబద్ధం చేసే ప్రయత్నం ఇది.
‘త్వద్వియోగేన మే రామ త్యక్తవ్యమిహ జీవితమ్’ అని కోరికోరి తన వెంటనడచి వచ్చిన సీత కనపడని సందర్భంలో, రాముడు, జనశూన్యమైన అరణ్యములో ప్రవేశించిన పిమ్మట ఆ దుఃఖమంతా శరీరములో శాంతించినది. కాని ఇప్పుడు సీతావియోగము కలుగుటచే ఆ దుఃఖమంతా మరల కట్టెలు వేయుటచే వెంటనే అగ్ని ప్రజ్వలించినట్లు, మరలా విజృంభించినది అని లక్ష్మణుడితో చెప్పుకు వాపోతాడు. ఒక వియోగం మరొక వియోగ భారాన్ని ఎగదోసి, ఒక దుఃఖాగ్ని జ్వాల మరొక దుఃఖాగ్ని జ్వాలను అంటిస్తూ పోయిన వైనమది (శ్రీమద్రామాయణము, అరణ్యకాండము, అథ త్రిషష్టితమః సర్గః).
కానీ, కుందాపన కవితల్లో కవి దుఃఖం ఒక సంఘటనకు లేదా ప్రదేశానికి పరిమితమైనదని చెప్పడం కష్టం. ఇతనిదొక నిరంతర పరిశ్రమ – ఇతనికి గతంతో సంధి కుదరాలి.
దిగులు పువ్వు అన్న కవిత చూడండి.
సుదీర్ఘమైన చర్చ
ఓ కొలిక్కి వచ్చేలోపే ముగిసినట్టు
చీకటి వెలుగుల్ని ఒడుకుతున్న కాలం చేతుల్లో
రంగు మారిన దారం
కలనేత వస్త్రంలా, అతడి జీవితం లేదా మనఃస్థితి పగటికీ రాత్రికీ మధ్య రంగులు మార్చుకోవడాన్ని గురించి చెబుతున్నాడు కవి. అది ఒక పద్ధతైన అల్లిక. చీకటి పడే వేళకి శోకపు ఛాయని చూపించే పొందికుంది అందులో. మరి ఈ సుదీర్ఘ చర్చ ఏమిటి? ఎవరితో?
పైన అన్నట్టు, కవికి గతంతో సంధి కుదరాలి. రాత్రిగా మారాక తనను దిగులై వెంబడించవద్దని పగటిని వేడుకుంటున్నాడు. కవి పదాల ఎంపిక కూడా స్పష్టమైనది. అందుకే, ‘గతాన్ని వెలిగించి గట్టిగా పీల్చాను’ అనడం ద్వారా, దిగులు పడడమనేది తనకొక వ్యసన ప్రవృత్తిగా మారిందని చెబుతున్నాడు. ఆ దుఃఖం వదిలించుకునే అవకాశం ఉండి ఉండవచ్చు గాక- దానినితడు వాడుకోలేడు. ప్రతిగా అతడేమి మూల్యం చెల్లించాల్సొస్తుందో కూడా తెలుసు. దిగులు పువ్వు అంత తేలిగ్గా రాలిపడేది కాదు అని అన్నదందుకే.
రాత్రిళ్ళు ఎదురుపడగానే కవి తనను తానే ఇలా లోకువ చేసుకోవడం, ఈ ఒక్క కవితలోనే ఎదురొచ్చిన గమనింపు కాదు. ఈ కవిత చూడండి. ఈ కవిత్వంలో కవి మాట్లాడుతోన్న గతం, అతను వదుల్చుకోలేకపోతున్న, మోయలేకపోతున్న బరువు. దిగులు. అందుకే అతడు రాత్రులకు లోకువ.
నడిరాత్రి నడుం మీద
సమయాన్ని చేది పోస్తూ
అరతెరిచిన కళ్ళతో
ఒక్కొక్క జ్ఞాపకం పూసని
మునివేళ్ళతో మీటుతూ

పొగమంచుని మోస్తూ
పొడిచే పొద్దు కోసం
ఎదురుచూసే వెదురుపొదలా
ఇలా…
నా రాత్రులు నావి
నీ పగళ్ళు నీవి.

రెండు ముక్కలైన
రోజును
అతికిస్తే బావుణ్ణు!
ఇలా జ్ఞాపకాలను పూసలుగా మునివేళ్ళతో తిప్పుకుపోవడం, ఉదయం కోసం చేస్తున్న తపస్సంటున్నాడు కవి. ‘నా రాత్రుళ్ళు నావి, నీ పగళ్ళు నీవి’ అనడంలోనే, సజావుగా సాగిపోయే పగలు, రాత్రిలోకి మళ్ళుతూనే రూపు మార్చుకుంటోందన్న అర్థం వచ్చి చేరింది. పగలూ రాత్రీ తానే రెండు విభిన్న వ్యక్తులుగా చీలిపోవడమూ తెలిసింది. ఇప్పుడిక ఆఖరు వాక్యంలో ఆశపడ్డట్టు – రెండు ముక్కలైన రోజును ఎవరైనా అతికించడం ఎందుకూ? ఆ రాత్రిళ్ళ ఒంటరితనం నుండి అతడిని కాపాడి, పగలూ రాత్రీ ఒకే ఒరవడిలో – ఒకే దుఃఖంలో లేదా ఒకే సంతోషంలో- సాగేందుకు ఆసరా ఇచ్చేందుకు. ఆ విముక్తి కోసమే జ్ఞాపకాల మణిపూసలతో అతను తపస్సు చేస్తున్నది. నిజానికి, ఆఖరు పాదంలో ‘ఎవ్వరైనా’ అని ధ్వనింపచేస్తూ, మళ్ళీ ఈ రోజుని తన హస్తగతం చేసుకోవడంలో తాను నిస్సహాయుణ్ణని చెప్పకనే చెబుతున్నాడు. పైన ప్రస్తావించిన కవితలోని దిగులు పడడమనే వ్యసనప్రవృత్తినీ గుర్తు చేస్తున్నాడు.
దృష్టి, ధ్వని, స్పర్శ, రుచి కూడా మన జ్ఞాపకాలను తవ్వి తోడి కలవరపెట్టగలవు. దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్ వింటే కొందరికి కుటుంబమంతా కలిసి భోజనం చేసిన సమయాలు గుర్తుకు రావచ్చు. షాపింగ్‌మాల్‌లో ఆదమరుపుగా తిరుగుతున్నప్పుడు అదాటుగా సోకిన అత్తరు వాసన, ఎడమైన ఎవరి సాన్నిహిత్యాన్నో దగ్గరికి తేవచ్చు. ఏళ్ళ తరువాత తింటున్న పనసపొట్టు కూర, ఒకప్పుడు కొసరి ముద్దలు తినిపించిన మేనత్త ప్రేమని, ఇప్పుడు ఎవరూ లేని ఆ ఇంటినీ కళ్ళ ముందుకు తేవచ్చు. ఒక్కోసారి ఆ జ్ఞాపకాలతో ముడిపడ్డ మనుషులు, వాతావరణం ఇవన్నీ మసకమసకగానే ఉన్నా, అనుభవమొక్కటీ విస్పష్టంగా ఉండి మనని కాసేపు అలౌకిక భావనలోకి నెట్టడమూ జరుగుతూంటుంది. అస్పష్టంగా అమ్మ రూపం అన్న టాగోర్ కవిత, ఇందుకు ఒక మంచి ఉదాహరణ.
ఈ కవితలో టాగోర్ తన తల్లి రూపేమిటో గుర్తు రాదు కాని, మిట్టమధ్యాహ్నపు వేళ ఆటబొమ్మల మీదుగా వినపడ్డ శబ్దమేదో ఊయల పట్టి ఊపుతూ తన తల్లి ఆలపించిన రాగాన్ని గుర్తు చేస్తుందని; ఆమె గుర్తు రాదు కాని, శరత్కాలపు ఉదయాలలో పారిజాతాల మీదుగా వీచిన గాలులకు ఆలయ ప్రాంగణంలోని ప్రాభాతసేవా పరిమళం తల్లి పరిమళమై తనను ఆవరిస్తుందని; ఆమె గుర్తు రాదు కాని, పడక గది కిటికీలో నుండి నీలాకాశం వైపు చూపు సారించినప్పుడు తన మోము మీద నిలిచిన తల్లి చూపులోని శాంతస్థిమితమేదో ఆ ఆకాశమంతా పరుచుకున్నట్టు అనిపిస్తుందనీ అంటాడు.
పై ఉదాహరణల్లోని నిర్దిష్టమైన, నిశ్చితమైన వివరాలను పక్కన పెడితే, ఈరకమైన నాస్టాల్జియా ఒక విశ్వవ్యాప్తమైన అనుభవం, దాదాపు గొప్ప కవులందరూ కవిత్వంగా మార్చుకున్న వస్తువు. కుందాపన లోని కవితల్లోనూ ఈ నాస్టాల్జియానే కనిపిస్తుంది.
అయితే, ఈ కుందాపన సంపుటిలోని కవిత్వాన్ని ఇటువంటి ఇతర కవిత్వాల నుండి ఎడంగా నిలబెట్టినవి, రెండు ప్రధానమైన అంశాలు.
ఒకటి, ఈ కవిత్వంలో గతాన్ని ప్రాతిపదికగా చూపించి, అదే గొప్పదనీ దాన్ని కోల్పోయాననీ అనడం గాని, వర్తమానం పట్ల వెగటు, ఈ కాలపు పోకడల పట్ల చిన్నచూపు, నిస్పృహ గానీ కనపడవు. అలాగే, ఉద్వేగాలపరంగా చూసినప్పుడు, ఇది సమూహాలకు వర్తించే కవిత్వం కూడా కాదు. ఇది ఊరి మీద బెంగతో రాసిన కవిత్వమే కావచ్చు కాక, కానీ ఆ ఊరి రావిచెట్టు చప్టా గురించో, అక్కడి కోవెల, మట్టి రోడ్ల గురించో, అక్కడి జ్ఞాపకాల గురించో వర్ణించి వదిలేసి, అవి దొరకని వెలితిలోంచి వెళ్ళగక్కిన కవిత్వం కాదు. ఈ రాత్రీ-దిగులూ కవికి మాత్రమే పరిమితమైన వ్యక్తిగత ఆవరణలో గిరికీలు కొట్టడమే మనకు ఆసాంతమూ కనపడుతుంది. అందుకే ఈ వేదనలోకి మరెవ్వరూ లాగబడలేదు. మరెవ్వరికో నిరూపింపబడానికి రాసింది కాదు కనుక, ఒక ఏకాంతంలో ప్రతిధ్వనిస్తోన్న ఈ గొంతుకలో ఆత్మీయంగా తోచే పిలుపు వినపడుతుంది. అది కవినీ పాఠకులనీ అనాయాసంగా దగ్గరకు చేరుస్తుంది.
రెండవది, ఈ కవిత్వంలోని మెలకువ. అంటే, ప్రపంచంతోనో, ఒంటరితనంతోనో కుదుర్చుకున్న రాజీ.
మన గతం ఎలాంటిది కానివ్వండి–అది అయస్కాంతంలా లాగేదో, బలంగా విసిరి ఒక మూలకు ఈడ్చి కొట్టేదో– మన సమస్య దానితో రాజీ కుదుర్చుకోవడమొక్కటే కాదు. వర్తమానానికి తప్పనిసరిగా లోబడి ఉండటంలో కూడా ఉంది. వృత్తి వ్యాపకాల నిర్బంధంలో సహోద్యోగులు, సన్నిహితులు, సహచరులు, అపరిచితులు–ఎవరైనా సరే వాళ్ళతో కలిసిపోవడం; ఈ క్షణంలో, వర్తమానప్రపంచంలో తప్పనిసరిగా బతకాల్సి రావడం మనలో చాలా మందికుండే సమస్య. అలాంటి వాళ్ళ కవిత్వంలో, సమూహాలలో వారి ఒంటరితనం గురించి, వారి ఇబ్బందిపడే నైజం గురించి, ‘ఇప్పటి’ రోజుల్తో మనకుండే నిరంతర వైరి గురించి, చాలానే ప్రస్తావనలు కనిపిస్తాయి. కానీ, గతాన్ని, విడువలేని తన వ్యసనంగా చూస్తూ, పగలు తనకు బానే జరిగిపోతోందన్న ఒప్పుకోలు, పగలు ఇలాగే జరిగితీరాలన్న అనుకోలు, కవిత్వంలో అరుదనే చెప్పాలి. ఏది ఎక్కువగా చెప్పబడుతుందో దాని మీదకే చూపు వెళ్ళడం సహజం కనుక, కుందాపనలోని కవిత్వాన్ని ‘ఇంటి బెంగ’కు చెందిన కవిత్వంగా మాత్రమే చూడడం తప్పని నా నిశ్చితాభిప్రాయం.
ఈ కవిత్వంలో మనం చూడాల్సినది, ఈ కాలపు మనిషిని. తన లోపలి సంచలనాలతో సంబంధమే లేకుండా, కర్తవ్యాలన్నీ యథావిధిగా నిర్వర్తించుకుపోతూ, ఏకాంతంలో ‘నిద్రకు వెలియై తానొక్కడుయై’ వేదన పడే ఈ కాలపు మనిషి అవస్థని. బెంగటిల్లేందుకు కూడా వేచి చూడగల అతడి స్థితప్రజ్ఞతని. వేదన ఎప్పుడూ ఒంటరిగా ఉన్నప్పుడే విశ్వరూపం చూపిస్తుందన్న అనాది వాక్యానికి, రోజునూ-తననూ రెండు ముక్కలుగా విడగొట్టుకుని, లోకపు చీకటికి తన లోపలి శూన్యంతో పోలికపెట్టి మన ముందు నిలబెట్టింది ఈ కవిత్వం. Solitary అన్న కవిత చదివితే, ఏకాకితనానికీ-సమూహంలోకీ, అవసరానికి తగ్గట్టు రూపు మార్చుకునే ఒదుగు మరింత స్పష్టమవుతుంది.
అటూ ఇటూ
ఎంతసేపు తచ్చాడగలను?!
కాసేపట్లో వెయ్యిగా విడిపోతా.
చివరికి చినుకులన్నీటినీ చేరదీసుకుని
పెద్ద సమూహమై దండెత్తుతా.
యుద్ధం వెలిసాక
ఏ ఏట్లోనో మళ్ళీ ఏకాకై పారుతా.
సింహభాగం కవితలు ఈ ఏకాకితనానికీ పూర్తిగా వ్యక్తిగతమైన అనుభూతులకూ చెందినవే అయినా, ఆ ధోరణి నుండి కాస్త బయటకు వచ్చి రాసిన కవితలు, రాసిలో తక్కువైనా, ఆకర్షిస్తాయి. వీలైనన్ని చిన్న చిన్న, తేలికైన పదాలతో ఒక్కో ఊహా ఒక్కో అనుభూతిగా మారిన ఈ సంపుటిలో ఇతర కోవలకు చెందిన కవితలూ ఉన్నాయి. కప్పతల్లి అలాంటి ఒక భిన్నమైన కవిత.
పొద్దుగాలనంగా ఊరేగింపుకెళ్ళిన
కప్పతల్లి
పొద్దుగూకినా ఇల్లు చేరకపాయె.
ఈ కవిత ఎంత సరళంగా కనిపిస్తుందో అంత బలమైనది, విలువైనది కూడా. కరువు ప్రాంతాల వాతావరణాన్ని అలతి పదాల్లో పొందుపరచడం ఒక ఎత్తు. వానలు పడని వేళల్లో, వానలు పడాలని రోటికి కప్పను గట్టి ఊరేగించే ఒక ప్రాంతపు సంప్రదాయాన్ని, ఈ కవి అనాయాసంగా కవిత్వం చేయడం ఇంకో ఎత్తు. మూడంటే మూడే వాక్యాల్లో ప్రజల సంప్రదాయాలనీ, ఆశల్నీ, నిరాశలనీ పకడ్బందీగా పట్టి కూర్చోబెడతాడు కవి.
కవి వాడే ఉపమానాల్లోని సౌందర్యమెలా ఉంటుందో చిన్నోడి అమ్మ కవిత కరతలామలకం చేస్తుంది. పిల్లవాడొచ్చే స్కూల్‌ బస్ గురించి:

పసుపు పచ్చని సీతాకోక చిలుక
పంచప్రాణాలని మోసుకొచ్చే వేళయింది
 అనడమూ,
తల్లి వాడి స్కూల్‌ బేగ్ అందుకోవడాన్ని
ఊరేగిస్తున్న దేవుని పల్లకి
భక్తుల భుజాలు మారినంత పవిత్రంగా
పుస్తకాల సంచి భుజాలు మారుతుందప్పుడు
 అనడమూ,
చెవులు పట్టి సున్నితంగా కుందేళ్ళను తెచ్చినట్టు
అరుగు మీద విప్పిన బూట్లను ఇంట్లోకి తెస్తాడు
 అనడమూ,
ఆ అనడంలోని సున్నితత్వమూ ఈ కవితని మళ్ళీ మళ్ళీ చదివించి గుర్తుండిపోయేలా చేస్తాయి. అయితే, ఈ కవితలో విశేషం ఇదొక్కటే కాదు. ఈ కవితా శీర్షిక చిన్నోడి అమ్మ. అంటే, ఇది ఒక తల్లి హృదయాన్ని ఆవిష్కరించడానికి వ్రాయబడ్డ కవిత. కానీ, తల్లి తాను స్వయంగా రాసినది కాదు. అలా అని, ఎదురుగా ఉన్న బిడ్డ రాసినదీ కాదు. సర్వసాక్షిలా ఒకరు చూసి రాస్తున్నారు కానీ అది ఒక పూట జరిగి ఆగిపోయే(యిన) కథ కూడా కాదు. నిజానికి ఈ కవిత, ‘స్కూల్ బస్సు కోసం రోజూ ఇంటి ముందు కూర్చుని ఎదురుచూసే చిన్నోడి అమ్మకు’ నాన్న రాసి ఇచ్చిన బహుమతి. మళ్ళీ మళ్ళీ చదివించే కవిత అని నేను అన్నప్పుడు, నిజానికి రెండోసారి నుండి మనకీ కవితలో కనపడేది అమ్మ కాదు. చిన్నోడి నాన్న. ఆ తల్లీకొడుకులను వేయికళ్ళతో గమనించుకుని పొంగిపోతోన్న పురుష హృదయమే, అతని చూపుల్లోని లాలిత్యమే, అతని భావాల్లోని సౌకుమార్యమే (పుస్తకాల సంచీని గుదిబండ అనక, భుజాల మీద వాతలు తేల్చేదైనా దేవుని పల్లకీ అనడానికి ఎంత సంస్కారం కావాలి!) ఈ కవిత ఔన్నత్యాన్ని పదిమెట్లు పైకెక్కించిందని అంటాను. తన కొడుకు అల్లర్లను, వాడి అచ్చటాముచ్చటల్లో తల్లిగా మారిన తన ప్రేయసి పొందుతున్న తన్మయత్వాన్ని, మౌనంగా అబ్బురంగా గమనించుకుంటున్న అతడి మనసు పరిచిన ఈ కవిత, నిశ్చయంగా అపురూపమే.
ఏ కవికైనా ఒకే వస్తువు మీద ఒకటికి మించి కవితలు రాయడం కత్తి మీద సాము లాంటిది. ప్రతిసారీ విభిన్నంగా వ్రాయడం, అలా రాస్తూనే తాను చెప్పదలచిన విషయానికి నిబద్ధులై ఉండటం కష్టసాధ్యమైన పని. అందువల్ల ఈ సంపుటిలోని కవితలు చదువుతున్నప్పుడు పునరుక్తి దోషం పాఠకుల మనసులో మెదలడంలో ఆశ్చర్యం లేదు. ప్రత్యేకించి దూప సంపుటిని కూడా చదివిన వారికి, ఈ కవితల్లోని వాతావరణము, ప్రతీకలు చిరపరిచితంగాను, పునరావృతమవుతున్నట్టుగానూ అనిపించడం సహజం. ‘నువ్వు రాయకుండా కూడా ఉండగలిగితే, రాయకుండా ఉండటమే మేలు’ అని కాపుస్‌కి సలహా ఇస్తాడు రిల్క తన ఉత్తరాలలో మొదటిదానిలో. బహుశా, ఇవి కవి రాసుకోకుండా ఉండలేని కవితలయుండాలి.

2 comments:

  1. మీ ఈ వ్యాసంలో - కవిత్వం మీద మీ ఇష్టం అక్షరమక్షరంలో తోస్తోంది.

    రవి వీరెల్లిగారి కవితల గురించి మీర్రాసింది చదివాక - కుందాపన - తప్పక కొని చదవాలని అనుకున్నాను. చదువుతాను.

    కుందాపన - ఓ కొత్తమాట కూడా తెలిసింది.

    రవి వీరెల్లిగారికి శుభాభినందనలు - పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు, మానసా!

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....