వ్యవధి లేదు

“ఆరు గడియలలో తల్లియనుట తెలియు..ఆరు నెలలు బై తండ్రియనుట తెలియుననుట నిజమే, శిశువు రాజహస్తమందు నేడ్చి కౌసల్య హస్తమందు నేడ్పుమానె" - కల్పవృక్షం, విశ్వనాథ.

బుజ్జాయి నీ చేతుల్లోనూ అలా ఏడ్చి ఉంటే, నిన్ను తెలుసుకోవడానికి వాడికి ఆరు నెలల కాలం పట్టే ఉంటే, నేనిప్పుడు ఈ మాటలన్నీ రాయాల్సిన అవసరమే ఉండేది కాదు.

మత్తు వదలని నా చెవులకు వినపడేలా, పుట్టీ పుట్టగానే కేర్ర్ర్....మంటూ గాఠి కంఠంతో ఏడ్చిన పసి గొంతు, ఇప్పుడు తల్చుకున్నా ఒళ్ళంతా ఓ క్షణం మొద్దుబారినట్టవుతుంది. "మగపిల్లాడు మానసా.." అని డాక్టరు చెంప తట్టి చెప్పడం కలలా గుర్తుంది. అంతే... ఆ క్షణంలో వాణ్ణి నేను చూడనే లేదు..చూసిన క్షణానికి ఎన్ని గడియలయ్యాయో చెప్పడానికి, అమ్మ మనసు లెక్కలు లోకానికర్థం కావు. అయినా ఆ చూసిన క్షణానికన్నా ముందు నుండే, ఎన్నో నెలల ముందు నుండే, ఏళ్ళ నుండీ, జన్మల నుండీ వాడు నావాడేనన్నంత వెర్రి ప్రేమ మగతలా కమ్ముకుని అక్కర్లేని జ్ఞాపకాలన్నీ, లెక్కలన్నీ చెరిపేసింది.

ప్రేమ బలం అనుభవం నుండి పుడుతుందా? ఆలోచన నుండా? తరచి చూసుకునే వ్యవధేదీ?

నేను అమ్మనై వాణ్ణి అల్లుకున్న క్షణమేదో గుర్తు లేదు కానీ, నువ్వు నాన్నలా వాణ్ణి చుట్టుకున్న తొలిక్షణం మాత్రం కళ్ళారా చూశాను.

ఎన్.ఐ.సి.యు లోకి బ్లూ డ్రస్, గ్లోవ్స్, ముక్కు చుట్టూ మాస్క్ కట్టుకుని, నా కోసం వేగం మందగించిన అడుగులేస్తూ, నా అరచేయిని వదలకుండా నడిపించుకెళ్ళావా? మత్తుగా నిదరోతున్న బుజ్జాయి తొట్టెను నీకు చూపించగానే నా చేయి వదిలేశావ్. రెండు చేతులు సరిపోనట్టు, చూపులతో వాడిని తడుముకున్న ఆత్రంలో చూశాను..నాన్నగా పుట్టిన నిన్ను. కొత్త స్పర్శకు ఉలిక్కిపడి కదిలిన బుజ్జాయిని ఇంకా అపురూపంగా దగ్గరకు హత్తుకుని, వాడికీ నీకూ అర్థమయ్యే కొత్త భాషకు అక్షరాలు సృష్టించుకున్నావ్. వాడి మీద నుండి మరలి నా కళ్ళల్లోకి చూసిన నీ చూపుల్లో, ఈ భాగ్యమంతా ఇకపైన మనిద్దరిదీ అని చెప్పకనే చెప్పిన నీ మనసు తెలిసిందనుకో. అరచేతిలో అంతక్రితం దోగాడిన ఖాళీతనమంతా, నీ కళ్ళలో ఉబికిన సంతోషానికి తుడిచిపెట్టుకుపోయాక, ఎన్నడూ నా ఛాయలకు రాని గర్వం ఆ క్షణంలో నన్ను చుట్టుముట్టి ఉక్కిబిక్కిరి చేసిందని నీకెప్పుడైనా చెప్పానా?

నీ ఆఫీసు పని. నీ ఆలస్యపు నిద్ర. అర్థ రాత్రిళ్ళు మెలకువ వస్తే, స్క్రిప్ట్ స్టేటస్ చూసుకుని మళ్ళీ రన్ ఫైర్ చెయ్యడం తప్పనిసరిగా మార్చిన ఉద్యోగం. ఏ అర్థరాత్రో రెప్పలను గుచ్చే వెలుగుకి నేను కళ్ళు తెరిస్తే, నలుపూ తెలుపుల యునిక్స్ స్క్రీన్ - బ్లింక్ అయే కర్సర్. "ప్చ్..." విసుగ్గా అటు తిరిగి ఒత్తిగిలి పడుకుంటే "వన్ మినిట్..ఆల్మోస్ట్ డన్.." అని నువ్ ఠాప్ మని లేప్‌టాప్ మూసేసిన శబ్దం. ఎక్కడికి పోయాయ్ ఆ నిన్నలన్నీ? నా కోపానికేముంది, నీ గారపు చూపుల మెత్తదనానికే వీగిపోయేది. కానీ పిల్లాడి కోపమంటే ఇంత తేలిక కాదని తేలిగ్గానే తెలిసిందిగా? మొదలెట్టాడా ఇక ఆరున్నొక్క రాగమే. గదిలో లాప్‌టాప్ పెట్టే నీ ధైర్యాన్ని పుడుతూనే వాడి విడవని గుప్పెట్లో నలిపి విసిరేశాడు. దుప్పటి అంచు కదిలినా ఊరుకోని మహాయోగి కదా వాడప్పుడు! నువ్ పిల్లిలా లేచి హాల్‌లోకి వెళ్ళబోయినా, వాడికి తెలిసిపోయేది. ఎవరి తప్పుకు వాళ్ళే బాధ్యులని తప్పుకు పడుకునేదాన్ని నేను. నీకిక తప్పక వాణ్ణి మోచేతి వొంపులోకి పొదువుకునేవాడివి. నడిరాతిరి లాలిపాటలు పాడేవాడివి, పక్క గదిలో నుండి మీ అమ్మా నాన్నల ఆదుర్దా గొంతులు వినపడితే కిందామీదా అయ్యేవాడివి. "ఊర్కోరా బుజ్జికన్నలూ.." అని వాణ్ణి నాకిచ్చి బతిమాలే నీ కన్నుల్లో..ఎన్ని క్షమాపణలు! ఎన్ని ప్రమాణాలు! పెదవి చివర నే దాచిన నవ్వులు, ఆ చీకట్లో నీకు కనపడి ఉండవ్ కదూ...!

కన్యాకుమారిలో సూర్యోదయం చూడాలని కదా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. సుష్టుగా తిని, వెచ్చగా పడుకుంటే ఏంటర్థం? కాళ్ళ క్రిందకి దుప్పటి లాగేస్తే తల మీదుగా మరొకటి లాక్కుంటూ...ఏం మొండివాడివబ్బా! "నావల్ల కాదు! సైనస్ ...ప్లీజ్...ఒక్క అరగంట" అంటూ తెల్లగా తెల్లారేదాకా గదిలోనే ఉంచేశావ్. తాకితే అంటుకుపోయే బద్ధకాన్ని, బద్ధకాలు పెనవేసుకుంటే రాజుకునే సౌఖ్యాన్ని, కాదనడమెట్లానో అప్పుడు నాకూ తెలీలేదు. ఊటీలోనూ నా నేస్తాలందరినీ బోల్తా కొట్టించి చీకటివేళకి రిసార్ట్స్‌లో నిలబెట్టావ్. పాటలన్నావ్, చిందులన్నావ్, లవ్ సీట్స్‌లో ఒదిగి అర్థం లేని ఆటలాడుకుంటుంటే...లోకపు సౌందర్యంతో నువ్వన్నట్టే పని లేకుండా పోయింది. పగలూ రాత్రీ నీ లెక్కల్లో నడుపుకున్నావ్. నిద్రా మెలకువా నీ రెప్పలతో చూపించావ్. ఎదురడగాలని మర్చేపోయేంత మైకం నాకు. సాగుతున్న భోగాన్నంతా అటకెక్కిస్తూ వచ్చాడుగా సుపుత్రుడు. వాడు ఐదింటికే లేచి ఆటలాడీఆడీ నిన్నూ లెమ్మని గుంజుతోంటే, ఏనాడైనా సైనస్ అన్నావా, దొంగా!! స్వెటర్లు వేసుకునీ, మఫ్లర్లు చుట్టుకునీ ఇద్దరూ ఎన్ని ఆటలు! అర్థమవుతాయనేనా, వాడికన్నేసన్నేసి కథలు? ఓయ్! నా కోపం గురించి అడుగుతున్నావా...నిజం చెప్పనా! వాడిని భుజానికెత్తుకుని నా దుప్పటి మెడ దాకా సర్ది వీపు రుద్ది వెళ్ళే నిన్ను, ఎన్నిసార్లో రహస్యంగా చూసుకున్నాను . వెయ్యింతలయ్యి మీదవాలిన తీయని బరువుని నెట్టుకుంటూ  మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను.

ఇల్లు సర్దాలంటే ఎంత బద్ధకంగా ఉండేవాడివి! ఏ పూట కాపూట వాయిదాలూ, వంకలూ. ఇల్లు కాదు, మనసు శుభ్రంగా ఉండాలని పిచ్చి మాటలొకటి పైగా. ఎక్కడికి దొర్లాయబ్బా ఆ జ్ఞానగుళికలన్నీ ఇప్పుడు? ప్రతి రాత్రీ ఫెళఫెళలాడే ఉతికిన దుప్పట్లు. సెంటర్ టేబుల్ తుడవడం, బట్టలు పద్ధతిగా ఉంచుకోవడం, జర్నల్స్ అన్నీ వరుస్సాగ్గా సర్దుకుని లోపల పెట్టుకోవడం, ఒకటా రెండా! పిల్లాడు లాగేస్తాడని బెదురూ, వాడి బుడిబుడి అడుగులకు ఏమైనా అడ్డొస్తాయని భయమూ, నోట పెట్టుకుంటాడన్న జాగ్రత్తా - మంచి నాన్నవేలే!! భోజనాలవగానే వంటింటి పై పని నాకొదిలేసి వాణ్ణి వెంటేసుకు వెళ్ళిపోతావు. పని పూర్తి చేసుకుని, చప్పుడు చెయ్యకుండా బెడ్ లైట్ వెలుగుకు అలవాటు పడుతూ మిమ్మల్ని చూస్తానా...ఎవరినెవరు పడుకోబెట్టారో అర్థం కాకుండా నిద్రలోకి జారుకున్న మీ ఇద్దరూ కనపడతారు. బెడ్ లైట్ ఆపేస్తాను కానీ, నా కళ్ళు చూసిన వెలుగు మనసంతా పరుచుకునే ఉంటుంది, రాతిరి తెల్లవార్లూ. మర్నాడూ, అటుపైనా, ఆపైనా..

హైదరాబాదులో మీటింగ్ నాకు. వదుల్చుకోవడం కుదర్లేదు. తప్పించుకునే వీల్లేదు. ఒక్క రోజు పని. పొద్దున మొదటి ఫ్లైట్ తీసుకుంటే, రాత్రి లాస్ట్ ఫ్లైట్ కి వెనక్కి వచ్చెయ్యచ్చు. ట్రావెల్ డెస్క్ వాళ్ళు వీలు కుదిరే ఎయిర్‌లైన్స్ లిస్ట్ పంపి చూసుకోమన్నారు. నాలుగింటి నుండి ఒంటిగంట దాకా నాది కాదనుకోవాలి. టైం టేబుల్ ఒకటికి పది సార్లు సరి చూసుకున్నాను. బట్టలు సర్దుకున్నాను. కాన్ఫరెన్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. పసివాడు "మ్మా..అమ్మా..." అన్నప్పుడల్లా గుండె ఎగిరిపడుతోంది. అన్ని గంటలు వాణ్ణి చూడకుండా ఎప్పుడూ లేను. ఉండలేను. ఏం చెయ్యాలీ? ఏం చెయ్యాలీ?  టీ ఇస్తూ అడిగావ్... "హైదరాబాదులో నాకూ కొంచం బేంక్ పని ఉంది, నీ కూడా రానా పోనీ?" అని. ఎంత దగ్గరగా అనిపించావో తెల్సా - టీ కప్పు అడ్డుండబట్టి కానీ, ఈ గుండెలో చెలరేగిన ప్రేమ తుఫాను, నిన్ను వదిలేదే కాదా క్షణం. పొద్దున్నే లేస్తూ అమ్మ ఎక్కడని వాడు వెదుక్కోకూడదు. రాతిరి పడుకునే ముందు అమ్మ ఇంకా రాలేదేమని ఏడవకూడదు. తెలుసు, కోర్కెల చిట్టా ఎప్పుడూ ఇంత చిన్నదై ఉండదని తెలుసు. బ్రతుకంటే ఇంత చిన్ని ఊగిసలాటలు కాదని పసితనం నా ఒళ్ళో నుండి దూకి వెళ్ళిపోయినప్పుడే తెలుసు. కానీ, కానీ..., మెడపట్టి ఊగే చిట్టి చేతుల్లోనే ప్రాణాలను పట్టి బంధించే బలముంటుంది. పెగలని పసి గొంతుల్లోని దుఃఖమే కుదిపి కుదిపి నిలదీస్తున్నట్టుంటుంది. నాకిప్పటికి ఇదే ముఖ్యం. ఇదే అవసరం. లోకం నాన్సెన్స్ అని కొట్టిపడేసే నా బలహీనతని, ప్రశ్నించకుండా, వెక్కిరించకుండా, నువ్వొక్కడివే అర్థం చేసుకున్నావ్. బలమై కాచుకున్నావ్ - చాలు. డెస్క్ వాళ్ళకి మూడు టికెట్లు బుక్ చెయ్యమని చెప్పేశాను. ధిలాసాగా పని పూర్తి చేసుకున్నాను. ఆ సాయంత్రం ఫ్రెండ్స్‌ని కలిసి, మర్నాడు కూడా అక్కడే ఉండి, మూడో రోజుకి ముగ్గురం మళ్ళీ బెంగళూరులో. చలో! ఏమీ ఎరగనట్టు, ఇదంతా ఏదో మామూలుగానే చేసినట్టు నువ్వు చులాగ్గా తిరగగా లేంది, అంతే మామూలుగా నేను పెట్టెలు ఖాళీ చేసి ఆఫీసుకు తయారైతే మాత్రం నేరమా? అల్మరాకి అడ్డుగా చేతులు కట్టుకు నిలబడి, - డైరీ చదివాను - అన్న నీ కవ్వింపు మాటల్లో, పట్టుబడింది నేను కాదు...నువ్వే!

రెండు ఉధృతప్రవాహాలు కలిసి ఒక్కటై పారినట్టు, రెండు జ్యోతులు పెనవేసుకుని ఒకే వెలుగై కదిలినట్టు, మునుపంతా నువ్వూ నేనూ ఒకటి.

ఇప్పుడు నీదీ వాడిదీ ఒకే రంగుల లోకం. నువ్వూ వాడూ కలిస్తే అది రెక్కలతో ఎగిరిపోయే కాలం.

గోరుముద్దలూ, తడి ముద్దులూ, కథలూ, ఆటలూ..

కాలాన్ని ఒంగోబెట్టి దాని వీపున మీ ఇద్దరూ ముద్దుగా గుద్దే  పసి ముద్రలన్నీమూడోమనిషినై చూస్తున్నా, ఎడంగా నిలబడ్డానన్న స్పృహ ఇబ్బంది పెట్టడంలేదెందుకో!

ప్రేమ బలం అనుభవం నుండి పుడుతుందా? ఆలోచన నుండా? తరచి చూసుకునే వ్యవధేదీ?

8 comments:

  1. almost.. naa gurinche annatlu undi ammaa..

    ReplyDelete
  2. మాటలలో చెప్పలేనంత బావుంది మానసా నీ అంతరంగం 😍🌹

    ReplyDelete
  3. కవనం లా కథనం అన్నింటికీ మించిన
    అమ్మతనం లాంటి కమ్మతనం..

    ReplyDelete
  4. Superb Manasa, ideal parents!!!

    ReplyDelete
  5. Wonderful! యాంత్రికత చోటు చేసుకునే రోజుల్లో మీ బ్లాగ్ నూతనోత్సాహనం నింపుతోంది.

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....