ఆజన్మం

 


తెలుగులో బహుశా మునుపెన్నడూ లేనంతగా ఆత్మకథారచనలు వెలువడుతున్న కాలమిది. రచనలు యథేచ్ఛగా ఏ కత్తెర్లూ లేకుండా ప్రచురించుకోగలిగిన సోషల్ మీడియా వెసులుబాటు ఒకటి, ఎవ్వరూ సాహిత్యంగానో, జీవితంగానో గుర్తించి అభినందించని తమ జీవితాలను, తమకు మాత్రమే తెలిసిన జీవితాలను ఇప్పటికైనా సాహిత్యం పేరిట రికార్డ్ చెయ్యాలన్న అస్తిత్వ స్పృహ ఒకటి, ‘నా’ అన్నది ఒక అనివార్యమైన నిజం అన్న ఎరుక ఒకటి, చాలా మంది రచయితలను ఈ రకమైన రచనల వైపు మళ్ళిస్తోంది. ఉద్దేశ్యాలు ఎంత ఉదాత్తమైనవైనా, రచన అనగానే మెదిలే ఒకానొక ఫ్రేమ్‌వర్క్‌ని ఈ సొంతకథలు రాసే కుతూహలమున్న చాలామంది రచయితలు దాటలేకపోతున్నారు. సంఘటనలకు సాధ్యమైనంత డ్రామాని అద్దకపోతే రచన కాలేకపోతుందనే భయాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఇవి గాక, వచనాన్ని నిర్వీర్యం చేసే స్వోత్కర్ష పరనిందల మోత ఎలాగూ తప్పదు. వీటన్నింటిని పక్కకు నెడుతూ, ఆజన్మంలో రాజిరెడ్డి వినిపించిన గొంతులోని విలక్షణత ఇదే పద్ధతిలో రచనలు చేస్తున్న సమకాలీనుల్లో కనపడదు. ఈ విలక్షణతకు మూలాలు పుస్తకపు ముందుమాటలో దొరుకుతాయి.

నిజానికి పుస్తకం పేరే ఆత్మకథాత్మక వచనం. రాజిరెడ్డికి సాహిత్యం పట్ల చాలా అభిప్రాయాలున్నాయి. సందేహాలూ ఉన్నాయి. అందుకే ముందుమాటలో అంత వివరంగా చెప్తాడు ఫిక్షన్-నాన్ ఫిక్షన్‌ల పట్ల తన ఆలోచనల ధోరణిని. కథలుగా అనుకున్నవి ఫిక్షన్‌గానూ అలా అనుకోనివి నాన్ ఫిక్షన్‌గానూ రాశానంటాడు. ఏ ఒక్క వాక్యం కలిపినా, ఏ వాక్యానికి ఏ కొద్దిపాటి రంగు అద్దినా నాన్ ఫిక్షన్ అది కాకుండాపోయే ప్రమాదం ఉందని అంటూనే తనదైన రంగు ఏ కొంచెమూ అద్దకుండా ఎవరైనా ఏ విషయమైనా ఎలా చెప్పగలరు? అది వార్తాపత్రికలోని వార్త అయినా, అనీ ప్రశ్నించుకుంటాడు. ఇది రాజిరెడ్డిపై అతని పాత్రికేయవృత్తి ప్రభావం కాదు. అది అతని సహజాతమైన తత్వమీమాంస. అందుకే, ఫిక్షన్ అబద్ధం; కానీ చెప్పాక నిజం అయిపోతుంది. కానీ నాన్ ఫిక్షన్ నిజం; చెప్పాక అది అబద్ధం (ఫిక్షన్) అయిపోతుంది అని అంటాడతను. Fact exists in many forms but fiction exists in one అన్న వెల్చేరు నారాయణరావు మాటలు గుర్తుకొస్తాయి.

వాక్యం పట్ల, వచనం పట్ల, సాహిత్యపు లక్షణం పట్ల ఇంత ఆలోచన, ఇంత విచక్షణ ఉన్నవాడు కాబట్టే నాస్టాల్జియాల వరదలో కొట్టుకుపోవాల్సిన ఈ సొంతకథనాలని, మెలకువ అన్న పట్టుగొమ్మతో కాపాడుకున్నాడు రాజిరెడ్డి. సాహిత్యంలో సాధారణంగా ఇమడవనిపించే క్షణాలను తన చిత్రమైన చూపుతో ఒడుపుగా వచనంలోకి లాక్కొచ్చుకున్నాడు. ఏ డ్రామా కోసం ప్రాకులాడుతూ సజీవ క్షణాలను సాహిత్యకారులు తరచుగా నిర్లక్ష్యం చేస్తారో, ఆ క్షణాల సౌకుమార్యాన్ని, ఆ అనుభూతుల తాలూకు సౌందర్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. గెలిచాడు కూడా. ఇది ఆత్మకథ కాదు. అందువల్ల కొన్ని సంఘటనలను విస్మరించడం లేదు; మరికొన్ని సంఘటనలను పెంచిచూపడమూ లేదు. ఇవి రచయిత జీవితకథలు కావు. జీవితాన్ని నిరాపేక్షతో రచయిత గమనించి నమోదు చేస్తున్న చెల్లాచెదురు సంఘటనలు ఇవి. ఈ కథనాలు అతనివి. కాని ఈ కథనాలు కేవలం అతని గురించి కావు. ఒక గోళంలో ఉంటూనే ఆ గోళం వెలుపలగా నిలబడి దాన్ని గమనించడం అందరికీ చప్పున పట్టుబడే విద్య కాదు.

ఇలాగే ఓ మనిషి గురించి ఆలోచనలో పడ్డ రాజిరెడ్డి అంటాడు, కొన్ని విషయాలు మూడో మనిషి ద్వారా తెలుసుకోవాలనుకునేవి కావని.

రోజూ కామన్ ఏరియాల్లో ఎదురుపడటం మినహా చెప్పుకునేందుకు మరే ఇతర జ్ఞాపకమూ లేకుండా తెగిపోవాల్సిన ఎన్నెన్నో పరిచయాలు మనిషి మనసులో నిజంగా ఏ ముద్రా వెయ్యవా? చూపుల పరిచయమే కావచ్చు, మనసు చొరవగా అవతలి మనిషికి సంబంధించిన మరే సమాచారమూ కోరుకోదా? ఒక మనిషి జీవితంలో స్పష్టంగా వస్తూన్న మార్పు, అది ఆ మనిషిలో తెస్తోన్న మెరుపు అర్థమవుతూ ఉన్నాక, అది కనపడనట్టు, పట్టనట్టు ఉండటమెలాగ?

ఆమె జీవితపు సరంభంలో మిళితం కాగలిగే ఒక చిన్న ఉనికి, ఈ భూమి మీది సకల జీవులతో పంచుకోగలిగే ఒక ఏకత – ఇదీ తనకు కావలసినది. సాటి మనిషి పట్ల, తన గమనింపులోకి వస్తూన్న ప్రపంచం పట్ల, ఈ నిజాయితీతో కూడిన కుతూహలం, మనిషికి స్వభావసిద్ధమనిపించే ప్రేమ -ఇతని కథల్లో (లేదూ, కథనాలలో) స్పష్టమైన రూపు తీసుకుని అందరూ దగ్గర చేసుకునేలా చేస్తాయి.

మానవసహజమైన ఉద్వేగాలు, వాంఛలు వాటి అకల్మష రూపంలో అక్షరాల్లోకి రావడమే రాజిరెడ్డి రచనల్లోని సౌందర్య రహస్యం.

నునుపైన వీపులో, ఆరోగ్యంగా కనపడే జడో, ఊపిరితిత్తులను తాకేలా లాగిన దమ్మో, లోకం దృష్టిలో బలహీనతలుగా గుర్తించబడే ఎన్నో ఊహలను, అలవాట్లను, అనుభవాలను నిస్సంకోచంగా చెప్పుకుంటాడు రాజిరెడ్డి. అయితే, వీటిలో వేటికీ ‘ఎవ్వరినీ సాకుగా చూపెట్టను’ అనగల ధైర్యము, జవాబుదారీతనము రాజిరెడ్డిని జడ్జ్ చెయ్యనీయకపోగా, రచయితకూ పాఠకుడికీ మధ్య ఉండే అరమరికలను, దూరాన్ని మెల్లిగా చెరుపుకుంటూ పోతాయి. రచయిత-రచన-పాఠకుడు అన్న వృత్తాన్ని నిస్సంకోచంగా, నింపాదిగా సాగే ఈ స్వరమే అనాయాసంగా పూర్తిచేస్తుంది.

రాజిరెడ్డి చెప్పేవాటిలో చాలా మటుకు సబ్బునురగలాంటి తేలికపాటి సంగతులే. హేలగా గాలిబుడగలను చిట్లించినంత సరదాగా రాసుకొస్తాడు వాటి గురించి. ఆ సంఘటనలు అతి సామ్యానమైనవి, ఏ ప్రత్యేకతా లేనివి, అసలు చెప్పేందుకేమీ లేనివే కూడా కావచ్చు కాక. అతని మాటలనే అరువు తెచ్చుకుంటే ‘ఉత్తి శూన్యమే’. కానీ, శూన్యంలో ఏదీ లేదని ఎలా అనగలం?!

రాజిరెడ్డి చూపు ఎంత ప్రత్యేకమైనదో అంత చురుకైనది. ఎంత సాధారణమైనదో అంత సూటైనది. ప్రత్యేకంగా నిలబెట్టాలని ఎదుటి దానిలో లేని లక్షణమేదీ దానికి ఆపాదించడు. అందరిలా చెప్పినట్టవుతుందని తనది కాని అనుభవాన్ని, అబద్ధంగా మార్చి చెప్పాలనుకోడు. అందుకే, ఆజన్మం చదువుతున్నప్పుడు ‘అందరూ ఇలాగే ఆలోచిస్తారా?’ అనే ఆశ్చర్యం కొన్నిసార్లు, ‘ఇలా అసలెవ్వరైనా చేస్తారా?’ అనే విస్మయం కొన్నిసార్లు మార్చి మార్చి అనుభవంలోకి వస్తూంటుంది పాఠకులకి. జీవితం ఏ లెక్కలకీ, కొలతలకీ అందేది కాదని పదే పదే గుర్తు చేసే ఈ అనూహ్యత ఆజన్మానికి అసలైన ఆకర్షణ.

పుస్తకం: ఆజన్మం
రచన: పూడూరి రాజిరెడ్డి.
ప్రచురణ: కృష్ణకాంత్ ప్రచురణలు, తెనాలి. 2021. ఫోన్: 97055 53567.
వెల: రూ. 280/-
దొరికేచోటు: అనల్ప బుక్ కంపెనీ (ఫోన్: 7093800303); అమెజాన్.ఇన్; నవోదయ బుక్ హౌస్ (ఫోన్: 91-9000413413, 040-24652387); కినిగె.

No comments:

Post a Comment

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....