Historic Times : అన్నా హజారేకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు

జాతీయ స్థాయిలో అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న అహింసావాద పోరాటానికి, నిరాహార దీక్షకు మద్దతుగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి, "యూత్ ఫర్ బెటర్ ఇండియా" సంస్థ అనేక మంది పౌరులను భాగస్వామ్యులను చేస్తూ, హైదరాబాద్ నగరంలో రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తోంది.


ఏప్రిల్ 8వ తారీఖున, దోమల్‌గూడలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో వేలాది మంది పౌరులతో పాటు, శేఖర్ కమ్ముల (సినీ దర్శకులు), చుక్కా రామయ్య ( విద్యావేత్త), బాబూ రావు వర్మ ( స్వాతంత్ర్య సమర యోధులు), రామ కృష్ణ రాజు (రాష్ట్ర కన్వీనర్, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్.టి.ఐ. కాంపైన్) తదితర ప్రముఖులు సైతం పాలు పంచుకోనుండటం ముదావహం.



స్వాతంత్ర్య పోరాటం తదనంతరం, ప్రజలందరి లబ్ధికై జరుగుతున్న అతి పెద్ద ప్రజా పోరాటంగా మారుతున్న ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి బాధ్యత కలిగిన పౌరులందరూ సంపూర్ణ మద్దతు నందించాలనీ, తమ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యులై ముందుకు నడిపించాలనీ 'యూత్ ఫర్ బెటర్ ఇండియా' సంస్థ పిలుపునిస్తోంది.

అవినీతిని నిరోధించేందుకు, అంతమొందించేందుకు మనకున్న అమూల్యమైన అవకాశాన్ని చేజార్చుకోరాదనీ, ఈ పోరాటం ప్రజలందరి సహకారంతో మాత్రమే ముందుకు సాగగలదనీ విన్నవిస్తూ, పాల్గొనదలచిన వారిని , "యూత్ ఫర్ బెటర్ ఇండియా" వారి ఈ క్రింది నంబర్లలో సంప్రదించాలని తెలియజేసారు.

శశాంక్ - 9949648018 ; ఎలక్షన్ రెడ్డి - 9676360111
 
Venue : Indira park, Hyderabad
Time : 8 AM

ఆలింగనం


హోరెత్తిస్తున్న హారన్లు...ఆగకుండా అనౌన్సుమెంట్లు..
మనకంటూ మిగిలింది కేవలం మరికొన్ని క్షణాలు

గుప్పెట్లోని ముళ్ళ గులాబీలో అందం శూన్యం
ఆ చివరి ఆకుపచ్చ రెపరెపలకే మనసంతా భారం


విచ్చుకోని పెదవుల మౌనంలో మనసు విరహ గీతాలు 
చెమ్మగిల్లిన చూపులకటూ ఇటూ వేల ఊసుల ఉత్తరాలు   

వీడమంటూ మొండికేస్తూ ఐక్యమవుతున్న అరచేతులు
వసంతాలన్నీ వెలి వేసే వేదనతో రగులుతున్న ఎదలు

ఓపలేని ఒంటరితనాన కమ్ముకునే దిగులు తలపులు
రోజుల ఎడబాటూ వల్లకాదంటూ రాలిపడే కన్నీటిబొట్లు

కాలమిలా విషం చిమ్ముకుంటూ వెళ్ళిపోయేదే
వీడ్కోలులోని విషాదం ఉప్పెనలా ముంచి వేసేదే..

నువ్వైనా నాలుగు నవ్వుల్ని దోసిట్లో పోసి సాగనంపకుంటే
ఆఖర్లో ఆత్మీయ ఆలింగనం ఆసరాగా ఇవ్వక ఆగిపోయుంటే !!

ఆమె నవ్వాలి మళ్ళీ !


ఏకాంతపు కలయికలలో, కబుర్లలో తొలి అడుగులేసిన స్నేహం
శారద రాత్రుల కవ్వింపుల్లో కోరి పొడిగించుకున్న ప్రణయం
స్మృతి తిన్నెల్లో శాశ్వత ముద్రలేసే జ్ఞాపకాలయ్యాయో
పాల మనసును ముక్కలు చేసిన విషపు చుక్కలయ్యాయో

ఆమె ఎప్పటిలా నవ్వడం లేదిక
అన్నాళ్ళూ తోడొచ్చిన అల్లర్లూ, సందళ్ళూ లేవిక !

ఇప్పుడు మిగిలిందల్లా ..
కలసి పంచుకున్న క్షణాల నిట్టూర్పుల సాంగత్యమే!
కరిగిన వెన్నెల కల లాంటి ప్రేమలో నుండి,
మెలకువలోకి మెల్లగా జారేందుకు, ఎడతెరిపి లేని పోరాటమే!

ఇక ఆమెకు కావలసిందల్లా..
మోహపు ముసుగులు జార్చుకున్నాక
బయటపడే నిజ రూపాలను భరించగల్గిన నిబ్బరం!
భయపు వాకిళ్ళ నుండీ, బాధల సంకెళ్ళ నుండీ
రేపటి ఉదయాన్ని విముక్తురాలిని చేసి
సరి కొత్తగా స్వాగతించాలన్న సంకల్పమూ, స్థిర చిత్తమూ..!!

సెక్షన్ 4(1)(బి) మీద సంజీవని యుద్ధభేరి!!

(లోక్‌సత్తా టైమ్స్ పక్ష పత్రికలో ప్రచురితమైన మా వ్యాసం )
లోక్ సత్తా సంజీవని..!


అవినీతికీ అన్యాయానికి తావు లేని ఒక కొత్త లోకాన్ని సృష్టించేందుకు నడుం బిగించి ముందుకు వచ్చిన చైతన్య స్రవంతి సంజీవని! అవినీతి రక్కసి కోరల్లో చిక్కుకుని ఊపిరాడక ఆఖరి దశకు చేరుకోనున్న స్వతంత్ర భారతావనికి , ముప్పు తప్పించేందుకు ముందుకు వచ్చిన ఈ ' సంజీవని ' - లోక్ సత్తా అనుబంధ సంస్థ. ప్రజలే పెంచి పోషించిన బద్ధకానికీ, నిర్లక్ష్యానికీ అలవాటు పడి, పని చెయ్యడానికి పూర్తిగా నీళ్ళు వదిలిన కొన్ని ప్రభుత్వ కార్యాలయాల దుమ్ము దులిపేందుకు ముందడుగు వేసారీ సంజీవని సూత్రధారులు.
 
సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి ఐదు వసంతాలు పూర్తి అయిన శుభ తరుణంలో, ఆ హక్కు మనకు అందించ దలచిన ఫలాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఏదైనా వినూత్నంగా చెయ్యాలన్న లోక్ సత్తా సంజీవని సూత్రధారుల తలపుల్లో నుండి,తపనలో నుండి పుట్టినదే ఈ 'సెక్షన్ 4(1)(బి) పై యుద్ధభేరి ' ఘట్టం. అందులో భాగంగా, ఒకటో రెండో కాదు..పదులూ ఇరవైలూ కాదు..ఏకంగా 500 ఆర్.టి.ఐ దరఖాస్తులు, ఒకే సెక్షన్ [ 4(1)(బి)] మీద పెట్టి, ఒక చరిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు సంజీవని సభ్యులు. ఈ దరఖాస్తులలో అధిక భాగం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలు మరియు సచివాలయంలోని వివిధ విభాగాల ప్రథాన కార్యదర్శులకు, మిగిలినవి రంగారెడ్డి, నల్గొండ మరియు హైదరాబాదు జిల్లాల కార్యాలయాలకు ఉద్దేశింపబడినవి. దరఖాస్తులకు వచ్చిన సమాధానాలు స్వల్పంగాను, అసంతృప్తికరంగాను ఉండటంతో సంజీవని బృంద సభ్యులు 350 ఫిర్యాదులు దాఖలు చేసారు.

అన్ని నీవనుచు..

ఆకాశపు కాన్వాస్ మీద అదృశ్య హస్తంతో
అంతరార్ధం వెతకమంటూ అలవోకగా రంగులద్దినా

ఉవ్వెత్తున ఎగసి పడే సాగర వీణియపై
అలల నురగల సంగీతం వినిపించినా

కలయికలూ కన్నీటి వీడ్కోల నడుమ
కాలాన్ని కమనీయ కావ్యంగా మలచినా

ఇసుక తెన్నెల్లో పున్నమి వెన్నెల పరిచి
సౌందర్యానికి సజీవ సాక్ష్యం చూపినా

వొళ్ళు విరుచుకుంటూ వచ్చే మట్టి వాసనను
జడి వానగా మారిన చినుకు స్పర్శకు కానుకిచ్చినా

మనసుల మధ్య యుద్ధాలైనా..సయోధ్యలైనా..
మనుషులు కొందరు మానవత్వం మరచి మృగాలైనా..

"ఎందుకన్నది" రహస్యంగానే మిగిలిపోనీ,
ఈ అసంతృప్తి ఏ కొందరినైనా దహించివేయనీ, పునీతులను చేయనీ!

ఎత్తులకు ఎదిగిపోతున్నానని తుళ్ళిపడే మానవుడు
తానెంత  అసమర్ధుడో ఏనాటికయినా తెలుసుకోనీ..!

ఆకసాన్ని అందుకున్న  గర్వం ఎంత  గొప్పదైనా..
మానసికంగా మరుగుజ్జవడం తప్పని తెలిసిరానీ..!!


By night, an atheist half believes in God. ~Edward Young, Night Thoughts

మానస సంగమం


తొలిసారి కట్టుకున్న కంచి పట్టు చీర అంచుల కిందుగా
దోబూచులాడే  తడి ఆరని పారాణి పాదాల అడుగుల్లో..
కాటుక  కన్నుల  కదలికల్లో దాగనన్న మెరుపుల మధ్య
క్రొంగొత్తగా కాంతులీనుతోన్న కళ్యాణపు  తిలకంలో
ప్రవాహంలా  సాగుతున్న  వేద మంత్రాల  నడుమ
సుముహూర్తాన తలపై వెచ్చగా తగిలిన నీ చేతిస్పర్శలో
రాలిపడే  ముత్యాల  తలంబ్రాల జల్లుల్లో నుండి
రహస్యంగా రెప్పలార్పుకుంటూ చూసే చూపుల్లో
బరువెక్కిన  మరుమల్లెల  పూల జడ  క్రిందుగా
మూడు ముళ్ళతో మెడలో పడ్డ పసుపు తాడులో
ఒళ్ళంతా కళ్ళు చేసుకు వీక్షించిన అగ్నిదేవుడి సాక్షిగా
ఒకరి వెనుక ఒకరం తడబడుతూ నడచిన ఏడడుగుల్లో ..
నా చుట్టూ చుట్టుకున్న నీ చేతుల మధ్య ఒదిగి
ఆకాశంలోని అరుంధతిని చూసిన ఆ అర్థ రాత్రిలో
..అప్పుడే ఎప్పుడో.. ..అక్కడే ఎక్కడో...
మనం సరికొత్తగా జన్మించిన సమ్మోహన క్షణాలేవో దొరలిపోయాయి.
అందాకా అపరిచితుడవైన నిన్ను ప్రియసఖుణ్ణి చేసిన బంధమూ
ఇన్నేళ్ల దూరాన్ని దూరం చేసిన రహస్యమూ
అందులోనే నిశ్శబ్దంగా ఒదిగిపోయాయి.

నీవు లేక...


ఆశల ఆకులు చిగురించే వసంతమో
వడగాలులతో  విసిగించే  గ్రీష్మమో
జడివానల జలపాతాల్లో తడిపే శ్రావణమో
వెన్నెల పరుపులు పరిచే  కార్తీకమో
మంచు పూల పల్లకిలో సాగే హేమంతమో
చలి గాలుల వణుకుల్లో కరిగే శిశిరమో ..

ఏదైతేనేం...నా ప్రపంచం లో రంగులు మారేది
వచ్చే పోయే ఈ వసంత హేమంతాల వల్ల కాదు...
                                                నీ వల్ల..!!

 Loving thoughts of you fill these endless days..Sweet dreams of you, fill my starless nights.. !

*మలి ప్రచురణ : నమస్తే ఆంధ్రా పత్రిక ఫిబ్రవరి 2012 సంచికలో*

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...