ప్రతి పేరుకీ వెనుక...

...ప్రయోగాలకి జడవని ఒక జంట ఉంటుంది.

అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ విపరీతంగా అలవాటైన శబ్దం/మాట ఒకటి ఉంటుందట. నూటికి తొంభై కేసుల్లో , అది వాళ్ళ సొంత పేరే అయి ఉంటుందిట.ఈ మధ్యనే ఎక్కడో చదివాను. ( సాక్ష్యాలు చూపించబడవు ).

అయినా సాక్ష్యాలు గట్రా దాకా ఎందుకు , ఇది మనలో చాలా మందికి అనుదినం అనుభవంలోకి వచ్చేదే కదా..! బాగా రద్దీగా ఉండే ఒక బజారుకి మన వాళ్ళతోటి వెళ్లి, ఏవేవో కొనే హడావుడి లో తప్పిపోయాం అనుకోండి. అమ్మో..అక్కో..గట్టిగా ఒకసారి మన పేరు పిలవగానే అంత హడావుడిలోనూ అది మనకి ఖచ్చితంగా వినిపిస్తుంది.

నిశ్శబ్దం గా ఉన్న క్లాసు రూం లో, ఆఖరు బెంచీలో కూర్చుని పక్క వాళ్లతో చాలా సీరియస్ గా చుక్కలాట ఆడుతున్నప్పుడు , ప్రపంచంలో జరిగేవన్నీ పై వాడికి ప్రతి క్షణం తెలిసిపోయినట్టే ...మనకీ మన పేరు ఎక్కడ ఎవరు తలుచుకున్నా వినపడి, వాళ్ళు దూరంగా మొదటి  బెంచీలో ఉంటే ఎగిరి దూకైనా సరే సమాధానం చెప్పెయ్యాలన్న ఆసక్తి కలుగుతుంది.ఆ తరువాత మన ఆవేశం చూసి టీచర్ పేరు పెట్టి పిలుస్తూ "గెట్ అవుట్" అని అరిచినప్పుడు వేరే అనుభూతి కలుగుతున్దనుకోండి...అది ఇప్పటికి నేను వివరించలేను .

ఒకటో తారీఖు రాగానే..డబ్బుల లెక్కలు కట్టుకుంటున్న అమ్మ-నానగారు.." మానస ఈ నెల అస్సలు చదువు వెలగబెట్టలేదు కాబట్టి ఎప్పుడూ ఇచ్చే వందలో యాభై తీసేసి మిగిలింది ఇద్దాం" అనుకుంటున్నారనుకోండి..పక్క గదిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏకాగ్రతతో చదువుకుంటున్న నాకు ఎలా వినపడేదో ఏమో వినపడిపోయేది.మరు క్షణం లో నేను ఆదరా బాదరాగా వంటింట్లోకి వెళ్లి, యాలకులూ అవీ వేసి బ్రహ్మాండమైన టీ పెట్టి , చదువుకుంటున్న పుస్తకాన్ని బోర్లించి , దాని మీద ఈ కప్పులు పెట్టుకుని వాళ్ళ ముందుకు వెళ్లి నిల్చునేదాన్ని.
                          టీ కాఫీ లంటే సాక్షాత్తూ ఆ సాగర మధనం లో ఉద్భవించిన అమృతానికి మోడరన్ రూపాలని మనసా వాచా కర్మణా నమ్మే మా నాన్నగారు, ఆ కప్ అందుకోగానే అన్ని మర్చిపోయి అమ్మ వైపు తిరిగి.." అయినా చదువెందుకు చట్టుబండలవనూ, పిల్లల దగ్గరా మన పొదుపు....పసి దానికి వందేమిటి వెయ్యిచ్చినా తప్పులేదు...' అంటూ నా వాటా నాకిచ్చేసే వారు . ఆ వంద నాకిచ్చినందుకు నెలంతా నేనెలా ఉండాలో, ఏమేం చదవాలో ఆశువుగా చెప్పేసి ..అలాగే ఉండకపోతే వీల్లేదంటూ అమ్మ బలవంతంగా వేయించుకునే ఒట్లను తప్పించుకోవడానికి నేను కిక్కురు మనకుండా అక్కడి నుండి జారుకునేదాన్ని .

ప్రాణానికి ప్రాణం గా ప్రేమించుకునే ఇద్దరు సాయం కాలం సాగర తీరానికి వెళితే, తడి ఆరని ఇసుక తిన్నెల మీద కాలి వేళ్ళతో ఇద్దరి పేర్లూ కలిపి రాసుకోవడమే వాళ్ళు చేసే మొట్ట మొదటి పని. పరుగెత్తుకొచ్చే ప్రతి అల్లరి అలా, అక్షరాలతో అలా ఒకటైన జంటని ఎక్కడ వేరు పరుస్తుందో అని, అర చేతులు అడ్డు పెట్టుకుని ఆపుతూ, "రాళ్ళలో..ఇసుకల్లో రాసాను ఇద్దరి పేర్లు .." అని పాడుకోవడం ఎంత మధురమైన అనుభూతి!

ఒక ఈడు వాళ్ళంతా గుంపుగా చేరి "దాగుడు మూతా..' అని అరుస్తూ ఆడుకుంటుంటే, మన పేరెక్కడ చెప్పేస్తారో అని భయ పడడాలూ, దాక్కోవడాలు ఎంత అల్లరి జ్ఞాపకాలో కదా...!  బడిలో జరిగే పోటీల్లో విజేతల పేర్లు ప్రకటించేప్పుడు, 'మొదటి బహుమతి గెలుపొందిన విద్యార్ధి ...' అని టీచర్ సస్పెన్స్ కోసం క్షణం  ఆగినట్టే ఆగి , మనకే వినపడేలా కొట్టుకుంటున్న గుండె లయలను రెట్టింపు చేస్తూ , రెండో క్షణం లో మైక్ లో మన  పేరే పిలిస్తే ,ఒక విధమైన ఉద్విగ్నతతో..అంతు తెలియని ఆనందం తో తూనీగలా స్టేజి మీదకి పరుగెత్తి వెళ్లి హోరెత్తించే చప్పట్ల మధ్య ప్రైజ్ తీసుకోవడం ఎంత గమ్మతైన గర్వానిచ్చే అనుభవం!

ఇలా చెప్పుకుంటూ పోతే...పేరు పేరుకో మరపురాని జ్ఞాపకం. ప్రతి పేరుకీ గుర్తొచ్చే ఒక  అందమయిన అనుభవం.

ఇంత గొప్పదైన పేరుని, మనిషి జీవితం లో అతి ముఖ్యమైనా పాత్ర పోషించే ఈ పేరుని చాలా మంది తల్లి దండ్రులు చిన్నచూపు చూడడం నాకు బోలెడంత బాధని కలుగజేస్తుంది. అలాంటి వాళ్ళందరినీ ఖండించడానికే నేను ఈ టపా రాయడం మొదలు పెట్టానసలు . పిల్లలు పెద్దయ్యాక ఏమంటారో అన్న కనీస భయం లేకుండా వాళ్లకి తోచిన పేర్లన్నీ పెట్టడం , ల్యాబ్ లో ప్రయోగాలు చేసినట్టు చెయ్యడం ఏమన్నా బాగుందా?

నాకు తెలిసిన శిష్ రాధిక అనే ప్రేమ జంట పెద్దలకి అంగీకారం కాకపోయినా పెళ్లి చేసుకుని, ఈ మధ్య వాళ్లకి పుట్టిన పాపకి "ఆరా" అనే పేరు పెట్టుకున్నారంటే నమ్ముతారా ? నాలో సగం, తనలో సగం కలిపితే "ఆరా" అని సగర్వం గా చెప్పుకు తిరుగుతుంటే ఆ గోల భరించలేక, ఒకసారి ఒళ్ళు మండి 'అర అర కలిపితే ఒకటి అవుతుంది రాధి..పేరేమైనా మార్చగలవేమో ప్రయత్నించరాదూ ' అని చెప్పి చూసాను. అక్షింతలు మనకి కొత్తవి కావు కదా !

ఇలాగే ఇంకో కధ. ఈ సారి నా మనసుకు కొంచం దగ్గరైన క(వ్య) ధ.

మా అక్కకి కవల పిల్లలు. ఆడపిల్లలా..మగ పిల్లలా అని అడిగితే నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి :).
పిల్లలు పుట్టాక, హాస్పిటల్ నుండి డిస్ఛార్జ్ అయ్యి ఇంటికి వచేస్తుంటే, దారిలో నేను తన చెయ్యి పట్టుకుని  ఆత్రం గా 'అయ్యో అక్కా!! మనం ఒక విషయం పూర్తిగా మర్చిపోయాం " అని ఖంగారు గా చెప్పాను.
అసలే కవల పిల్లలు పుట్టగానే ఉండే బోలెడన్ని టెస్టుల్లో ఏదైనా మర్చిపోతున్నామేమో అని చాలా టెన్షన్స్ లో ఉన్న అక్క, ఇంకా ఖంగారు పడిపోతూ.."ఎక్కడ, ఎప్పుడు, ఆసుపత్రిలోనా ? ' అని అడిగింది.
"అది కాదక్కా..! మనం పిల్లలకి అసలు పేర్లయితే నీకు పెళ్ళైనప్పటి నుండి ఆలోచిస్తూనే ఉన్నాంలే కాని, ముద్దు పేర్లు వెదకి ఉంచుకోవడం మర్చిపోయాం, రేపటి నుండి ఏమని పిలుస్తాం ? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పిచ్చి పిచ్చి పేర్లతో పిలిస్తే, ఎంతైనా బాగోదు కదా ! "....చాలా బెంగపడుతూ చెప్పాను నేను.
"ఓస్ ఇదా..నువ్వేం ఖంగారు పడకు. నేనూ బావా కలిసి వాళ్లకి ముద్దు పేర్లు కూడా ఆల్రెడీ సిద్ధం చేసేసాం" అండి గర్వంగా నవ్వుతూ .
"హమ్మయ్య! చాలా మంచి పని చేసావు , నాకసలే పిచ్చి పిచ్చి ముద్దు పేర్లంటే మహా చిరాకు. నువ్వు - బావ సెలెక్ట్ చేసారు కాబట్టి ఖచితంగా బానే ఉండి ఉంటాయి. ఇంతకీ ఏం పేర్లు.." ఇహ ఆగలేనట్టు అడిగాను.
"పప్పీ అండ్ బుడ్డి " అక్క మొహం మీద మళ్లీ అదే గర్వం తో కూడిన నవ్వు.
బాగా హుషారుగా ఊదుకుంటున్న బూర నా మొహం మీదే 'ట్టాప్ప్" మని పేలినంత నొప్పి కలిగింది నా మనసుకి.
"ఈ పప్పీ ఏంటి చంటి కుక్క పిల్లకి పెట్టినట్టు..ఈ బుడ్డి ఏంటి.. బడ్డి కొట్లో సోడా బుడ్డి అన్నట్టు...ప్లీజ్ అక్కా !...వీళ్ళకి ఊహ వచ్చాక ఈ పేర్లా మాకు పెట్టేది అని నిన్ను అనరాని మాటలు అంటారు.నీకింత కన్నా మంచి పేర్లు తోచకపోతే , అమ్మ మనని పిలిచినట్టు అసలు పేర్లతోనే పిలిచెయ్, అంతే కాని ..మరీ ఇలా..."
"షటప్! నువ్వు ఎవరి పేర్ల గురించి ఇలా కుక్క పిల్ల - సబ్బు బిళ్ళ అంటున్నావో తెలుస్తోందా..! " నేను పూర్తి చెయ్యక ముందే గయ్యిమంది అక్క.
నేనేమైనా వేంకటేశ్వర స్వామి నామాలని తప్పుగా ఉచ్చరించి పాపం మూటగట్టేసుకుంటున్నానా అని నిజంగానే ఖంగారు పడిపోయాను.
"ఈ పేర్లతోనే వాళ్ళని పొట్టలో పడ్డప్పటి నుండీ పిలుస్తున్నాం, ఏ రోజూ ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు, తెల్సా.." - మళ్లీ గయ్యి గయ్యి..అక్కే..!
"అంటే అక్కా..! దేవుడు పిల్లలకి మాటలు ఇవ్వడానికి కొంచం టైం తీసుకుంటాడు కదా పాపం.."
"మాటలు ఇవ్వలేదు. నాలుగు కాళ్ళు..నాలుగు చేతులు ఇచ్చాడు,నచ్చకపోతే తన్ని చెప్పడానికి . అవన్నీ ఆనందంగా ఆమోదించిన పేర్లు ఇవి. ఇక నువ్వు దయ చేయవచ్చు ." అని దయ లేకుండా నన్ను నానా మాటలూ అని నా మనసును తీవ్రం గా గాయపరిచింది.
తీవ్రమైనా గాయం కాబట్టి నాలుగు  నెలలైనా అది మానలేదు.ప్రతి రోజూ నేను దగ్గరికి వెళ్ళగానే.."పప్పీ! పిన్ని వచ్చింది రామ్మా..బుడ్డీ ఎక్కడున్నావ్  ఇలా రామ్మా.." అని పిలుస్తుంటే విని భరించలేక , ఒక రోజు నేను అమ్మ దగ్గర కూర్చుని, వాళ్ళ ముద్దు పేర్ల గురించి నా మనసులో ఉన్న బాధనంతా వెళ్ళగక్కాను.

ఎప్పటి నుండో మనసులో ఉన్న బాధని పంచుకునేందుకు ఒక తోడు దొరికితే కలిగే ఆనందంతో..అమ్మ ఒక్క ఉదుటున లేచి కూర్చుని.."నీకూ అలాగే అనిపిస్తోందీ..?! చూసావా...ఆ మొద్దుకి చెపితే మన మాట తీసిపారేసింది. ఏమోలే ఎంతైనా నేను పాత కాలం దాన్ని కదా నేను కాదూ-కూడదని బెట్టు చేస్తే ఏం బాగుంటుందని , వీళ్ళు పొట్టలో పడ్డప్పటి నుండీ ఆలోచించి రెడీ చేసి పెట్టుకున్న ముద్దు పేర్లు ఇహ నా మనసులోనే దాచేసుకున్నాను " అంది కొంచం బాధగా.

నా హృదయం ద్రవించిపోయింది. ఒక్క క్షణం అమ్మమ్మ ప్రేమంటే ఏమిటో పూర్తిగా అర్థమైపోయినట్టు అనిపించింది.
"పోనీలేమ్మా దీని గురించి నువ్వింతలా బాధ పడాలా ! నీ మనసులో ఉన్న పేర్లేమిటో చెప్పు ..అక్కకి చెబ్దాం. ఏదో ఒక రోజు బింకానికి పోయినా..రెండో రోజు నుండి మనం ఎలా పిలిస్తే అలాగే తనూ పిలుస్తుందిలే..." అని ధైర్యం చెప్పాను, "పప్పీ-బుడ్డి" కన్నా ప్రపంచం లోని అన్ని పేర్లు బానే ఉంటాయి అనే గుడ్డి ఆశావాదంతో.
"అంతేనంటావా..ఏమిటో నువ్వు చెప్తుంటే నాక్కూడా మళ్లీ ఏదో ధైర్యం వస్తోందేవ్..ఆ కుక్క పిల్ల పేరుతో చంటి దాన్ని పిలవాలంటే నాకు నోరే రావడం లేదంటే నమ్ము.అయినా అనుకోవాలే గాని బంగారం లాంటి పేర్లు ఎన్ని లేవనీ..." అమ్మ ఎక్కడికెక్కడికో వెళ్లిపోతుంటే బలవంతంగా ఆపి .."అబ్బ..పేర్లేమిటో చెప్పమ్మా ముందు..!" అని గుర్తు చేసాను.
"ఆ..అదే అదే..అక్కడికే వస్తున్నా.అమ్మయికేమో చిట్టాయి..అబ్బాయికేమో బుజ్జాయి..ఖాయం చేసేద్దాం..ఏమంటావ్! అయినా ఇందులో అనేందుకేముందనీ నా మొహం. నిక్షేపంగా ఉన్నాయి. వింటుంటే తెలీడం లేదూ.." అమ్మ చిరునవ్వుల మధ్య చిద్విలాసం గా చెప్పింది.
నాకు "పెనం మీద నుండి పొయ్యిలో పడడం..", "ముందు నుయ్యి వెనుక గొయ్యి.." "దొందూ దొందే..." లాంటి సామెతలెన్నో అంతరంగం లో సుళ్ళు తిరిగాయి. కాగితమూ కలమూ తెచ్చుకుని అవన్నీ లైనుగా రాసుకోవడం తప్ప వేరేమీ చెయ్యలేని అశక్తురాలిని కాబట్టి మౌనం గా ఆ సన్నివేశం నుండి నిష్క్రమించాను.
                                                                  ***********

16 comments:

  1. >>'మొదటి బహుమతి గెలుపొందిన విద్యార్ధి ...' అని టీచర్ సస్పెన్స్ కోసం క్షణం ఆగినట్టే ఆగి , మనకే వినపడేలా కొట్టుకుంటున్న గుండె లయలను రెట్టింపు చేస్తూ , రెండో క్షణం లో మైక్ లో మన పేరే పిలిస్తే ,ఒక విధమైన ఉద్విగ్నతతో..అంతు తెలియని ఆనందం తో తూనీగలా స్టేజి మీదకి పరుగెత్తి వెళ్లి హోరెత్తించే చప్పట్ల మధ్య ప్రైజ్ తీసుకోవడం ఎంత గమ్మతైన గర్వానిచ్చే అనుభవం!

    స్వయంగా అనుభవించాను కాబట్టి ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేను. చాలా చక్కగా అభివర్ణించారు.

    ReplyDelete
  2. na pillala perla gurinchi inta chettaga rasinanduku neeku e siksha aina veyyachhu. kaaani.....neeloni kavayitri na manasuni dochukunnanduvalla aagipotunna.

    ReplyDelete
  3. na pillala perla gurinchi inta chettaga rasinanduku neeku e siksha aina veyyachhu. kaaani.....neeloni kavayitri na manasuni dochukunnanduvalla aagipotunna.

    ReplyDelete
  4. ఒళ్ళు మండి 'అర అర కలిపితే ఒకటి అవుతుంది రాధి..పేరేమైనా మార్చగలవేమో ప్రయత్నించరాదూ ' అని చెప్పి చూసాను. అక్షింతలు మనకి కొత్తవి కావు కదా !
    chala bagundi

    ReplyDelete
  5. బాగా రాస్తున్నారు...keep it up!

    ReplyDelete
  6. @Kiran Teja, Thank you Very much.
    @Enaganti Rama Chandra garoo - Am sure you were on cloud 9 back then.

    ReplyDelete
  7. sorry- Ravi Chandra garoo, for the typo in the message above. :((

    ReplyDelete
  8. @ Siva Prasad garoo..chaalaa thanks andi.
    @ Padmaarpita garoo..hrudayapoorvaka krutajnatalu.:)

    ReplyDelete
  9. నిజమే మానస గారు నా పేరు కూడా నాకిష్టం ఉండదు . ఈ విషయం లో మీరు చాలా అదృష్టవంతులు

    ReplyDelete
  10. శివ రంజని గారూ..మీ పేరుకి ఏమైందండీ..చక్కగానే ఉంటుంది కదా...:). అందమైన పేరు.
    నా పేరు సంగతి సరే సరి.:). మనసు నచ్చని వాళ్ళు ఎవరుంటారు అయినా..కదా..!

    ReplyDelete
  11. పేస్ బుక్ లో LIKE లాగా like ఉంటె బావుండు, నేను లైకు మరి

    ReplyDelete
  12. Hilarious!
    Manasa Garu, You have written it really well and with all your heart. Waiting for more!

    ReplyDelete
  13. అక్షింతలు మనకి కొత్తవి కావు కదా ఇంకా చెప్పాలా అర్ధం అయిపొయింది. బావుంది.

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....