నిశ్శబ్దపు నిశీధిలోకి...

.
సంగీతంలా లయబద్దం గా సాగిపోయే నదీ ప్రవాహం..ఉండుండి నెమ్మదిగా, కవ్విస్తునట్టుగా..ఏదో రహస్యం చెప్పాలనట్టుగా  గుస గుసగా  నా పాదాల దాకా వచ్చి, మువ్వల పట్టీలను మాత్రమే  ముద్దాడి  పారిపోయే తుంటరి నీళ్ళు.కాలం గుప్పిట్లో నుండి జర్రున జారి గతంలోకి చేరిపోయే క్షణాలల్లె , నా చేతిలోకి చేరాక ఉండలేనంటూ తిరిగి తీరం లోని అనంత రేణువుల్లోకి కలిసిపోతోంది, అప్పటి దాకా సూరీడి  సాక్షిగా మిలా మిలా మెరిసిన ఇసుకంతా..!    


రేయికి రారాజులా చంద్రుడు ఆకాశంలోకి అడుగు పెట్టే వేళయింది. చెలికాడి రాక గురించి వెన్నెలమ్మ తెచ్చిన  వర్తమానం అందగానే, అప్పటిదాకా ఏ అంతఃపురాల్లోనో తమ అందాలకు మెరుగులు దిద్దుకుంటున్న చుక్కలన్నీ, ఒక్కసారిగా వినీలాకశపు వీధుల్లోకి చమక్కుమనే రాజసం ఉట్టిపడుతుండగా , ఠీవిగా అడుగు పెట్టాయి.


మసక వెన్నెల్లో ఇసుక తిన్నెలు అమర్చుకుంటున్న అందాలను, నదినీ నన్నూ ఆవహిస్తున్న చిక్కటి నల్లటి నలుపును  చూస్తుంటే, అప్పటి దాకా నన్ను నిలువరించిన స్తబ్దతను విదుల్చుకోవాలనిపించింది .రాతిరిలో ఏం మాయ ఉందో ఎన్నో ఏళ్ళ నుండీ ప్రయత్నిస్తున్నా , ఈ క్షణానికీ నేను కనిపెట్టలేకపోయాను.


ప్రపంచాన్ని రంగుల్లో ముంచెత్తే పగటి కంటే, అన్నీ రంగులని చెరిపేసి లోకాన్ని ఒక్కటి చేసే నిశీధి నలుపులోనే , నేనర్థం చేసుకోలేని రహస్యమేదో ఉంది.శతకోటి వర్ణాల నొక్క చోట కలిపి ఆ విశ్వేశ్వరుడు చిత్రించిన అత్యద్భుత కళా ఖండంలో అదృశ్యంగా కదలాడుతూ నన్ను అల్లరి పెట్టే అందమేదో ఉంది.  వర్ణాలన్నీ విడిచి చీకటి చీర కట్టుకున్నప్పుడు, మౌన ముద్రలోకి జారిన స్త్రీ లా ప్రకృతి మారినప్పుడు, అచ్చెరువొందించే  ఆ సౌందర్యం ముందు మోకరిల్లి, మౌనంగా ఆ దృశ్యాన్ని కను రెప్పల వెనుక చిత్రించుకోవడం  మినహా ఇంకేం చెయ్యగలను నేను!


" ఆకాశ మా వొరస
ఆవులించిన రేయి
మిసమిసలతో ఏటి
పసలతో ననుసుట్టి
ఈ రేయి నన్నొల్ల నేరవా రాజ
                  యెన్నెలల సొగసంత ఏటి పాలేనటర ..."

అంటూ విరహంతో, విషాదంతో, "కలవరపు నా బతుకు కలత నిదురయ్యింది  "  అని ఎంకి లా బాధ పడే క్షణాలని కాదు రాత్రి నాకిచ్చేది!
రాత్రి, నన్ను నాకు గుర్తు చేస్తుంది. పని ఒత్తిడిలో, పందేలు పడి తీస్తున్న పరుగుల్లో, ఒక రోజంతా ఎలా గడిచిందో కళ్ళ ముందుకు తెస్తుంది.  శక్తికి  మించి పోరాడి ఓడిపోయినప్పుడు నాకు తోడుగా నిద్రా దేవిని పంపించి ఓదారుస్తుంది. ముసుగులను పక్కన పెట్టి, నేను నేను గా మారేందుకు, నిజాయితీగా నిశ్చింతగా నిద్ర పోయి, రేపటిని మరో సారి కొత్త ఆశలతో స్వాగతించేందుకు సంధిగా మారుతుంది.న న్ను నేను మర్చిపోయేందుకు, నేనేంటో నాకు జ్ఞప్తికి తెచ్చేందుకు, నేను సాధించాల్సిన లక్ష్యాలను వెన్నాడే  కలలుగా మార్చేందుకు, కలలను నిజం చేసుకునేందుకు ఒక నిశ్శబ్దాన్ని సృష్టించేందుకు  రాతిరిని మించిన సాయమేముంది ?.


"ప్రపంచంతా నిద్రలోకి జారుకున్న రాత్రుల్లో, తన గమ్యాలను చేరుకునేందుకు విశ్రమించక పోరాడే వాడే విజేత అవుతాడు"  అని చిన్నప్పుడు చాలా చోట్ల చదువుకునే దాన్ని . ఎందుకో ఆ వాక్యం నన్ను విపరీతం గా ఆకర్షించేది. ఎంతలా అంటే , ప్రతి రోజూ గడియారం పది  చూపించగానే తరువాతి రోజు బ్రహ్మాండం బద్దలైపోతుందన్నా  పట్టించుకోకుండా పడుకునే నేను, ఆ వాక్యం చదివిన రోజు మాత్రం నిద్రని పది నిమిషాలు వాయిదా వేసుకుని , బాధగా పడుకునే దాన్ని. కొన్ని రోజులు విజేత అవ్వాలంటే రాత్రే మెలకువగా  ఉండాలనుకుని, "ప్రిపరేషన్"లో భాగం గా పగలంతా బలవంతంగా పడుకుని, మళ్ళీ రాత్రికి కూడా నిద్రని ఆపుకోలేక యధావిధిగా పడుకుని అమ్మ దగ్గర అనేకానేక  తిట్లు తిన్న రోజులు కూడా ఉన్నాయనుకోండి...అది వేరే విషయం.. :)


ఏది ఏమైనా నిశీధి - నిశ్శబ్దం నా స్వప్న లోకాలకు సందిగ్ధపు తెరలను తొలగిస్తూ దారి చూపిస్తూనే ఉంటాయి.ఏడు గుర్రాల రధమెక్కి వచ్చి నా ఏకాంతానికి   ఎవరైనా భంగం కలిగించినా , నా కల చెదిరిపోయినా.. ఒక రాత్రి కరిగిపోయినా...మరో రాత్రి కోసం సాగే నిరీక్షణలోనే  నా జీవితం గడిచిపోతోంది..
కృష్ణశాస్త్రి  గారన్నట్లు ,


మింట నెచటనో  మెరయు చుక్కల
కంట చూచితి కాంక్ష లూరగ
కాంక్ష లూరిన కొలది చుక్కలె 
కాంచి బ్రదుకే గడపితిన్...


"I am like the road in the night listening to the footfalls of it's memories in silence.." - Tagore

22 comments:

 1. పదాల ఒరవడి చాలా బాగా సాగింది..

  ReplyDelete
 2. నాకు మాత్రం "మానస" గారు రాసే ప్రతీ పదం "మనసు"కు హత్తుకుపోయినట్టు అనిపిస్తుంది

  ReplyDelete
 3. వావ్
  అద్భుతంగా వుందండి

  ReplyDelete
 4. సుమిత్ర గారూ..ధన్యవాదాలండి...:)
  శివ రంజని గారూ..ఆహా..! నా జన్మ ధన్యం అయిపోయింది.. :)))
  శివ గారూ..చాలా చాలా థాంక్స్ అంది..ఓపిగ్గా చదినందుకు ..:)

  ReplyDelete
 5. @జాన్ హైడ్ గారూ..కొన్నేళ్ళ క్రితం విజయవాడ లో, "ఎక్స్ రే" వారి 24 గంటల కవి సమ్మేళనం జరిగింది..మీరు అక్కడికి ఏమైనా వచ్చారా... ? మిమ్మల్ని ఇంతకూ ముందెక్కడో కలిసినట్టుగా ఉంది..అందుకే అడుగుతున్నాను..

  ReplyDelete
 6. ఎక్స్‌రే 24 గంటల సమ్మేళనంలో పాల్గొన్నాను
  ఎక్స్‌రే నిర్వహిస్తున్న ఉత్తమ కవితల పోటీలో కూడా 2004లో సన్మానింపబడ్డాను

  ReplyDelete
 7. ప్రపంచంతా నిద్రలోకి జారుకున్న రాత్రుల్లో, తన గమ్యాలను చేరుకునేందుకు విశ్రమించక పోరాడే వాడే విజేత అవుతాడు" అని చిన్నప్పుడు చాలా చోట్ల చదువుకునే దాన్ని . 100% sure
  ar rehman kuda night music compose chestadu andu vallo emo he gor oscar award

  ReplyDelete
 8. chala baga chepparamDi nice one.

  ReplyDelete
 9. లోకేష్ శ్రీకాంత్ గారూ..ధన్యవాదాలండి. ఇంతకీ మీరు మూడో ప్రేమ చదివారా లేదా?

  ReplyDelete
 10. జాన్ హైడ్ కనుమూరి గారూ, మీ పుస్తకాలు ఇరవై నాలుగు గంటల కవి సమ్మేళనం అప్పుడు నాకు కొన్ని ఇచ్చారు. :)
  మీకు బహుశా గుర్తుండి ఉండకపోవచ్చు. ఈ సారి మళ్లీ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు కలుసుకుందాం.

  ReplyDelete
 11. శివ ప్రసాద్ గారూ..మీకు సీక్రెట్ తెలిసిపోయింది.. ఇక కొన్ని రోజులు నిద్ర మానేయండి.:)
  హను గారూ..కృతజ్ఞతలు.

  ReplyDelete
 12. MANAS...chalaa andamga, apuroopamga undi nuvvu rasindi... kaani, niseedhito, nisshabdamto kante, nidrato nee anubandhame..naku baaga telusu..

  ReplyDelete
 13. మీ నిశ్శబ్దపు నిశీధిలో చాలా బాగుందండి....

  ఎన్నో నిశీధులు ట్యాంక్ బండ్ పై తిరిగిన రోజులు, కార్మిక్ నగర్ కొండ చివరిన పడుకొని బేగంపేట విమానశ్రయం నుండి ఎగురుతున్న విమానాలను చూస్తూ "ఓ దేవుడా, నేనెప్పుడు అలా ఎగురుతాను" అనుకొన్న రోజులు.... అవొక తీపి గురుతులు....

  ఈరోజు ఆవిమనమెక్కాను కాని నాతోపాటు ఆరోజు ఉన్న ఆ మిత్రులే లేరు

  i Miss all my friends who supported me to be in present position but everyday i remember you my friends............

  ReplyDelete
 14. savirahe, నిశ్శబ్దపు నిశీధిలోకే వెళ్లి పోయారేమో..
  ఏ ప్రభాత కిరణాలో వెచ్చగా తాకి మేల్కొల్పినపుడు తిరిగి ఈ లోకంలోకి వచేస్తారు లెండి.. :)

  ReplyDelete
 15. @Vamsi..Am glad my post reminded you of some memorable moments of life!..and yes, I know the role that friends play in our lives..
  :D Missing and Meeting them back is all part n parcel of life..Take it easy n keep it going.. :)

  ReplyDelete
 16. "మనసు"కు హత్తుకుపోయినట్టు అనిపించింది.

  ReplyDelete

 17. " ఆకాశ మా వొరస
  ఆవులించిన రేయి
  మిసమిసలతో ఏటి
  పసలతో ననుసుట్టి
  ఈ రేయి నన్నొల్ల నేరవా రాజ
  యెన్నెలల సొగసంత ఏటి పాలేనటర ..అసలు ఇంత మధురానుభూతిని కలిగించినందుకు
  మనఃపూర్వక సుమంజలి..

  ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....