విరహితమ్

పడమటి కొండల గుండెల్లో
ఒద్దికగా ఒదుగుతున్న సూరీడిని
రైలు కిటికి ఊచలకానిన కళ్ళు
దిగులుగా దాచుకుంటున్నాయి.

కలిసినట్టున్న పట్టాలను క్షణాల్లో విడదీస్తూ
నిశ్శబ్దపు పెదవులను శృతిలయల్లో కదిలిస్తూ
విషాద వియోగ విరహ భారాల స్పృహ లేక
జోరుగానే సాగుతోందీ రైలుబండి పరుగు.

బికారి నోట ముక్కలైపోయిన పదాలుగా
ఉండుండీ తాకుతోన్న ఓ విరహ గీతం
ఆకాశపు ఆవలి ఒంపులో ఒణుకుతూ
మిగిలున్న వెలుగుల్లో ముక్కలవ్వని నక్షత్రం

నాకీ నిశీథిలో
మరింకేం గుర్తుకు తేగలవు?

విడివడిన నీ అరచేతి వేళ్ళనీ
ఆగీ ఆగీ ఆఖరకు ఓడిన కన్నీటి బొట్లనీ
రాతిరిలో తడుస్తోన్న గ్రీష్మపు గాలి
జ్ఞాపకాలేమోననుకుని మోసుకొస్తుంటే..

చుట్టూ చీకట్లు పరుచుకుంటున్నా
కళ్ళల్లో సాయంకాలపు సూరీడి ఎరుపలాగే...
తడిగా!

11 comments:

 1. ఆషాఢ విరహితమ్ ..
  బావుంది మానస గారు.

  ReplyDelete
 2. "బికారి నోట ముక్కలైపోయిన పదాలుగా
  ఉండుండీ తాకుతోన్న ఓ విరహ గీతం
  ఆకాశపు ఆవలి ఒంపులో ఒణుకుతూ
  మిగిలున్న వెలుగుల్లో ముక్కలవ్వని నక్షత్రం"

  Beautiful, Manasa! :-)

  ReplyDelete
 3. చాలా బాగుంది..

  ReplyDelete
 4. రాతిరిలో తడుస్తోన్న గ్రీష్మపు గాలి
  జ్ఞాపకాలేమోననుకుని మోసుకొస్తుంటే..
  మంచి ప్రయోగం.కవిత ఆర్ద్రం గా సాగింది.

  ReplyDelete
 5. బాగుంది మానసగారూ, మంచి కవిత, విరహితం అన్నారు కానీ, అంతకన్నా బాగా, కవిత నిండా మంచి స్నేహమూ, ఆర్ద్రతా కనిపిస్తున్నాయి నాకు.

  ReplyDelete
 6. మీ కవితలన్నీ చదివాను... అసలెంత అద్బుతంగా రాశారు. అద్బుతం అన్నా మీ కవితలతో సరితూగలేదు.. ఒక్కొ కవిత minimum రెండు సార్లు చదివాను.. హార్ట్ టచింగ్ పొయట్రీస్... మీ బావుకత్వానికి జొహార్లు!

  ReplyDelete
  Replies
  1. Thanks, Karthik. Thank you for all your kind words:-) and glad that you liked them

   Delete

వేడుక

 సెలవురోజు మధ్యాహ్నపు సోమరితనంతో ఏ ఊసుల్లోనో చిక్కుపడి నిద్రపోయి కలలోని నవ్వుతో కలలాంటి జీవితంలోకి నీతో కలిసి మేల్కోవడమే, నాకు తెలిసిన వేడుక...