ఇష్టమాను నిన్నే...మనసిలాయో...



పోటెత్తిన అలలతో పుడమి కడలైపోవటాన్ని కనులారా వీక్షించి, అటుపై పాల వెన్నెల విరిగి తెలి వెలుగులుగా మారబోయే క్షణాల దాకా సైకత తీరాల్లో అనిమేషివై నిరీక్షించి...కాలం కౌగిట్లో నుండి ఏవేమి కొల్లగొట్టి కొంగు ముడిలో దాచుకున్నావో పదాలలో పెట్టవూ..? ఒక్క అనుభవమూ అవ్యక్తమై నీలో నిక్షిప్తమవకూడదు, దొరలిన నవ్వుల సిరులన్నీ లోలో దాగిపోకూడదు...పందెమే కడుతున్నాను మనసా! - అక్షరాల అమ్ములపొది నిన్నేమైనా గెలిపిస్తుందేమో ప్రయత్నించవూ?
                                                                 ****************
అనంత కాలప్రవాహంలో రెండు రోజులంటే పరిగణనలోనికి రాని పరిచ్ఛేదమే కావచ్చు; కాలానిదేముంది, కళ్ళెమేసే వారు లేరనుకుని తల నెగురవేస్తుంది. సృష్టిలో సౌందర్యమనేది ఒకటుందనీ, ఆ సౌందర్యం అనుభవంలోకి వచ్చిన క్షణాలు కాలాలనూ లోకాలనూ కూడా విస్మరించగల శక్తినిస్తాయనీ - లెక్కలు కట్టుకు గళ్ళను దాటుకుంటూ తమ ప్రతిభకు తామే చప్పట్లు కొట్టుకునే గోడ మీది ముళ్ళకెప్పటికి తెలిసేను, ఎవ్వరు చెప్పేను? మునుపెరుగని మనోజ్ఞ సీమలలో తిరుగాడిన రోజులే కాదు, స్మృతి పథంలో ముద్దరలేసిన ఆ అనుభవాలన్నీ అక్షరబద్ధం చేసుకునే ఏకాంత క్షణాల్లోనూ, మామూలు వేళల్లో మనను పరుగులెత్తించే ఆ మాయావికి, గర్వభంగం అయి తీరుతుంది కదూ!

బ్యాక్ వాటర్స్, సాగర తీరాలూ, జలపాతాలూ, పర్వత శిఖరాలూ, కొబ్బరి చెట్లూ - అన్నీ కాస్త అటునిటుగా అక్కడక్కడే పక్కపక్కనే ఉంటే - అదే కేరళ. కలహంస పంక్తులనూ, కల్హార సౌరభాలనూ ఇంకా మిగుల్చుకున్న భూలోక స్వర్గమది. రెండు రోజుల వ్యవథి ఆ అందాలను చూడటానికి నాబోటి వాళ్ళకి అస్సలేమాత్రమూ సరిపోదు. తమి తీరనే తీరదు. తనువేమో కదులదు.

సాగర తీరాలను స్పృశించి వచ్చే మంద సమీరం చెవిలో ఇంకా రహస్యాలు చెబుతునట్టే ఉంది; అలలు కమ్ముకున్నప్పుడల్లా తడిసిన పాదాలు అవి వెనక్కు మళ్ళగానే మెత్తటి ఇసుకలోకి లాగబడ్డ స్పర్శ ఇంకా సజీవంగానే ఉంది; పడియలు కట్టిన కావి రంగు నీరు ఒక్కోసారీ ఒక్కో తీరుగా కనపడి నవ్వించడమూ గుర్తుంది. రేయి రేయంతా చంద్రికలతో వన్నెలద్దుకుంటుంటే ఏ తీగ చాటునో రహస్యంగా రెప్పలు విప్పుతున్న మొగ్గల పక్కన ఓపిగ్గా కూర్చుని కబుర్లాడుకోవడం జ్ఞాపకాలలో పదిలంగా ఉంది. ఎన్ని కబుర్లని పంచుకోను...అన్నింటి గురించీ సవివరంగా రాయలేకపోయినా, చూసిన రెండు ముఖ్యమైన ప్రదేశాల గురించి -- కాసిన్ని సంగతులు.


మొదటి రోజు - బెంగళూరు నుండి పన్నెండు గంటల ప్రయాణించి -కాసర్‌గోడ్‌లో విడిది - బెకల్ ఫోర్ట్ సందర్శనం

సాగర తీరాన నలభై ఎకరాల్లో నిర్మించబడిన కోట ఇది. భారతదేశపు పది అద్భుతాలలో(2012) ఒక్కటిగా ప్రతిపాదించబడిన పర్యాటక ప్రదేశం కూడానూ. నల్లరాతి కోట గోడలు చూస్తుంటే, తడుముతూ ముందు సాగుతుంటే, ఎన్నెన్ని ఆలోచనలో..! ఒకప్పుడు ఇది దుర్భేద్యమైన కోట. ఒక చక్రవర్తి బలానికి, బలగానికీ, ఆతని పరాక్రమానికి తిరుగులేని సాక్ష్యం. ఇప్పుడో - పల్లీలు చేతబట్టుకు ఒక సాయంకాలం గడిపేందుకు వీలుగా మార్చబడ్డ విహార స్థలం.  ఎందుకో హఠాత్తుగా "రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే" అని శుక్రాచార్యునికి బదులిచ్చిన బలి చక్రవర్తి ఎంత వివేకవంతుడో కదా అనిపించింది.

"ఉరికే చిలకా" పాట గుర్తుందా? బొంబాయి సినిమా! కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని మనీషా కోసం ఎదురుచూస్తూ అరవింద స్వామి పాట పాడింది ఇక్కడే. ఆ పాట తల్చుకోగానే ముందు నేపథ్యంలో వినిపించే మురళీ గానం గుర్తొస్తుంది. మతి చెడగొట్టిన సంగీతం కదూ..! అలా కోట బురుజుల మీద కూర్చుని, సముద్రం మీద పడుతున్న వర్షపు చినుకుల సంగీతం వింటూ కోట లోపలి వైపు దట్టంగా పెరిగిన పచ్చికలో పరుగులిడుతున్న పసి వాళ్ళను చూడడం ఎంచక్కటి కాలక్షేపమో.

మధ్యాహ్నమనగా వెళితే, కాస్త ఎండగా ఉన్నంతసేపూ బీచ్ పార్క్‌లోనూ, ఇక నాలుగు మొదలుకుని బెకల్ ఫోర్ట్‌లోనూ కాళ్ళరిగేలా తిరగడంతోనే సరిపోయింది. కోట బయటా లోపలా కూడా ఊరబెట్టిన ఉసిరికాయల మీద పల్చగా కారం జల్లి అమ్ముతూంటారు. అన్ని గంటల సేపూ నేను ఒకదాని తరువాత ఒకటి తింటూనే ఉన్నాను. హ్మ్మ్..రాస్తుంటే మళ్ళీ పులపుల్లగా తియతియ్యగా ఆఖర్లో కాస్త వగరు రుచి లాంటిదేదో వదిలిన ఆ ఉసిరికాయ ఇంకొక్కటి బుగ్గన పెట్టుకు చప్పరించాలనిపిస్తోంది. సూర్యాస్తమయమయ్యే వేళకు కోట తలుపులు మూసేస్తారు. అరికాళ్ళ మీద ఇసుకంతా ఓపిగ్గా దులుపుకుని, ఇసుక గుళ్ళు కట్టి గవ్వలేరుకునే అలవాట్లు ఉంటే సముద్ర జలాలతో మళ్ళీ చేతులు తడుపుకుని, కోట బయటకు వచ్చేయాలి. పక్కనే హనుమంతుడి గుడి ఉంటుంది. హారతి సమయం. ఎంచక్కా దణ్ణం పెట్టేసుకుని బెల్లం-అటుకులు-కొబ్బరి తురుము కలిపి చేసిన ప్రసాదం దోసిలి నిండా నింపుకు బయటకు వచ్చి నిలబడితే, దూరంగా ఆకుపచ్చ జెండాతో, నెలవంకతో అస్పష్టంగా కనపడే మసీదు కూడా మసకమసకగా చూపులకానుతుంది. బాగుంటుంది, రెంటినీ అలా చూడడం.

రెండవ రోజు....కాసర్‌గోడ్ నుండి అనంతపురానికి ప్రయాణం..

నిశ్చలమైన సరస్సు...మధ్యలో కేరళీయుల దేవాలయ నిర్మాణాలలోని వైవిధ్యతను కళ్ళకు కట్టినట్టు చూపించే అనంత పద్మనాభస్వామి ఆలయం. హరినామ స్మరణతో ముఖరితమవుతున్న దేవాలయ ప్రాంగణంలో జంటగా అడుగులేస్తూ మేమిద్దరం. పక్కకు చూస్తే, తలలు నిక్కించి ఎగిరిపడుతున్న చిరుమీలు కనపడతాయి. ఉన్నట్టుండి నీటి పైపైకొస్తున్న కొంగల తడిసిన రెక్కల తపతప ధ్వనులు, ఎన్నడనగా అక్కడొచ్చి చేరాయో - తెలతెల్లని పావురాయిపిట్టల కురరీ ధ్వనులు...ఇవేమీ అక్కడి నిశ్శబ్దాన్ని భగ్నం చేయకుండా, లయగా ఇమిడిపోయినట్లనిపించడంలోనే ఉంది అసలు మహత్తంతా..!

మెట్లు దిగి, ఆలయంలోకి వెళ్ళి, పంచలోహాలతోనో, రాతితోనో కాక అమూల్యమైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడ్డ భూదేవీ శ్రీదేవీ సహిత అనంత పద్మనాభ స్వామికి మనసారా మ్రొక్కాము. దర్శనమైన ఉత్తరక్షణంలో  "పదండి...పదండీ" అంటూ తరిమేయకుండా ఇంకాసేపు అటు పక్క కూర్చుని శ్రీ మహా విష్ణువును ప్రార్ధించండి అంటూ చోటు చూపించిన పూజారులంటే అమాంతం గౌరవం పెరిగిపోయింది. కాసేపాగి, ఆ గుడికి కాపలాగా పిలువబడడమే కాక, దైవాంశ కలిగినదిగా పొగడబడే మకర శ్రేష్టాన్ని చూడటానికి వెళ్ళాము. మేమూ, మాతో పాటు ఇంకో పది మందీ - ఆశ చావక ఎంత సేపు చూశామో- తీరా అది బయటకే రాలేదు. చూసే భాగ్యం కలుగలేదు. అన్నట్టూ - త్రివేండ్రంలో ఉన్న అనంత పద్మనాభ స్వామికి ఇదే మూలస్థానం అని ఇక్కడి వారి నమ్మిక. స్వామి ఈ సరస్సులో నుండి కనపడే గుహలోపలి నుండే అక్కడికి వెళ్ళారని ఒక విశ్వాసం.

                                                                            *****
వెళ్ళే ముందు రెండు గంటలు మళ్ళీ, పాలక్కడ్ బీచ్‌కు వెళ్ళి, తీరానికి కాస్త దూరంగానే కూర్చుని... ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల కౌగిలిలో నను బంధించేందుకు, నురగల నవ్వులతో ముందుకొస్తున్న సంద్రాన్ని చూస్తుంటే...మనసంతా ఎంత పరవశమో!!

అరుణ కాంతుల పగడపు తునకలు నీవే, నీలిమేఘఛాయలు వాలిన వేళ నీలాలగనివీ నీవే, పకృతి కాంత చిరుచీకట్ల కాటుక దిద్దుకుంటూంటే మరకతమణులన్నీ నీవే, తెలి లేవెన్నెల చాలులో తళతళె దీపించు వేళ ముత్తెపు గుత్తులు నీవే, వర్ణాలన్నీ దోచిన అర్ణవమా, రతనాకరమా...నీ అసమాన సౌందర్యాన్ని వర్ణించదలచిన ప్రతీ ప్రయత్నంలోనూ నిర్దాక్షిణ్యంగా నను ఓడిస్తావెందుకు ?

64 comments:

  1. Replies
    1. ...and that conveys a million feelings..thank you so much.

      Delete
  2. మానసా.....అబ్బ, ఏం చెయ్యాలి నిన్ను? ఏం చెయ్యాలి నిన్ను?

    కలల దారుల్లో కవిత్వపు పూలు పరిచి..నీ మెత్తని రాతలతో చేయి పట్టి అలా ఊపిరి తీసుకోనివకుండా లాక్కెళతావేం?

    ఇన్ని సౌందర్య భావనల్ని ఒక్కసారిగా నువ్వు మీద పడేస్తే ఒక్కసారిగా రాలిన పూలన్నీ గుట్టగా పడి అందులో మునిగి మరి లేవలేనట్టుగా ఉంది ఇక్కడ...

    కేరళ ఎన్ని సార్లు చూసినా ....అంత అందాన్ని ఏం చేసుకోవాలో తెలీక....మౌనంగా మనసులో ఆ మోహాన్ని మౌనంగా గుండెల్లో పాతేశాను తప్ప..ఇంతందంగా ఆవిష్కరించలేక!

    బెల్లం-అటుకులు-కొబ్బరి తురుము కలిపి చేసిన ప్రసాదం దోసిలి నిండా నింపుకు బయటకు వచ్చి నిలబడితే, దూరంగా ఆకుపచ్చ జెండాతో, నెలవంకతో అస్పష్టంగా కనపడే మసీదు కూడా మసకమసకగా చూపులకానుతుంది So...beautiful...

    ఇంత బావుందని కొలవలేను...అందుకే ఇంకోసారి చదువుతున్నా..

    ReplyDelete
    Replies
    1. :)) వచ్చారా, రండి! మీ కోసమే ఎదురుచూపులు. మీకా రోజే చెప్పాను - మీరు భారతీయుల మనోభావాలను దెబ్బతీసి, మాలో ఆశలు నిద్రలేచేలా శిశిరము, హేమంతమూ అంటూ అక్కడి రంగులు చూపించకండీ అని :).
      Revenge అండీ revenge ! :)

      మీరిక్కడికి వచ్చాక తప్పకుండా కేరళ వెళ్ళే అవకాశం రావాలని నా కోరికానూ. Thank you so much for such a wonderful response.

      Delete
  3. పోటెత్తిన అలలతో పుడమి కడలైపోవటాన్ని కనులారా వీక్షించి, అటుపై పాల వెన్నెల విరిగి తెలి వెలుగులుగా మారబోయే క్షణాల దాకా సైకత తీరాల్లో అనిమేషివై నిరీక్షించి...కాలం కౌగిట్లో నుండి ఏవేమి కొల్లగొట్టి కొంగు ముడిలో దాచుకున్నావో పదాలలో పెట్టవూ..? ఒక్క అనుభవమూ అవ్యక్తమై నీలో నిక్షిప్తమవకూడదు, దొరలిన నవ్వుల సిరులన్నీ లోలో దాగిపోకూడదు...పందెమే కడుతున్నాను మనసా! - అక్షరాల అమ్ములపొది నిన్నేమైనా గెలిపిస్తుందేమో ప్రయత్నించవూ?
    ****************
    అనంత కాలప్రవాహంలో రెండు రోజులంటే పరిగణనలోనికి రాని పరిచ్ఛేదమే కావచ్చు; కాలానిదేముంది, కళ్ళెమేసే వారు లేరనుకుని తల నెగురవేస్తుంది. సృష్టిలో సౌందర్యమనేది ఒకటుందనీ, ఆ సౌందర్యం అనుభవంలోకి వచ్చిన క్షణాలు కాలాలనూ లోకాలనూ కూడా విస్మరించగల శక్తినిస్తాయనీ - లెక్కలు కట్టుకు గళ్ళను దాటుకుంటూ తమ ప్రతిభకు తామే చప్పట్లు కొట్టుకునే గోడ మీది ముళ్ళకెప్పటికి తెలిసేను, ఎవ్వరు చెప్పేను? మునుపెరుగని మనోజ్ఞ సీమలలో తిరుగాడిన రోజులే కాదు, స్మృతి పథంలో ముద్దరలేసిన ఆ అనుభవాలన్నీ అక్షరబద్ధం చేసుకునే ఏకాంత క్షణాల్లోనూ, మామూలు వేళల్లో మనను పరుగులెత్తించే ఆ మాయావికి, గర్వభంగం అయి తీరుతుంది కదూ!

    intha copy paste chesanani tittukovaddu...chala bagunnay

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీ నరేశ్ గారూ - ధన్యవాదాలండీ!

      Delete
  4. ఆ కడలి అలలు అలా అలా నా పాదాలను సున్నితంగా ముద్దాడుతున్నటే ఉందండీ ఇది చదూతున్నంతసేపు. అమ్మ కుట్టీ! మనసిచ్చేసా :)
    సుభ..

    ReplyDelete
    Replies
    1. డబుల్ థాంక్స్ కుట్టీ..! :) :-)

      Delete
  5. ఇంత అందాలు చూసిన మిమ్మల్ని,అందాలను తమలో ఉంచుకొని
    ఇలా ఒలకపోసిన అక్షరాల్ని చూస్తె కొంచెం అసూయగా ఉంది

    ReplyDelete
    Replies
    1. అయ్యో -:) శశి గారూ -ధన్యవాదాలండీ!

      Delete
  6. మీ పోస్ట్ కి కామెంట్ రాయటం కష్టం మరో సారి చదువుకోవటమే.

    ReplyDelete
    Replies
    1. ఊహూ నేనొప్పుకోను -:) - థాంక్యూ. :)

      Delete
  7. త్రిస్సూర్ లో రైలు దిగి అక్కడ్నించి ఇన్నోవాలో గురువాయూర్ లో చేరి అక్కడ్నించి అట చిట్టచివర అనంతపద్మనాభుడి దర్శనంతో (మధ్యలో కన్యాకుమారిని కలుపుకుని) కేరళ మొత్తం (మలబార బెల్ట్ వదిలేసి) ఒక చుట్టు చుట్టేసాం వారం రోజుల్లో.బహుశా మీరు మాతో వచ్చి ఉంటే ఓ పేద్ద ఉద్గ్రంధం రాసి ఉండేవారేమో.మీరిప్పుడు రాసిన దాంట్లో ఒకటోవంతు కూడా రాయలేని నిరక్షరాశ్యులం కాబట్టీ ఇలా చదివి చదివి నెమరేసుకుంటూ ఆనందిస్తాం అంతే.

    ReplyDelete
    Replies
    1. పప్పు సర్ - మీ అత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఐతే మరి ఈ సారి మమ్మల్ని ఎటు వెళ్ళమంటారు? మీరెటు వెళ్తారు? కోనసీమ మీరు చూపిస్తారని లెక్క కట్టుకోవచ్చంటారా? :)

      Delete
  8. అనుభూతులన్నీ అక్షరాలై.. భావాలన్నీ పరిమళాలు వెదజల్లే పుష్ఫాలై..అటు నుండి ఇటువైపు వ్యాపించాయి.
    అద్భుతంగా .. బహుకరించారు. ధన్యవాదములు.

    ReplyDelete
    Replies
    1. వనజ గారూ - ధన్యవాదాలండీ..!

      Delete
  9. అద్భుతంగా రాసారు.

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారూ - ధన్యవాదాలండీ!

      Delete
  10. అద్భుతం మానసగారు మరోమాటలేదు. ఒక్కొక్కసారి స్వయంగా చూసినదానికంటే మీలాంటివాళ్ళు తమకళ్ళతో చూసి ఇలా అందమైన మాటలలో చెప్తేనే ఎక్కువ ఆస్వాదిస్తామేమో అనిపిస్తుంటుంది మీరు రాసే ఈ ట్రావెలాగ్స్ చూస్తే. చాలాబాగా రాశారు తప్పకుండా నేను ఇంత అందంగా ఆస్వాదించి ఉండేవాడ్ని కాదు.

    ఇక కేరళతో నా ప్రణయం ఈనాటిది కాదు, అదేదో సినిమాలో చూడకుండా ప్రేమించుకున్నట్లు ఇంతవరకూ ఒక్కసారికూడా వెళ్ళని నేను చిన్నప్పటినుండి కేరళ గురించి విన్నవీ బొమ్మల్లో చూసినవీ గుర్తుంచుకుని విపరీతమైన ప్రేమను పెంచుకున్నాను, పక్కాగా ప్లాన్ చేసుకుని చాలినన్నిరోజులు కేరళలోని అన్నిప్రాంతాలు చుట్టిరావాలని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. వేణూ - థాంక్యూ! నిజమే, కేరళ అంటేనే మనలో చాలా మందికి (ఇంకా చూడకపోయినా ) పట్టరాని అభిమానం. ఇలా ఒకట్రెండు రోజులు సరి కాదు. మీరనుకునట్టు పక్కాగా ప్లాన్ చేసుకుని వెళ్ళడమే బాగుంటుంది. నా మోజు వెయ్యింతలు పెరగడానికి కారణం అలెప్పీ HouseBoatsలొ మంచి మిత్రులతో గడపడమే..!

      మున్నార్, అలెప్పీ, ఆ సముద్రాలు, బ్యాక్ వాటర్స్ - నేనేమిటి ఎవ్వరు చూసినా ఏదో ఒకటి రాసుకు తీరాల్సిందే..! Credit goes to Kerala :).
      Thanks for all your kind words.

      Delete
  11. మాటలు లేవండీ, అద్భుతం అన్న పదం చిన్నదవుతుందేమో!

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారూ - థాంక్యూ! :)

      Delete
  12. మానస గారూ మీ జ్ఞాపకాల్లో మేమూ తడిసిపోయాం. థాంక్యు.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయి గారూ- ధన్యవాదాలండీ..!

      Delete
  13. మానస గారూ, శ్రీనివాస్ పప్పు గారూ
    చాలా అసూయగా ఉంది. కేరళకి ఏ నెలలో వెళ్తే బాగుంటుందో కొంచెం చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. రావు గారూ - :). అసూయ కేరళ మీద మీ ఘాటైన ప్రేమకు ధర్మామీటరని అర్థం చేసుకున్నాం (పెళ్ళి పుస్తకం డయలాగే! :) )

      నాకు వ్యక్తిగతంగా వర్ష ఋతువులో వెళ్ళడమంటే ఇష్టమండీ..లేదా చలికాలం గానీ. చూడడానికి చాలా బాగుంటుందప్పుడు (ప్రయాణం కాస్త ఇబ్బంది పెట్టినా సరే). పప్పు శ్రీనివాస్ గారు మల్బార్ తప్ప మొత్తం చూశారు కనుక, వారైతే మంచి సలహాలు ఇవ్వగలరేమో!

      Delete
  14. కేరళయో? మనసొరుబాడు పరిభ్రమిక్క్యుమ్. నిసర్గ రమణీయముమ్ , నితాంత సుందరముమ్ ఆణ సుఖ స్వర్గలోగ వాసమ్.
    భయపడకండి. కేరళ మీద నా అభిమానం పీక్స్ కెళితే నా ఫీలింగ్స్ అలా ఉంటాయ్.

    ReplyDelete
    Replies
    1. స్నేహామామి సంభవిక్యాం..!(?!) తెలుసు తెలుసునీ వింత మోహములు..:)

      Delete
  15. Hello Manasa garu,

    I am relatively new to telugu blogs. I landed in your blog world accidentally thanks to a random search on google. I read few blogs of yours and started liking your style of writing. Reading nice telugu stories & poems always makes me happy. I knew that one can blog/comment in telugu, but I never tried it before. Your blogs make me think about it seriously, hopefully my next comment will be in Telugu. Any suggestions or pointers on how to start writing in Telugu?

    Please do write more frequently.

    BTW, is your Surname 'Chamarthi' or 'Chatrathi'? Leka rendu naa? :)

    --S

    ReplyDelete
    Replies
    1. Dear Anon S,

      Thanks to that random search from my side too :D. Glad you liked my blog - happy reading. Please check koodali.org /maalika.org and you will find a bunch of nice Telugu blogs. and to write in Telugu, I suggest you use lekhini.org. It is fairly simple and I don't think you need further help if you use that tool.

      and.."Chamarthi" -puttinti aasti. :) - "Chatrathi" mettininti aasti. రెండూ నావే! :)
      (pls write your full name next time - will be easy to address)

      Delete
    2. మానస గారు,

      మీరు ఇచ్చిన వివరములకు ధన్యవాదములు. తెలుగులో భావ వ్యక్తీకరణకు లేఖిని చాలా సులభతరమైన మార్గము లాగ ఉన్నది. నేను ఇప్పటి నుంచి లేఖినిని తరచుగా వాడుటకు ప్రయత్నిస్తాను.



      --శ్రీనివాస్

      Delete
    3. శ్రీనివాస్ గారూ - అభినందనలు :))). మరిక బ్లాగ్ మొదలుపెడితే నాకు చెప్పడం మర్చిపోకండి.:)
      -Warm Regards,

      Delete
    4. తప్పకుండా...కాని నేను ఇప్పట్లో బ్లాగు మొదలు పెట్టక పోవచ్చు, నాకు అంత పాండిత్యమూ, కవి హౄదయం రెండూ లేవు. :)..మీరు పంపిన బ్లాగ్స్ లోని మంచి కవితలు, కథలు అర్థం అయితే ప్రస్తుతానికి అదే పదివేలు :-)
      /* సాగర తీరాలను స్పృశించి వచ్చే మంద సమీరం చెవిలో ఇంకా రహస్యాలు చెబుతునట్టే ఉంది; అలలు కమ్ముకున్నప్పుడల్లా తడిసిన పాదాలు అవి వెనక్కు మళ్ళగానే మెత్తటి ఇసుకలోకి లాగబడ్డ స్పర్శ ఇంకా సజీవంగానే ఉంది; */
      నేను చాలా సార్లు సాగరతీరాలకు వెళ్ళాను, అక్కడి వాతావరణానికి పరవశుడనయ్యాను. కానీ మీరు పైన చెప్పినంత గొప్ప అనుభూతి మాత్రం ఎప్పుడూ కలగలేదు.మరి మీకు నిజంగానే అలాంటి అనుభూతి కలుగుతుందో, లేక మీకు కలిగిన చిన్న అనుభూతిని అంత గొప్పగా వర్ణిస్తారొ తెలియదు. చెప్పాను కదా, నాకు అంత పాండిత్యమూ, కవి హౄదయం రెండూ లేవు. :)

      This blog deserves all the compliments people before me have given. I do not want to repeat them, so I will just say this - please do write more frequently.

      --శ్రీనివాస్

      Delete
    5. శ్రీనివాస్ గారూ - నిజానికి నా అనుభూతులన్నీ ఇక్కడ రాసినవాటి కంటే వ్యక్తిగతమైనవీ, మరింత ప్రత్యేకమైనవీ. :). కొత్త ప్రాంతాలకు వెళ్ళగానే సరీగ్గా అటువంటి ప్రదేశాల గురించే అంతకు మునుపెవరో వ్రాసిన అందమైన మాటలు గుర్తొస్తాయి. అనుభవాలను మరింత ప్రత్యేకం చేస్తాయి. ఆ హుషారులో నేనూ ఇలా నా సంబరాన్ని వ్యక్తీకరించుకుంటూంటాను. :)

      - నా బ్లాగ్ గురించి మీ మంచి మాటలకు కృతజ్ఞతలు. తఱచుగా వ్రాసే ప్రయత్నం చేస్తాను.

      Delete
  16. మానస గారూ, బాగున్నారా!
    మీ 'ఇష్టమాను నిన్నే మనసిలాయే చదివే భాగ్యం కలిగింది. లింక్ పొస్ట్ చేసిన అబ్దుల్ అజీజ్ గారికి ధన్య వాదాలు చెప్పాలి. చాలా కాలమయింది మీ కవిత్వం చదివి. తిరిగి ప్రాణం లేచి వచ్చినట్లుగా ఉంది.
    కృతగ్నతలు.
    కొంగర గంగాధర రావు.

    ReplyDelete
    Replies
    1. గంగాధరరావు గారూ, - చాలా సంతోషమైంది మిమ్మల్ని ఇక్కడ చూసి. లింక్ పంపిన అబ్దుల్‌కూ, ఓపిగ్గా చదివి స్పందించినందుకు మీకూ ధన్యవాదాలు.

      Delete
  17. ఏ కామెంటు పెట్టినా చర్విత చర్వణమే అవుతుంది.కానీ తప్పటం లేదు .This is easily one of the best blogs in Telugu.అందమైన భావాలను అంతే అద్భుతంగా చెప్పడం మీకు బాగా చేతనవును.

    ReplyDelete
    Replies
    1. శ్రీకాంత్ గారూ - ధన్యవాదాలండీ! :))

      Delete
  18. Beautifully written. నేనూ కేరళ చూసాను కానీ ఇంత అందంగా వ్రాయటం రాదు:)

    కేరళ గురించి వ్రాసి మున్నార్ లో మా ట్రెక్కింగ్ అనుభవం జ్ఞప్తికి తెచ్చారు..దాని గురించి వ్రాయాలి..త్వరలో వ్రాస్తా!

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ! మున్నార్ ఇంకో అద్భుతమైన పర్యాటక స్థలం. :). రాయడమంటూ మొదలెడితే ఎక్కడ ఆపాలో కూడా తెలీదేమో మనకు అనిపిస్తుంది. మలుపుల రోడ్లలో నీలం పూల చెట్ల కోసం ఎంత వెదుక్కున్నామో మేము. ఆ టాప్ పాయింట్ అందం సరే సరి. దారిలో చిన్న చిన్న జలపాతపు పాయల్లాంటివి కూడా తగులుతూ ఉంటాయి. సూపర్ ఫ్రెష్ క్యారెట్లూ, చలచల్లని తియతీయని కొబ్బరినీళ్ళు ఎక్కడికెళ్ళినా బోనస్.

      Delete
  19. మానసా.. కేరళ అందమేమో కాని.. మీ వ్యాసం అద్భుతం.. మొదటినాలుగు పేరాలూ, చివరి పేరా గొప్ప రసాత్మక హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాయి.. వాటితో మీ ఈస్తటిక్ సెన్స్ పైన, మీ రచనా సామర్ధ్యం పైన గౌరవం అమాంతం మరింత పెరిగిపోయింది.

    మధ్య భాగంలో రాసిన మీ రెండు రోజుల ప్రయాణమూ ఎప్పటి మీ అందమైన శైలిలోనే ఆహ్లాదకరంగా ఉంది. మాకందరికీ కేరళ అందమంతా పరిచయం చేయటానికైనా, మీరో నెల్లాళ్ళు కేరళ అంతా తిరిగొస్తే బాగుండును అనిపించింది.

    పొగడ్తలను తట్టుకొనే శక్తి మీకు ఉందని నమ్ముతూ, మరోమాట..

    ఇలాంటి ట్రావెలాగ్స్ రాయటంవల్ల, జీవితమంటే డబ్బుగోల కాదు, అంతకు మించి మరేదో ఉందన్న స్పృహ కొందరికైనా కలిగించగలరు మీరు.. జీవితం మీకు మరింత సౌందర్యాన్ని దర్శించే, పలవరించే శక్తినివ్వాలని కోరుకొంటున్నాను..

    ReplyDelete
    Replies
    1. :)) ప్రసాద్ గారూ - ఆ నాలుగు పేరాలూ రైల్లో తిరిగి వస్తూ మననం చేసుకుంటూ రాసుకున్నవి. - అందుకే అవి ప్రత్యేకం. మీ ఆత్మీయ స్పందనకు, అభినందనలకు హృదయపూర్వక ధన్యవాదాలండీ!

      Delete
  20. "కోనసీమ మీరు చూపిస్తారని లెక్క కట్టుకోవచ్చంటారా?"

    మానస గారూ అది మా అదృష్టం,తప్పకుండా మీకు ఎప్పుడు వీలుపడుతుందో చెప్తే మేము అప్పుడు వీలుచేసుకుంటాం(సంక్రాంతికి వెళ్దామా?)

    ReplyDelete
  21. అప్పుడే అయిపోయిందా !!

    ReplyDelete
  22. చక్కని పరిసరాలకు అద్భుతమైన బావుకతను జోడించారు,..వెళ్ళాలనుకునేవారికి కొన్ని సూచనలు, సలహాలు,రూట్ మాప్ జతపరిస్తే మరింతగా బావుండేదనిపించిందండి,బావుందండి.

    ReplyDelete
  23. I wonder if you know How they live in Tokyo (Hai!) If you seen it then you mean it Then you know you have to go

    nenu beach ki vellinappudu ee song ekkuvaga vintanu mari meeru ante hahaha entha try chesina kudurugaa comeent pettalekapothunna meeku oka suggestion isthunna nannu ban cheyandi hahah

    ReplyDelete
  24. మీ ఆహ్లాదకర పర్యాటకానుభవాన్ని అంతే ఆహ్లాదంగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్..

    ReplyDelete
  25. మానసా! ఈ పోస్ట్ ని చదివిన అన్ని సార్లు నేను కాలం అనే మాయావి కి చిక్కనే లేదు. అనుభూతితో నువ్వందించిన ప్రతి అనుభవం ఒక పుష్ప గుచ్చం. మనసు పొరలలో అది పదిలం.

    నువ్వన్నట్టు నీ మాటలే.. ఇందుకు తార్కాణం

    "సౌందర్యం అనుభవంలోకి వచ్చిన క్షణాలు కాలాలనూ లోకాలనూ కూడా విస్మరించగల శక్తినిస్తాయనీ"

    నిజం . అభినందనలు.

    ReplyDelete
  26. Manasa garu....finally Kasargod, Bekal fort chusi ochanandi ninna ne....
    Its awesome..... Krishna

    ReplyDelete
    Replies
    1. Really? Did I inspire you to visit these places ?:) Great! Wonderful to hear this update from you.
      and I feel absolutely great to hear that you equally liked these places.

      Thanks a ton, Krishna :)

      Delete
  27. The pleasure is mine - Krishna. Thank you :)

    ReplyDelete
  28. Hey there! I know this is somewhat off-topic however I had to
    ask. Does managing a well-established website such as yours take a lot of work?
    I'm brand new to operating a blog however I do write in my diary
    every day. I'd like to start a blog so I can share my experience and views online.

    Please let me know if you have any kind of recommendations
    or tips for new aspiring bloggers. Thankyou!

    ReplyDelete
    Replies
    1. I am really sorry, a friend of mine created this site and helped me, and I am really not sure. You can simply use google blogspot, there are not too many advantages of having your own blog .

      Check this and just follow the instructions. Add your blog to aggregates (maalika.org etc) to have a better set of readers.

      https://support.google.com/blogger/answer/1623800?hl=en

      Hope this helps.


      Delete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....