నందకిశోర్ కవిత్వం - "నీలాగే ఒకడుండేవాడు"

*తొలి ప్రచురణ - సారంగ వారపత్రికలో.

" కాలే  గచ్చుపై కుంకుండు  గింజలు గీకి
నాకు  తెలీకుండా నువ్వు  చురుగ్గా అంటించినప్పుడు 

పరిక  పొదల్లో గుచ్చిన  ముళ్ళని
నొప్పి  తెలీకుండా నేను  సుతారంగా తీసినప్పుడు

ఎర్రటి  మధ్యాహ్నం మనం  భూతద్దపు చేతులతో  
రెండు  పచ్చి అగ్గిపుల్లలని  వెలిగించ చూసినప్పుడు"

ఈ  గుప్పెడు పదాలూ  చదివేసరికి, మనం ఎక్కడి వాళ్ళమక్కడి నుండి తప్పుకుని, పసితనపు వీథుల్లోకి  పరుగూ తీస్తాం. జ్ఞాపకాన్ని వెన్నెలకిరణమంత సున్నితంగా స్పృశిస్తూ, మనకే  తప్ప మరొకరికి  తెలీదనుకున్న బాల్యాన్ని అక్షరాల్లో గుప్పిస్తూ "నీలాగే  ఒకడుండేవాడు" అంటూ పేరుతోనే మనసులకు ఎర వేసి లాగిన వాణ్ణి - 'ఆ మాట నీకెలా తెలిసిందసలు' అంటూ ప్రశ్నించేందుకు సిద్ధమవుతాం. నిండా పాతికేళ్ళు నిండని పసివాడు కదా, బహుశా కవిత్వమంటే బాల్యమేనన్న భ్రమలో ఉన్నవాడేమో కదా, లోకాన్ని చూడని  అమాయకత్వం పదాల్లో  వెల్లువలా పొంగుతోంటే, కవిత్వమంటూ మనకిచ్చాడు కానీ...అని ఊహిస్తూ ఊరికే పేజీలు తిరగేస్తోంటే..

"వెన్నెల స్నేహితా! నిన్నేమీ అనను. నువ్వు చేస్తున్న  దేన్నీ ప్రశ్నించను. నీకు దేహం  కావాలి. సత్తువతో  నిండిన దేహం. శుభ్రత నిండిన  మనసు, స్వచ్ఛత  నిండిన ఆత్మ  కావాలి. మనం  మనమై జీవించడం  కావాలి. అనుభూతి సంపదను సృష్టించడం  కావాలి. ఏం  చేద్దాం?! అవేమీ  నా దగ్గర  లేవు. ఉన్నదల్లా  ఒక అనారోగ్యమైన  దేహం, గాయాలు  నిండిన మనసూ, వెలుతురు లేని  ఆత్మ. నీ  అద్భుత హృదయం  లాంటిదే నాకూ  ఉంటే బాగుండు. ఈ విషాదాలు, నిషాదాలూ అన్నీ  ఒకేసారి అంతమైతే  బాగుండు. చిందరవందరగా  పడి ఉన్న  ఊహలకి నిశాంతమేదైనా  ఆవహిస్తే బాగుండు. కానీ- 
కానీ, ఏదీ జరగదు. ఒక పిచ్చి  ఊహలో తప్ప  ఏవీ ఎక్కడా  అంతమవవు.

దుఃఖిత  సహచరీ! 

మసకలోనే అడుగులేస్తాను. మసకలోనే తప్పిపోతాను. మసకలోకానికే జీవితం  రాసిచ్చి ప్రయోజనం  లేకుండా పరుగు  తీస్తాను."  అంటూ  ఊపిరి వేగం  పెరిగేంత ఉద్వేగం కలిగిస్తాడు. ఎవరితను? చలాన్ని గుర్తు చేసేంత తీవ్రతతో జ్వలించిపోతున్న పిల్లవాడు - ఎవరితను?


గుర్తొస్తారు, ఒక్కో కవితా మొదలెట్టగానే, ఎవరెవరో కవులు గుర్తొస్తారు. కానీ కవిత పూర్తయ్యేసరికి మాత్రం, ఈ కవి ఒక్కడే మిగులుతాడు, ఒక అపూర్వ అనుభవాన్ని మనకి విడిచిపెడుతూ. అదే నందకిశోర్ ప్రత్యేకత. ఇతనికి తనదైన గొంతు ఉంది, తనకు మాత్రమే సాధ్యమయ్యే శైలి ఉంది. ఇంకా, అతనికి మాత్రమే సొంతమైన కొన్ని అనుభవాలున్నాయ్. అయితే, అవి ఎలాంటివైనా, ఆ బాధనో, సంతోషాన్నో, పాఠకులకు సమర్థవంతంగా చేరవేయగల నేర్పూ, ఆ విద్యలో అందరికీ దొరకని పట్టూ కూడా ఉన్నాయ్. పాఠకులను ఆదమరచనివ్వడు. పరాకుగా చదివే వాళ్ళను కూడా "ఓయ్, నిన్నే!" అని కవ్వింపుగా పిలిచి మరీ ప్రశ్నించే అతని గడుసుదనం, ఈ కవిత్వాన్ని తేలిగ్గా తీసుకోనివ్వదు.  అంత తేలిగ్గా మరచిపోనివ్వదు.

"చేపలా  తుళ్ళేటి పరువాన్నంతా
దేశాలమీదుగా విసురుకున్నవాళ్ళం.
వానలా  కురిసేటి యవ్వనపు  కోరికని
సముద్రపు అంచులకు వదులుకున్నవాళ్ళం.
ఒరుసుకున్న రాళ్ళ  మీదా ఓడించే  నీళ్ళ మీదా
సంతకాలు చేసినవాళ్ళం, సంతోషం పొందిన  వాళ్ళం.

చెప్పు! ఏదో  ఒకటి..
అంతా  అర్థమవుతోందనో
అప్పటిలా ఉండలేననో  చెప్పు.
అసలే  తెలీదనో
అణువంతైనా గుర్తులేదనో  చెప్పు. 
నిశ్శబ్దాన్ని వింటూ
రక్తం  ఇంకిపోకముందే

నేనేడ్వనుగాని
ఓయ్!నిన్నే..."

"నిశ్శబ్దాన్నివింటూ, రక్తం ఇంకిపోకముందే" అన్న నాలుగు పదాల్లో ఆశానిరాశల ఊగిసలాటనీ, తానిక మోయలేని బాధనీ సుస్పష్టంగా చూపెడుతూనే, "నేనేడ్వను గానీ" అన్నమరుసటి పాదంలో తనకున్న తలబిరుసునంతా చూపెడతాడు. ఆ "ఓయ్! నిన్నే" అన్నపిలుపుకు ఎంత వేటాడే లక్షణమున్నదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గుండె ఒక్కసారిగా ఝల్లుమని, నన్నేనా అన్న ఉలికిపాటుతో లోకంలోకి, అతని లోకంలోకి, కవిత్వంలోకీ గబగబా వెళ్ళి చక్కర్లు కొడుతూంటామే - అప్పుడనిపిస్తుంది, కవిత్వం ఇతనికి అడక్కుండా దొరికిన వరమని.

ఆధునికాంధ్ర సాహిత్య ప్రయోగాలను సమీక్షిస్తే, అనుభూతిని ఆమోదయోగ్యంగా, ఆస్వాదయోగ్యంగా చేయడానికి ఉన్న పద్ధతుల్లో,”స్వాత్మీయీకరణ” ప్రథానమైనది. పఠితకు అనుభవయోగ్యమైన స్వీయానుభవాన్ని కవి వ్యక్తీకరించడం, దానిని పఠిత ఆత్మీకరించుకుని అనుభవించడం ఈ ప్రక్రియలో కనపడుతుంది.  ఈ సంపుటిలో ఎన్నో కవితలు కవికి ఈ ప్రక్రియలో గల పట్టుకి అద్దం పడతాయి. కవితల దాకా కూడా వెళ్ళక్కర్లేదు, "నీలాగే ఒకడుండేవాడు" అన్నశీర్షికలోనే ఎంత కవిత్వం ఉందో, చూసే కళ్ళుంటే!

"నీలాగే ఒకడుండేవాడు..
వాడు  నీలాగే- 
అచ్చం  నీలాగే నవ్వుతూ  తుళ్ళుతూ
పొద్దు  నెత్తికెక్కుతుంటే గారాలు దులుపుకుంటూ
చేతిలో  సంచితో, సంచిలో  సద్దితో
సద్దిలో బువ్వతో, బువ్వలో అమ్మతో
పొద్దుగూకేదాక బళ్ళోనే  దాగిపోయి
సాయంసంధ్యపైన సూరీడై  వెలిగేవాడు" 
అని  ఈ నందుడు  అంటున్నప్పుడు ఎందరు  యశోదల మనసులు  బరువయ్యాయో ఊహించడం  అసాధ్యమేం కాదుగా!

"కవిత  అందరిళ్ళకూ వెళ్ళదు, ఎవరి ఇంటి  తలుపు తడుతుందో, అతడిక ఉన్మత్తుడు" అంటారు చినవీరభద్రుడో కవితలో. నందకిశోర్  కవిత్వంలో ఆ  ఉన్మత్తత ఉంటుంది. అది ఎదుటి  వాళ్ళకి వెన్నులో  నుండి జలదరింపు తెప్పించేంత గాఢమైనది.లోతైనది.

“తూరుపు దోసిట్లోంచీ  సూర్యుడు రాకముందే  ఊపిరి నదుల్లో  స్నానం చేసి  రావాలి. పోనీ- నాలోంచీ నువ్వూ, నీలోచీ నేనూ  నడుచుకుంటూ పోతాం, ఏంటట? నా  కాళ్ళకి వెన్నెల  అంటుకోనీ..నీ  కాళ్ళు రెండూ  రాళ్ళు తగిలి చిట్లిపోనీ..ఏంటట"   అని ఎంత  నిర్లక్ష్యంగా చెప్పేస్తాడో!

"శిశిరాన్నిగెలిచిన పిచ్చిలో  వెర్రిలో
చెట్టుకి ఏమీ  పట్టకపోవచ్చు. 
వాలే  పక్షులకి ఏ  చెట్టైనా ఒక్కటే
గూడు  కడ్తే గుండె  పగిలిపోతుంది.
గాలివానొకటి గట్టిగా  వీస్తే
నిజం  నిక్కచ్చిగా తెలిసిపోతుంది."

-  అన్నప్పుడు చేదు జీవిత  సత్యాలను అలతి  పదాలలో కూర్చిన నేర్పుకి అవాక్కయ్యాను.  ఉదాహరణగా  పై కవితనే తీసుకుందాం. ఇక్కడ చెట్టును జీవితంతోనూ, వాలే పక్షులను  అవసరాలుగానూ ఊహించుకోండి. మీకొక  భావం చప్పున స్ఫురిస్తుంది. అలా కాకుండా చెట్టును ఒక మనిషిగానూ, వాలే పక్షిని స్త్రీగానూ ఊహించుకోండి - మరొక అద్భుతమైన అర్థం దొరుకుతుంది. ఇహ దాని నుండీ "గూడు కడితే గుండె పగలడం" ఎందుకో, "గాలివాన  వస్తే తేలిపోయే నిజ"మేమిటో కవి చెప్పక్కర్లేదు. గొంతుకలో కొట్టాడుతున్న ఆ భావాన్ని నిజానికి  పదాల్లో పెట్టక్కర్లేదు. అదే ఈ కవితలోని సౌందర్యం. కవి ఏ ఉద్దేశ్యంతో రచన చేశాడో అంతకంటే భిన్నమైన స్ఫూర్తినివ్వగల శక్తి దానికి ఉన్నప్పుడే, అది కాలం ధాటికి తట్టుకుని నిలబడగలదు.  ఈ కవితకు ఆ శక్తి ఉందో లేదో, ప్రతీకలను అర్థవంతమైన వస్తువులతో పూరించగల పాఠకులెవరైనా తీర్మానించగలరు.

ఈ  పుస్తకం ఉత్తరార్థం  మాత్రం ఒకింత  పలాయన లక్షణాలతో  ఊహాజనిత దుఃఖ  పరిథికి కుదించుకుపోవడం మొదలెట్టింది. ఉదాత్తంగానూ సమస్తాన్నీ ఆత్మీకరించుకోగలిగింత  విస్తృతంగానూ కనిపించిన ప్రణయ  భావం మెల్లిగా జీవితానికే ప్రతికూలమై "ముగింపు" కోసం  ప్రాకులాడుతున్న భావన  కలిగిస్తుంది. "ఎవరికీ చెప్పకుండా, ఎవర్నీ అడగకుండా/ఎందుకో తెలీకుండా  ఉరి వేసుకుంతారు" అన్న పంక్తుల్లోనూ,
"సముద్రం వాణ్ణి  ప్రేమించిందని 
ఎవ్వరికీ చెప్పడు
కల్లోలాన్ని వాడు  కోరుకున్నట్టు
ఎప్పటికీ తెలీదు 
తెలిసేదల్లా
వాడిక  లేడనే!"   అన్నప్పుడూ ఇదే  ధోరణి కనపడుతుంది.

రెండవ  సమస్య అతని  భాషకు సంబంధించినది. చాలా చోట్ల అతను కొత్త  పదాలను కూడా సృజించాడు, సందర్భోచితంగా వాడాడు. మచ్చుకు, ఒక  కవితలో "నిశిద్దోహలు" అని వాడాడీ  కవి. ఆ పదం ఉందా? లేదు. మరెందుకలా వాడాడూ? అతని కవిత చెప్తుంది. కొన్నిచోట్ల భాషాపరంగా, శైలిపరంగా ప్రయోగాలూ చేశాడు. వాటితో కూడా నాకేం పేచీ  లేదు. "రాఖీ" కవితలో చక్కటి తెలంగాణా మాండలీకాన్నివాడాడు. నన్నడిగితే ఆ కవిత ఈ  పుస్తకానికే తలమానికమంటాను.

 "గనపడంగనే 
ఉరుక్కుంట వచ్చి
కావలించుకుని
కండ్లు  తుడుసుకున్నట్టు..
తెచ్చిన దారప్పోసల  రాఖీకి
నీ  లెక్క నా  లెక్క గుచ్చిపెట్టిన.." అంటూ  ఆర్ద్రంగా సాగిపోయే ఆ కవిత, ఏమో, మామూలుగా వ్రాసి ఉంటే ఏ మేరకు  అలరించేదన్నది ప్రశ్నార్థకమే. కానీ ఇలా వ్రాయడంలో మాత్రం తమ్ముడి చేతికి రాఖీ కట్టేందుకు తపిస్తోన్న అక్క తడికళ్ళత్ మన ముందుకొస్తుంది.

అలాగే "పిచ్చిరాత" కవితలో "దృశ్యాదృశ్య సంకెలలు  తెగి/నిస్సందేహ  స్వేచ్ఛావాయువులలో/ఏకాంతముగా సంగమించు" అంటూ గ్రాంథికంలోకి ముడుచుకున్నప్పుడు కూడా దానినొక  విలక్షణతగానే స్వీకరించగల్గుతాం ( ఈ కవితలో ఒకే ఒక్క పాదంలో మాత్రం వ్యావహారికాన్ని కవి వాడటం కనిపిస్తుంది - అది కవితా ప్రవాహానికి అడ్డు కలిగించకపోగా దాని ప్రత్యేకతను నొక్కి చెప్తుంది). కనుక, ఈ కవికి  భాష ఉన్నది ఎందుకో తెలుసు. ఏ మాండలీకంలో లేదా ఏ శైలిలో తన మనసు లోతుల్లో ఉన్నభావం నర్మగర్భంగా పాఠకులకు చేరవేయాలో సుస్పష్టంగా తెలుసు. ఇంత తెలిసినవాడు కూడా మామూలు భాషలో సాగుతోన్న కవితల్లో "వాణ్ణి" అనవలసిన చోట "వాన్ని" అనడమే, బొత్తిగా మింగుడుపడని విషయం. అలాగే "అట్లా" అని దీర్ఘం ఉండవలసిన చోట హ్రస్వంతో రాజీపడటం (ఉదాహరణకు ఆఖరు పేజీలోని - "రాళ్ళెట్ల వికసించేదీ, పువ్వులెట్లా బద్దలయ్యేదీ రహస్యం" అనడం) అకారణమనిపిస్తుంది. ఇవి అచ్చుతప్పులో, కవి ఈ పదాలను పలికే పద్ధతిదేనో పాఠకులకు అర్థమయ్యే అవకాశం లేదు. ఏదేమైనా, ఈ పలుకురాళ్ళ ఏరివేతలో పాయసపు రుచిని మరచిపోయే ప్రమాదమెంతైనా ఉంది కనుక, మలి ముద్రణల్లో ఈ లోపాలు సవరించబడతాయని ఆశిద్దాం.

ఒక  సంవత్సర కాలంలో సృజింపబడ్డ కవిత్వం కనుక, సమకాలీన సమాజపు పోకడలేవో కవిని ప్రభావితం చేయడమన్నది ఊహించదగ్గ విషయమే. స్పందించే లక్షణమూ, దానిని భద్రపరచాలన్నతలంపూ ఉన్నవాడవడం వల్లేమో, "కాంక్ష" అంటూ పాక్, ఆఫ్గన్, సిరియాలను చుట్టేసి వచ్చాడు. కవిలో అకస్మాత్తుగా కనపడ్డ ఈ అభ్యుదయవాదం మాత్రం ఆశ్చర్యపరచింది. భావకవిత్వ  లక్షణాలతో ఉప్పొంగిన ఈ కవితా సంపుటిలో, ఈ  ఒక్క కవితా తన చుట్టూ తానే ఒక  గిరి గీసుకుని పాఠకులను అటు నుండటే వెళ్ళిపొమ్మంది. ఈ సంపుటిలో ఇమడదనిపించిన ఒకే ఒక్క కవిత ఇది.

మొదటి 36 కవితలకు అనుబంధంగా వచ్చిన వచనాన్ని ( అనుకోకుండా, ఒక  సంధ్యావస్త కాలంలోంచీ)చదువుతున్న కొద్దీ, ఈ కవికి బలమైన అభివ్యక్తి, శిల్పానికి సంబంధించి గొప్ప అభిరుచీ, ప్రత్యేకతా ఉన్నాయని తెలుస్తుంది. "చిట్టితల్లీ" అనేటప్పుడతడి నిష్కల్మషమైన అనురాగమూ, “దేవీ, దేవీ!" అంటూ తపించే ఇతగాడి వలపూ, "వెన్నెల స్నేహితా!", "దుఃఖిత సహచరీ!" అంటూ ఆర్తిగా పిలుచుకునే నవనీత హృదయమూ, మనకు  తెలీకుండానే కవితో  ఓ దగ్గరి సంబంధాన్నికలుగజేస్తాయి.  "తన బాధను లోకం బాధ"గా మలచిన కృష్ణశాస్త్రి అసంకల్పితంగా గుర్తొస్తారు.

" ఆ  కొత్త రోజుల్లో, మేలుకున్న కొత్త సమాజంలో తనకు లభించిన ఒకటి రెండు అనుభవాలనో, కష్టసుఖాలనో కవి తన దివ్యకావ్యాల్లో పెట్టాడు. తరువాత  అహంకారం వల్లనో, అశ్రద్ధ వల్లనో  ఆ అనుభూతుల్నే కౌగిలించుకుని చుట్టూ ఆవరణ కట్టి కూర్చున్నాడు" - (పాతిక సంవత్సరాల  తెలుగు కవిత్వం, భారతి రజతోత్సవ  సంచిక) . కృష్ణశాస్త్రి తన కవిత్వం గురించి  తానే చెప్పుకున్న  మాటలివి. పునరుక్తి  దోషాలకు తన  బాధ్యత ఎంతవరకూ  ఉందో లోకం ముందు ఒప్పుకుంటూ  చెప్పిన సత్యమిది.  శైలి, భాష, శిల్పాల పరంగా  ఏ పోలికా  లేకపోయినా, ప్రస్ఫుటంగా కనపడే సంవేదన ఇద్దరిలోనూ  ఒకటే కనుక, పై మాటలు  ఈ కవి  భవిష్యత్తులో ప్రచురించబోయే మరే  కవితా సంపుటికీ అద్దం పట్టే  స్థితి రాకూడదని  అభిలషిస్తున్నాను.

నందకిశోర్లోని కవితాదృష్టి విశ్వరహస్యాల్నీ, జీవిత రహస్యాల్నీ వర్తమాన వస్తుప్రపంచంలో చూడటాన్ని నిరాకరించి, లేదా అధిగమించి అనుభూతిలో అన్వేషించింది. అందుకే అంత ప్రత్యేకంగా కనపడుతుందది. "అమలిన శృంగారాన్ని ప్రతిపాదించడంలోనూ, అనుభూతులకు పట్టం కట్టి రూపపరంగా నూతన అభివ్యక్తి మార్గాలను సుసంపన్నం చేయడంలోనూ, అనుభూతిని విస్తరింపజేయడానికి సమర్థంగా కవితాభాషను రూపొందించుకోవడంలోనూ" ఈ కవి కూడా తనదైన ముద్రను ప్రతి పుటలోనూ చూపెడుతూ వచ్చాడు. ఆనందానికి ఒకింత నిర్లక్ష్యాన్నీ, బాధలకు ఒకింత నిబ్బరాన్నీ జోడించి, మోహంలో మాత్రం ప్రాణాలర్పించే నిజాయితీని ప్రకటిస్తూ సాగిన ఈ సంపుటి, “నీలాగే ఒకడుండేవాడు” అన్న కవి మాటలకు నిజమేనని జవాబివ్వగల అనుభవాన్నైతే ఇచ్చే తీరుతుంది. ఆశ్చర్యానికి పదాలు మరచిన లోకంలో మనను వదలిన ఈ కవి, మరిన్ని సంపుటులతో మళ్ళీ మన ముందుకు రావాలనీ, “నీలా మరెవ్వరూ ఉండరు” అనిపించేంత ప్రత్యేకంగా తన ప్రస్థానాన్ని కొనసాగించాలనీ మనసారా ఆకాంక్షిద్దాం.
 
** రాయప్రోలు సుబ్బారావు కవిత్వం గురించి కోవెల సంపత్కుమారాచార్య చెప్పిన మాటలు.

13 comments:

  1. Replies
    1. Pavan, where are you? how are you?
      you either mail me or give me your mail ID.

      Delete
    2. i have tried to reach u so many times...hows aunty n uncle..my mail id pavan063@gmail.com..

      Delete
  2. ఇక్కడ మీరందించిన నందకిశోర్ కవితా పాదాలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయండి. ఎంత చక్కని పదాలో! ఎంత చిక్కని వ్యక్తీకరణో! చదువుతుంటే... పారే సెలయేరులా, వీచే పైరగాలిలా అలా పరుగులు తీస్తున్నాయి. నందకిశోర్ కవిత్వానికి సంబంధించి... మీ వ్యాఖ్యానము, ఆశీర్వచనాలు, ఆకాంక్ష అన్నీ చాలా చాలా బావున్నాయి.

    ReplyDelete
  3. Good post....making us to know more about Nanda Kishore.

    ReplyDelete
  4. తమ్ముడు నందు, కవిత్వం లో , ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటారు,
    తన మనస్సులాగే సున్నిత శైలి, కానీ నిర్దిష్టమైన అభిప్రాయాన్ని కలిగిన వ్యక్తిత్వం,
    అభినందనలు తమ్ముడూ..

    ReplyDelete
  5. అద్భుతమైన విశ్లేషణ. మీరు ఉదహరించిన కవితాపంక్తులు ఎంత బాగున్నాయో, మీ విశ్లేషణా అంతే బాగుంది. అభినందనలు.

    ReplyDelete
  6. Thanks a lot, everyone. This book is available in Kinige online book store. Please check there if any of you need copies.

    ReplyDelete
  7. manasa garu,, mee basha, bhavavakteekarana bagundi.. http://vaitharani.blogspot.in/2013/12/blog-post_8212.html.. please view this blog and comment..

    ReplyDelete
  8. Replies
    1. లోకేష్ శ్రీకాంత్ గారూ, ధన్యవాదాలండీ,
      మీకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

      Delete
  9. మీ విశ్లేషణలు బాగుంటాయి. గొప్పవిషయాల్ని చెపుతూనే, లోపాల్ని, తీసుకోవల్సిన జాగ్రత్తల్నీ చాలా సున్నితంగా చెపుతారు. ఈ పనెందుకో సమీక్షకులు (నేనూ అప్పుడప్పుడూ చేస్తుంటానుకనుక నాతో సహా), చేయటం లేదు. నిజానికి సమీక్షలు ఇలాగ ఉంటేనే బాగుంటుంది. చెపితే ఏమనుకొంటారో అనుకొంటూ పొగడ్తలతో ముంచెత్తే సమీక్షలు, అప్పటికప్పుడు సంతోషాన్నిచ్చినా, సదరు కవికి ఏమాత్రమూ ఉపయోగపడవు. అభినందనలు

    ReplyDelete
    Replies
    1. :-) థాంక్యూ సర్. మీ కవితలు చదువుతూంటాను నేను, శ్రద్ధగా. మీ మంచి మాటలు చదవడం సంతోషమనిపించింది.

      Delete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....