దేవకన్య

ఎంత సున్నితత్వం నీలో!
పూవు అందంగా సిగ్గుపడింది.
నాకెప్పుడూ నువ్విలాగే కనపడాలి!
సౌందర్యం రెపరెపలాడింది.
పాటలేమైనా పాడగలవా?
సంగీతం గొంతు సవరించుకుంది.
నన్నొక్కసారి ముద్దుపెట్టుకోవూ?
ప్రేమ ఆర్తిగా పెనవేసుకుంది.
ఇల్లెప్పుడూ కళకళలాడుతుండాలి!
ప్రకృతి లోగిలిలో పచ్చగా నవ్వింది.
నా తెలివి ముందు వాళ్ళెంత!
మౌనం నిండుగా విచ్చుకుంది.
పూర్తిగా ఓడిపోయాను, వేరే దారేదిక?
ధైర్యం కౌగిలినిచ్చి ఊరడించింది.
నీ ముఖం నాకు చూపించకు, కంపరం!
సహనం అవమానాన్ని భరించింది.
ఏయ్, ఒకసారిటు నాదగ్గరికి రా!
ప్రేమ ఉలిక్కిపడి ఉన్నదంతా ఇచ్చింది.
ఆవేశంలో జరిగింది, ఇదేమంత కాని పని!
అనుబంధం అగ్నిసాక్షిగా విలవిలలాడింది.
మనసంతా నీవే అని చెప్పిందెప్పుడూ?
గుండె పగిలిపోయి ముక్కలయింది.
శాపమోక్షమైన దేవకన్య నవ్వింది. శపించకుండానే వెళ్ళిపోయింది.

అత్తిరపల్లి జలపాతాలు , త్రిస్సూర్, కాలడి

ఇదొక అనుకోని ప్రయాణం. అనుకోని అంటే పూర్తిగా అనుకోనిదేం కాదూ, ఇంతకు మునుపు ఒకట్రెండు సార్లు వెళ్దామని అనుకున్నాం కానీ, వరుసగా వెళ్ళడం కుదరకపోవడంతో, అవి మర్చిపోయి వేరే దిక్కుల్లోకి పిట్టల్లా ఎగిరిపోయాం. మళ్ళీ ఈమధ్యెప్పుడో ఓ మధ్యాహ్నం వేళ నింపాదిగా కూర్చుని మేమిద్దరం టి.వి చూస్తోంటే, మణిరత్నం "విలన్" సినిమా వస్తోంది. అంతెంత్తు కొండపై నుండి తటాలున క్రిందకు దూకేసి, ఎండిన చెట్టు మీది పల్చటి కొమ్మల మీద స్పృహ తప్పి నాయిక వాలిపోతుందే...సరీగ్గా అప్పుడే చూడటం మొదలెట్టాం. ఆ ముహూర్తబలమేమిటో కానీ ఆ వెనుక కనపడ్డ జలపాతాల గురించి ముచ్చటపడ్డ మూడు వారాల్లోనే వెళ్ళే అవకాశం వచ్చేసింది.

అయితే వెళ్ళే ముందు తెలిసిందేమింటంటే త్రిస్సూర్ అక్కడికి చాలా దగ్గరని. ఎలాగూ శనాదివారాల్లోనే వెళ్తాం కనుక, ముందు త్రిస్సూర్ వెళ్ళి, అక్కడి నుండి జలపాతాల దగ్గరికి వెళితే బాగుంటుందనిపించింది. పైగా, త్రిస్సూర్‌లో గొప్ప శివాలయమొకటి ఉంది. అది కేరళలోని అతి ప్రాచీన శివాలయాల్లో ఒకటిట. ఆదిశంకరాచార్యుల తల్లిదండ్రులు సత్సంతానం కోసం మొక్కిన శివయ్య గుడి కూడానూ. శనివారం ఉదయాన్నే అక్కడికి చేరుకుని, గుడికి ఐదు నిముషాల నడకలో ఉండేట్టుగా ఏర్పాట్లు చేసుకుని, ఓ గంటలో తయారై వెళ్ళిపోయాం. చాలా పెద్ద గుడి. మహాశివలింగమది. అలంకారం చేశాక చూశాము కనుక, ఆ పూట నాకసలు ఏమీ అర్థం కాలేదు. కేరళ దేవాలయాల నిర్మాణం కూడా చిత్రంగా ఉంటుంది. గర్భగుడి ఓ వేదిక మీద ఉంటుంది. మెట్లు ఎక్కి పూజారులు మాత్రమే వెళ్తారు. మిగిలిన అందరికీ దర్శనం క్రింద నుండే. ఈ ఆలయంలో ప్రతిరోజూ లింగాకారంలో ఉన్న పరమేశ్వరుడికి ఘృతంతో అభిషేకం చేస్తారు. కొన్ని వందల ఏళ్ళ నుండీ ఆ నెయ్యి లింగం మీద అలాగే ఉండిపోయింది. అది కరగదు. చెదరదు. అరటి దొన్నెల్లో అర్చకులు కాసింత నేతినే ప్రసాదంగా భక్తులందరికీ ఇస్తూంటారు. ఆ విశాలమైన ఆలయ ప్రాంగణమంతా ఓ రెండు మూడు గంటల పాటు తిరిగి, రూంకి వచ్చేశాం. 

మధ్యాహ్నం మూడుగంటలకు బయలుదేరి అక్కడికి ముప్పావుగంట దూరంలో ఉన్న గురువాయుర్ క్షేత్రానికి వెళ్ళాము. దీనిని అందరూ కృష్ణుడి గుడిగా చూస్తారు కానీ, మూల విగ్రహం శ్రీమహావిష్ణువుదే. ఈ విగ్రహం ద్వాపర యుగంలో దేవకీ వసుదేవులు మొక్కిన విగ్రహమట. అంటే కృష్ణుడే కొలిచిన విష్ణు రూపమన్నమాట. యుగాంత వేళలో ఉద్ధవుడికి ఈ విగ్రహాన్ని ఇచ్చి, పరమ పావనమైన ప్రాంతంలో ప్రతిష్టించమని అడిగితే, అతని మాట మీద దేవగురువు బృహస్పతీ, వాయువులు కలిసి ఇక్కడ ప్రతిష్టించారు కనుక, ఆ శ్రీమన్నారాయణుడిక్కడ "గురువాయుర్" అని కొలవబడుతున్నాడని చెప్తారు. గుడి సాయంత్రం నాలుగు గంటల దాకా తెరవరు. రద్దీ మాత్రం మూడు గంటలకే మొదలైపోతుంది. గంటా- రెండు గంటలు క్యూలో ఉండాల్సిందే. గుడి బయట మొత్తం పండుగ వాతావరణమే ఉంటుంది. బంగారు అంచులతో పాలమీగడి రంగులతో మెరిసిపోయే కేరళచీరలు అడుగడుగునా కనిపిస్తూంటాయి. సాయంసంధ్య వేళయ్యేసరికి గుడి చుట్టూ కొన్ని వేల సంఖ్యలో ఆవునేతి దీపాలు వెలిగిస్తారు. కన్నుల పండుగ అనే మాటకు అసలైన అర్థం తెలియాలంటే అది చూసి తీరాలి. కమ్ముకుంటున్న చిరు చీకట్ల మధ్యలో నిష్కంపంగా వెలుగులీనే అన్ని వేల దీపలను ఒక్కసారిగా చూడటమే మహద్భాగ్యం! అది దాటుకు లోపలికెళ్తే ఆ నల్లనివాడు, పద్మనయనమ్ముల వాడు, మౌళిపరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు కృపారసంబు చల్లనే చల్లుతాడందరిపైనా.  అన్నట్టూ, పొద్దున శివాలయానికి వెళ్ళడం, వెంటనే కన్నయ్య దగ్గరికి రావడం, మళ్ళీ అద్వైత ప్రబోధకులైన శంకరాచార్య జన్మస్థాలానికి దగ్గర్లో ఉండటం- వీటన్నింటి వల్లా, ఆ రోజంతా నాకు " తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నెఱిభూతి పూతగాగ.." అంటూ శివకేశవులకు భేదము లేదని చెప్పే భాగవత పద్యం గుర్తొస్తూనే ఉంది; 

దర్శనమైపోయాక "వెన్న" ప్రసాదంగా తీసుకుని వెనక్కి వెళ్దామా ఉందామా అనుకుంటుంటే , చావక్కడ్ బీచ్ అక్కడికి పావుగంట దూరమే అని తెలిసింది. ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాం. సూర్యాస్తమయమైపోయింది. కెంజాయి రంగు నల్లని నలుపులో కలిసిపోబోతోంది. తీరమంతా అల్లరల్లరిగా ఉంది, అంత పరిశుభ్రంగా కూడా ఏమీ లేదు. కానీ, ఆ సముద్ర తీరమన్న ఆలోచనే నన్ను వివశురాలిని చేస్తుంది. ఆ గాలిపటాలూ, పసిపిల్లల కేరింతలు, కెరటాల నురగల నవ్వులు, అప్పుడే పైకొచ్చి తొంగి చూసే చందమామ, తీరాన్ని వదిలి వెళ్ళే నౌకలు, తీరాలను చేరే జాలరులూ, చేపల వాసనా - అదొక ప్రపంచం. సాగర తీరాలే చూపించగలిగే ప్రపంచం. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడో సముద్రం కూడా ఉంది అంటే నాకు గొప్ప తృప్తి. ప్రయాణమంతా సఫలమైన భావన చుట్టుముడుతుంది. ఈ సారీ అంతే, మినహాయింపేం లేదు.


నేనూ, అనిల్ ఇద్దరం నిద్రకి లోటు జరిగితే తట్టుకోలేం. అందుకని మామూలుగా ఎప్పుడూ తెల్లవారుఝామునే లేవడం, అర్థరాత్రి దాకా తిరగడం లాంటివి పెట్టుకోం. అయితే ఆ రోజు వెనక్కి వచ్చేశాక మాత్రం మర్నాడు బ్రాహ్మీముహూర్తాన జరిగే శివాభిషేకానికి వెళ్ళాలని అనుకున్నాం, చిత్రంగా లేచాం కూడా. మూడున్నరకల్లా గుళ్ళో ఉండాలి. అలాగే వెళ్ళాం. బెంగళూరులో ఆ వేళకి లేచి అడుగు బయటపెడితే చలికి వణికి చచ్చిపోతాం. ఆశ్చర్యంగా అక్కడ అలాంటి వాతావరణం లేదు. ఉండీ లేనట్టుగా ఉన్న పొగమంచు పరదాల మధ్య నుండి మెల్లిగా నడుచుకుంటూ గుడిలోఅడుగుపెట్టాం. త్రిపుండ్రాలు ధరించిన శివభక్తులందరూ ఒక్కొక్కరుగా చేరుతున్నారు. శివనామస్మరణతో ఆ ప్రాంతమంతా దైవత్వాన్ని పొందినట్లుంది. అలాంటి అద్భుతమైన వాతావరణంలో - అప్పుడు మళ్ళీ చూశాను శివలింగాన్ని. అభిషేకానికి అర్చకులు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. నిన్న ఉన్న అలంకరణలేవీ లేవు. నేయి పేరుకుపోయి ఉంది. నిర్మలంగా భాసిస్తోన్న ఆ బ్రహ్మ మురారి సురార్చిత లింగాకారాన్ని చూస్తూనే ముకుళించిన చేతులతో స్తోత్రం చేయాలనిపిస్తుంది.
"నమో నిష్కల రూపాయ - నమో నిష్కల తేజసే
నమస్సకల నాథాయ- నమస్తే సకలాత్మనే
నమః ప్రణవ వాచ్యాయ- నమః ప్రణవ లింగినే
నమః స్సృష్ట్యాది కర్త్రేచ - నమః పంచముఖ్యాతే"

దాదాపు నలభై నిముషాల పాటు సాగిన అభిషేకాన్ని కళ్ళారా చూసి, నిన్నటి దర్శనంలో ఉన్న అసంతృప్తులన్నీ చెరిపేసుకున్నాను. ఈ ఊరంటూ వెళ్ళడం జరిగితే, ఈ బ్రాహ్మీముహూర్తాన అభిషేకాన్ని చూసే అవకాశాన్ని కోల్పోకూడదు. దగ్గర్లోనే ఉన్న భగవతి ( మలయాచలవాసిని ఈ ప్రాంతమంతా భగవతిగానే పిలవబడుతుంది), ఉన్ని కృష్ణన్ ఆలయాలు కూడా దర్శించుకుంటే - తరువాతి ప్రయాణానికి సిద్ధమైపోయినట్లే.

అక్కడి నుండీ అత్తిరపల్లి జలపాతాలకు. మణిరత్నం మనసు దోచిన చోటుకు. 

ఆ సౌందర్యాన్ని మాటల్లో పెట్టగల శక్తి నాకుందనుకోను. వసంతాన్నింకా మిగుల్చుకున్న అడవి దారుల్లో పూతేనెల పరిమళాలేవో అనుమతి అడక్కుండానే గుండె నిండా నిండుకోవడం గుర్తొస్తోంటే, తీయని బాధ. మత్తిల్లిన దారుల్లో నడక సాగినంత మేరా జలపాతపు రవాలెక్కడి నుండో వినపడి కవ్విస్తూనే ఉంటాయి.పురాస్మృతిగీతాలేవో పాదం పలకరించిన అడుగడుగులోనూ ప్రతిధ్వనిస్తూంటాయి. కొండ పైన ప్రశాంతంగా పారిన నీటిలో నిశ్చింతగా ఆటలాడుకుని, కొండ అంచుల్లో జలపాతమై దూకిన లోతుల్లోకి ఓపిగ్గా నడుచుకు వెళ్ళి - తలనెత్తి ఆ ప్రవాహ వేగాన్ని చూసేంత వరకూ పర్లేదు కానీ, తుంపర్లలో తడిసిపోయి హిమాలయోన్నత రసపారవశ్యాన్ని చినుకులతో కొలిచి చూసుకోవాలనుకోవడం మూర్ఖత్వం కాక మరేమిటి? కళ్ళ ముందే నీళ్ళు వేగంగా సుళ్ళు తిరుగుతూంటాయి. పక్కనున్న గడ్డిపరకలు తల ఊచి తాళమేస్తాయి. నురగలు లేచి ఆకాశాన్ని అందుకుంటాయి. సర్వజగత్శరీరాన్ని అరుణారుణకిరణాలతో తడిమే సూరీడు జలపాతంతో జతకట్టి ఇంద్రధనుస్సు సృష్టిస్తాడు. అంత సౌందర్యాన్నీ, జలపాతాన్ని దోసిలిలో పట్టుకోలేం. విప్పార్చుకున్న కళ్ళతో ఆకాశాన్నీ కొలవలేం. ఇలా పదాలలో పెట్టే ప్రయత్నాల్లో గెలుస్తామో ఓడుతామో - ఓ అనుభవాన్నైతే దాచుకోగలం. 

రాత్రికి బెంగళూరుకు బస్. అక్కడ దాకా వెళ్ళాం కదా అని, సమయం కూడా ఉందన్న ధైర్యంతో "కాలడి" వెళ్ళాము. జగద్గురువులు శ్రీఆదిశంకరాచార్యులు జన్మించిన ప్రదేశం. వారి చరణాంబుజముల సంస్పర్శతో ధన్యత పొందిన ప్రాంతమిది. అడుగడుగునా వింతలే అక్కడ. కథలుగా విన్న విశేషాలన్నీ కళ్ళారా చూసి - మేము చూడాలనుకున్న ఓ ప్రదేశానికి వెళ్ళగలిగాము. ఆ ఇల్లు ఇదీ. గుర్తుపట్టగలరా? ఎండు ఉసిరికాయను భిక్షగా ఇచ్చిన కడుబీద బ్రాహ్మణురాలి దైన్యానికి కలత చెంది, శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చేసిన ఇల్లు ఇదే! శ్రీమహాలక్ష్మి ప్రీతినొంది బంగారు ఉసిరికల వర్షం కురిపించిన ఇల్లు.


"సరసిజ నయనే సరోజ హస్తే
ధవళ తరాంశుక గంధమాల్యశోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్ ॥"

నంబూద్రి వంశీయులు ఇప్పటికీ అక్కడ ఉంటున్నారు. వాళ్ళ వారసులైన గోపాలం అనే వ్యక్తితో మాట్లాడాం. నాకైతే ఇంకా ఆ ఉసిరికాయలేమైనా ఉన్నాయా అని అడగాలనిపించింది ;). బొమ్మలో ఉన్నట్టే చాలా పాతకాలం ఇల్లు. జగద్గురువులు వచ్చిన నాటి నుండీ అలాగే ఉందా అన్న ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. 

మొత్తానికి చాలా మధుర స్మృతులు పోగేసుకున్నాను ఈ ప్రయాణంలో.  వెన్నెల కిరణాలు సోకి సిగ్గిల్లి నవ్వే నక్షత్రాలు నీలాకాశపు చెక్కిలిని మెరిపించే క్షణాల్లో - తిరుగుప్రయాణం మొదలవక తప్పదు. ఆశ ఏమిటంటే...అత్తిరపల్లి మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు కాదు, శ్రావణమాసాన జడివానలు కురిసే రోజుల్లో, మహారణ్యాలు చినుకు తడికి తలలూపి మహోద్వేగంతో చిందాడే రోజుల్లో ఆ సౌందర్యంలో తడుస్తూ నడుస్తూ ఆలోచనలను వెలేస్తూ ఆ జలపాతాల క్రిందకెళ్ళాలి. తెల్లంచు నల్లచీర కప్పుకున్న ఆకాశకన్య అందాలన్నీ నీటిమడుల్లో నుండి దోసిలికెత్తుకుని నాలో కలిపేసుకోవాలి. అంతే! :)

( క్రితం సారి కేరళ విశేషాలేవో వ్రాసినప్పుడు చదివి - అక్కడికి వెళ్ళి వచ్చి, గుర్తుంచుకుని మళ్ళీ నాకా మాట చెప్పి పరమానందభరితురాలిని చేసిన బ్లాగ్ మిత్రులు కృష్ణ గారి కోసం ప్రత్యేకంగా ఈ కబుర్లు :))

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....