వర్షం కురిసే రాత్రుల్లో..

చీకటిని వణికించే దీపకాంతిలో
అసహనంగా కదులుతాయ్ పరదాల నీడలు
ప్రాచీన స్వప్నాన్ని పదే పదే గుర్తు చేస్తూ
ఉండీ ఉండీ గలగలమంటాయ్ గాలిగంటలు

తెరిచిన కిటికీల్లోంచీ చాచిన నా అరచేతుల్లో
చిందులేస్తున్న చినుకుల్ని చూస్తూ చూస్తూనే
నే తిరగబడ్డ గొడుగుల్లో
పసివాడు వదిలిన పడవనవుతాను
వాడి పగడపు పెదవుల మీది నవ్వునై తుళ్ళిపడతాను

చుక్కల్ని దాచేస్తూ రెమ్మల్ని రాల్చేస్తూ
దిక్కుల్ని కాల్చేసే వాననలా చూస్తూ చూస్తూ
నే ముడుచుకున్న సీతాకోక రెక్కల్లో
దాగిపోని రంగుల లోకమవుతాను
దాగలేని  స్వేచ్ఛా కాంక్షనవుతాను

మంత్రజలం చల్లేదెవరో
తెలియరాదు కానీ
వర్షం కురిసిన ప్రతి రాత్రీ నేను
నేలను తాకని చినుకునవుతాను.

(Published in TFAS Souvenir-2015)

1 comment:

  1. మేడం గారు...
    కవిత బాగుందండి.

    ఈ క్రింది రెండు సందర్భాల్లో నేనిలా
    మలుచుకుని చదువుకున్నాను.
    బాగుందనిపించింది.
    not at all a correction.
    just a different view.
    ఊరుకుండలేక
    మీతో పంచుకోవాలనిపించింది
    తప్పు తలచకండేం ...

    "నే తిరగబడ్డ గొడుగల్లే
    పసివాడు వదిలిన పడవనవుతాను"

    "మంత్రజలం చల్లేదెవరో
    తెలిసిరాదు కానీ"

    :)

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....