మహాలయం

ఢం డం ఢం ఢండఢఢం డండఢడం
ఢడఢండం ఢండఢఢం డండఢడం
ఎవరి జీవితాల్లోని ఉత్సవ కోలాహలాన్నో
ఉరుకులు పరుగులతో మోసుకొస్తుంది గాలి
నల్లని రాత్రిని కన్నుల్లోకి ఒంపుకుంటూ
ఒంటరిగానే గాలిని నమ్మి నడచిపోతూంటాను
అడవి పక్షుల పాటలన్నీ పగటినీడలతో పారిపోయే వేళ
శరదృతునదులన్నీ సముద్రంతో సంగమించే చోట
నిశినీలి చెంపలపై నక్షత్రాలు కైపుగా నవ్వి
నిదురపోని లోకాలపై మెరుపుకలలు రువ్వే వేళ
వాళ్ళని చూస్తాను
కాగడా వెలుగుల్లో, కాళ్ళకు గజ్జెల్తో
జన్మాంతర దుఃఖాల్ని హేలగా
మంటల్లో విసిరే నిర్లక్ష్యంతో
యవ్వనంతో
చంద్రుని ఆవరించే ఎర్రని వెలుగులా వాళ్ళంతా
చితిమంట చుట్టూ చేరి చిందేస్తుంటే చూస్తాను
లోకాలు కంపించటమొక్కటే లక్ష్యంగా ఆ
చేతుల్లోని మంత్రదండాలు ఊగిపోవడం చూస్తాను.
ఢం డం ఢం ఢండఢఢం డండఢడం
ఢడఢండం ఢండఢఢం డండఢడం
ఆ రాత్రి,
ముక్కలయే కాలం ముందు
మౌనం నిశ్శేషంగా నిలబడ్డ రాత్రి,
చీకటిని శ్వాసిస్తున్న లోకంలోనే
వెలుగేదో సుస్పష్టంగా కనపడ్డ రాత్రి
ఆ అడవి మంటల్లో, అవనీ ఆకాశాల్లో
సముద్రపు గాలిలో, నీటిలో
నిరంతరం మెదలే అనాది సంగీతమే
అనాగరికుల వాయిద్యాల్లో ప్రతిధ్వనించి
లోలోపలి సంచలనాన్ని శకలంలా ఎగరగొడుతోంటే
చుట్టూ ప్రతీ శబ్దమూ నిశబ్దమవడమూ
మహానిశబ్దమంతా సంగీతమవడమూ తెలిసి
నాలోపలి ఊపిరి లయను తొలిసారి వింటాను.
---------------------------------------------------
తొలి ప్రచురణ: ఈమాట, మార్చ్-2015 సంచికలో

4 comments:

 1. Banal, Consequential, Significant, Onerous ఇట్లా డిఫరెంట్ మూమెంట్స్ , రోల్స్ లోంచి దైనందిన గృహస్థాశ్రమం నడుస్తున్నప్పుడు మనిషి ఒక Hub and Spoke లాగా విస్తరించుకుంటాడనుకుంటాను. ఎదురుచూడని సెరెండిపిషియస్ మూమెంట్ ఇలాంటిది తారసపడుతుంది, ఏ అర్ధరాత్రో వళ్ళు తెలీకుండా నిద్రలోకి జారుకున్న రాత్రుల్లో ఎగిరిపోయి, ఎదురుచూసిన లోకంలో కరువు తీరా తిరిగి వచ్చినట్లుగా. అప్పటిదాకా శక్తులన్నీ అంచులదాకా పరచినదేదో ఉనికి లోంచి తప్పుకుంటుందేమో, అత్తిపత్తి ఆకు చిక్కనయినట్లుగా ఆ హబ్ అండ్ స్పోక్స్ మనిషి ముడుచుకొని దట్టమవుతాడు. చిక్కటి ఆత్మ చిలకరించిన తడి సాక్ష్యంగా, రేడియంట్ కళ్లల్లోంచి వచ్చిన వెలుగేదో ఆ మనిషి చేరాల్సిన గమ్యస్థానానికి లిప్తపాటు వంతెన వేసి మార్గం చూపుతుంది.

  థాంక్యూ ఫర్ ద మూమెంట్

  ReplyDelete
 2. లోతట్టు భావకవిత. చాలా చాలా బాగుందండి.

  ReplyDelete
 3. Chaalaa baagundi Manasa gaaru..

  ReplyDelete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...