అవ్యయ – సౌభాగ్య కుమార మిశ్ర

మనకు మన దేశంలోని ఇతర రాష్ట్రాల కవుల కన్నా, ఇతర దేశాల్లో ఉన్న కవులే మెరుగ్గా తెలుసేమోనని చాలా సార్లు అనిపిస్తుంది. ఎక్కడో ఒక ఠాగూర్‌నీ సుబ్రహ్మణ్యభారతినీ కమలాదాస్ (మాధవి కుట్టి) లాంటి వారిని మినహాయిస్తే, ఇతర రాష్ట్రాల కవుల గురించి, వారి కవిత్వాన్ని గురించి, మనం విన్నదీ అక్కున చేర్చుకున్నదీ తక్కువ. మరీ ముఖ్యంగా, సమకాలీన కవిత్వానికి సంబంధించి, వైరముత్తు (A Drop in search of the Ocean, ఆంగ్లానువాదం: బాలన్ మీనన్), గుల్జార్ (Selected Poems, Neglected Poems, ఆంగ్లానువాదం: పవన్ కె. వర్మ), జావేద్ అఖ్తర్(In Other Words, ఆంగ్లానువాదం: అలీ హుసేన్) మొదలైనవారి కవిత్వాలు జనాల్లోకి వచ్చాయన్న మాటే కాని, అక్కడ కవిత్వాన్ని మించి లేదా కవిత్వంతో పాటుగా సినిమా మంత్రం పనిచేసిందనడం అతిశయోక్తి కాదు.
మంచి కవిత్వమంటే మనకు బాగా తెలిసిన ప్రపంచాన్నే కొత్తగా చూపించడమో, లేదా అసలెన్నడూ చూడని లోకానికి తలుపు తీయడమో చెయ్యాలని నేననుకుంటాను. ఇతర దేశాల కవులనూ వాళ్ళ కవిత్వాలనూ చదువుతున్నప్పుడు మనం చాలా సందర్భాల్లో మనకు తెలియని లోకాన్నే చూస్తాం. వాళ్ళ సిద్ధాంతాలు వేరు. సంస్కృతీసంప్రదాయాలు వేరు. ఆ లోకపు తత్వాలూ భావాలూ, వాళ్ళ ఋతువులూ రంగులూ, సమస్యలూ స్పందనలూ అన్నీ మన కవితాప్రకటనకు ఎంతోకొంత భిన్నంగానే ఉంటాయి. అదే మన దేశంలోని ఇతర భాషలను తీసుకుంటే, మన మధ్య ఇన్ని భేదాలు కనపడవు. కొసలను పట్టుకు చూస్తే దూరం తెలీదని కాదు కాని, స్థూలంగా ఆచారవ్యవహారాలు వేరైనా మనందరినీ కలిపే సూత్రమేదో ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో, మనని ఆనుకుని ఉన్న రాష్ట్రపు కవిత్వాన్ని చదవబోవడమంటే, మన లోకాన్ని కొత్తగా కవి కళ్ళతో చూడటమే అవుతుంది. ఈ కుతూహలమే, ప్రముఖ ఒరియా కవి, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారగ్రహీత, ఆత్మనేపది(1965), మధ్యపదలోపి(1971), నఈపహారా(1973), అన్యతార, మణికర్ణిక మొదలైన కవితా సంపుటులెన్నింటినో వెలువరించిన సౌభాగ్య కుమార మిశ్ర కవితల నుండి 60 కవితలను ఎంపిక చేసుకుని వేలూరి వేంకటేశ్వర రావు, వెనిగళ్ళ బాలకృష్ణ రావులు అనువదించి (అనుసృజించి) ప్రచురించిన కవితల సంపుటి అవ్యయను చదివేందుకు నా తొట్టతొలి కారణం.
ఆ ఆసక్తికి, సౌభాగ్య కవిత్వంలో పాఠకులను గట్టిగా పట్టుకునే లక్షణాలు కొన్ని జత కలిశాయి. కుమార మిశ్ర కవితలు చదవడమంటే ఎక్కడో ఒకచోట నింపాదిగా కూర్చుని ఆలోచనలో పడటం కాదు. బొమ్మ వెనుక బొమ్మ, బొమ్మ వెనుక బొమ్మ, రెప్పపాటులో దృశ్యం మారిపోతూ ముగింపు దాకా శరవేగంతో సాగుతుంది కవిత నడక. కొట్టొచ్చినట్టు కనపడే ఈ వేగం, కవితలని త్వరత్వరగా చదవమని తొందర పెట్టినట్టుగా ఉంటుంది. ఓ కొత్త దారిలో ఎవరో చేయి పట్టుకు బరబర తీసుకుపోతుంటే, దృశ్యం మనఃఫలకంలో ముద్రించుకునే వ్యవధి కూడా లేక ముందుకు వెళ్ళిపోయినట్టే వాక్యం వెనుక వాక్యం చదువుకుంటూ కవిత పూర్తి చేసేస్తాము. గమ్యం చేరాక వచ్చిన దారిని మననం చేసుకున్నట్టు, కవిత చదవడం పూర్తయ్యి అనుభవం మనదయ్యాక, ప్రతి మాటనీ మళ్ళీ తరచి చూసేలా చేస్తుంది ఈ కవిత్వం. ఉదాహరణకి, ల్యాండ్‌స్కేప్ (పు: 121) కవిత చూడండి.
రెండో ఝాము ఎండ నదిమీద ఆవిరి, దూరపు కొండల్లో నిప్పు
నక్కల బొరియల మూతుల్లో గుప్పెడుగుప్పెడు రాళ్ళ ముక్కలు.
అక్కడ పల్లెలో కాబోలు రాతిరి నిశ్శబ్దం. ఒక్క చిన్నపిట్ట,
క్రొత్త గుడిసె కప్పు మీద పాకిన బీరతీగె
సగం తెరిచిన తలుపు ఇంటిలో రోలు రోకలి చప్పుడు
బార్లగా తెరిచిపడి ఉంది ఆలోచనలు లేని పిల్లమనసు,
గుమ్మడి పూలలో అటూఇటూ తిరుగుతూ సీతాకోకచిలుక
దారి ప్రక్కన క్రింద ఎండిపడి ఉంది బురదజీవితం
రెండవ ఝాము స్తబ్ధత. మేఘాలు లేని పసుపు రంగు ఆకాశం
ఇక్కడ నా చుట్టూ నది వణుకుతూ పోసిన ఇసుకగుట్టలు
అలసిన దేహం…
కవిత పూర్తిగా చదివితే, మొత్తం మూడు పాదాల్లో రెండవ ఝాము ఎండ నుండి రాతిరికీ, మళ్ళీ పగటి ఎండకీ కవి సునాయాసంగా చేసిన ప్రయాణం కనపడుతుంది. గమనించండి.
ఆ తరువాత చెప్పుకోవలసింది, సౌభాగ్య వాడిన ప్రతీకల గురించి. సౌభాగ్య కవిత్వం నేల విడిచి సాము చెయ్యదు. అతనిదంతా ఈ లోకపు కవిత్వం. అతను చూపించినదంతా ఇక్కడి సగటు మనిషి జీవితం. ప్రత్యేకించి, ప్రాంతీయతను పదిలపరుచుకున్న కవిత్వమితనిది. ఇతని ఊహలు, కవిత్వము కూడా ఒరియా వాతావరణాన్ని దాటి వెళ్ళవు. అందుకే, కల్పనలో చాతుర్యమే తప్ప అసంబద్ధత కాని, ఊహకు అందకపోవడమన్న ప్రశ్న గాని సాధారణంగా తలెత్తవు. అవి భారతీయ ఇతిహాసాల్లో నుండి, పురాణాల్లో నుండి వాడిన ప్రతీకలు కావచ్చు, పదే పదే ఉదహరించిన కాఠజోడి లాంటి నదుల ప్రస్తావన కావచ్చు, ‘గొడుగు పాతి కథ వినే మంగలి’ కావచ్చు, ‘అమ్మమ్మ కలలు’ కావచ్చు, సరివి తోటలో, కృష్ణచూడా పువ్వులో కావచ్చు. ఏం వాడినా కవి ఉద్దేశ్యం స్పష్టం. ఏవో పక్షులనో ఎక్కడివో వాగులనో ఏదో ఒక నది ఒడ్డునో వర్ణించడం అతని లక్ష్యం కాదు. పాఠకులు వాళ్ళకు పరిచయమైన వ్యక్తులను, వస్తువులను, ప్రదేశాలను ఇతని కవిత్వంలోకి చొప్పించి చూసుకోవడం కూడా కవికి ఇష్టం లేదు. అతను విస్పష్టంగా ఒరియా వాతావరణాన్నే చూపించదలచాడు. పదే పదే కొన్ని ప్రదేశాలను ప్రతీకలుగా వాడటం ద్వారా, వాటిని విన్నప్పుడు ప్రతిసారీ అదే విధమైన స్పందన పాఠకుల్లోనూ కలిగేలా ముద్ర వేయగలిగాడు. అలా చెయ్యడం ద్వారా వాటికొక అస్తిత్వాన్నీ ఏర్పరచాడు. ఉదాహరణకి, కృష్ణచూడా (పు:53) కవిత చూడండి.
నిజంగా ఎంత గర్వం? కృష్ణచూడాకి, అమ్మో! ఎంత ఉబ్బిపోతున్నదో!–ఇదీ కవిత ఎత్తుగడ. మొదటి వాక్యంలోనే సమాధానం లేని ప్రశ్న, ఆశ్చర్యార్థకం. ఇవి, మన ఊహలను తుదికంటా పొడిగిస్తాయి. అంటే, ఎంత గర్వం సాధ్యమని మనమనుకుంటామో, అంత గర్వమూ దానికి ఆపాదిస్తున్నాం. ఇప్పుడు, కవిత ముగింపు చూడండి.
స్త్రీ సమగ్ర అస్తిత్వాన్ని మరిచి నెరజాణడిలా ఇవాళ
ఎందుకు పదే పదే నిన్ను, నీ యవ్వనాన్నీ కోరుకుంటాను,
నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వూ ఒకేఒక కృష్ణచూడా లాంటి స్త్రీ అవు,
నీ చేతిలో అమ్ముడుపోతాను, ఇదే దేహం, ఇదే మనస్సు, ఇదే ప్రాణం!
ఎత్తుగడ, ముగింపుల్లో ఉన్న వైరుధ్యం చూస్తే ఈ కవితలో ప్రాణం ఎక్కడుందో తెలుస్తుంది. పైన చెప్పినట్టు, ‘ఏదో ఒక’ అనడం లేదిక్కడ కవి, ‘ఒకేఒక’ అంటున్నాడు. అదే ఈ కవితకు ఆయువుపట్టు. ఆ పూవు అతిశయాన్ని అసంబద్ధంగా కనపడే తన కోరికకు ముడిపెట్టి, మనఃప్రాణదేహాలను అమ్మకానికి పెట్టేందుకు సిద్ధపడ్డ అతని వ్యక్తిత్వాన్ని సమర్ధించుకోవడానికి వాడుకున్న పదమిది. సౌభాగ్య కుమార మిశ్ర ప్రతీకలకు ఒక అస్తిత్వాన్ని కల్పిస్తాడు అనడంలో నా ఉద్దేశ్యమిదే.
సౌభాగ్య కుమార మిశ్ర కవిత్వంలో నిరాశ ఉంది, కానీ అది క్షణక్షణం గతంలోకి తొంగిచూసుకుంటూ, గతంలోనే బ్రతకాలని వగచే బుద్ధి వల్ల వచ్చింది కాదు. ఆశ కూడా ఉంది, అదీ భవిష్యత్తుని సమూలంగా మార్చితే(నే) బ్రతుకు బాగుపడుతుందన్న ఆలోచనలో పుట్టింది కాదు. ఇతనిదంతా, ‘వర్తమానం’లో చలించిన కవిత్వం. అతనెంత సాంప్రదాయకమైన ప్రతీకలు తీసుకున్నా, చర్వితచర్వణంలా అనాదిగా కవితావస్తువులైన వాటినే మళ్ళీ గుప్పిట పట్టినా (సంధ్యాసమయం, అపరాహ్ణం, రాత్రులు, నదులు…), వాటిని పూర్వపు ఆలోచనలకు భిన్నంగా వాడటం ద్వారా, కొత్త అనుభూతిని సమర్థవంతంగా సృష్టించగలిగాడు (పూవును సహజంగా సున్నితత్వానికీ మెతక స్వభావానికీ ప్రతీకగా చూపెడతారు, కానీ, పై కవితలో దానిని అతిశయంతో నిండినదిగానూ తిరస్కరించే శక్తిని నిలుపుకున్నదానిగానూ చూపించాడు కవి); అలాగే, చెప్పిన పద్ధతేదైనా, అతను చూపించింది మాత్రం సమకాలీన ప్రపంచాన్ని. తనను తాను అధికుడిగా భావిస్తూ ఎత్తుల్లో నిలబడి, ప్రపంచాన్నీ ప్రజలనూ దూరం నుండి గమనిస్తూ రాసిన కవిత్వం కాదిది; తానూ అక్కడే, నట్టనడుమన నిలబడి తన అనుభవాన్నే కవిత్వంగా మార్చి రాసినది. అందుకే ఆ కవిత్వానికి సహజత్వం, తేలిగ్గా పాఠకులకు చేరడం లాంటి గుణాలు వచ్చాయి. మచ్చుకు బాలి జాత్ర (పు:97) కవిత చూడండి. బాలి జాత్ర కార్తీక పూర్ణిమతో మొదలై ఏడురోజులపాటు కటక్‌లో జరిగే సంత. ‘బెలూన్ పగిలినట్టు నవ్వినవ్వి దొర్లిపడ్డాం’, ‘పల్లీల తొక్కలు పారేసినట్టు మాటవెంటమాట విసిరిపారేశాము’-ఇలా, నేపథ్యానికి తగ్గట్టు మనని ఆ వాతావరణంలోకి తీసుకునిపోయి, ‘ఇంతకీ హోటల్ గదికి ఎంత బాకీ పడ్డాం?’ అని ఒక్కసారిగా అక్కడి నుండి బయటకు లాగుతాడు. ‘ఒకటో తారీఖు ఇంకెంత దూరం?’ అని ప్రశ్నించి, సంబరమంతా ముగిశాక మళ్ళీ ఎప్పటి దినచర్యలోకి రాక తప్పని అసహాయతనూ దిగులునూ చూపెట్టి, పాఠకులను అక్కడ వదిలేస్తాడు.
సౌభాగ్య కవితల్లో తెచ్చిపెట్టుకున్న సామాజికవాదం కనపడదు. (కనీసం ఈ సంపుటికి సంబంధించినంతవరకూ.) అతను చూపించగలిగిందే మాటల్లో పెట్టాడు. చలమో అచలమో, ప్రాణం ఉన్న ప్రపంచాన్నే మనకీ చూపెట్టాడు. అలాగే, పాశ్చాత్య కవితా విప్లవాలు భారతీయ కవిత్వాన్ని శాసిస్తున్న రోజుల్లో (తొలి సంపుటి ఆత్మనేపది 1965లో ప్రచురితం.) కవిత్వం రాసినా, సౌభాగ్య కవిత్వం ఆ ప్రభావానికి లోనై భాషను శ్రద్ధగా చెక్కి నగిషీలు పెట్టుకున్నట్టు కనపడదు. క్లుప్తత కోసం అనవసర ప్రయాస ఎక్కడా కనపడదు. వస్తువును బట్టి, పాదాల సంఖ్యతో నిమిత్తం లేకుండా కవితను యథేచ్ఛగా పొడిగించుకుని, కవిత అందజేయాల్సిన అనుభూతి మీదే దృష్టినుంచినట్టు, స్పష్టంగానే తెలుస్తుంది. ఉదాహరణకు, ఈ కవిత చూడండి. అపరాహ్ణము (పు: 27) అన్న పదం వినగానే తట్టే సోమరితనం, సేదతీరాలనిపించే గుణం, అన్నింటికీ మించి ఆ నింపాదితనం-వీటిని కవిత్వంగా మలచడం ఊహించినంత సులువైతే కాదు. సౌభాగ్య కవిత్వం ఆ కష్టం కనపడనీయదు.

అపరాహ్ణంలో నిజంగా అనిపిస్తుంది, అంతా ఏదో ఖాళీ ఖాళీ అని,
చెట్ల మీద ఎలాంటి పక్షులూ లేవు, బజారులో కొనటం అమ్మకంలాంటి బేరాల్లేవు
ప్రియురాలి నుంచి ఫిర్యాదులూ లేవు, నేను ఎవరితో గడపాలి
ఈ తీయనివేళ?…
కవితల ఎంపికలో అనువాదకుల అభిరుచి సుస్పష్టంగా కనపడింది. సౌభాగ్య విస్తృతంగా వ్రాయడం, అనువాదకులు ఏ ఒక్క సంపుటినో అనువదించాలనుకోకుండా – ఆత్మనేపది, మధ్యపదలోపి, నఈపహారా సంపుటుల నుండి(వరుసగా ముప్పైఏడు, పంతొమ్మిది, నాలుగు) కవితలు తీసుకోవడం, పాఠకులుగా మనకు లాభించిన విషయం. అపురూపమైన ప్రతీకలకు అంతే అందమైన తెలుగు పదాలను వాడడం ద్వారా మూలంలోని సౌందర్యాన్ని వీలైనంతగా తెలుగులోనూ ప్రతిఫలింపజేశారు. ఐతే, ముందుమాటలో అనువాదకులు ‘ఇవి అనువాదాలు కాదు’ అని చెప్పినా, ఇవి అనువాదాలేనన్న స్పృహ పాఠకులను చాలా చోట్ల విడిచిపెట్టలేదు. ఎలానూ అనుసృజన అన్నారు కాబట్టి కొన్ని కవితల్లో వాక్యాన్ని మరికాస్త మార్చి రాసే స్వాతంత్య్రం తీసుకుని ఉంటే, కవితలు మరింత రాణించేవని అనిపించింది. ఇలా అనడానికి రెండు కారణాలు: ఒకటి, కవిత్వాన్ని పక్కన పెట్టినా పాఠకుడు వాక్యాన్ని కేవలం వాక్యంగా చదివేందుకు శ్రమపడకూడదు. రెండు, అవకాశం, అవసరం ఉన్న సందర్భాల్లో కవిత్వం నేరుగా, స్పష్టంగా పాఠకులకు చేరాలి. ఉదాహరణలిస్తాను.
ఎండ అంతా చక్కబెడుతుంది దుకాణదారుడి దురవస్థ/ నిర్దయ ఆకాశం ఆశాభంగం./ నీలిరుమాలు మీద ఒక కణం కాటుక మరక/ మబ్బు, వాన, చిక్కటి కాన (రోడ్డు, పు:119)
వసంత దుర్ఘటన తరువాత,/ ఇక్కడ అవమానం, అక్కడ అస్వస్థత-హంసభాషలో/ నేను విన్నాను నేనెరిగిన భూమి కంఠధ్వని (మూడు నెలల తరువాత, పు:107)
ఇవాళ గనుక నగరంలో టెలిగ్రాఫ్ తీగలన్నీ తెగిపోతే,/ ప్రియురాలి ముఖం నీరసంగా కనపడుతుంది, మాటలు అన్నీ/ గాలిలో ఎగిరిపోవు, అయితే ఇది ఏ విధమైన దుఃఖానికీ/ గురుతు కాదని నేను అంటాను (ఇవాళ గనుక, పు:35)
స్పష్టంగా, ఇవన్నీ పాఠకులకు త్వరగా చేరేవి కావు. అలా చేరకపోవడం కవితల్లోని లోతు వల్ల అని కూడా నేను భావించడం లేదు. వసంత దుర్ఘటన ఏ ప్రకృతి వైపరీత్యమో అయి ఉండాలి. బహుశా భూకంపం. అలాగే, మూడవ ఉదాహరణలో, మూలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మాటలన్నీ గాలిలో ఎగిరిపోతాయి అని ఉండాలి. కవిత్వ వ్యాకరణం వేరని ఒప్పుకుంటూనే, వాక్యాల్లో ‘ఇది అనువాద’మని పట్టిచ్చే ఛాయలేమీ లేకపోతే మరింత బాగుండేదని చెప్పక తప్పదు. అంటే, అనుసృజన లోని వాక్యం తెలుగు నుడికారానికి మరికొంత దగ్గరగా ఉండి, భాష ఆసాంతమూ ఒకే ఒరవడిలో సాగి ఉంటే, పాఠకులకు ఆ ఇబ్బంది తెలిసేది కాదేమో. (ఉదా: నీ ఖాళీ ఇల్లు కవిత మొదటి పాదాలకు, చివరి పాదాలకూ భాషలో, కవి గొంతులో వచ్చిన తేడా పరిశీలించండి.)
సౌభాగ్య కుమార మిశ్ర కవితల్లో సింహభాగం అందరూ పొదువుకోగలిగిన సరళతతోనే ఉన్నా ఆ కవిత్వంలో మార్మికత లేకపోలేదు. ఆ లక్షణం తొంగి చూసినప్పుడల్లా అనువాదంలో స్పష్టత లోపించింది. అప్పటిదాకా సరళంగా, హాయిగా, అనిపించిన కవిత్వం, సంక్లిష్టంగా తోచింది. ఉదాహరణకి, నీ ఖాళీ ఇల్లు కవితనే మళ్ళీ చూడండి. మూలంలోని భావాన్ని పట్టుకోవడానికి అవసరమైన అతిముఖ్యమైన లంకె ఏదో తెగిపోయిందనే తోస్తుంది. అన్వయానికీ ఇందులో కవితాత్మకత ఏమై ఉంటుందన్న ఊహకూ తేలిగ్గా లొంగని కవితల్లో ఇది ఒకటి. ఆ అస్పష్టతను పక్కకు నెట్టగలిగే శక్తినిచ్చింది మాత్రం, అద్భుతమైన భావాలే!
కాఠ్‌జోడి నది ఒడ్డున కూచొని ఊహించుకుంటాను, నీ
కంఠస్వరం ఎగురుతూ వస్తుందని; దాని దారంతో గుచ్చబడి తారలన్నీ
అన్నది మనకందిన అనువాదం. ఇక్కడ దాని దారంతో అంటే, కంఠస్వరాన్ని దారంగా చెబుతున్నాడనే అనుకోవాలి. దీనిని బట్టి, మూలాన్ని ఊహించే ప్రయత్నం చేస్తే నాకు తోచిన భావం ఇది: కవి కాఠ్‌జోడి నది ఒడ్డున కూర్చుని ఎవరిదో గొంతు ఊహించుకుంటున్నాడు. తారలు పొదిగిన దారంలా, ఆ గొంతు గాలిలో ఎగురుతూ వస్తున్నట్టుగా ఊహించుకుంటున్నాడు. దూరం నుండి మన కోసం ఎవరైనా గొంతు విప్పి పిలిచారనుకుంటే, మనమధ్యనున్న దూరానికీ, గాలిరొదకీ, ఆ మాటలన్నీ మనకు స్పష్టంగా వినపడవు. అక్కడొక మాటా, ఇక్కడొక మాట ముక్కలు ముక్కలుగా వినపడుతుంది. వినపడ్డ ముక్కలను తారలతో పోలుస్తున్నాడు. అలా తారల్లా తళుక్కుమన్న మాటలని మోసుకొస్తున్న దారంగా, ఆమె గొంతును ఊహిస్తున్నాడు. కవి భావం స్పష్టంగా ఇదేనా కాదా? మనకు తెలియదు. గమనిస్తే, మార్మికవాదం ప్రకటితమైన కవితలే ఈ పుస్తకంలో పాఠకులను ఇబ్బంది పెడతాయి. (అదేసమయంలో, ఈ ప్రశ్న పక్కనపెట్టి ఇలాంటివి చూసినప్పుడే నమ్మకంగా అనిపిస్తుంది అనువాదం అంటూ ఏమీ ఉండదు, ఉండేదంతా అనుసృజనే అని.)
ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులను పక్కనబెడితే, అవ్యయ పొరుగువారి కవిత్వం పట్ల మనకున్న దాహాన్ని చాలావరకూ శాంతింపజేసిన నీటికుండ. దీనికి ముఖ్యమైన కారణం, అనువాదకులు జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న కవితలేనని నా అభిప్రాయం. మిశ్ర ఫలానా కోవకు, ఫలానా వాదానికి చెందిన కవి అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు కానీ (నిజానికి ఈ కవితలు మూడు కవితా సంపుటాల నుండి ఎంపిక చేసుకోబడ్డ 60 కవితలు మాత్రమే కనుక, మనమా మాట అనలేం కూడా!) ఈ పుస్తకంలోని కవితలన్నీ అనుభూతి ప్రధానమైనవి. సౌభాగ్య ఏ అనుభూతినీ మామూలు మాటలతో పాఠకులకు చేరవేయాలనుకోడు. ఎన్ని ప్రతీకలు వాడైనా సరే, తన అనుభూతిలోని గాఢతని పాఠకులకు చేరవేసే తీరుతాడు. విరహం (పు:137) కవిత చూడండి. ఆ విరహాన్ని చెప్పడానికి ఎన్ని ప్రతీకలు వాడాడో చూడండి: కంటిమబ్బు కింద వణుకుతూ శ్రావణమాసపు పిలుపు, నిద్రను దొంగిలించిన చందమామ, నీ ప్రేమలా ఆరిపోయిన నా కళ్ళ వెలుగు, మూసుకున్న కళ్ళలో చిరుచేపలా నీ జ్ఞాపకం,… ఒక్కో ప్రతీక మనను కవి అనుభూతికి ఒక్కో అడుగు దగ్గరగా తీసుకు పోతుంది. ‘ఇవాళ నువు ఎంత దూరం?’ అన్న ప్రశ్నతో, కవితో పాఠకుడు మమేకం కాగలిగిన వలయం పూర్తవుతుంది. ఈ ప్రతీకలే సౌభాగ్య కవిత్వానికి అసలైన బలం. ఒక సంఘటనో, అనుభవమో ఇలా ప్రతీకలతో వర్ణించినప్పుడు, అది పాఠకులకు అర్థం కాకపోయే అవకాశాలు తక్కువ. కాబట్టి, ఈ పుస్తకంలో ఎక్కువ భాగం ఇవే ఉన్నాయంటే, ఇది కవితల ఎంపికలో అనువాదకుల శ్రద్ధను, అనువాదంలో ఉండే పరిమితుల పట్ల వాళ్ళకున్న అవగాహననూ చూపెడుతోంది.

ఒకే భాషకు చెందిన కవిత్వాన్ని మనం చదువుతున్నప్పుడు, వ్యక్తీకరణలో తేడాలు మినహాయిస్తే, కొంతకాలానికి మనకు ఆ కవితావస్తువులు, వాతావరణం, కవిత సాగే తీరు అన్నీ అలవాటైపోతాయి. పోనుపోనూ కవిత్వం చదువుతున్నప్పుడు అప్పటికప్పుడు బాగుందని అనుకోవచ్చు గానీ, నిజంగా మనని బలంగా తాకి, వెన్నాడే కవితలు వేళ్ళ మీద లెక్కపెట్టేటన్ని మాత్రమే ఉంటాయి. అలాంటప్పుడే ఒక కొత్త పూవు, ఒక కొత్త ఊరు, ఒక నది ఒడ్డు-మునుపెన్నడూ మనం విననివీ, చూడనివీ-గొప్ప ఉపశాంతినిస్తాయి. స్తబ్ధమైన వాతావరణాన్ని చెదరగొడతాయి. అవ్యయ ఆ పని చేసింది.

No comments:

Post a Comment

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....